ఫెడరర్... ఫటాఫట్... | US Open tournament | Sakshi
Sakshi News home page

ఫెడరర్... ఫటాఫట్...

Published Mon, Sep 7 2015 12:23 AM | Last Updated on Fri, Aug 24 2018 5:21 PM

ఫెడరర్... ఫటాఫట్... - Sakshi

ఫెడరర్... ఫటాఫట్...

♦ వరుసగా 15వసారి ప్రిక్వార్టర్స్‌లోకి   
♦ ముర్రే, వావ్రింకా కూడా ముందంజ   
♦ యూఎస్ ఓపెన్ టోర్నీ
 
 కొత్త వ్యూహాలకు పదును పెడుతూ... అనుభవాన్ని రంగరిస్తే... వయసుతో సంబంధం లేకుండా తమ ప్రత్యర్థులపై ఆధిపత్యం చలాయించి అలవోక విజయాలు సాధించవచ్చని స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నిరూపిస్తున్నాడు. మూడేళ్ల క్రితం వింబుల్డన్ టోర్నీలో చివరిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అతను యూఎస్ ఓపెన్‌లో ఈసారి దూసుకెళ్తున్నాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ప్రత్యర్థికి సెట్ కోల్పోకుండా ఈ ఐదుసార్ల మాజీ చాంపియన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ఫెడరర్‌తోపాటు మాజీ విజేత ఆండీ ముర్రే, ఐదో సీడ్ వావ్రింకా, ఆరో సీడ్ బెర్డిచ్‌లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
 
 న్యూయార్క్ : గతంలో తనకెంతో కలిసొచ్చిన వేదికపై ఫెడరర్ మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తనకు ఎదురైన అనుకూల ‘డ్రా’ను సద్వినియోగం చేసుకుంటూ, పక్కాగా ఆడుతూ ఒక్కో అడ్డంకిని దాటుతున్నాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఈ స్విట్జర్లాండ్ స్టార్ వరుసగా 15వ ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో రెండో సీడ్ ఫెడరర్ 6-3, 6-4, 6-4తో 29వ సీడ్ ఫిలిప్ కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై విజయం సాధించాడు.

గంటా 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 34 ఏళ్ల ఫెడరర్ ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేయడం విశేషం. అయితే ఫెడరర్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. వింబుల్డన్ టోర్నమెంట్ తర్వాత ఫెడరర్ తన సర్వీస్‌ను చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఇక కోల్‌ష్రైబర్‌తో ఇప్పటివరకు ఆడిన 10 సార్లూ ఫెడరరే నెగ్గడం విశేషం. ఈసారీ ఫెడరర్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడు తూ కోల్‌ష్రైబర్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. పదునైన సర్వీస్‌లు సంధిస్తూ... శక్తివంతమైన రిటర్న్ షాట్‌లు కొడుతూ... నెట్ వద్దకు తరచూ దూసుకువచ్చిన ఫెడరర్ నిలకడగా పాయింట్లు సాధించాడు.

ఈ టోర్నీలో ఫెడరర్ ప్రత్యర్థి ఆటగాళ్ల సర్వీస్‌ను రిటర్న్ చేస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. అతని ఆటతీరును చూశాక మునుపటి ఫెడరర్ కనిపిస్తున్నాడని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా)తో ఫెడరర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 4-1తో ఆధిక్యంలో ఉన్నాడు. మూడో రౌండ్‌లో జాన్ ఇస్నెర్ 6-3, 6-4తో తొలి రెండు సెట్‌లు గెలిచాక, అతని ప్రత్యర్థి వాసెలి (చెక్ రిపబ్లిక్) మెడ నొప్పి కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు.

 చెమటోడ్చిన బెర్డిచ్
 మరోవైపు మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) కూడా సునాయాస విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 30వ సీడ్ థామస్ బెలూచి (బ్రెజిల్)తో జరిగిన మూడో రౌండ్‌లో ముర్రే 6-3, 6-2, 7-5తో విజయం సాధించాడు. రెండు గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే తన సర్వీస్‌లో ఒకే గేమ్‌ను కోల్పోయాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ఐదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-3, 7-6 (7/5), 6-4తో బెమెల్‌మన్స్ (బెల్జియం)పై గెలుపొందగా... ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-7 (2/7), 7-6 (9/7), 6-3, 6-3తో 31వ సీడ్  లోపెజ్ (స్పెయిన్)ను ఓడించాడు. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన బెర్డిచ్, రెండోసెట్‌ను టైబ్రేక్‌లోనే నెగ్గి పుంజుకున్నాడు.

 క్వార్టర్స్‌లో సిలిచ్
 మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ సిలిచ్ 6-3, 2-6, 7-6 (7/2), 6-1తో 27వ సీడ్ జెరెమీ చార్డీ (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 12వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-4, 6-3, 6-1తో 24వ సీడ్ బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా)పై, 15వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6-3, 7-6 (7/3), 7-6 (7/3)తో 20వ సీడ్  థీమ్ (ఆస్ట్రియా)పై గెలుపొందగా... అన్‌సీడెడ్ డొనాల్డ్ యంగ్ (అమెరికా) 4-6, 0-6, 7-6 (7/3), 6-2, 6-4తో 22వ సీడ్ ట్రయెస్కీ (సెర్బియా)ను బోల్తా కొట్టించాడు. తొలి రౌండ్‌లో 11వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్)ను ఓడించిన మాది రిగానే ఈ మ్యాచ్‌లోనూ యంగ్ తొలి రెండు సెట్‌లు కోల్పోయి, ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు నెగ్గి విజేతగా నిలిచాడు.

 మరో ముగ్గురు అవుట్...
 మహిళల సింగిల్స్ విభాగంలో తాజాగా 11వ సీడ్ కెర్బర్, 16వ సీడ్ సారా ఎరాని, 18వ సీడ్ పెట్కోవిచ్ మూడో రౌండ్‌లోనే నిష్ర్కమించారు. 20వ సీడ్ అజరెంకా (బెలారస్) 7-5, 2-6, 6-4తో కెర్బర్‌ను ఓడించింది. రెండో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 6-2, 6-3తో రోజర్స్ (అమెరికా)పై, జొహనా కొంటా (బ్రిటన్) 7-6 (7/2), 6-3తో పెట్కోవిచ్ (జర్మనీ)పై, 22వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 7-5, 2-6, 6-1తో సారా ఎరాని (ఇటలీ)పై, లిసికి (జర్మనీ) 6-4, 4-6, 7-5తో స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)పై, 24వ సీడ్ పెనెట్టా (ఇటలీ) 1-6, 6-1, 6-4తో సెట్‌కోవ్‌స్కా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నారు.

 మూడో రౌండ్‌లో పేస్-హింగిస్ జంట
 మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. రెండో రౌండ్‌లో యూజిన్ బౌచర్డ్ (కెనడా)-కిరియోస్ (ఆస్ట్రేలియా) జోడీ నుంచి పేస్-హింగిస్‌లకు వాకోవర్ లభించింది. క్రీడాకారులకు కేటాయించిన లాకర్ గదిలో కెనడా అమ్మాయి బౌచర్డ్ పడిపోవడంతో ఆమె తలకు గాయమైంది. దాంతో రెండో రౌండ్‌లో కిరియోస్-బౌచర్డ్ జంట బరిలోకి దిగలేదు. మరోవైపు రోహన్ బోపన్న (భారత్)-యుంగ్ చాన్ (చైనీస్ తైపీ) ద్వయం 3-6, 6-3, 10-8తో కుద్రయెత్సెవా (రష్యా) -పెయా (ఆస్ట్రియా) జంటను ఓడించింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో బోపన్న-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జోడీ 6-3, 7-6 (7/4)తో ఫ్రిస్టెన్‌బర్గ్ (పోలండ్)-గొంజాలెజ్ (మెక్సికో) జంటపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement