కాంపౌండ్ టీమ్ విభాగాల్లో ఫైనల్‌కు భారత మహిళల, పురుషుల జట్లు
షాంఘై (చైనా): ఆర్చరీ సీజన్ తొలి ప్రపంచకప్ టోర్నమెంట్ కాంపౌండ్ విభాగంలో భారత క్రీడాకారుల గురి అదిరింది. మహిళల, పురుషుల టీమ్ విభాగాల్లో భారత జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లి రెండు స్వర్ణ పతకాల రేసులో నిలిచాయి. బుధవారం జరిగిన టీమ్ విభాగాల నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత జట్లు నిలకడగా రాణించాయి.
ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ చాంపియన్ అదితి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో 235–230 పాయింట్ల తేడాతో టర్కీ జట్టును ఓడించింది. అనంతరం సెమీఫైనల్లో సురేఖ బృందం 235–230 పాయింట్ల తేడాతోనే ఎస్టోనియా జట్టుపై గెలిచింది.
శనివారం జరిగే ఫైనల్లో ఇటలీతో భారత మహిళల జట్టు తలపడుతుంది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచిన సురేఖ జట్టుకు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ లభించింది.
మరోవైపు అభిషేక్ వర్మ, ప్రథమేశ్, ప్రియాంశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు తొలి రౌండ్‌లో 233–227తో ఫిలిప్పీన్స్ జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 237–234తో డెన్మార్క్ జట్టుపై, సెమీఫైనల్లో 235–233తో టాప్ సీడ్ దక్షిణ కొరియా జట్టుపై విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో నెదర్లాండ్స్‌తో టీమిండియా పోటీపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment