డిఫెండింగ్ చాంపియన్ ముర్రేపై సంచలన విజయం | US Open - Andy Murray title defence ended by dominant Wawrinka | Sakshi
Sakshi News home page

డిఫెండింగ్ చాంపియన్ ముర్రేపై సంచలన విజయం

Published Sat, Sep 7 2013 1:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

డిఫెండింగ్ చాంపియన్ ముర్రేపై సంచలన విజయం

డిఫెండింగ్ చాంపియన్ ముర్రేపై సంచలన విజయం

ముర్రే మెరుపులకు బ్రేక్ పడింది. తాను ఆడిన చివరి నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరుకొని రెండింటిలో టైటిల్ సాధించిన ఈ బ్రిటన్ స్టార్ యూఎస్ ఓపెన్‌లో నమ్మశక్యంకాని రీతిలో ఓడిపోయాడు. ఇన్నాళ్లూ స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నీడలో అంతగా గుర్తింపు పొందలేకపోయిన వావ్రింకా తన కెరీర్‌లో చిరస్మరణీయ విజయం సాధించాడు. డిఫెండింగ్ చాంపియన్ ముర్రేను వరుస సెట్‌లలో ఓడించి యూఎస్ ఓపెన్‌లో అతిపెద్ద సంచలనం నమోదు చేశాడు.
 
 న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) క్వార్టర్ ఫైనల్లోనే చేతులెత్తేశాడు. తొమ్మిదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) నమ్మశక్యంకానిరీతిలో ఆడుతూ వరుస సెట్‌లలో 6-4, 6-3, 6-2తో ముర్రేను బోల్తాకొట్టించాడు. ఈ క్రమంలో వావ్రింకా తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్ దశకు అర్హత సాధించాడు.
 
 వరుసగా 35వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న వావ్రింకా ఈ మెగా ఈవెంట్స్‌లో అత్యుత్తమంగా మూడుసార్లు (2011 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012 ఫ్రెంచ్ ఓపెన్, 2010 యూఎస్ ఓపెన్) క్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాడు. 2004లో ఆండీ రాడిక్ తర్వాత యూఎస్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోవడం ఇదే తొలిసారి.
 
 ఏకపక్షంగా...
 ఈసారి టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన ముర్రే క్వార్టర్ ఫైనల్లో పేలవ ఆటతీరును కనబరిచాడు. 2 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వావ్రింకా ఆద్యంతం దూకుడుగా ఆడటంతో ఈ బ్రిటన్ స్టార్ ఏదశలోనూ తేరుకోలేకపోయాడు. తొలి సెట్‌లో, రెండో సెట్‌లో ఒక్కోసారి ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ స్విస్ స్టార్ మూడో సెట్‌లో రెండుసార్లు బ్రేక్ పాయింట్లు సాధించాడు. మరోవైపు మ్యాచ్ మొత్తంలో ముర్రేకు ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా రాలేకపోవడం గమనార్హం. నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 30 అనవసర తప్పిదాలు చేసిన ముర్రేకు తానాడిన 146 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం కేవలం ఇది రెండోసారి మాత్రమే. 2008 వింబుల్డన్ టోర్నీలో నాదల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ ముర్రేకు ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం రాలేదు.
 
 వరుసగా 14వ సారి సెమీస్‌లోకి
 పురుషుల సింగిల్స్‌లోని మరో క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 6-2, 3-6, 6-0తో 21వ సీడ్ యూజ్నీ (రష్యా)పై గెలిచాడు. తన కెరీర్‌లో వరుసగా 14వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో, వరుసగా ఏడోసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. అయితే ఈ టోర్నీలో తొలిసారి ప్రత్యర్థికి ఒక సెట్‌ను కోల్పోయాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో వావ్రింకాతో జొకోవిచ్; గాస్కేతో నాదల్ ఆడతారు.
 
 సానియా జోడి ఓటమి
 యూఎస్ ఓపెన్‌లో భారత స్టార్ సానియా మీర్జా పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా మీర్జా-జెంగ్ జీ (చైనా) జోడి 2-6,2-6తో యాష్లే బార్తీ-కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది. 65 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా జంట ఒక్కో సెట్‌లో మూడేసిసార్లు తమ సర్వీస్‌లను కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement