మళ్లీ గట్టెక్కిన ముర్రే | British star, who won a five-set match in the second round | Sakshi
Sakshi News home page

మళ్లీ గట్టెక్కిన ముర్రే

Published Thu, May 26 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM

మళ్లీ గట్టెక్కిన ముర్రే

మళ్లీ గట్టెక్కిన ముర్రే

రెండో రౌండ్‌లోనూ ఐదు సెట్‌ల పోరులో నెగ్గిన బ్రిటన్ స్టార్
మూడో రౌండ్‌లో వావ్రింకా, నిషికోరి ఫ్రెంచ్ ఓపెన్

 
 
పారిస్: క్లే కోర్టులపై కూడా సుదీర్ఘ మ్యాచ్‌లు ఆడి, విజయం సాధించే సత్తా తనలో ఉందని  బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే మరోసారి నిరూపించుకున్నాడు. సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ రెండో సీడ్ ప్లేయర్ వరుసగా రెండో రౌండ్ మ్యాచ్‌లోనూ ఐదు సెట్‌ల పోరులో నెగ్గి ఊపిరి పీల్చుకున్నాడు. ఫ్రాన్స్‌కు చెందిన ‘వైల్డ్ కార్డు’ ఆటగాడు మథియాస్ బుర్గూతో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే 6-2, 2-6, 4-6, 6-2, 6-3తో నెగ్గి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో ముర్రే నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతోపాటు 45 అనవసర తప్పిదాలు చేశాడు. తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. రాడెక్ స్టెపానెక్‌తో జరిగిన తొలి రౌండ్‌లోనూ ముర్రే ఐదు సెట్‌లపాటు పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే.

మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఐదో సీడ్ నిషికోరి (జపాన్), తొమ్మిదో సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్‌లో వావ్రింకా 7-6 (9/7), 6-3, 6-4తో డానియల్ (జపాన్)పై, నిషికోరి 6-3, 6-3, 6-3తో కుజ్‌నెత్సోవ్ (రష్యా)పై, గాస్కే 6-1, 7-6 (7/3), 6-3తో ఫ్రాటెన్‌జెలో (అమెరికా)పై గెలిచారు.


ముగురుజా ముందుకు
మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ ముగురుజా (స్పెయిన్), ఆరో సీడ్ హలెప్ (రుమేనియా), రెండో సీడ్ రద్వాన్‌స్కా (పోలండ్) మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. రెండో రౌండ్‌లో ముగురుజా 6-2, 6-0తో మిర్టిలి జార్జెస్ (ఫ్రాన్స్)పై, హలెప్ 7-6 (7/5), 6-2తో దియాస్ (కజకిస్తాన్)పై, రద్వాన్‌స్కా 6-2, 6-4తో గార్సియా (ఫ్రాన్స్)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో పదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-4, 6-1తో సు వీ సెయి (చైనీస్ తైపీ)పై, 11వ సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-2, 6-2తో గొలుబిక్ (స్విట్జర్లాండ్)పై, 13వ సీడ్ కుజ్‌నెత్సోవా (రష్యా) 6-1, 6-3తో హితెర్ వాట్సన్ (బ్రిటన్)పై నెగ్గారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement