సాక్షి, హైదరాబాద్: ఇటీవల జకార్తా, పాలెంబాంగ్ వేదికల్లో జరిగిన ఆసియా క్రీడల్లో తన ఉనికిని చాటుకున్న భారత సెపక్‌తక్రా సమాఖ్య... సెపక్‌తక్రా ప్రపంచ కప్ నిర్వహించేందుకు సిద్ధమైంది. గోవా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగనున్న అంతర్జాతీయ సెపక్‌తక్రా సమాఖ్య (ఐఎస్‌టీఏఎఫ్) ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ఎల్బీ స్టేడియంలోని శాట్స్ చైర్మన్ చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రపంచకప్ నిర్వహణ హక్కుల పత్రాన్ని ఐఎస్‌టీఏఎఫ్ కార్యదర్శి డాటో అబ్దుల్ హలీమ్ బిన్ ఖాదిర్, భారత సెపక్‌తక్రా సమాఖ్య అధ్యక్షులు ఎస్‌ఆర్ ప్రేమ్‌రాజ్‌కు అందజేశారు.
1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడలతో భారత్‌లో సెపక్‌తక్రా ఆట పరిచయమైంది. తాజాగా పాలెంబాంగ్ ఆసియా క్రీడల్లో భారత సెపక్‌తక్రా జట్టు కాంస్యాన్ని అందుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భారత్‌లో సెపక్‌తక్రా క్రీడ మరింత ప్రాచుర్యం పొందాలంటే ప్రత్యేక అకాడమీలు నెలకొల్పాలని.... రెగ్యులర్‌గా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని ఐఎస్‌టీఏఎఫ్ అబ్దుల్ హలీమ్ సూచించారు. మరోవైపు శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రం కూడా ఆసక్తిగా ఉందని... దీనికి సంబంధించి ప్రతిపాదనలను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డాక్టర్ ఎస్‌కే జోషికి పంపించామని తెలిపారు. విద్యార్థుల పరీక్షలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తదుపరి యూత్ గేమ్స్‌ను ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహించే ఆలోచనలో ఉన్నామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ నీలమ్ కపూర్ చీఫ్ సెక్రటరీకి పంపించిన లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment