
అంతిమ్‌కు కాంస్య పతకం
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ మనీషా భన్వాల్ పసిడి పతకంతో మెరిసింది. హోరాహోరీగా సాగిన మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో శుక్రవారం మనీషా 8–7 పాయింట్ల తేడాతో ఓక్ జే కిమ్ (కొరియా)పై విజయం సాధించింది. ఒక దశలో 2–7తో వెనుకంజలో నిలిచిన మనీషా... ఆఖరి నిమిషంలో అసమాన పోరాటంతో వరుసగా 6 పాయింట్లు సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది.
ఆసియా చాంపియన్‌షిప్‌లో 3 కాంస్యాలు గెలిచిన మనీషాకు ఇదే తొలి స్వర్ణం కాగా... సెమీఫైనల్లో మనీషా 5–1తో బిలిమ్‌బెక్ కైజీపై విజయం సాధించింది. అంతకుముందు టైనిస్ డుబెక్ (కజకిస్తాన్), హన్‌బిట్ లీ (కొరియా)పై ఏకపక్ష విజయాలతో మనీషా సెమీస్‌కు చేరింది. 2021 ఆసియా చాంపియన్‌షిప్ తర్వాత ఈ పోటీల్లో భారత్‌కు ఇదే తొలి పసిడి పతకం. ఆ పోటీల్లో భారత్ తరఫున వినేశ్ ఫొగాట్, సరితా మోర్ భారత్ తరఫున స్వర్ణాలు గెలిచారు.
మరోవైపు యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ మహిళల 53 కేజీల విభాగంలో కాంస్యం కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన మోయో కియోకా చేతిలో ఓడిన అంతిమ్... కాస్య పతక పోరులో సత్తాచాటింది. నేహ శర్మ (57 కేజీలు), మోనిక (65 కేజీలు), జ్యోతి బెరివాల్ (72 కేజీలు) మెడల్ రౌండ్స్‌కు అర్హత సాధించలేకపోయారు. ఈ టోర్నీలో భారత్ 1 స్వర్ణం, 1 రజతం, 6 కాంస్యాలతో మొత్తం 8 పతకాలు సాధించగా... పురుషుల ఫ్రీస్టయిల్ పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి.