సినెర్‌ సులువుగా... | Janik Sinner avoids upset to enter fourth round at the US Open | Sakshi
Sakshi News home page

సినెర్‌ సులువుగా...

Published Mon, Sep 2 2024 5:16 AM | Last Updated on Mon, Sep 2 2024 5:16 AM

Janik Sinner avoids upset to enter fourth round at the US Open

ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి టాప్‌ సీడ్‌

వరుసగా ఆరో ఏడాది ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరిన మాజీ చాంపియన్‌ మెద్వెదెవ్‌ 

న్యూయార్క్‌: ఈ ఏడాది దూకుడు మీదున్న ప్రపంచ నంబర్‌వన్‌ ప్లేయర్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సినెర్‌ ఈ సీజన్‌లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలవడంతోపాటు మరో నాలుగు టోరీ్నల్లో విజేతగా నిలిచాడు. 

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు, వింబుల్డన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన సినెర్‌... యూఎస్‌ ఓపెన్‌లో తనకు క్లిష్టతరమైన ప్రత్యర్థులు మూడో ర్యాంకర్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా)లు ఇంటిముఖం పట్టడంతో టైటిల్‌ ఫేవరెట్‌గా అవతరించాడు. సినెర్‌తోపాటు మాజీ చాంపియన్, ఐదో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) వరుసగా ఆరో ఏడాది ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... పదో సీడ్‌ అలెక్స్‌ డిమినార్‌ (ఆ్రస్టేలియా) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.  

వరుస సెట్లలో... 
పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ సినెర్‌  6–1, 6–4, 6–2తో గంటా 53 నిమిషాల్లో క్రిస్టోఫర్‌ ఒ కానెల్‌ (ఆ్రస్టేలియా)పై అలవోక విజయం సాధించాడు. ఏకంగా 15 ఏస్‌లు సంధించిన సినెర్, 46 విన్నర్లు కొట్టాడు. మిగతా మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్, ఐదో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 6–3, 6–4, 6–3తో ఫ్లావియో కొబొలి (ఇటలీ)పై, పదో సీడ్‌ అలెక్స్‌ డి మినార్‌ (ఆ్రస్టేలియా) 6–3, 6–7 (4/7), 6–0, 6–0తో ఇవాన్స్‌ (బ్రిటన్‌)పై, తాజా వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనలిస్ట్, 14వ సీడ్‌ టామీ పాల్‌ (అమెరికా) 6–7 (5/7), 6–3, 6–1, 7–6 (7/3)తో గాబ్రియెల్‌ డియాలో (కెనడా)పై గెలుపొందారు. 

క్వార్టర్‌ ఫైనల్లో పౌలా బదోసా 
మహిళల సింగిల్స్‌లో 26వ సీడ్‌ పౌలా బదోసా (స్పెయిన్‌) తొలిసారి యూఎస్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బదోసా 6–1, 6–2తో యాఫన్‌ వాంగ్‌ (చైనా)పై గెలిచి ఐదో ప్రయత్నంలో ఈ టోరీ్నలో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు మాజీ చాంపియన్‌ (2022), టాప్‌ సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌), ఐదోసీడ్‌ జాస్మిన్‌ పావ్లీని  (ఇటలీ), ఆరో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 

మూడో రౌండ్లో నంబర్‌వన్‌ స్వియాటెక్‌ (పోలాండ్‌) 6–4, 6–2తో 25వ సీడ్‌ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా)పై సునాయాసంగా గెలిచింది. ఐదో సీడ్‌ పావ్లీని (ఇటలీ) 6–3, 6–4తో 30వ సీడ్‌ పుతిన్‌త్సెవ (కజకిస్తాన్‌)పై గెలుపొందగా, ఆరో సీడ్‌ పెగూలా (అమెరికా) 6–3, 6–3తో బోజెస్‌ మనెరియో (స్పెయిన్‌)ను ఓడించింది. మాజీ నంబర్‌వన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌) 6–3, 6–2తో జెస్సికా పొంచెట్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించగా, 16వ సీడ్‌ లుడ్‌మిలా సామ్సోనొవా (రష్యా) 6–1, 6–1తో ఆష్లిన్‌ క్రుయెగెర్‌ (అమెరికా)పై నెగ్గింది. 

‘మిక్స్‌డ్‌’ క్వార్టర్స్‌లో బోపన్న జోడీ 
భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న యూఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇండోనేసియన్‌ భాగస్వామి అల్దిలా సుత్జియదితో కలిసి ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న జంట రెండో రౌండ్లో 0–6, 7–6 (7/5), 10–7తో జాన్‌ పీర్స్‌ (ఆ్రస్టేలియా)–కాటరీనా సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీపై గెలుపొందింది.

 క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–సుత్జియది జోడీ నాలుగో సీడ్‌ మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా)–క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జంటతో తలపడుతుంది. ఎబ్డెన్‌ పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న భాగస్వామి! ఇదివరకే పురుషుల డబుల్స్‌లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం మూడో రౌండ్లోకి ప్రవేశించింది. మరోవైపు పురుషుల డబుల్స్‌ మూడో రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్‌)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) ద్వయం 2–6, 2–6తో టాప్‌ సీడ్‌ మార్సెల్‌ గ్రెనోలర్స్‌ (స్పెయిన్‌)–హొరాసియో జెబలాస్‌ (అర్జెంటీనా) జంట చేతిలో ఓడింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement