న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ విభాగం పోటీల్లో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు లభించాయి. 57 కేజీల విభాగంలో రవి దహియా పసిడి పతకం నెగ్గాడు. ఫైనల్లో రవి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో హిక్మతుల్లో వొహిదోవ్ (తజికిస్తాన్)పై గెలిచాడు. బౌట్ ముగియడానికి 2 నిమిషాల 32 సెకన్లు ఉందనగా రవి 10–0తో ఆధిక్యం సంపాదించడంతో నిబంధనల ప్రకారం రిఫరీ భారత రెజ్లర్‌ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు రవి క్వాలిఫయింగ్ రౌండ్‌లో 14–5తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ యుకి తకహాషి (జపాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 6–3తో తగ్స్ బత్జార్గల్ (మంగోలియా)పై, సెమీఫైనల్లో 2019, 2018 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో వరుసగా రజత, కాంస్య పతకాలు నెగ్గిన సనాయెవ్ (కజకిస్తాన్)పై గెలిచాడు. 65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్ (భారత్) 2–10తో టకుటో ఒటుగోరో (జపాన్) చేతిలో... 79 కేజీల విభాగం ఫైనల్లో గౌరవ్ బలియాన్ (భారత్) 5–7తో బుడజపోవ్ (కిర్గిస్తాన్) చేతిలో... 97 కేజీల విభాగం ఫైనల్లో సత్యవర్త్ కడియాన్ (భారత్) 0–10తో ముజ్తబా (ఇరాన్) చేతిలో ఓడిపోయి రజత పతకాలతో సంతృప్తి పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment