‘స్విస్’ షో... | US Open tournament | Sakshi
Sakshi News home page

‘స్విస్’ షో...

Published Fri, Sep 11 2015 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

‘స్విస్’ షో...

‘స్విస్’ షో...

♦ సెమీస్‌లో ఫెడరర్, వావ్రింకా ‘ఢీ’
♦ క్వార్టర్స్‌లో అలవోక విజయాలు
♦ యూఎస్ ఓపెన్ టోర్నీ

 
 తమ ప్రత్యర్థులకు ఆద్యంతం తేరుకునే అవకాశం ఇవ్వకుండా స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్స్ రోజర్ ఫెడరర్, స్టానిస్లాస్ వావ్రింకా అద్వితీయ ఆటతీరుతో అదరగొట్టారు. యూఎస్ ఓపెన్  టోర్నీలో పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ పోరాటానికి సిద్ధమయ్యారు. ఏకపక్షంగా జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఫెడరర్ ధాటికి 12వ సీడ్ రిచర్డ్ గాస్కే... వావ్రింకా దూకుడుకు 15వ సీడ్ అండర్సన్ చేతులెత్తేశారు. ఫెడరర్, వావ్రింకా భీకరమైన ఫామ్‌లో ఉండటంతో ఈ ఇద్దరు మిత్రుల సమరంలో ఎవరు పైచేయి సాధిస్తారో ఆసక్తికరంగా మారింది.
 
 న్యూయార్క్ : యూఎస్ ఓపెన్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సూపర్ షో కొనసాగుతోంది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఫెడరర్ 6-3, 6-3, 6-1తో 12వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)ను చిత్తుగా ఓడించాడు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క సెట్ కూడా కోల్పోని ఫెడరర్, ఓవరాల్‌గా తన సర్వీస్‌లో ప్రత్యర్థులకు కేవలం రెండు గేమ్‌లు మాత్రమే సమర్పించుకోవడం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను బోల్తా కొట్టించిన గాస్కే... ఫెడరర్‌తో మ్యాచ్‌లో మాత్రం తేలిపోయాడు. 87 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ ఏకంగా 16 ఏస్‌లు సంధించడంతోపాటు 50 విన్నర్స్ కొట్టాడు.

కేవలం రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసిన అతను ప్రత్యర్థికి ఒక్కసారి కూడా తన సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం ఇవ్వలేదు. మరోవైపు గాస్కే సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఫెడరర్ 28 సార్లు నెట్ వద్దకు వచ్చి 23 సార్లు పాయింట్లు సంపాదించడం విశేషం. పదోసారి యూఎస్ ఓపెన్‌లో కనీసం సెమీస్‌కు చేరిన ఫెడరర్ ఐదుసార్లు టైటిల్ సాధించి, మరోసారి రన్నరప్‌గా నిలిచాడు.

 మరో క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-4, 6-4, 6-0తో 15వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై గెలిచాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించిన అండర్సన్ ఈ మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 90 కేజీల బరువున్న అండర్సన్ 12 ఏస్‌లు సంధించినప్పటికీ, తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు కూడా చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ముర్రేలాంటి స్టార్ ప్లేయర్‌ను ఓడించిన అండర్సన్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పక్కా ప్రణాళికతో ఆడిన వావ్రింకా అనుకున్న ఫలితాన్ని సాధించాడు. అండర్సన్ శక్తివంతమైన సర్వీస్‌లకు చక్కని రిటర్న్‌లతో సమాధానం ఇచ్చిన వావ్రింకా అతని సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేయడం విశేషం.

 సెమీఫైనల్లో తన దేశానికే చెందిన ఫెడరర్‌తో వావ్రింకా తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 16-3తో ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్‌ను ఓడించిన వావ్రింకాను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు.

 హలెప్ అద్భుత విజయం
 మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 20వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హలెప్ 6-3, 4-6, 6-4తో విజయం సాధించి తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు అర్హత పొందింది. 2 గంటల 40 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్స్‌లో హలెప్ మూడో సెట్ ఆరంభంలో తన సర్వీస్‌ను కోల్పోయి 0-2తో వెనకబడింది. ఈదశలో వర్షం రావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. వర్షం తగ్గిన తర్వాత హలెప్ పుంజుకొని స్కోరును 2-2తో సమం చేసింది.

ఈ తర్వాత మరోసారి అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. 1997లో ఇరీనా స్పిర్‌లియా తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి రుమేనియా ప్లేయర్‌గా హలెప్ గుర్తింపు పొందింది. శుక్రవారం జరిగే మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో రొబెర్టా విన్సీ (ఇటలీ)తో సెరెనా విలియమ్స్; ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)తో సిమోనా హలెప్ తలపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement