నాదల్ & వావ్రింకా
►పదో సారి ఫైనల్లోకి నాదల్
►వావ్రింకాతో అమీతుమీ రేపు
►ఫ్రెంచ్ ఓపెన్
ఇటు వావ్రింకా, అటు నాదల్ తమ ప్రత్యర్థులను దెబ్బకు దెబ్బ తీశారు. తమ ప్రతీకారానికి ఫ్రెంచ్ ఓపెన్‌ను వేదికగా చేసుకున్నారు. గతేడాది ఇదే వేదికపై బ్రిటన్ స్టార్ ముర్రే చేతిలో సెమీస్‌లో ఎదురైన పరాభవానికి ఈ ఏడాది వావ్రింకా బదులు తీసుకుంటే... మూడువారాల క్రితం రోమ్ మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్లో థీమ్ చేతిలో చవిచూసిన పరాజయానికి నాదల్ ప్రతీకారం తీర్చుకున్నాడు.
పారిస్: స్పానిష్ సంచలనం రాఫెల్ నాదల్... మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్‌లో తుదిపోరుకు అర్హత సంపాదించాడు. ఈ క్లేకోర్టు సూపర్ చాంపియన్ పదో టైటిల్ కోసం స్విట్జర్లాండ్ స్టార్ వావ్రింకాతో తలపడనున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో నాదల్ 6–3, 6–4, 6–0తో డొమినిక్ థీమ్‌ను చిత్తుచిత్తుగా ఓడించాడు. కేవలం 2 గంటల 7 నిమిషాల్లోనే థీమ్ ఆట కట్టించాడు. మరో సెమీస్‌లో వావ్రింకా 6–7 (6/8), 6–3, 5–7, 7–6 (7/3), 6–1తో ముర్రేను కంగుతినిపించాడు. ఇద్దరు తమ తమ ప్రత్యుర్థులపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఫైనల్ పరంగా చూస్తే కూడా ఇద్దరి గణాంకాలు ఆసక్తికరంగానే ఉన్నాయి. ఇప్పటి దాకా ఫైనల్ చేరిన ఏ గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ వావ్రింకా ఓడిపోలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ (2014) ఫైనల్లో నాదల్‌ను కంగుతినిపించిన వావ్రింకా... ఫ్రెంచ్ ఓపెన్ (2015), యూఎస్ ఓపెన్ (2016) ఫైనల్స్‌లో జొకోవిచ్‌ను ఓడించాడు. మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్‌ది ఎదురులేని రికార్డు. ఫైనల్ చేరిన 9 సార్లు టైటిల్ చేజిక్కించుకున్నాడు.
వారెవ్వా వావ్రింకా
గతేడాది... ఇదే టోర్నీ... డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి వావ్రింకా... క్వార్టర్స్ దాకా ఎదురేలేని పయనం. కానీ సెమీస్‌లో చుక్కెదురు. బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే చేతిలో ఓటమి. వరుసగా రెండో టైటిల్ గెలుద్దామనుకున్న ఆశలకు తెర! అందుకేనేమో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకున్నాడు. ఏడాది తిరిగేలోపే లెక్క సరిచేశాడు. ముర్రే కథను అదే టోర్నీ సెమీస్‌లో ముగించాడు. వారెవ్వా వావ్రింకా అనిపించుకున్నాడు.
ఆద్యంతం హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 2015 చాంపియన్ స్విస్ స్టార్ 3–2 సెట్లతో గతేడాది రన్నరప్ ముర్రేను కంగుతినిపించాడు. జోరు మీదున్న వావ్రింకాకు ఇది వరుసగా పదో విజయం కావడం గమనార్హం. ఇద్దరి పోరాటంతో నాలుగున్నర గంటలపాటు ఈ మ్యాచ్ సాగింది. మొదటి సెట్ నుంచే ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో రెండు సెట్లు టైబ్రేక్ దారి తీశాయి. చివరకు వావ్రింకా 6–7 (6/8), 6–3, 5–7, 7–6 (7/3), 6–1తో ముర్రేను కంగుతినిపించాడు. బ్రిటన్ స్టార్ ఆరంభం నుంచే మ్యాచ్‌పై పట్టుబిగించే ప్రయత్నం చేశాడు. అయితే వావ్రింకా కూడా దీటుగా బదులివ్వడంతో ప్రతీపాయింట్‌కు చెమటోడ్చాల్సివచ్చింది. అయితే ఈ సెట్‌లో స్విస్ స్టార్ పదే పదే అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.
టైబ్రేక్‌లోనూ సరిదిద్దుకోలేని తప్పులతో తొలిసెట్‌ను కోల్పోయాడు. తర్వాత రెండో సెట్‌ను మాత్రం దూకుడుగా ప్రారంభించిన వావ్రింకా ప్రత్యర్థి సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే మూడో సెట్‌లో మళ్లీ ముర్రేదే పైచేయి అయ్యింది. ముర్రే మూడు బ్రేక్ పాయింట్లను సాధించగా... వావ్రింకా మళ్లీ నియంత్రణే లేని అనవసర తప్పిదాలతో సెట్‌ను కోల్పోవాల్సివచ్చింది. ఇక నాలుగో సెట్‌లో మళ్లీ ఇద్దరు అసాధారణ ప్రదర్శన కనబరచడంతో ఇది సుదీర్ఘంగా సాగింది. దీంతో ఈ సెట్ కూడా టైబ్రేక్‌కు దారితీసినప్పటికీ వావ్రింకా దూకుడుగా ఆడి సెట్‌ను ముగించాడు. ఇద్దరూ వీరోచిత పోరాటంతో 2–2తో సమంగా నిలిచారు. నిర్ణాయక ఐదో సెట్‌లో వావ్రింకా జోరు ముందు ముర్రే తేలిపోయాడు. వరుసగా ఐదు గేమ్‌లు గెలుచుకొని వావ్రింకా 5–0తో ఆధిక్యంలో నిలిచాడు. తర్వాతి గేమ్‌ను ముర్రే బ్రేక్ చేసినా... ఏడో గేమ్‌ను బ్రేక్ చేసిన స్విస్ ఆటగాడు సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.