sepak takraw world cup
-
భారత జట్ల శుభారంభం
సాక్షి, హైదరాబాద్: సెపక్తక్రా ప్రపంచకప్ టోర్నమెంట్లో తొలిరోజు భారత జట్లు సత్తా చాటాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్లో తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. గురువారం జరిగిన పురుషుల మ్యాచ్‌లో భారత్ 21–6, 21–10తో ఫ్రాన్స్ జట్టును చిత్తుగా ఓడించింది. మహిళల విభాగంలో భారత్ 21–8, 21–8తో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించింది. భారత్‌లో తొలిసారి జరుగుతోన్న ఈ ప్రపంచకప్‌కు భాగ్యనగరం ఆతిథ్యమిస్తోంది. రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి ఈ మెగా టోర్నీని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కె. సాయిబాబా, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు కె. రంగారావు, అంతర్జాతీయ సెపక్తక్రా సమాఖ్య కార్యదర్శి అబ్దుల్ హలీం ఖాదర్, డిప్యూటీ ప్రెసిడెంట్ బూన్‌చెయ్ లోరిపట్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ తౌఫీఖ్, భారత సెపక్తక్రా సమాఖ్య కార్యదర్శి యోగిందర్ సింగ్ దహియా తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నీలో మొత్తం 16 పురుషుల జట్లు, 12 మహిళల జట్లు పాల్గొంటున్నాయి. -
నేటి నుంచి సెపక్తక్రా ప్రపంచకప్
హైదరాబాద్: భాగ్యనగరంలో నేటి నుంచి సెపక్తక్రా ప్రపంచకప్ జరగనుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగే ఈ పోటీల్లో 20 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారని బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంతర్జాతీయ సెపక్ తక్రా సమాఖ్య సెక్రటరీ జనరల్ అబ్దుల్ అదీమ్ ఖాద్రీ తెలిపారు. ప్రపంచం గుర్తించే విధంగా వచ్చే ఏడాది జకార్తాలో జరిగే ఆసియా క్రీడల్లో సెపక్ తక్రా క్రీడాకారులు తమ సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో సెపక్‌తక్రాకు చోటు దక్కే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. శాట్స్ చైర్మన్ ఎ.వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సెపక్తక్రా వరల్డ్ కప్ మొదటి సారిగా దేశంలో నిర్వహిస్తున్నారని, ఆ అవకాశం హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. 16 పురుషుల జట్లు, 12 మహిళల జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. గురువారం మంత్రులు కేటీఆర్, పద్మారావు, మహేందర్ రెడ్డిలు పోటీలను ప్రారంభిస్తారని వివరించారు. సెపక్తక్రా ప్రపంచకప్ ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత సెపక్తక్రా సమాఖ్య సెక్రటరీ జనరల్ యోగిందర్ సింగ్ దహియా, జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రేమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నవంబర్‌లో సెపక్తక్రా వరల్డ్ కప్
సాక్షి, హైదరాబాద్: ఐఎస్‌టీఏఎఫ్ ‘ప్రపంచ కప్’ ఇంటర్ రెగూ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. నవంబర్‌లో జరుగనున్న ఈ అంతర్జాతీయ టోర్నీకి భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈమేరకు శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఎల్బీ స్టేడియంలో ఆదివారం టోర్నీ కార్యాచరణకు సంబంధించిన సమావేశం జరిగింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో నవంబర్ 2 నుంచి 5 వరకు సెపక్తక్రా ప్రపంచ కప్ పోటీలు జరుగుతాయని శాట్స్ చైర్మన్ తెలిపారు. మొత్తం 20 దేశాలు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. భారత్‌తో పాటు జపాన్, థాయ్‌లాండ్, మలేసియా, బంగ్లాదేశ్, సింగపూర్, శ్రీలంక, దక్షిణ కొరియా, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, వియత్నాం, కాంబోడియా, చైనీస్ తైపీ, ఇరాన్ జట్లు ఈ టోర్నీలో తలపడతాయి. టోర్నీ జరిగినన్నీ రోజులు మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయని, పోటీలను తెలంగాణ సాంస్కృతిక కమిటీ సంచాలకులు ఎం. హరికృష్ణ ప్రారంభిస్తారని వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. టోర్నీలో పాల్గొనే అన్ని జట్లకు హైటెక్ సిటీలో వసతి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కె. రంగారావు, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నవత.. మరో ఘనత
ఆరోసారి అంతర్జాతీయ పోటీలకు ఎంపిక వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వచ్చే నెల బ్యాంకాక్‌లో మెగాటోర్నీ మహబూబ్‌నగర్ క్రీడలు: సెపక్తక్రా క్రీడలో జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి నవత దూసుకుపోతోంది. నిరుపేద కుటుంబ, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా మొక్కవోని దీక్ష, పట్టుదలతో సెపక్‌తక్రాలో విశేష ప్రతిభ కనబరుస్తోంది. ప్రధాన స్రై్టకర్గా రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతోంది. వచ్చే నెల 15 నుంచి 20 వరకు బ్యాంకాక్ (థాయ్‌లాండ్)లో జరగనున్న సెపక్తక్రా వరల్డ్ చాంపియన్‌షిప్‌కు భారత మహిళల జట్టుకు ఎంపికైంది. ఆగస్టులో మహారాష్ట్ర (ఔరంగాబాద్)లో జరిగిన ప్రత్యేక క్యాంపులో ట్రయల్స్ నిర్వహించి ప్రతిభ కనబరిచిన నవతను అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. ఈనెల 28న జాతీయ జట్టుతో కలిసి ఆమె బ్యాంకాక్‌కు బయలుదేరనుంది. సెపక్‌తక్రాలో ప్రదర్శనకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నవతకు రూ.3లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసింది. అంతర్జాతీయ పోటీల్లో నవత ప్రతిభ... సెపక్‌తక్రాలో నవత గతంలో ఐదుసార్లు అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించింది. 2013 సెప్టెంబర్‌లో యుథంటిని (థాయ్‌లాండ్)లో జరిగిన ప్రపంచ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో దేశానికి తొలిసారిగా ప్రాతినిధ్యం వహించింది. ఆ టోర్నీలో భారత మహిళల జట్టు మూడోస్థానంలో నిలిచింది. 2014 మార్చిలో కౌలాలంపూర్(మలేసియా)లో జరిగిన ఐఎస్‌టీఏఎఫ్ సూపర్‌సిరీస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. అదే ఏడాది ఆగస్టులో బ్యాంకాక్(బ్యాంకాక్)లో జరిగిన ప్రపంచ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో పాల్గొని రజత పతకం సాధించింది. సెప్టెంబర్‌లో కొరియాలో జరిగిన ఏషియన్స్ గేమ్స్‌లో, 2015లో బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌కు దేశం తరుఫున పాల్గొంది.