వావ్రింకాకు ‘చేదు’ అనుభవం!
వావ్రింకాకు ‘చేదు’ అనుభవం!
Published Tue, Jan 28 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గడం అంటే అన్నింటికీ లెసైన్స్ వచ్చేసినట్లే అని భావించినట్లున్నాడు వావ్రింకా. పాపం...నాదల్‌లాంటి దిగ్గజాన్ని ఓడించిన ఘనత సాధించి కొన్ని గంటలైనా గడవక ముందే అతనికి ఆసీస్ గడ్డపై చేదు అనుభవం ఎదురైంది.
అతను ఎంత గొప్ప విజయం అందుకున్నా... అవన్నీ జాన్తానై, రూల్స్ అంటే రూల్సే అని ఒక బార్‌లో తెలిసొచ్చింది. వివరాల్లోకెళితే...విజేతగా నిలిచిన రాత్రి ఒంటి గంట తర్వాత మందు పార్టీ చేసుకునేందుకు వావ్రింకా దాదాపు 20 మంది స్నేహితులతో కలిసి మెల్‌బోర్న్ నగరంలో తిరిగాడు.
అయితే ఒక బార్‌లో మాత్రం ఈ స్విస్ స్టార్‌కు చేదు అనుభవం ఎదురైంది. లాబీలో షాంపేన్ గ్లాస్ అందుకొని స్నేహితులతో బార్‌లోకి వెళుతుంటే నిర్వాహకులు అడ్డుకున్నారు. అక్కడ చాలా స్థలం ఖాళీగా ఉన్నా వీరికి అనుమతి లభించలేదు. దాంతో అసహనంతో షాంపేన్ పారబోసిన వావ్రింకా, లాంజ్‌లోనే గ్లాస్ పడేసి వెళ్లిపోయాడు. అతను ఎవరైనా తమకు... తమ నిబంధనలు మారవని అని యాజమాన్యం తేల్చేసింది.
ఇంతకీ కారణమేమిటంటే...ఒకే సమయంలో గరిష్టంగా అక్కడ 12 మందిని అనుమతిస్తారు కాబట్టి వావ్రింకాను వెనక్కి పంపించామని బార్ వాళ్లు జవాబిచ్చారు! చివరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు తమకు తెలిసిన బార్ల సమాచారం ఇచ్చారు. అక్కడ అతనికి గౌరవ మర్యాదలు లభించాయి. పట్టలేని ఆనందంతో ఉదయం 5 గంటల వరకు వావ్రింకా అక్కడ చిత్తుగా తాగుతూనే కూర్చున్నాడట!
Advertisement