mens singles title
-
US Open 2022: ‘నంబర్‌వన్’ సమరం
న్యూయార్క్: పురుషుల టెన్నిస్ చరిత్రలో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో ఇద్దరు క్రీడాకారులు ఏకకాలంలో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. ఫైనల్లో గెలిచిన ప్లేయర్‌కు తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ లభిస్తుంది. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి ఒంటి గంట 30 నిమిషాలకు ఈ ఫైనల్ మొదలవుతుంది. సెమీఫైనల్స్‌లో ఏడో సీడ్ కాస్పర్ రూడ్ 7–6 (7/5), 6–2, 5–7, 7–2తో 27వ సీడ్ ఖచనోవ్ (రష్యా)పై... మూడో సీడ్ అల్కరాజ్ 6–7 (6/8), 6–3, 6–1, 6–7 (5/7), 6–3తో 22వ సీడ్ టియాఫో (అమెరికా)పై గెలిచారు. 23 ఏళ్ల కాస్పర్ రూడ్ తన కెరీర్లో రెండో సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరగా... 19 ఏళ్ల అల్కరాజ్ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ ఏడాది కాస్పర్ రూడ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచాడు. పక్కా ప్రణాళికతో... నాన్న క్రిస్టియాన్ శిక్షణలో రాటుదేలిన కాస్పర్ పక్కా ప్రణాళికతో ఆడి రష్యా ఆజానుబాహుడు ఖచనోవ్ ఆట కట్టించాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ శక్తివంతమైన సర్వీస్‌లను రిటర్న్ చేయడానికి కాస్పర్ బేస్‌లైన్ వెనుక నిల్చోని రిటర్న్ చేశాక సుదీర్ఘ ర్యాలీలు ఆడాడు. తొలి సెట్ టైబ్రేక్‌లో కాస్పర్, ఖచనోవ్ మధ్య 12వ పాయింట్ కోసం ఏకంగా 55 షాట్ల ర్యాలీ జరగడం విశేషం. మూడు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కాస్పర్ పది ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 23 సార్లు దూసుకొచ్చి 20 సార్లు పాయింట్లు గెలిచాడు. 53 విన్నర్స్ కొట్టిన కాస్పర్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఖచనోవ్ 41 అనవసర తప్పిదాలు చేశాడు. వరుసగా మూడో మ్యాచ్‌లో... ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అల్కరాజ్ ఈ టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఐదు సెట్ల పోరాటంలో విజయాన్ని దక్కించుకున్నాడు. 4 గంటల 19 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 59 విన్నర్స్ కొట్టిన అల్కరాజ్ నెట్ వద్దకు 42 సార్లు దూసుకొచ్చి 32 సార్లు పాయింట్లు గెలిచాడు. మరోవైపు టియాఫో 15 ఏస్‌లు సంధించి ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 52 అనవసర తప్పిదాలు చేశాడు. 7: ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వరుసగా మూడు ఐదు సెట్ల మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ చేరిన ఏడో ప్లేయర్‌గా అల్కరాజ్ గుర్తింపు పొందాడు. గతంలో అగస్సీ (అమెరికా; 2005 యూఎస్ ఓపెన్), ఎడ్బర్గ్ (స్వీడన్; 1992 యూఎస్ ఓపెన్), బన్గెర్ట్ (జర్మనీ; 1967 వింబుల్డన్), టోనీ రోచ్ (ఆస్ట్రేలియా; 1967 ఫ్రెంచ్ ఓపెన్), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా; 1962 ఫ్రెంచ్ ఓపెన్), అలెక్స్ ఒల్మెడో (పెరూ/అమెరికా; 1959 ఆస్ట్రేలియన్ ఓపెన్) ఈ ఘనత సాధించారు. రాజీవ్–సాలిస్బరీ జోడీకి డబుల్స్ టైటిల్ పురుషుల డబుల్స్‌లో రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో రాజీవ్ రామ్–సాలిస్బరీ ద్వయం 7–6 (7/4), 7–5తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. వరుసగా 22వ ఏడాది యూఎస్ ఓపెన్‌లో ఆడిన రాజీవ్ 11 వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగాడు. వుడ్ఫర్డ్–వుడ్‌బ్రిడ్జ్ (ఆస్ట్రేలియా; 1995, 1996) ద్వయం తర్వాత యూఎస్ ఓపెన్‌లో వరుసగా రెండేళ్లు డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి జోడీగా రాజీవ్–సాలిస్బరీ ద్వయం గుర్తింపు పొందింది. -
Novak Djokovic: ఆ కుర్రాడి సలహాల వల్లే టైటిల్ నెగ్గాను.. అందుకే ఆ గిఫ్ట్
పారిస్: ఆదివారం రాత్రి జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ 2021 ఫైనల్లో అద్భుత విజయం సాధించి, 19వ గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకున్న ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జోకవిచ్.. ఓ చిన్నారి అభిమానికి తన విన్నింగ్ రాకెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. గ్రీకు వీరుడు, సిట్సిపాస్‌తో జరిగిన హోరాహోరీ పోరులో తొలి రెండు సెట్లను కోల్పోయిన జకో.. ఆ తర్వాత వరుసగా మూడు సెట్లలో గెలిచి రెండోసారి కెరీర్ స్లామ్ సాధించాడు. ఈ సందర్భంగా తాను టైటిల్ నెగ్గడానికి సహకరించిన కుర్రాడికి ఆయన అపురూపమైన బహుమతిని అందజేశాడు. తన పోరాటంలో కీలకపాత్ర పోషించిన చిన్నారి అభిమానికి కృతజ్ఞతగా విన్నింగ్ రాకెట్‌ను బహుకరించాడు. A gift to a great supporter 😄#RolandGarros | @DjokerNole pic.twitter.com/F04a5UDNQr — Roland-Garros (@rolandgarros) June 13, 2021 ఇదిలా ఉంటే, తన అభిమాన ఆటగాడి నుంచి ఊహించని గిఫ్ట్‌ను అందుకున్న ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పట్టలేని సంతోషంతో గంతులేస్తూ కేరింతలు పెట్టాడు. ఈ మొత్తం సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా, ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ తుది సమరంలో జకో 6–7 (6/8), 2–6, 6–3, 6–2, 6–4తో చారిత్రక విజయాన్ని సాధించాడు. టైటిల్ విజేత జొకోవిచ్‌కు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్ సిట్సిపాస్‌కు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించింది. చదవండి: ఫైనల్‌కు కొద్ది నిమిషాల ముందే ఆ విషయం తెలిసింది.. -
ఫైనల్‌కు కొద్ది నిమిషాల ముందే ఆ విషయం తెలిసింది..
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పోరాడి ఓడిన గ్రీకు వీరుడు స్టెఫానోస్ సిట్సిపాస్.. మ్యాచ్‌కు ముందు జరిగిన విషాదాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తనకెంతో ఇష్టమైన నాన్నమ్మ చనిపోయినట్లు.. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందే తనకు విషయం తెలిసినట్లు చెప్పుకొచ్చాడు. తన నాన్నమ్మలాంటి వ్యక్తిని తాను ఇప్పటి వరకూ చూడలేదని ఆయన తెలిపాడు. నాన్నమ్మ తననెప్పుడూ ఉల్లాసంగా ఉంచేందుకు ప్రయత్నించేదని, ఆమె లాంటి వ్యక్తులు కలలు కనడం నేర్పిస్తారని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Stefanos Tsitsipas (@stefanostsitsipas98) జీవితంలో గెలుపు ఓటములు సహజమని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించామా లేదా అన్నదే ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. కాగా, ఆ బాధను దిగమింగుతూనే ఫైనల్ బరిలో దిగిన సిట్సిపాస్.. తొలి రెండు సెట్లు గెలిచి గెలుపు దిశగా పయనించేలా కనిపించాడు. కానీ ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ అనూహ్యంగా పుంజుకోవడంతో ఓటమిపాలయ్యాడు. 4 గంటల 11 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో జకో 6–7 (6/8), 2–6, 6–3, 6–2, 6–4తో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై విజయం సాధించాడు. చదవండి: వీరోచితం... ‘జొకో’ విజయం -
విజేత సౌరభ్ వర్మ
సాక్షి, హైదరాబాద్: జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ ఈ ఏడాది రెండో అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ముగిసిన హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో సౌరభ్ వర్మ పురుషుల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సౌరభ్ వర్మ 21–13, 14–21, 21–16తో లో కీన్ యె (సింగపూర్)పై విజయం సాధించాడు. మేలో సౌరభ్ వర్మ స్లొవేనియా ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. ‘ఈ టోర్నీలో నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. పలు హోరాహోరీ మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకున్నాను. ఫైనల్లో తొలి గేమ్ గెలిచాక రెండో గేమ్‌లో ఆధిక్యంలో ఉన్న దశలో ఏకాగ్రత కోల్పోయాను. తొందరగా మ్యాచ్‌ను ముగించాలనే ఉద్దేశంతో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాను. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో మళ్లీ వ్యూహం మార్చి ప్రత్యర్థిపై పైచేయి సాధించాను’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల సౌరభ్ వర్మ వ్యాఖ్యానించాడు. విజేతగా నిలిచిన సౌరభ్ వర్మకు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 98 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంటకు నిరాశ ఎదురైంది. బేక్ హా నా–జుంగ్ క్యుంగ్ యున్ (దక్షిణ కొరియా) జోడీతో జరిగిన ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 17–21, 17–21తో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. రన్నరప్‌గా నిలిచిన సిక్కి–అశ్విని జోడీకి 2,850 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 4,680 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
వారె‘వావ్రింకా’
తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు సెమీస్‌లో సోంగాపై విజయం ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్భుతమైన ఆటతీరుతో అలరిస్తున్న వావ్రింకా అదే జోరుతో ఫైనల్‌కు చేరాడు. ఫెడరర్‌నే మట్టికరిపించిన వావ్రింకా ముందు సోంగా నిలబడలేకపోయాడు. జొకోవిచ్, ముర్రేల మధ్య సెమీస్ విజేతతో... ఆదివారం జరిగే ఫైనల్లో వావ్రింకా తలపడతాడు. పారిస్ : గతేడాది తొలి రౌండ్లోనే ఓడిన వావ్రింకా ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సమరానికి సిద్ధమయ్యాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-3, 6-7 (1/7), 7-6 (7/3), 6-4తో 14వ సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా ఈ టోర్నీలో అడుగుపెట్టిన వావ్రింకా ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ అంతిమ పోరాటానికి చేరుకున్నాడు. 12 ఏళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ బాలుర సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఈ స్విట్జర్లాండ్ ప్లేయర్ పురుషుల విభాగంలోనూ ఈ ఘనత సాధించేందుకు మరో విజయం దూరంలో ఉన్నాడు. ఈ స్విస్ ఆటగాడి దూకుడుతో ఫ్రాన్స్ అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. 1988లో హెన్రీ లెకొంటె తర్వాత సోంగా రూపంలో మరో ఫ్రాన్స్ ఆటగాడు ఈ టోర్నీలో ఫైనల్ చేరుకుంటాడని భావించినా అది సాధ్యపడలేదు. ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను, క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ నిషికోరి (జపాన్)ను ఓడించిన సోంగా సెమీస్‌లోనూ పోరాడినా కీలకదశలో తడబడ్డాడు. మరోవైపు క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్, మాజీ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను వరుస సెట్లలో చిత్తు చేసిన వావ్రింకా అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. శక్తివంతమైన బ్యాక్‌హ్యాండ్ షాట్లతోపాటు పదునైన ఏస్‌లతో చెలరేగిన వావ్రింకా మ్యాచ్ మొత్తంలో మూడుసార్లు సోంగా సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఈ గెలుపుతో వావ్రింకా కెరీర్లో రెండోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. 2014లో అతను ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గాడు.