![Serena Williams Confirms That She Will Not Take Part In Tokyo olympics - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/27/Untitled-7.jpg.webp?itok=6TLORhVG)
వాషింగ్టన్: టోక్యో ఒలింపిక్స్‌కు మరో స్టార్ టెన్నిస్ ప్లేయర్ దూరం కానుంది. ప్రపంచ 8వ ర్యాంక్ క్రీడాకారిణి, అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్ ఒలింపిక్స్ సంగ్రామం నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దేశం తరఫున ఆడే క్రీడాకారుల జాబితాలో తన పేరు లేదనే కారణంగా ఆమె విశ్వక్రీడలకు వెళ్లే ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపింది. తన నిర్ణయంలో ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించింది. కాగా, మరో 26 రోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సెరెనా ఈ కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఆమె అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్నారు.
కాగా, ఇప్పటివరకు 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్‌లు నెగ్గిన 39 ఏళ్ల సెరెనా విలియమ్స్.. విశ్వక్రీడల్లో సింగల్స్, డబుల్స్ విభాగాల్లో మొత్తం నాలుగు పతకాలు సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తూ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో స్వర్ణం సాధించిన ఆమె.. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో డబుల్స్ స్వర్ణం, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో డబుల్స్ స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆమె సాధించిన మూడు డబుల్స్ స్వర్ణాలు అక్క వీనస్‌తో కలిసి సాధించినవే కావడం విశేషం. ప్రస్తుతం వింబుల్డన్ బరిలో నిలిచిన ఈ నల్లకలువ, తన ఎనిమిదవ వింబుల్డన్ టైటిల్‌పై, అలాగే 24వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసింది.
చదవండి: WTC Final: భువీని తీసుకెళ్లకపోవడం అతిపెద్ద పొరపాటు..
Comments
Please login to add a commentAdd a comment