సెరెనా విలియమ్స్ ఆందోళన
లండన్: అమెరికాలో నల్ల జాతీయులపై కాల్పులు జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆ దేశ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ పేర్కొంది. ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమన్న సెరెనా.. కాల్పులకు కాల్పులు ప్రతీకారం కాదని హితవు పలికింది.
'డల్లాస్లో జరిగిన కాల్పులు నన్ను తీవ్రంగా బాధించాయి. ఏ ఒక్కరూ వారి జీవితాల్ని కోల్పోవాలని అనుకోరు. అసలు వర్ణాల్లో తేడా అనేది సమస్య కాకూడదు. నల్ల జాతీయులు ఎక్కడ నుంచి వచ్చినా మనమంతా ముందు మనుషులం. ప్రస్తుత హింసాత్మక వాతావరణంలో మా కుటుంబానికి భద్రత లేదేమో అనిపిస్తుంది. దేనికైనా హింస అనేది జవాబు కాదు. అమెరికాలో ఏదైతే జరిగిందో అది తీరిగి పూడ్చలేనిది. 2003, సెప్టెంబర్లో కాంప్టాన్ లో జరిగిన కాల్పుల్లో మా అక్క యెతుందె ప్రైజ్ మరణించింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి మా అక్క కారులో ఉన్న సమయంలో కాల్పులు జరగడంతో మా అక్క అక్కడే చనిపోగా, అతను మాత్రం బయటపడ్డాడు. మనిషిని మరొక మనిషి ప్రేమిస్తేనే మనుగడ ఉంటుంది' అని సెరెనా తెలిపింది. శనివారం వింబుల్డన్ టైటిల్ ను గెలిచిన సెరెనా.. అమెరికాలో ప్రస్తుత పరిస్థితి చాలా బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేసింది.