వారె‘వావ్‌రింకా’
తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు సెమీస్‌లో సోంగాపై విజయం
ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్భుతమైన ఆటతీరుతో అలరిస్తున్న వావ్రింకా అదే జోరుతో ఫైనల్‌కు చేరాడు. ఫెడరర్‌నే మట్టికరిపించిన వావ్రింకా ముందు సోంగా నిలబడలేకపోయాడు. జొకోవిచ్, ముర్రేల మధ్య సెమీస్ విజేతతో... ఆదివారం జరిగే ఫైనల్లో వావ్రింకా తలపడతాడు.
పారిస్ : గతేడాది తొలి రౌండ్‌లోనే ఓడిన వావ్రింకా ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సమరానికి సిద్ధమయ్యాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-3, 6-7 (1/7), 7-6 (7/3), 6-4తో 14వ సీడ్ జో విల్‌ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా ఈ టోర్నీలో అడుగుపెట్టిన వావ్రింకా ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ అంతిమ పోరాటానికి చేరుకున్నాడు. 12 ఏళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ బాలుర సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఈ స్విట్జర్లాండ్ ప్లేయర్ పురుషుల విభాగంలోనూ ఈ ఘనత సాధించేందుకు మరో విజయం దూరంలో ఉన్నాడు.
ఈ స్విస్ ఆటగాడి దూకుడుతో ఫ్రాన్స్ అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. 1988లో హెన్రీ లెకొంటె తర్వాత సోంగా రూపంలో మరో ఫ్రాన్స్ ఆటగాడు ఈ టోర్నీలో ఫైనల్ చేరుకుంటాడని భావించినా అది సాధ్యపడలేదు. ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను, క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ నిషికోరి (జపాన్)ను ఓడించిన సోంగా సెమీస్‌లోనూ పోరాడినా కీలకదశలో తడబడ్డాడు. మరోవైపు క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్, మాజీ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను వరుస సెట్‌లలో చిత్తు చేసిన వావ్రింకా అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. శక్తివంతమైన బ్యాక్‌హ్యాండ్ షాట్‌లతోపాటు పదునైన ఏస్‌లతో చెలరేగిన వావ్రింకా మ్యాచ్ మొత్తంలో మూడుసార్లు సోంగా సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఈ గెలుపుతో వావ్రింకా కెరీర్‌లో రెండోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. 2014లో అతను ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గాడు.