నవంబర్‌లో సెపక్‌తక్రా వరల్డ్ కప్
సాక్షి, హైదరాబాద్: ఐఎస్‌టీఏఎఫ్ ‘ప్రపంచ కప్’ ఇంటర్ రెగూ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. నవంబర్‌లో జరుగనున్న ఈ అంతర్జాతీయ టోర్నీకి భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈమేరకు శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఎల్బీ స్టేడియంలో ఆదివారం టోర్నీ కార్యాచరణకు సంబంధించిన సమావేశం జరిగింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో నవంబర్ 2 నుంచి 5 వరకు సెపక్‌తక్రా ప్రపంచ కప్ పోటీలు జరుగుతాయని శాట్స్ చైర్మన్ తెలిపారు. మొత్తం 20 దేశాలు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి.
భారత్‌తో పాటు జపాన్, థాయ్‌లాండ్, మలేసియా, బంగ్లాదేశ్, సింగపూర్, శ్రీలంక, దక్షిణ కొరియా, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, వియత్నాం, కాంబోడియా, చైనీస్ తైపీ, ఇరాన్ జట్లు ఈ టోర్నీలో తలపడతాయి. టోర్నీ జరిగినన్నీ రోజులు మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయని, పోటీలను తెలంగాణ సాంస్కృతిక కమిటీ సంచాలకులు ఎం. హరికృష్ణ ప్రారంభిస్తారని వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. టోర్నీలో పాల్గొనే అన్ని జట్లకు హైటెక్ సిటీలో వసతి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కె. రంగారావు, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్‌ఆర్ ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.