యోసు (కొరియా): గత నెల ఇండోనేసియా ఓపెన్ టైటిల్ గెలుచుకున్న భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి వరుసగా రెండో టైటిల్‌కు చేరువయ్యారు. కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అగ్రశ్రేణి భారత జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకు జంట సాత్విక్–చిరాగ్ 21–15, 24–22తో రెండో సీడ్ లియాంగ్ వే కెంగ్– వాంగ్ చాంగ్ (చైనా) ద్వయంపై గెలుపొందింది.
ప్రపంచ రెండో ర్యాంకులో ఉన్న చైనీస్ ప్రత్యర్థులపై భారత షట్లర్లకు ఇదే తొలి విజయం! గతంలో తలపడిన రెండు సార్లూ సాత్విక్–చిరాగ్‌లకు నిరాశే ఎదురైంది. తాజా సెమీస్‌లో భారత ద్వయం జోరుకు చైనీస్ జంటకు ఓటమి తప్పలేదు. వరుస గేముల్లో గెలిచినప్పటికీ మ్యాచ్ మాత్రం హోరాహోరీగా సాగింది. 3–3 నుంచి 5–5 ఇలా స్కోరు పోటాపోటీగా కదిలింది. సాత్విక్–చిరాగ్ 7–5 స్కోరు వద్ద ఆధిక్యంలోకి వచ్చినప్పటికీ చైనా స్టార్లు స్మాష్‌లతో మళ్లీ సమం చేశారు.
అయితే నెట్ వద్ద లియాంగ్ అనవసర తప్పులు చేయడంతో భారత్ 14–8తో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని సంపాదించి తొలి గేమ్‌ను చేజిక్కించుకుంది. ఇక రెండో గేమ్‌లో పోటీ మరింత పెరిగింది. ఆరంభం నుంచి 2–2, 8–8 వద్ద వరుస విరామాల్లో స్కోర్లు సమం కావడంతో ఇరు జోడీలు పైచేయి సాధించేందుకు శ్రమించారు. సాత్విక్ స్మాష్‌లతో రెచ్చిపోయాడు. వరుస పాయింట్లతో 11–8తో ఆధిక్యంలోకి వచ్చిన భారత జోడీ దీన్ని 14–9తో పెంచుకుంది.
కానీ లియాంగ్, వాంగ్ క్రాస్‌కోర్టు షాట్లకు పదునుపెట్టడంతో పోటాపోటీ మళ్లీ మొదటికొచ్చింది. ఇక్కడినుంచి ఆఖరి దశ దాకా హోరాహోరీ కొనసాగడంతో 20–20, 22–22 వద్ద స్కోర్లు సమమయ్యాయి. తర్వాత నాలుగోసారి దక్కిన మ్యాచ్ పాయింట్‌ను ఈ సారి ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా సాత్విక్ తెలివిగా స్మాష్‌లతో ముగించాడు. నేడు జరిగే తుదిపోరులో భారత జోడీ టాప్ సీడ్ ఫజర్ అలి్పయాన్–ముహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) జంటతో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment