డానిల్ మెద్వెదెవ్, నిక్ కిరియోస్
న్యూయార్క్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా వివాదాస్పద టెన్నిస్ ప్లేయర్ నిక్ కిరియోస్ యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం సృష్టించాడు. తన దూకుడైన ఆటతో కిరియోస్ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఇంటిదారి పట్టించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ కిరియోస్ 7–6 (13/11), 3–6, 6–3, 6–2తో మెద్వెదెవ్‌పై విజయం సాధించి తన కెరీర్‌లో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కిరియోస్, మెద్వెదెవ్ ఏస్‌లతో హడలెత్తించారు. కిరియోస్ 21, మెద్వెదెవ్ 22 ఏస్‌లు సంధించారు. అయితే అందివచ్చిన బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకున్న కిరియోస్ విజయం రుచి చూశాడు. మ్యాచ్ మొత్తంలో మెద్వెదెవ్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన కిరియోస్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్లో మరో రష్యా ప్లేయర్ ఖచనోవ్‌తో కిరియోస్ ఆడతాడు.
తాజా ఓటమితో మెద్వెదెవ్ వచ్చే సోమవారం విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోనున్నాడు. మెద్వెదెవ్ స్థానంలో నాదల్ (స్పెయిన్), అల్‌కరాజ్ (స్పెయిన్), కాస్పర్ రూడ్ (నార్వే)లలో ఒకరు ప్రపంచ నంబర్‌వన్ అవుతారు. మరోవైపు ఐదో ర్యాంకర్ కాస్పర్ రూడ్, ఖచనోవ్ కూడా తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రూడ్ 6–1, 6–2, 6–7 (4/7), 6–2తో ముటెట్ (ఫ్రాన్స్)పై, ఖచనోవ్ 4–6, 6–3, 6–1, 4–6, 6–3తో కరెనో బుస్టా (స్పెయిన్)పై, బెరెటిని (ఇటలీ) 3–6, 7–6 (7/2), 6–3, 4–6, 6–2తో ఫోకినా (స్పెయిన్)పై, తొమ్మిదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–4, 6–4తో ఏడో సీడ్ కామెరూన్ నోరి (బ్రిటన్)పై గెలిచారు.
కోకో గాఫ్, జబర్ తొలిసారి...
మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా టీనేజర్ కోకో గాఫ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), 17వ ర్యాంకర్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), 46వ ర్యాంకర్ ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్ 7–5, 7–5తో షుయె జాంగ్ (చైనా)పై గెలుపొందగా... జబర్ 7–6 (7/1), 6–4తో కుదెర్‌మెటోవా (రష్యా)ను ఓడించింది. మూడో రౌండ్‌లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను బోల్తా కొట్టించిన తొమ్లాయనోవిచ్ అదే జోరు కొనసాగించి ప్రిక్వార్టర్ ఫైనల్లో 7–6 (8/6), 6–1తో సమ్‌సోనోవా (రష్యా)పై గెలిచింది. కెరీర్‌లో 42వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న గార్సియా 6–4, 6–1తో అలీసన్ రిస్కే అమృత్‌రాజ్ (అమెరికా)ను ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment