![Gongadi Trisha Interview](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/122.jpg.webp?itok=5l4_g4VE)
ఈ జర్నీలో ఎత్తుపల్లాలు చూశాను
రెండు మెడల్స్ అడిగారు.. తీసుకొచ్చా : క్రికెటర్ త్రిష
సాక్షి, హైదరాబాద్: భారత దేశానికి మహిళా ప్రపంచ క్రికెట్ కప్ సాధించడమే తన లక్ష్యమని మహిళా క్రికెటర్ గొంగడి త్రిష పేర్కొన్నారు. నగరంలోని హయత్ ప్లేస్ హోటల్‌లో నిర్వహించిన సన్మాన సభలో ఆమె మాట్లాడారు. ‘అండర్ –19 టీ–20 ప్రపంచ కప్ విజయంలో కీలకపాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. క్రికెట్‌లో మిథాలిరాజ్ స్ఫూర్తి. ప్రతి మ్యాచ్ ఆడే ముందు ఒక్కటే ఆలోచన ఉంటుంది. బాగా ఆడాలి.
టీం గెలవాలన్న లక్ష్యంతో గ్రౌండ్‌లోకి వెళతా. ఓవర్ కవర్ షాట్ నా ఫేవరెట్. నిద్రలో లేపి ఆడమన్నా ఆడతాను. ఆటలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదు. నిత్యం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆరు, ఏడేళ్ల నుంచి ఫిట్నెస్, బ్యాటింగ్, ఆహారపు అలవాట్లలో కోచ్ సూచలను పాటిస్తున్నా. ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను’ అన్నారు.
లక్ష్యంతో పనిచేస్తేనే..
కేవలం డబ్బు సాయంతో విజయం సాధ్యం కాదు, కష్టపడి, నిర్థేశిత లక్ష్యంతో పనిచేస్తేనే జీవితంలో రాణించగలమని ఏఆర్‌కే ఫౌండర్ ఛైర్మన్ రామ్‌రెడ్డి అన్నారు. 2028లో లోకేష్ , వెన్నెల మెడల్స్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్రిష తండ్రి, హాకీ ప్లేయర్, ట్రైనర్ రామ్‌రెడ్డి మాట్లాడుతూ భద్రాచలం ఐటీసీలో ఉద్యోగం చేస్తూ త్రిషకు క్రికెట్‌లో శిక్షణ ఇప్పించాను.
మెరుగైన కోచింగ్ కోసం 17 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చేశాం. చాలా కష్టనష్టాలను చూశానన్నారు. భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ చిన్నతనంలో కరణం మల్లీశ్వరిని ప్రభుత్వం ఘనంగా సత్కరించినపుడు పోడియం ముందున్న నేను అలా సత్కారం పొందాలని అనుకున్నానని తెలిపారు.
ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టడంతో ఎంతో మంది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కష్టపడి పనిచేయడం, నిబద్ధత, నమ్మకంతో పనిచేస్తే విజయం సాధించడం తధ్యమని గోపీచంద్ అన్నారు. బ్యాడ్మింటన్ ఆడని రోజు లేదని టీజీపీఎస్సీ మాజీ ఛైర్మన్ జనార్థన్‌రెడ్డి అన్నారు. త్రిష నిత్యం తన ఆటను మెరుగుపరుచుకుని, వృద్ధిచెందాలని మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రికెట్ కోచ్ జాన్ మనోజ్, మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఎంఎస్‌కే ప్రసాద్, మాజీ ఐఏఎస్ రాజేశ్వర్ తివారీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment