రద్వాన్‌స్కాకు చుక్కెదురు
న్యూయార్క్: సీడెడ్ క్రీడాకారిణులకు ఈసారి యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ కలసిరావడంలేదు. ఇప్పటికే టాప్-10 సీడింగ్స్‌లోని ముగ్గురు క్రీడాకారిణులు సారా ఎరాని, కరోలిన్ వొజ్నియాకి, పెట్రా క్విటోవా మూడో రౌండ్‌లోపు నిష్ర్కమించగా... నాలుగో రౌండ్‌లో మరో ముగ్గురు వారి సరసన చేరారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్), ఎనిమిదో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), తొమ్మిదో సీడ్ జెలెనా జంకోవిచ్ (సెర్బియా) ఓటమి పాలయ్యారు. మరోవైపు టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), ఐదో సీడ్ నా లీ (చైనా) తమ జోరు కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో 24వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా) 6-4, 6-4తో రద్వాన్‌స్కాపై; 18వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) 4-6, 6-3, 7-6 (7/3)తో కెర్బర్‌పై; నా లీ 6-0, 6-3తో జంకోవిచ్‌పై గెలిచారు. డిఫెండింగ్ చాంపియన్ సెరెనా 6-4, 6-1తో 15వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)ను ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో కార్లా నవారోతో సెరెనా; మకరోవాతో నా లీ తలపడతారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో పదో సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-4, 6-2తో కామిలా జియార్జి (ఇటలీ)పై గెలిచింది.
ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్, ముర్రే
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్)తోపాటు మాజీ విజేతలు జొకోవిచ్ (సెర్బియా), హెవిట్ (ఆస్ట్రేలియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్‌లో మూడో సీడ్ ముర్రే 7-6 (7/2), 6-2, 6-2తో మాయెర్ (జర్మనీ)పై, టాప్ సీడ్ జొకోవిచ్ 6-0, 6-2, 6-2తో సౌసా (పోర్చుగల్)పై, హెవిట్ 6-3, 7-6 (7/5), 3-6, 6-1తో డాన్‌స్కాయ్ (రష్యా)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ బెర్డిచ్ 6-0, 6-3, 6-2తో బెనెట్యూ (ఫ్రాన్స్)పై, తొమ్మిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-3, 6-2, 6-7 (1/7), 7-6 (9/7)తో బగ్ధాటిస్ (సైప్రస్)పై, 21వ సీడ్ యూజ్నీ (రష్యా) 6-3, 6-2, 2-6, 6-3తో 12వ సీడ్ టామీ హాస్ (జర్మనీ)పై. ఇస్టోమిన్ (ఉజ్బెకిస్థాన్) 6-3, 6-4, 2-6, 3-6, 6-1తో 20వ సీడ్ సెప్పి (ఇటలీ)పై నెగ్గారు.
పురుషుల డబుల్స్ మూడో రౌండ్‌లో ఆరో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-వాసెలిన్ (ఫ్రాన్స్) జోడి 4-6, 4-6తో 12వ సీడ్ ఫ్లెమింగ్-ముర్రే (బ్రిటన్) ద్వయం చేతిలో ఓడింది