గట్టెక్కిన వావ్రింకా | Australian Open tournament | Sakshi
Sakshi News home page

గట్టెక్కిన వావ్రింకా

Published Mon, Jan 16 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

గట్టెక్కిన వావ్రింకా

గట్టెక్కిన వావ్రింకా

ఐదు సెట్‌ల పోరులో విజయం
శ్రమించిన ఫెడరర్, ముర్రే
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ  


టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో స్టార్‌ క్రీడాకారులకు తొలి రోజే కఠిన పరీక్ష ఎదురైంది. మాజీ చాంపియన్, నాలుగో సీడ్‌ వావ్రింకా, ఐదో సీడ్‌ కీ నిషికోరి, యూఎస్‌ ఓపెన్‌ మాజీ విజేత, ఏడో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ తొలి రౌండ్‌నుఅతికష్టమ్మీద గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మాజీ నంబర్‌వన్‌ రోజర్‌ ఫెడరర్‌(స్విట్జర్లాండ్‌), టాప్‌ సీడ్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌) కూడా విజయం కోసం కష్ట పడాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్‌ విభాగంలో మాత్రం నాలుగో సీడ్‌ సిమోనా హలెప్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.  

మెల్‌బోర్న్‌: ఒకవైపు మండుతున్న ఎండలు... మరోవైపు ఊహించనిరీతిలో కఠిన ప్రత్యర్థులు... దాంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్‌ విభాగంలో తొలి రోజు సీడెడ్‌ క్రీడాకారులకు కష్టాలు తప్పలేదు. 2014 చాంపియన్‌ స్టానిస్లాస్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌), 2014 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా), 2014 యూఎస్‌ ఓపెన్‌ రన్నరప్‌ కీ నిషికోరి (జపాన్‌) ఐదు సెట్‌లపాటు తీవ్రంగా పోరాడి తొలి రౌండ్‌ అడ్డంకిని అధిగమించడంలో సఫలమయ్యారు. 3 గంటల 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా 4–6, 6–4, 7–5, 4–6, 6–4తో క్లిజాన్‌ (స్లొవేకియా)పై గెలుపొందగా... 3 గంటల 34 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నిషికోరి 5–7, 6–1, 6–4, 6–7 (6/8), 6–2తో కుజ్‌నెత్సోవ్‌ (రష్యా)ను ఓడించాడు. 3 గంటల నాలుగు నిమిషాలపాటు జరిగిన మరో మ్యాచ్‌లో సిలిచ్‌ 4–6, 4–6, 6–2, 6–2, 6–3తో జనోవిచ్‌ (పోలండ్‌)పై విజయం సాధించాడు. క్లిజాన్‌తో జరిగిన పోరులో వావ్రింకా 21 ఏస్‌లు సంధించగా... ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు, 43 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు.
మరోవైపు టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన ఐదుసార్లు రన్నరప్‌ ఆండీ ముర్రే 7–5, 7–6 (7/5), 6–2తో మర్చెంకో (ఉక్రెయిన్‌)ను ఓడించగా... గతంలో నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన 17వ సీడ్‌ ఫెడరర్‌ 7–5, 3–6, 6–2, 6–2తో జర్గెన్‌ మెల్జర్‌ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు. 2 గంటల ఐదు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌ 19 ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, మెల్జర్‌ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేశాడు. 14వ సీడ్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా), పదో సీడ్‌ బెర్డిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌), 12వ సీడ్‌ సోంగా (ఫ్రాన్స్‌), 23వ సీడ్‌ జాక్‌ సాక్‌ (అమెరికా) కూడా రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.

మళ్లీ తొలి రౌండ్‌లోనే హలెప్‌కు చుక్కెదురు...
హిళల సింగిల్స్‌ విభాగంలో తొలి రోజే సంచలనం నమోదైంది. నాలుగో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) 3–6, 1–6తో షెల్బీ రోజర్స్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. ఏడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడుతున్న హలెప్‌కు ఈ టోర్నీ అంతగా కలిసిరాలేదు. గతంలో ఈ టోర్నీలో ఆమె రెండుసార్లు మాత్రమే తొలి రౌండ్‌ను దాటగలిగింది.

డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) 6–2, 5–7, 6–2తో సురెంకో (ఉక్రెయిన్‌)పై కష్టపడి గెలిచింది. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ గార్బిన్‌ ముగురుజా (స్పెయిన్‌) 7–5, 6–4తో ఎరాకోవిచ్‌ (న్యూజిలాండ్‌)పై, 13వ సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) 7–6 (7/5), 7–5తో కొజ్‌లోవా (ఉక్రెయిన్‌)పై, ఎనిమిదో సీడ్‌ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా) 6–0, 6–1తో డుకీ మరినో (కొలంబియా)పై, పదో సీడ్‌ కార్లా నవారో (స్పెయిన్‌) 6–2, 6–2తో సెపెలోవా (స్లొవేకియా)పై గెలిచారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement