French Open 2024 : సాత్వి క్‌–చిరాగ్‌ జోడీదే టైటిల్‌ | Sakshi
Sakshi News home page

French Open 2024 : సాత్వి క్‌–చిరాగ్‌ జోడీదే టైటిల్‌

Published Mon, Mar 11 2024 4:31 AM

French Open 2024 : Satwik-Chirag clinches French Open 2024 title - Sakshi

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండోసారి విజేతగా నిలిచిన భారత ద్వయం

ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండా డబుల్స్‌ టైటిల్‌ హస్తగతం

పారిస్‌: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ సాత్వి క్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ ఈ ఏడాది తమ ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోరీ్నలో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం చాంపియన్‌గా నిలిచింది. కేవలం 37 నిమిషాల్లో ముగిసిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ జంట సాత్వి క్‌–చిరాగ్‌ 21–11, 21–17తో లీ జె హుయ్‌–పో సువాన్‌ యాంగ్‌ (చైనీస్‌ తైపీ) జోడీని ఓడించింది.

టైటిల్‌ గెలిచే క్రమంలో భారత జోడీ తమ ప్రత్యర్థులకు ఒక్కగేమ్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. విజేతగా నిలిచిన సాత్వి క్‌–చిరాగ్‌ శెట్టిలకు 62,900 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 52 లక్షలు), 11,000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్‌ చిరాగ్‌ శెట్టి 2022లోనూ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టైటిల్‌ గెలిచారు. ఈ ఏడాది సాత్వి క్‌–చిరాగ్‌ మలేసియా మాస్టర్స్‌ టోర్నీ, ఇండియా ఓపెన్‌ టోరీ్నలలో ఫైనల్‌ చేరి రన్నరప్‌ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. మూడో టోర్నీలో మాత్రం ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా విజేతగా నిలిచారు.


శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ కాంగ్‌ మిన్‌ హుక్‌–సియో సెంగ్‌ జే (దక్షిణ కొరియా) జోడీని 21–13, 21–16తో చిత్తు చేసిన సాత్వి క్‌–చిరాగ్‌... ఫైనల్లోనూ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. సుదీర్ఘ ర్యాలీలు సాగకుండా కళ్లు చెదిరే స్మాష్‌లతో పాయింట్లను తొందరగా ముగించారు. తొలి గేమ్‌లో తొలి ఏడు నిమిషాల్లోనే సాత్వి క్‌–చిరాగ్‌ 11–4తో ఆధిక్యంలోకి వెళ్లారు. ఆ తర్వాత అదే జోరును కొనసాగిస్తూ మరో నాలుగు నిమిషాల్లో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో చైనీస్‌ తైపీ జోడీ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా కీలకదశలో భారత ద్వయం పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement