కౌలాలంపూర్: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై మరో టైటిల్ సాధించేందుకు భారత ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి అడుగు దూరంలో నిలిచారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ –1000 టోర్నీ మలేసియా ఓపెన్‌లో ఈ జోడి ఫైనల్లోకి అడుగు పెట్టింది.
ఆరు గేమ్ పాయింట్లు కాపాడుకోవడంతో పాటు ఆపై మరో రెండు పాయింట్లు గెలుచుకొని విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో సీడ్ సాత్విక్ – చిరాగ్ 21–18, 22–20 స్కోరుతో ఆరో సీడ్, కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్ – సియో స్యూంగ్ జాను చిత్తు చేశారు. 47 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ సాగింది.
తొలి గేమ్ ఆరంభంలో భారత ఆటగాళ్ల ఆధిక్యం సాగింది. చక్కటి ర్యాలీలతో వీరిద్దరు 9–5తో ముందంజ వేయగా వరుసగా నాలుగు పాయింట్లతో కొరియా ద్వయం స్కోరును సమం చేసింది. అయితే 11–9తో, ఆపై 13–12తో మన జట్టు ఆధిక్యం ప్రదర్శించింది. వరుస పాయింట్లతో 17–13 వరకు దూసుకెళ్లిన చిరాగ్ – సాత్విక్ దానిని కొనసాగించారు.
రెండో గేమ్ మాత్రం హోరాహోరీగా సాగింది. అనంతరం 9–4తో...11–6తో ఆధిక్యం చూపించిన కొరియా ఆటగాళ్లు ఒక దశలో 17–11తో గేమ్‌పై పట్టు బిగించారు. ఈ సమయంలో భారత్ కోలుకునే ప్రయత్నం చేసినా 20–14తో గేమ్ గెలిచే స్థితికి కొరియా చేరింది. అయితే ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. ఒకటి కాదు రెండు కాదు...వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించిన సాత్విక్ – చిరాగ్ సంచలనం సృష్టించారు.
నేడు జరిగే ఫైనల్లో చైనాకు చెందిన టాప్ సీడ్ జంట లియాంగ్ వి కెంగ్ – వాంగ్ చాంగ్‌తో సాత్విక్ – చిరాగ్ తలపడతారు. గతంలో ఈ రెండు జోడీల మధ్య 4 మ్యాచ్‌ల జరగ్గా...భారత ద్వయం 1 మ్యాచ్‌లో గెలిచి 3 మ్యాచ్‌లలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment