
ఫిలిప్పీన్స్ టీనేజ్ టెన్నిస్ స్టార్ సంచలన ప్రదర్శన
మయామి ఓపెన్‌లో సెమీఫైనల్లోకి
క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ స్వియాటెక్‌పై విజయం
‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగి ‘వైల్డ్ ఫైర్’
రెండో రౌండ్‌లో ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్ ఒస్టాపెంకోపై... మూడో రౌండ్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతమాడిసన్ కీస్‌పై గెలుపు
క్రీడాభిమానులకు ఫిలిప్పీన్స్ దేశం గుర్తుకు రాగానే ముందుగా వారి మదిలో మెదిలేది దిగ్గజ బాక్సర్ మ్యానీ పకియావ్ పేరు. రానున్న రోజుల్లో ఈ స్టార్ బాక్సర్ సరసన అభిమానులు మరో పేరు కూడా ప్రస్తావిస్తారంటే అతిశయోక్తి కాదు. ఖరీదైన టెన్నిస్ క్రీడలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక్కసారిగా అందరి దృష్టిలో పడిన ఆ యువతార ఎవరో కాదు 19 ఏళ్ల అలెగ్జాండ్రా ఇయాలా... స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ ఫిలిప్పీన్స్ టీనేజర్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన ఇయాలా సెమీఫైనల్ చేరుకునే క్రమంలో ముగ్గురు గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్‌ను ఓడించడం విశేషం. జెస్సికా పెగూలాతో జరిగే సెమీఫైనల్లో ఇయాలా విజయం సాధిస్తే... నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన మయామి ఓపెన్‌లో ‘వైల్డ్ కార్డు’తో అడుగు పెట్టి ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది.
ఫ్లోరిడా: అనామకురాలిగా బరిలోకి దిగి రౌండ్ రౌండ్‌కూ సంచలన విజయాలు సాధిస్తున్న ఫిలిప్పీన్స్ టీనేజర్ అలెగ్జాండ్రా ఇయాలా...మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 140వ ర్యాంకర్ ఇయాలా 6–2, 7–5తో ప్రపంచ రెండో ర్యాంకర్, ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన పోలాండ్ స్టార్ ప్లేయర్ ఇగా స్వియాటెక్‌ను బోల్తా కొట్టించింది.
1 గంట 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇయాలా ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిది సార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. 19 ఏళ్ల ఇయాలా గత ఏడేళ్లుగా స్పెయిన్‌లోని రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. ఈ టోర్నీలో ‘వైల్డ్ కార్డు’తో అడుగు పెట్టిన ఇయాలా రెండో రౌండ్‌లో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై 7–6 (7/2), 7–5తో గెలుపొందగా... మూడో రౌండ్‌లో 6–4, 6–2తో ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ఐదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)ను కంగుతినిపించింది.
ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇయాలాకు పదో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) నుంచి ‘వాకోవర్’ లభించింది. ‘నమ్మశక్యంగా లేదు. నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. నా జీవితంలోనే ఇది గొప్ప విజయం’ అని ఇయాలా వ్యాఖ్యానించింది. సెమీఫైనల్లో ఐదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)తో ఆడనున్న ఇయాలా విజయం సాధిస్తే... మయామి ఓపెన్‌లో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగి ఫైనల్ చేరుకున్న తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్)తో పావోలిని (ఇటలీ) తలపడుతుంది.