హైదరాబాద్: భాగ్యనగరంలో నేటి నుంచి సెపక్‌తక్రా ప్రపంచకప్ జరగనుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగే ఈ పోటీల్లో 20 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారని బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంతర్జాతీయ సెపక్ తక్రా సమాఖ్య సెక్రటరీ జనరల్ అబ్దుల్ అదీమ్ ఖాద్రీ తెలిపారు. ప్రపంచం గుర్తించే విధంగా వచ్చే ఏడాది జకార్తాలో జరిగే ఆసియా క్రీడల్లో సెపక్ తక్రా క్రీడాకారులు తమ సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో సెపక్‌తక్రాకు చోటు దక్కే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. శాట్స్ చైర్మన్ ఎ.వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సెపక్‌తక్రా వరల్డ్ కప్ మొదటి సారిగా దేశంలో నిర్వహిస్తున్నారని, ఆ అవకాశం హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు.
16 పురుషుల జట్లు, 12 మహిళల జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. గురువారం మంత్రులు కేటీఆర్, పద్మారావు, మహేందర్ రెడ్డిలు పోటీలను ప్రారంభిస్తారని వివరించారు. సెపక్‌తక్రా ప్రపంచకప్ ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత సెపక్‌తక్రా సమాఖ్య సెక్రటరీ జనరల్ యోగిందర్ సింగ్ దహియా, జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రేమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment