Asian Wrestling Championships 202- అస్తానా (కజకిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఎట్టకేలకు భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. ఈ టోర్నీ ఐదో రోజు గురువారం పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్ భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. ఫైనల్లో అమన్ 9–4 పాయింట్ల తేడాతో అల్మాజ్ సమన్‌బెకోవ్ (కిర్గిస్తాన్)పై గెలుపొందాడు.
అప్పుడు రవి దహియా
నేరుగా క్వార్టర్ ఫైనల్ బౌట్ ఆడిన అమన్ 7–1తో రికుటో అరాయ్ (జపాన్)పై, సెమీఫైనల్లో 7–4తో వాన్‌హావో జు (చైనా)పై విజయం సాధించాడు. అమన్ ప్రదర్శనతో వరుసగా నాలుగో ఏడాది 57 కేజీల విభాగంలో భారత్ ఖాతాలోనే స్వర్ణ పతకం చేరడం విశేషం. 2020, 2021, 2022లలో రవి కుమార్ దహియా ఈ విభాగంలో విజేతగా నిలిచాడు. గాయం కారణంగా ఈసారి రవి ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు.
అమన్‌కిది రెండోది
ఢిల్లీలోని విఖ్యాత ఛత్రశాల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసే అమన్ గత ఏడాది అండర్–23 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణ పతకం సాధించాడు. ఈ ఏడాది అమన్‌కిది రెండో పతకం. ఫిబ్రవరిలో జాగ్రెబ్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో అమన్ కాంస్య పతకం గెలిచాడు.
మూడింట నిరాశ
గురువారం జరిగిన ఇతర నాలుగు వెయిట్ కేటగిరీల్లో మూడింట భారత రెజ్లర్లకు నిరాశ ఎదురైంది. 79 కేజీల విభాగంలో దీపక్ కుక్నా కాంస్య పతకం నెగ్గగా... 97 కేజీల విభాగంలో దీపక్ నెహ్రా కాంస్య పతక బౌట్‌లో ఓడిపోయాడు. దీపక్ కుక్నా 12–1తో షురాత్ బొజొరోవ్ (తజికిస్తాన్)పై గెలుపొందగా... దీపక్ నెహ్రా 9–12తో మక్సూద్ వెసలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. అనూజ్ (65 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో, ములాయం యాదవ్ (70 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఓటమి పాలయ్యారు.
హైదరాబాద్ ఎఫ్‌సీ మ్యాచ్ ‘డ్రా’
సూపర్ కప్ టోర్నీలో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తొలి ‘డ్రా’ నమోదు చేసింది. కేరళలో జరుగుతున్న ఈ టోర్నీలో ఈస్ట్ బెంగాల్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌ను హైదరాబాద్ 33తో ‘డ్రా’గా ముగించింది. సోమవారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఒడిశాతో హైదరాబాద్ ఆడుతుంది.
భారత్‌కు తొలి ఓటమి
తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా జోన్ గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. చైనా జట్టుతో గురువారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 0–3తో పరాజయం చవిచూసింది.
తొలి సింగిల్స్‌లో రుతుజా భోస్లే 3–6, 5–7తో జియాంగ్ జిన్యు చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా 5–7, 1–6తో యువాన్ యు చేతిలో ఓటమి పాలైంది. దాంతో భారత పరాజయం ఖరారైంది.
నామమాత్రంగా జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో శ్రీవల్లి రష్మిక–వైదేహి చౌదరీ ద్వయం 0–6, 1–6తో జియాంగ్ జిన్యు–యాంగ్ జావోజువాన్ జోడీ చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ తలపడుతుంది. ఈ టోర్నీలో జపాన్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment