వావ్రింకాకు రావ్‌నిచ్ షాక్
మెల్‌బోర్న్: టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన నాలుగో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) పోరాటం ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ముందే ముగిసింది. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) 6-4, 6-3, 5-7, 4-6, 6-3తో వావ్రింకాపై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-4, 6-4, 7-6 (7/4)తో టామిక్ (ఆస్ట్రేలియా)పై, ఎనిమిదో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-4, 6-4, 7-5తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై, మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) 7-5, 3-6, 6-3, 7-6 (7/4)తో కుజ్‌నెత్సోవ్ (రష్యా)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ విభాగంలో 14వ సీడ్ అజరెంకా (బెలారస్)తోపాటు ఏడో సీడ్ కెర్బర్ (జర్మనీ), కొంటా (బ్రిటన్), షుయె జాంగ్ (చైనా) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.
క్వార్టర్స్‌లో సానియా జోడీ
మహిళల డబుల్స్ మూడో రౌండ్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ 6-1, 6-3తో కుజ్‌నెత్సోవా (రష్యా) -విన్సీ (ఇటలీ) ద్వయంపై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో బోపన్న (భారత్) -యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) 4-6, 6-3, 10-6తో హలవకోవా (చెక్ రిపబ్లిక్)-కుబోట్ (పోలండ్)లపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు.
మూడో రౌండ్‌లో ప్రాంజల
బాలికల సింగిల్స్ రెండో రౌండ్‌లో హైదరాబాద్ అమ్మాయి ప్రాంజల (భారత్) 7-6 (7/5), 6-3తో మిరా అంటోనిష్ (ఆస్ట్రియా)పై గెలిచింది. డబుల్స్ తొలి రౌండ్‌లో ప్రాంజల-కర్మాన్ ద్వయం 6-4, 6-3 తో హులె-సెలీనా (ఆస్ట్రేలియా) జంటపై నెగ్గింది.