పాయింట్ పాయింట్‌కూ పోరాటం... సుదీర్ఘ ర్యాలీలు... 3 గంటల 13 నిమిషాలు ముగిసినా పూర్తి కాని రెండు సెట్‌లు... ఫ్రెంచ్ ఓపెన్‌లో 13 సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ తీరిది. తొలి సెట్‌ను అతికష్టమ్మీద నెగ్గిన నాదల్‌కు రెండో సెట్‌లోనూ ఒక్కో పాయింట్‌కు తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సిన స్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో మ్యాచ్ తుది ఫలితం ఎలా ఉంటుందోనని అభిమానులు ఆలోచిస్తున్న తరుణంలో కోర్టులో ఊహించని సంఘటన జరిగింది. రెండో సెట్ 12వ గేమ్‌లో నాదల్ రిటర్న్ షాట్‌ను అందుకోనే క్రమంలో బేస్‌లైన్ వద్ద జ్వెరెవ్ జారి పడటంతో చీలమండకు తీవ్ర గాయమైంది.
పడిన వెంటనే జ్వెరెవ్ నొప్పితో విలవిలలాడాడు. మైదానంలో ప్రథమ చికిత్స తర్వాత జ్వెరెవ్‌ను చక్రాల కుర్చీపై బయటకు తీసుకెళ్లారు. ఐదు నిమిషాల తర్వాత జ్వెరెవ్ ‘క్రచెస్’ సహాయంతో కోర్టులోకి వచ్చి అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయాడు.
దాంతో రాఫెల్ నాదల్ తనకెంతో కలిసొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో 14వ సారి ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో ఫైనల్ చేరిన 13 సార్లూ నాదలే విజేతగా నిలిచాడు. కాస్పర్ రూడ్ (నార్వే), సిలిచ్ (క్రొయేషియా) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో నాదల్ తలపడతాడు.
పారిస్: తన 36వ పుట్టిన రోజు విజయం రుచి చూసిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో నాదల్ తొలి సెట్‌ను 7–6 (10/8)తో టైబ్రేక్‌లో గెలిచాడు. రెండో సెట్‌లోని 12వ గేమ్ చివర్లో నాదల్ రిటర్న్ షాట్‌ను అందుకునే క్రమంలో జ్వెరెవ్ కోర్టులో జారి పడ్డాడు.
దాంతో పాయింట్ నాదల్‌కు లభించింది. స్కోరు 6–6తో సమమైంది. కోర్టులో జారిపడ్డ జ్వెరెవ్‌కు గాయం త్రీవంగా ఉండటంతో అతను మళ్లీ బరిలోకి దిగలేకపోయాడు. దాంతో నాదల్‌ను విజేతగా ప్రకటించారు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన పోరులో జ్వెరెవ్ రెండు సెట్‌లలో నాదల్‌కు చెమటలు పట్టించాడు.
తొలి సెట్ టైబ్రేక్‌లో జ్వెరెవ్ 6–2తో ఆధిక్యంలో నిలిచి నాలుగు సెట్ పాయిం ట్లు సంపాదించాడు. కానీ పట్టువదలకుండా పోరాడినా నాదల్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 7–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత స్కోరు 7–7తో, 8–8తో సమమైంది. ఈ దశలో నాదల్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి తొలి సెట్‌ను గంటా 38 నిమిషాల్లో గెల్చుకున్నాడు.
రెండో సెట్‌లోనూ జ్వెరెవ్ అద్భుతంగా ఆడుతూ 5–3తో ఆధిక్యంలోకి వచ్చి సెట్ కోసం సర్వీస్ చేశా డు. కానీ తొమ్మిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేశాడు. 11వ గేమ్‌లో జ్వెరెవ్ తన సర్వీస్‌ను కాపాడుకోగా... 12వ గేమ్‌లో నాదల్ సర్వీస్‌లో చివరి పాయింట్ సమయంలో జ్వెరెవ్ జారి పడటంతో మ్యాచ్ ముగిసింది.
నేడు మహిళల సింగిల్స్ ఫైనల్
స్వియాటెక్ (పోలాండ్) X కోకో గాఫ్ (అమెరికా)
సా. గం. 6:30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం
కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం అమెరికా టీనేజర్ కోకో గాఫ్... రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గాలనే లక్ష్యంతో స్వియాటెక్ నేడు మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో తలపడనున్నారు.
⚔️ A thrilling battle came to a tough end with an injury to @AlexZverev but he and @RafaelNadal played some amazing points!
— Roland-Garros (@rolandgarros) June 3, 2022
Check out the Highlights by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoment pic.twitter.com/E9vn2iRF1v
Comments
Please login to add a commentAdd a comment