భారత షూటర్లకు రెండు పతకాలు
- జీతూ రాయ్‌కు రజతం
- అయోనిక ఖాతాలో కాంస్యం
- షూటింగ్ ప్రపంచకప్
మారిబోర్ (స్లొవేనియా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత షూటర్ల గురి అదిరింది. పురుషుల 50 మీటర్ల పిస్టల్ విభాగంలో జీతూ రాయ్ రజతం... మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అయోనిక పాల్ కాంస్య పతకం సాధించారు. సోమవారం జరిగిన ఈ పోటీల ఫైనల్లో జీతూ రాయ్ 193.9 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని సంపాదించాడు. జీతూ రాయ్ ధాటికి ప్రపంచ చాంపియన్ తొమోయుకి మత్సుదా (జపాన్-172.9 పాయింట్లు) కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. దామిర్ మికెక్ (సెర్బియా-194 పాయింట్లు) స్వర్ణం కైవసం చేసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన జీతూ రాయ్‌కిది వారం వ్యవధిలో రెండో రజతం కావడం విశేషం. గతవారం మ్యూనిచ్‌లో జరిగిన ప్రపంచకప్‌లోనూ అతను రజతం సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో మహారాష్ట్ర అమ్మాయి అయోనిక పాల్ 185.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కెరీర్‌లో తొలి ప్రపంచకప్ పతకాన్ని దక్కించుకుంది. లండన్ ఒలింపిక్స్ చాంపియన్ యి సిలింగ్ (చైనా-209.6 పాయింట్లు) స్వర్ణం సాధించాడు.
షూటర్లకు అమితాబ్ చేయూత
ముంబై: సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ యువ క్రీడాకారులకు ఆర్థికంగా అండగా నిలవనున్నారు. ఇద్దరు మహిళా షూటర్లు అయోనికా పాల్, పూజా ఘట్కర్‌లను ఆయన స్పాన్సర్ చేస్తారు. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ప్రణాళికలో భాగంగా ఆటగాళ్లకు అమితాబ్ తన మద్దతు పలికారు.