సెరెనా ‘సూపర్’
మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అమెరికా స్టార్
శనివారం సఫరోవాతో తుది పోరు
ఇవనోవిచ్‌కు షాకిచ్చిన చెక్ భామ
ఓవైపు తీవ్రమైన ఎండ.. మరోవైపు తనకంటే తక్కువ ర్యాంక్ క్రీడాకారిణి నుంచి గట్టిపోటీ... ఆటలో అపార అనుభవం ఉన్నా.. గతంలో మట్టి కోటలో ఆధిపత్యం చూపినా... ఈసారి మాత్రం ఆరంభంలో కాస్త తడబాటు... అయినా ఆత్మ విశ్వాసంతో పోరాడిన టాప్‌సీడ్ సెరెనా... 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో బాసిన్‌ిస్కీపై గెలిచి ఫైనల్‌కు చేరింది. మరోవైపు సెర్బియా సుందరి ఇవనోవిచ్‌కు చెక్ చిన్నది సఫరోవా సూపర్ షాకిచ్చింది.
పారిస్: చివరి రెండు సెట్లలో అమోఘమైన పోరాట పటిమను చూపెట్టిన అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్... ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కెరీర్‌లో 20వ సింగిల్స్ గ్రాండ్‌స్లామ్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ సెరెనా 4-6, 6-3, 6-0తో 23వ సీడ్ టిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై నెగ్గింది. ఆరంభంలో సర్వీస్‌లో తడబడటంతో తొలిసెట్‌ను చేజార్చుకున్న సెరెనా.. రెండోసెట్‌లో సత్తా చాటింది. స్కోరు 2-2గా ఉన్న దశలో బాసిన్‌స్కీ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు తర్వాత వరుసగా సర్వీస్‌లను నిలబెట్టుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో అమెరికా ప్లేయర్ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. బాసిన్‌స్కీకి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా సర్వీస్‌లతోనే అదరగొట్టింది. ఓవరాల్‌గా చివరి 10 గేమ్‌లను గెలిచి బాసిన్‌స్కీకి అడ్డుకట్ట వేసింది.
కెరీర్‌లో తొలిసారి...
చెక్ క్రీడాకారిణి లూసి సఫరోవా కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్ మ్యాచ్‌లో 13వ సీడ్ సఫరోవా 7-5, 7-5తో ఏడోసీడ్‌అనా ఇవనోవిచ్ (సెర్బియా)పై నెగ్గింది. గంటా 52 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలో ఇవనోవిచ్ ఆకట్టుకున్నా.. చివర్లో నిరాశపర్చింది. బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఓ దశలో 4-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆరో గేమ్‌లో సఫరోవా రెండు బ్రేక్ పాయింట్లు కాచుకుని ఆధిక్యాన్ని 4-2కు తగ్గించింది.
ఇక స్కోరు 5-5గా ఉన్న దశలో ఇవనోవిచ్ రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. దీంతో 6-5 ఆధిక్యంలో నిలిచిన సఫరోవా అద్భుతమైన వ్యాలీతో సెట్‌ను చేజిక్కించుకుంది. రెండోసెట్‌లో 1-1తో స్కోరు సమమైన తర్వాత సఫరోవా సూపర్ సర్వీస్‌తో 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే స్కోరు 5-4గా ఉన్న దశలో మూడు డబుల్ ఫాల్ట్ చేసింది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఇవనోవిచ్ చెలరేగాలని ప్రయత్నించినా... సర్వీస్‌ను నిలబెట్టుకోలేకపోయింది. తర్వాత తన సర్వీస్‌లో మూడో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 1981 (హనా మండికోవా) తర్వాత మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన తొలి చెక్ మహిళా క్రీడాకారిణి రికార్డులకెక్కింది. శనివారం జరిగే ఫైనల్లో సెరెనా... సఫరోవాతో అమీతుమీ తేల్చుకుంటుంది.
ప్రాంజల జోడి ఓటమి
బాలికల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఏడోసీడ్ ఎడ్లపల్లి ప్రాంజల (భారత్)-వుషువాంగ్ జెంగ్ (చైనా) 1-6, 3-6తో టీచ్‌మన్ (స్విట్జర్లాండ్)-జుయ్ (చైనా) జోడి చేతిలో ఓడారు.
నేటి పురుషుల సెమీస్ మ్యాచ్‌లు
జొకోవిచ్ (1) ముర్రే (3)
సోంగా (14) వావ్రింకా (8)
నోట్: బ్రాకెట్లలో ఉన్న అంకెలు సీడింగ్స్
సాయంత్రం గం. 5.30 నుంచి
నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం