వావ్రింకా
చెన్నై: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన స్విట్జర్లాండ్ ప్లేయర్ స్టానిస్లాస్ వావ్రింకా చెన్నై ఓపెన్‌లో సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ వావ్రింకా 7-5, 6-2తో రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఈ విజయంతో కార్లోస్ మోయా (2004, 05); మారిన్ సిలిచ్ (2009, 10) తర్వాత చెన్నై ఓపెన్‌ను రెండుసార్లు నెగ్గిన క్రీడాకారుడిగా వావ్రింకా గుర్తింపు పొందాడు. 2011లో ఈ స్విస్ స్టార్ తొలిసారి ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు.
కెరీర్‌లో 500వ మ్యాచ్ ఆడిన వావ్రింకాకు ఫైనల్లోనూ అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. విజేతగా నిలిచిన క్రమంలో అతను తన ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. 95 నిమిషాలపాటు సాగిన ఫైనల్ ఆరంభంలో ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకున్నారు. అయితే స్కోరు 5-5వద్ద ఉన్నదశలో వాసెలిన్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన వావ్రింకా తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను కైవసం చేసుకున్నాడు.
రెండో సెట్‌లోనూ అదే జోరు కొనసాగించి ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన వావ్రింకాకు 72,490 డాలర్లు (రూ. 45 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. డబుల్స్ టైటిల్‌ను బ్రున్‌స్ట్రోమ్ (స్వీడన్)-ఫ్రెడరిక్ నీల్సన్ (డెన్మార్క్) జోడి గెల్చుకుంది. ఫైనల్లో ఈ జంట 6-2, 4-6, 10-7తో పావిక్-ద్రగంజా (క్రొయేషియా) ద్వయంపై నెగ్గింది.