Satwik Sairaj And Chirag Shetty Won The Title Of Korea Open 2023 - Sakshi
Sakshi News home page

Korea Open 2023: ఎదురులేని సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 

Published Mon, Jul 24 2023 3:40 AM | Last Updated on Mon, Jul 24 2023 9:14 AM

Satwik Sairaj and Chirag Shetty won the title of Korea Open - Sakshi

యోసు (కొరియా): ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తూ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ తమ ఖాతాలో నాలుగో టైటిల్‌ను జమ చేసుకుంది. కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంక్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట 17–21, 21–13, 21–14తో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ జోడీ ఫజర్‌ అల్ఫీయాన్‌–మొహమ్మద్‌ రియాన్‌ అర్దియాంతో (ఇండోనేసియా)పై అద్భుత విజయం సాధించింది.

62 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాత్విక్, మహారాష్ట్ర ఆటగాడు చిరాగ్‌ తొలి గేమ్‌లో తడబడినా వెంటనే తేరుకొని తర్వాతి రెండు గేమ్‌లను దక్కించుకున్నారు. తొలి గేమ్‌లో ఒకదశలో 2–10తో వెనుకబడ్డ భారత జోడీ ఆ తర్వాత అంతరాన్ని తగ్గించినా గేమ్‌ను సొంతం చేసుకోలేకపోయింది. అయితే రెండో గేమ్‌ నుంచి సాత్విక్, చిరాగ్‌ ఆట మారింది. ముఖ్యంగా సాత్విక్‌ తిరుగులేని స్మాష్‌లతో చెలరేగాడు.

ఫలితంగా స్కోరు 15–11 వద్ద భారత జోడీ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 20–15తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు పాయింట్లు చేజార్చుకున్నా వెంటనే మరో పాయింట్‌ నెగ్గి గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ఆరంభంలోనే 7–3తో ఆధిక్యంలోకి వెళ్లి ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.

విజేతగా నిలిచిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి 33,180 డాలర్ల (రూ. 27 లక్షల 20 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ‘వరుసగా టైటిల్స్‌ గెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ వారం మాకెంతో అద్భుతంగా గడిచింది. ఈ టోర్నీ మొత్తం గొప్పగా ఆడాం. మా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాం. మంగళవారం నుంచి జరిగే జపాన్‌ ఓపెన్‌లో మా జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాం’ అని సాత్విక్, చిరాగ్‌ వ్యాఖ్యానించారు.   

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అభినందన 
సాక్షి,అమరావతి: కొరియా ఓపెన్‌లో డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి (మహారాష్ట్ర)లను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో జరిగే టోర్నీల్లోనూ వీరిద్దరూ విజయ పరంపర కొనసాగించాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.   

 ఈ ఏడాది సాత్విక్‌–చిరాగ్‌ నెగ్గిన టైటిల్స్‌. స్విస్‌ ఓపెన్‌ సూపర్‌–300, ఆసియా చాంపియన్‌షిప్, ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌–1000, కొరియా ఓపెన్‌ సూపర్‌–500 టోర్నీలలో టైటిల్స్‌ గెలిచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement