spain tennis star
-
సంచలనాల 'అల్కరాజ్'.. 'ఆల్‌టైమ్ గ్రేట్' లక్షణాలు పుష్కలంగా
ఏడాది క్రితం.. స్పెయిన్‌లో మాడ్రిడ్ ఓపెన్.. కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్లే కోర్టుపై అప్పటికే అతను చెప్పుకోదగ్గ విజయాలు సాధించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. క్వార్టర్స్ సమరంలో ప్రత్యర్థి ఎవరో తెలియగానే అతను భావోద్వేగానికి గురయ్యాడు. దిగ్గజ ఆటగాడు, తాను ఆరాధించే, అభిమానించే రాఫెల్ నాదల్ ఎదురుగా ఉన్నాడు. ఇద్దరు స్పెయిన్ స్టార్ల మధ్య వారి సొంతగడ్డపై పోరు అనగానే ఆ మ్యాచ్‌కు ఎక్కడ లేని ఆకర్షణ వచ్చింది. చివరకు నాదల్‌పై సంచలన విజయంతో తన 19వ పుట్టిన రోజున అల్కరాజ్ తనకు తానే కానుక ఇచ్చుకున్నాడు. అతను అంతటితో ఆగలేదు. సెమీస్‌లో జొకోవిచ్‌నూ మట్టికరిపించి ఒకే క్లే కోర్టు టోర్నీలో ఆ ఇద్దరినీ ఓడించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అక్కడే అతను ఏమిటో ప్రపంచానికి తెలిసింది. భవిష్యత్తులో సాధించబోయే ఘనతలకు అది సూచిక అయింది. - మొహమ్మద్ అబ్దుల్ హాది మూడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో వింబుల్డన్ గెలవడం, వరల్డ్ నంబర్ వన్ కావడం తన కల అని చెప్పుకున్నాడు. క్లే కోర్టు వేదిక ఫ్రెంచ్ ఓపెన్ చాలా ఇష్టమైనా, వింబుల్డన్‌కు ఉండే ప్రత్యేకత వేరని అన్నాడు. 17 ఏళ్ల వయసులో అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. కానీ కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఈ ఘనతలన్నీ సాధిస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. నాదల్ దేశం నుంచి వచ్చి.. నాదల్ తరహాలోనే బలమైన షాట్లు ఆడుతూ, అతనిలాగే క్లే కోర్టును ఇష్టపడే అల్కరాజ్ను అందరూ నాదల్కు సరైన వారసుడిగా గుర్తించారు. బేబీ నాదల్ అంటూ పేరు పెట్టారు. నాలుగేళ్ల క్రితం వింబుల్డన్ గ్రాస్ కోర్టుల్లో ఫెడరర్‌తో కలసి ప్రాక్టీస్ చేసిన అతను ఇప్పుడు అదే వింబుల్డన్‌ను ముద్దాడి కొత్త చరిత్ర సృష్టించాడు. అసాధారణంగా.. సమకాలీన టెన్నిస్‌లో అల్కరాజ్ ప్రస్థానం చాలా వేగంగా సాగింది. తండ్రి గొన్జాలెజ్ అల్కరాజ్ మాజీ టెన్నిస్ ఆటగాడు. ఒకప్పుడు స్పెయిన్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. సహజంగానే తండ్రి వల్లే అతనికి ఆటపై ఆసక్తి పెరిగింది. ముర్షియా పట్టణంలో గొన్జాలెజ్ ఒక టెన్నిస్ అకాడమీకి డైరెక్టర్‌గా ఉండటంతో అక్కడే ఆటలో ఓనమాలు నేర్చుకున్నాడు అల్కరాజ్. సహజ ప్రతిభ ఉన్న అతను ఆటలో వేగంగా దూసుకుపోయాడు. దిగువ స్థాయి జూనియర్ టోర్నీలలో అతను రెగ్యులర్‌గా ఆడాల్సిన అవసరమే లేకపోయింది. 15 ఏళ్ల వయసుకే ప్రొఫెషనల్‌గా మారి వరుస విజయాలు సాధించడంతో సర్క్యూట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాజీ వరల్డ్ నంబర్ వన్, ఫ్రెంచ్ ఓపెన్ విజేత యువాన్ కార్లోస్ ఫెరీరోను కోచ్‌గా పెట్టుకోవడం అతని కెరీర్లో కీలక మలుపు. ముడి పదార్థంలా ఉన్న అల్కరాజ్ను ఫెరీరో మెరిసే బంగారంగా తీర్చిదిద్ది.. అద్భుతమైన అతని ఆటలో తన వంతు పాత్ర పోషించాడు. అన్నీ సంచలనాలే.. ఏటీపీ టూర్లో అల్కరాజ్ ఎన్నో అరుదైన విజయాలు అందుకున్నాడు. వీటిలో ఎక్కువ భాగం పిన్న వయస్సులోనే సాధించిన ఘనతలుగా గుర్తింపు పొందాయి. టీనేజర్‌గా ఉండగానే 9 టైటిల్స్ నెగ్గి సంచలనం సృష్టించాడు. ఏటీపీ 500 స్థాయి టోర్నీ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా, ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్‌ను సాధించిన మూడో పిన్న వయస్కుడిగా అల్కరాజ్ నిలిచాడు. తనపై ఉన్న అంచనాలను అతను ఎప్పుడూ వమ్ము చేయలేదు. వాటికి అనుగుణంగా తన ఆటను మెరుగుపరచుకుంటూ, తన స్థాయిని పెంచుకుంటూ పోయాడు. అతని కెరీర్లో అన్నింటికంటే అత్యుత్తమ క్షణం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఉన్నత స్థానాన్ని పొందడం! వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచిన చిన్న వయస్కుడిగా, మొదటి టీనేజర్‌గా అల్కరాజ్ ఘనత వహించాడు. ఈ మైలురాయిని దాటాక అతని గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. కేవలం అతని ఆట, అతను సాధించబోయే టైటిల్స్‌పైనే అందరి చూపులు నిలిచాయి. గ్రాండ్‌గా విజయాలు.. 17 ఏళ్ల వయసులో తొలిసారి అల్కరాజ్ వింబుల్డన్ బరిలోకి దిగాడు. ఇదే అతనికి మొదటి గ్రాండ్‌స్లామ్ టోర్నీ. అయితే క్వాలిఫయింగ్ దశను అధిగమించలేకపోయాడు. తర్వాత ఏడాదికే యూఎస్ ఓపెన్‌లో ఏకంగా క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాడు. 1963 తర్వాత ఎవరూ 18 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించలేకపోవడం అతని విజయం విలువను చూపించింది. 2022లో తనకిష్టమైన ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్ వరకు చేరిన అల్కరాజ్ ఏడాది చివరికల్లా గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించడం విశేషం. యూఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకొని మొదటిసారి అతను మేజర్ విజయాన్ని చవి చూశాడు. అప్పటికే వరల్డ్ నంబర్ వన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్కరాజ్ అదే స్థానంతో ఏడాదిని ముగించాడు. అనూహ్య గాయాలు ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరం చేయగా.. గాయం కారణంగానే ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోనూ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత అతను మళ్లీ రివ్వున పైకి ఎగిశాడు. పూర్తి ఫిట్నెస్ను సాధించిన తర్వాత గ్రాస్ కోర్టు టోర్నీ క్వీన్స్ క్లబ్ విజేతగా.. వింబుల్డన్‌పై గురి పెట్టాడు. గ్రాస్ కోర్టుపై తన ఆట కాస్త బలహీనం అని తాను స్వయంగా చెప్పుకున్నా.. పట్టుదల ఉంటే ఎక్కడైనా గెలవొచ్చని ఈ స్పెయిన్ కుర్రాడు నిరూపించాడు. ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తూ వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన తీరు కొత్త శకానికి నాంది పలికింది. గత రెండు దశాబ్దాల్లో ముగ్గురు దిగ్గజాలు మాత్రమే శాసించిన వింబుల్డన్‌ను గెలుచుకొని తాను టెన్నిస్‌ను ఏలడానికి వచ్చానని సూత్రప్రాయంగా చెప్పాడు. పదునైన ఆటతో.. అల్కరాజ్ ఆటలోకి వచ్చినప్పుడు అతను క్లే కోర్టు స్పెషలిస్ట్ మాత్రమే అన్నారు. అతను ఆరంభంలో అతను సాధించిన టైటిల్స్, నాదల్ వారసుడిగా వచ్చిన గుర్తింపు ఒక్క సర్ఫేస్కే పరిమితం చేసేలా కనిపించింది. కానీ ఏడాది తిరిగే లోపే అది తప్పని నిరూపించాడు. తొలి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ హార్డ్ కోర్టు కాగా, ఇప్పుడు సాధించిన వింబుల్డన్ గ్రాస్ కోర్టు. ఇక క్లే కోర్టులో ఫ్రెంచ్ ఓపెన్ బాకీ ఉంది. దాన్ని సాధించేందుకూ ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఇప్పుడతను ఆల్‌రౌండ్ ప్లేయర్. పదునైన ఫోర్హ్యండ్ అతని ప్రధాన బలం. అతని డ్రాప్ షాట్లు నిజంగా సూపర్. ఆ షాట్ బలమేమిటో తాజాగా వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్ రుచి చూశాడు. ఫిట్నెస్, ఫుట్ స్పీడ్, దృఢమైన శరీరంతో అతను యువ నాదల్‌ను గుర్తుకు తెస్తున్నాడు. అల్కరాజ్ ఇప్పటికే తన ఆటతో ప్రపంచ టెన్నిస్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నాడు. కెరీర్లో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోనే జీవితకాలం సంతృప్తి పొందే ఆటగాళ్లతో పోలిస్తే రెండు పదుల వయసులోనే అతను రెండు గ్రాండ్‌స్లామ్‌లు సాధించాడు. మున్ముందు గాయాల బారిన పడకపోతే పెద్ద సంఖ్యలో టైటిల్స్ అతని ఖాతాలో చేరడం ఖాయం. 2021లో క్రొయేషియా ఓపెన్ గెలిచి తన తొలి ట్రోఫీని అందుకున్న అల్కరాజ్ తర్వాతి ఏడాది వచ్చేసరికి 5 టైటిల్స్ గెలిచాడు. 2023లో ఇప్పటికే 6 టైటిల్స్ అతని ఖాతాలో చేరాయంటే అతను ఎంతగా ప్రభావం చూపిస్తున్నాడో అర్థమవుతోంది. ముగ్గురు దిగ్గజాలు ఫెడరర్, నాదల్, జొకోవిచ్ తర్వాత టెన్నిస్‌ను శాసించగల ఆటగాడిగా అతని పేరు ముందుకొచ్చేసింది. దాంతో సహజంగానే ఎండార్స్మెంట్లు, బ్రాండ్లు అతని వెంట పడ్తున్నాయి. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక కంపెనీలు నైకీ, బబోలట్, రోలెక్స్, ఎల్పోజో, బీఎండబ్ల్యూ, కెల్విన్ క్లీన్, లూయీ విటాన్ అతనితో జత కట్టాయి. ఆటలో ఇదే జోరు కొనసాగిస్తే అల్కరాజ్ ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలవడం ఖాయం. చదవండి: #StuartBroad: రిటైర్మెంట్తో షాకిచ్చిన స్టువర్ట్ బ్రాడ్ క్రికెట్లో సంచలనం.. ఒకే ఓవర్లో 7 సిక్స్‌లు, 48 పరుగులు! వీడియో వైరల్ -
రాఫెల్ నాదల్కు చుక్కెదురు
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ 2022 సంవత్సరాన్ని ఓటమితో ముగించాడు. సిడ్నీలో జరుగుతున్న యునైటెడ్ కప్ మిక్స్డ్ టీమ్ టోర్నీలో భాగంగా శనివారం బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 0–2తో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో రెండో ర్యాంకర్ నాదల్ 6–3, 3–6, 4–6తో 14వ ర్యాంకర్ కామెరాన్ నోరీ చేతిలో ఓడిపోయాడు. గతంలో నోరీతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో నాదల్ ఈ బ్రిటన్ ప్లేయర్ చేతిలో తొలిసారి ఓడిపోవడం గమనార్హం. -
చరిత్ర సృష్టించిన స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్
ట్యురిన్ (ఇటలీ): అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్పెయిన్ టీనేజర్ కార్లోస్ అల్కరాజ్ కొత్త చరిత్ర లిఖించాడు. 1973లో అధికారికంగా ర్యాంకింగ్స్ మొదలయ్యాక నంబర్‌వన్ ర్యాంక్‌తో ఏడాదిని ముగించనున్న పిన్న వయస్కుడిగా 19 ఏళ్ల అల్కరాజ్ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా; 2001లో 20 ఏళ్ల 214 రోజులు) పేరిట ఉన్న ఈ రికార్డును అల్కరాజ్ తిరగరాశాడు. గాయం కారణంగా అల్కరాజ్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌కు దూరమయ్యాడు. మరోవైపు ఈ టోర్నీలో టైటిల్ సాధిస్తే స్పెయిన్ దిగ్గజం, ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ అందుకోవడంతోపాటు సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించేవాడు. కానీ నాదల్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ప్రస్తుతం నంబర్‌వన్‌గా ఉన్న అల్కరాజ్ (6,820 పాయింట్లు) డిసెంబర్ 5న ముగిసే టెన్నిస్ సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించడం ఖరారైంది. ఈ ఏడాదిని 32వ ర్యాంక్‌తో ప్రారంభించిన అతను సెప్టెంబర్ 12న నంబర్‌వన్ ర్యాంకర్‌గా ఎదిగాడు. పిన్న వయస్కులో టాప్ ర్యాంక్ అందుకున్న టెన్నిస్ ప్లేయర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ సంవత్సరం అల్కరాజ్ ఐదు సింగిల్స్ టైటిల్స్ (రియోఓపెన్, మయామి మాస్టర్స్, బార్సిలోనా ఓపెన్, మాడ్రిడ్ మాస్టర్స్, యూఎస్ ఓపెన్) సాధించాడు. మొత్తం 57 మ్యాచ్‌ల్లో గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. 76 లక్షల 27 వేల 613 డాలర్ల (రూ. 62 కోట్లు) ప్రైజ్‌మనీ సంపాదించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్ చరిత్రలో సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనున్న 18వ ప్లేయర్ అల్కరాజ్. 2003 తర్వాత బిగ్–4 ప్లేయర్లు (ఫెడరర్, నాదల్, జొకోవిచ్, ఆండీ ముర్రే) కాకుండా మరో ప్లేయర్ టాప్ ర్యాంక్‌తో ముగించడం ఇదే ప్రథమం. నాదల్ తర్వాత స్పెయిన్ నుంచి ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. -
తండ్రిగా ప్రమోషన్ పొందిన స్పెయిన్ బుల్
టెన్నిస్ రారాజు.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. శనివారం రాత్రి నాదల్ భార్య మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా ఈ ఏడాది జూలైలో నాదల్ దంపతులు తాము తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించాడు. తాజాగా మగబిడ్డ ఇంట్లో అడుగుపెట్టడంతో వారి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఇక నాదల్, మరియా ఫ్రాన్సిస్కాలు 2019లో వివాహం చేసుకున్నారు. కెరీర్‌పై ఫోకస్ పెట్టడానికే కొన్నాళ్ల పాటు పిల్లలు వద్దనుకున్నామని నాదల్ గతంలో పేర్కొన్నాడు. ప్రస్తుతం 36 ఏళ్ల వయసున్న నాదల్ టెన్నిస్‌లో ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్‌లు సాధించాడు.టెన్నిస్ పురుషుల ర్యాంకింగ్స్‌లో నాదల్ రెండో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో తన దేశానికే చెందిన టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ కొనసాగుతున్నాడు. ఇటీవలే తన చిరకాల మిత్రుడు రోజర్ ఫెదరర్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఫెదరర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నాదల్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఇద్దరు చివరిసారిగా లావెర్ టెన్నిస్ టోర్నీలో డబుల్స్ మ్యాచ్‌లో పాల్గొని అభిమానులను సంతోషపెట్టారు.అయితే మ్యాచ్ ముగిశాకా ఫెదరర్, నాదల్‌లు కన్నీళ్లు పెట్టడం అక్కడున్న ప్రతీ ఒక్కరిని కలిచివేసింది. మరో టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ నాదల్కు శుభాకాంక్షలు తెలిపాడు. ''కంగ్రాట్స్ స్పెయిన్ బుల్.. ఇప్పటిదాకా తెలియదు.. నిజంగా గుడ్‌న్యూస్. ఏ వ్యక్తి అయినా తాను తొలిసారి తండ్రి అయితే అక్కడ ఉండే సంతోషం వేరుగా ఉంటుంది. ఆ అనుభూతిని ఇప్పుడు నాదల్ పొందుతున్నాడు. అలాంటి సంతోషాన్ని ఇదివరకే చూశా. నాదల్కు ఎలాంటి అడ్వైజ్ ఇవ్వలేను.. ఎందుకంటే అతనికి పెద్ద ఫ్యామిలీ ఉంది. వాళ్లే అన్ని జాగ్రత్తలు చెబుతారు'' అంటూ లాఫింగ్ ఎమోజీతో పేర్కొన్నాడు. Baby Nadal is here! 👶 According to Spanish press, Rafael Nadal and Maria Francisca Perello welcomed their first child—a boy named Rafael—on Saturday. Congrats, Rafa and Mery! ❤️ — TENNIS (@Tennis) October 8, 2022 #Djokovic on Rafa’s son: Congrats! I didn’t know. Really? It’s a beautiful news. I wish his wife and baby a lot of health and happiness. As a father, I’m not gonna give any advise (smiling) him.He has a big family. I’m sure he will experience himself (smiling)#rafa — Yerik_nolefamkz 🇰🇿 (@yerikilyassov) October 8, 2022 -
నాదల్కు షాక్
న్యూయార్క్: ఈ ఏడాది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు నిరాశ ఎదురైంది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. అమెరికా ప్లేయర్ ఫ్రాన్సిస్కో టియాఫో తన కెరీర్లోనే గొప్ప ప్రదర్శనతో ప్రపంచ మూడో ర్యాంకర్ నాదల్‌ను ఓడించి యూఎస్ ఓపెన్ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ టియాఫో 6–4, 4–6, 6–4, 6–3తో రెండో సీడ్ నాదల్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్లో ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)తో టియాఫో ఆడతాడు. నాదల్‌తో 3 గంటల 34 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో టియాఫో 18 ఏస్‌లు సంధించి నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నాదల్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన టియాఫో 49 విన్నర్స్ కొట్టాడు. మరోవైపు నాదల్ తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు, 26 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో నాదల్‌ను ఓడించిన మూడో అమెరికా ప్లేయర్‌గా టియాఫో ఘనత వహించాడు. గతంలో అమెరికా ప్లేయర్లు ఆండీ రాడిక్ (2004లో), జేమ్స్ బ్లేక్ (2005లో) నాదల్‌ను ఓడించారు. ఈ ఏడాది నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో టైటిల్స్ సాధించి, వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్నాడు. గాయం కారణంగా అతను సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆడకుండా తన ప్రత్యర్థి కిరియోస్ (ఆస్ట్రేలియా)కు వాకోవర్ ఇచ్చాడు. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), 11వ సీడ్ జానిక్ సినెర్ (ఇటలీ) తమ ప్రత్యర్థులను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరారు. 2014 చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో 3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–4, 3–6, 6–4, 4–6, 6–3తో గెలుపొంది వరుసగా రెండో ఏడాది క్వార్టర్ ఫైనల్ చేరాడు. సినెర్ 6–1, 5–7, 6–2, 4–6, 6–3తో ఇవాష్క (రష్యా)పై గెలిచాడు. క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), ఆరో సీడ్ సబలెంకా (బెలారస్), ఎనిమిదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో స్వియాటెక్ 2–6, 6–4, 6–0తో నీమియెర్ (జర్మనీ)పై, సబలెంకా 3–6, 6–3, 6–2తో డానియెలా కొలిన్స్ (అమెరికా)పై, పెగూలా 6–3, 6–2తో క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై, ప్లిస్కోవా 7–5, 6–7 (5/7), 6–2తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై గెలిచారు. -
Wimbledon 2022: నాదల్ అదరహో
లండన్: ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన నాదల్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 36 ఏళ్ల నాదల్ 4 గంటల 21 నిమిషాల్లో 3–6, 7–5, 3–6, 7–5, 7–6 (10/4)తో ‘సూపర్ టైబ్రేక్’లో 11వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై అద్భుత విజయం సాధించాడు. మ్యాచ్ రెండో సెట్లో నాదల్కు పొత్తి కడుపులో నొప్పి రావడంతో మెడికల్ టైమ్అవుట్ తీసుకొని చికిత్స చేయించుకొని ఆటను కొనసాగించాడు. ఆ తర్వాత మొండి పట్టుదలతో ఆడిన నాదల్ చివరకు విజయతీరం చేరాడు. మ్యాచ్ మొత్తంలో ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 36 సార్లు దూసుకొచ్చి 26 సార్లు పాయింట్లు గెలిచాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాకు చెందిన నిక్ కిరియోస్తో నాదల్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కిరియోస్ 6–4, 6–3, 7–6 (7/5)తో క్రిస్టియన్ గారిన్ (చిలీ)పై గెలిచి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. హలెప్ జోరు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో 2019 చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా) 6–2, 6–4తో అనిసిమోవా (అమెరికా)పై... రిబాకినా (కజకిస్తాన్) 4–6, 6–2, 6–3తో తొమ్లాజనోవిచ్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి సెమీస్ చేరారు. మరో క్వార్టర్ ఫైనల్లో ఆన్స్ జబర్ (ట్యూనిషియా) 3–6, 6–1, 6–1తో మేరీ బుజ్ కోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన తొలి అరబ్ ప్లేయర్‌గా నిలిచింది. -
French Open: హోరాహోరీ సమరం... గాయంతో సమాప్తం
పాయింట్ పాయింట్‌కూ పోరాటం... సుదీర్ఘ ర్యాలీలు... 3 గంటల 13 నిమిషాలు ముగిసినా పూర్తి కాని రెండు సెట్లు... ఫ్రెంచ్ ఓపెన్‌లో 13 సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ తీరిది. తొలి సెట్‌ను అతికష్టమ్మీద నెగ్గిన నాదల్కు రెండో సెట్లోనూ ఒక్కో పాయింట్‌కు తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సిన స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తుది ఫలితం ఎలా ఉంటుందోనని అభిమానులు ఆలోచిస్తున్న తరుణంలో కోర్టులో ఊహించని సంఘటన జరిగింది. రెండో సెట్ 12వ గేమ్‌లో నాదల్ రిటర్న్ షాట్‌ను అందుకోనే క్రమంలో బేస్‌లైన్ వద్ద జ్వెరెవ్ జారి పడటంతో చీలమండకు తీవ్ర గాయమైంది. పడిన వెంటనే జ్వెరెవ్ నొప్పితో విలవిలలాడాడు. మైదానంలో ప్రథమ చికిత్స తర్వాత జ్వెరెవ్‌ను చక్రాల కుర్చీపై బయటకు తీసుకెళ్లారు. ఐదు నిమిషాల తర్వాత జ్వెరెవ్ ‘క్రచెస్’ సహాయంతో కోర్టులోకి వచ్చి అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయాడు. దాంతో రాఫెల్ నాదల్ తనకెంతో కలిసొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో 14వ సారి ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో ఫైనల్ చేరిన 13 సార్లూ నాదలే విజేతగా నిలిచాడు. కాస్పర్ రూడ్ (నార్వే), సిలిచ్ (క్రొయేషియా) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో నాదల్ తలపడతాడు. పారిస్: తన 36వ పుట్టిన రోజు విజయం రుచి చూసిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో నాదల్ తొలి సెట్‌ను 7–6 (10/8)తో టైబ్రేక్‌లో గెలిచాడు. రెండో సెట్లోని 12వ గేమ్ చివర్లో నాదల్ రిటర్న్ షాట్‌ను అందుకునే క్రమంలో జ్వెరెవ్ కోర్టులో జారి పడ్డాడు. దాంతో పాయింట్ నాదల్కు లభించింది. స్కోరు 6–6తో సమమైంది. కోర్టులో జారిపడ్డ జ్వెరెవ్‌కు గాయం త్రీవంగా ఉండటంతో అతను మళ్లీ బరిలోకి దిగలేకపోయాడు. దాంతో నాదల్‌ను విజేతగా ప్రకటించారు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన పోరులో జ్వెరెవ్ రెండు సెట్లలో నాదల్కు చెమటలు పట్టించాడు. తొలి సెట్ టైబ్రేక్‌లో జ్వెరెవ్ 6–2తో ఆధిక్యంలో నిలిచి నాలుగు సెట్ పాయిం ట్లు సంపాదించాడు. కానీ పట్టువదలకుండా పోరాడినా నాదల్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 7–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత స్కోరు 7–7తో, 8–8తో సమమైంది. ఈ దశలో నాదల్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి తొలి సెట్‌ను గంటా 38 నిమిషాల్లో గెల్చుకున్నాడు. రెండో సెట్లోనూ జ్వెరెవ్ అద్భుతంగా ఆడుతూ 5–3తో ఆధిక్యంలోకి వచ్చి సెట్ కోసం సర్వీస్ చేశా డు. కానీ తొమ్మిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేశాడు. 11వ గేమ్‌లో జ్వెరెవ్ తన సర్వీస్‌ను కాపాడుకోగా... 12వ గేమ్‌లో నాదల్ సర్వీస్‌లో చివరి పాయింట్ సమయంలో జ్వెరెవ్ జారి పడటంతో మ్యాచ్ ముగిసింది. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ స్వియాటెక్ (పోలాండ్) X కోకో గాఫ్ (అమెరికా) సా. గం. 6:30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం అమెరికా టీనేజర్ కోకో గాఫ్... రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గాలనే లక్ష్యంతో స్వియాటెక్ నేడు మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో తలపడనున్నారు. ⚔️ A thrilling battle came to a tough end with an injury to @AlexZverev but he and @RafaelNadal played some amazing points! Check out the Highlights by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoment pic.twitter.com/E9vn2iRF1v — Roland-Garros (@rolandgarros) June 3, 2022 -
ఫుట్‌బాలర్ కావాల్సిన వ్యక్తి.. క్లేకోర్టు రారాజు ఎలా అయ్యాడు
టెన్నిస్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు.. ఆటలో అతనికి ఎదురులేదు.. కోర్టులో అతను బరిలోకి దిగాడంటే ప్రత్యర్థులకు హడల్.. అందరూ అతన్ని క్లేకోర్టు రారాజుగా అభివర్ణిస్తారు. టెన్నిస్ ఓపెన్ శకం మొదలైన తర్వాత అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు కొల్లగొట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ సాధించిన ఆల్‌టైమ్ గ్రేట్ జాబితా తీస్తే అందులోనూ అగ్రస్థానం అతనిదే. తన తరంలోనే పుట్టిన మరో ఇద్దరు గ్రెటేస్ట్ ఆటగాళ్లను దాటి మరీ.. మరో గ్రాండ్‌స్లామ్ దక్కించుకోవడం కోసం పరుగులు తీస్తున్నాడు. ఈ పాటికే మీకు అర్థమయి ఉంటుంది ఆ వ్యక్తి ఎవరో.. ది గ్రేట్ రాఫెల్ నాదల్. నాదల్ ఇవాళ 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఫుట్‌బాలర్ కావాల్సిన వ్యక్తి ఈరోజు టెన్నిస్ ప్రపంచాన్ని రారాజులా ఏలుతున్నాడు. హ్యాపీ బర్త్‌డే నాదల్.. పవర్‌గేమ్‌కు పెట్టింది పేరు రాఫెల్ నాదల్. ఫుట్‌బాలర్ కావాల్సిన నాదల్ తన అంకుల్ ప్రోత్సాహంతో రాకెట్ చేతబట్టాడు.. టెన్నిస్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. స్పెయిన్‌లోని మానకోర్లో అనా మారియా, సెబాస్టియన్ నాదల్ దంపతులకు 1986 జూన్ 3న రాఫెల్ నాదల్ జన్మించాడు. నాదల్ బాబాయిలు ఇద్దరు(మిగ్యూల్ నాదల్, టోనీ నాదల్) ఫుట్‌బాల్ ఆటలో పేరు సంపాదించారు. తొలుత నాదల్‌ను కూడా ఫుట్‌బాలర్‌గానే చూడాలనుకున్నారు. కానీ నాదల్ చిన్న బాబాయి టోనీ నాదల్‌ను మూడేళ్ల వయసులోనే ప్రతిభను గుర్తించాడు. తమలా ఫుట్‌బాలర్ కాకుండా టెన్నిస్ బ్యాట్ చేతపడితే ఎలా ఉంటుందని ఆలోచించాడు. టోనీ నాదల్.. క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండేవాడు. నాదల్ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా బాబాయితోనే గడిపేవాడు. ప్రతీరోజు ఎర్రమట్టిలో గంటల తరబడి నాదల్ చేత ప్రాక్టీస్ చేయించేవాడు. అతని కోసం ఎర్రమట్టిని అత్యంత కఠిన పరిస్థితులను సృష్టించి మరీ నాదల్కు శిక్షణ ఇచ్చేవాడు. నాదల్ ఆ శిక్షణ తట్టుకోలేక ఒక సందర్భంలో తన తల్లికి ఫిర్యాదు చేశాడు. కానీ బాబాయి టోనీ మాత్రం నాదల్‌ను టెన్నిస్ రారాజులా చూడాలనుకుంటున్నానని నాదల్ తల్లికి ముందే చెప్పాడు. ఆమె కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. చిన్ననాటి నుంచే ఎర్రమట్టిలో కఠోర సాధన చేశాడు గనుకనే నాదల్ ఇవాళ క్లేకోర్టుకు రారాజు అయ్యాడు. ఒక రకంగా నాదల్ టెన్నిస్ కెరీర్‌కు బీజం పడింది ఇక్కడే. బాబాయి కఠిన శిక్షణలో అండర్-12 టైటిల్ సాధించేశాడు. ఆ తర్వాత 14 ఏళ్లకే స్పానిష్ జూనియర్ సర్క్యూట్లో రఫాకు మంచి పేరు వచ్చింది. ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో అప్పటికే టెన్నిస్‌లో టాప్ ఆటగాడిగా ఉన్న కార్లోస్ మోయాను ఓడించి సంచలనం సృష్టించాడు రాఫెల్ నాదల్. అప్పటికి నాదల్ వయస్సు 14 ఏళ్లే. ఈ సంచలనం అక్కడితో ఆగలేదు. 2001లో ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడిగా నాదల్ కెరీర్‌ను ఆరంభించాడు. ఆ మరుసటి ఏడాది జరిగిన వింబుల్డన్‌లో సెమీఫైనల్ చేరి అందరి దృష్టిని ఆకర్షించాడు. 18 ఏళ్ల వయసులో డేవిస్ కప్‌లో అప్పటి వరల్డ్ నెంబర్-2 ఆండ్రీ అగస్సీని ఓడించి ఔరా అనిపించాడు. అక్కడి నుంచి నాదల్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. తన ఆటను మాత్రం అంతే పట్టుదలతో కొసాగించాడు.. కొనసాగిస్తున్నాడు. ఇక తన కాలంలోనే మరో టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్‌కు ధీటుగా మారాడు. 2005 నుంచి రోజర్ ఫెదరర్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారిన నాదల్ 2006 నుంచి 2009లోపూ ఐదు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడించి సంచలనం సృష్టించాడు. ఆటను ఎంత ప్రేమించాడో.. కుటంబాన్ని అంతే.. ఆటను ఎంత ప్రేమించాడో కుటుంబాన్ని అంతే ప్రేమించాడు నాదల్. తల్లిదండ్రులంటే అమితంగా ఇష్టపడే నాదల్కు 2009లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మనస్పర్థల కారణంగా నాదల్ తల్లిదండ్రులు విడిపోయారు. ఇది నాదల్‌ను మానసికంగానూ.. కెరీర్ పరంగానూ చాలా దెబ్బ తీసింది. ఎంతలా అంటే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఓటమి ఎరుగని రారాజుగా వెలుగొందుతున్న నాదల్కు తొలి ఓటమి అదే సంవత్సరం వచ్చింది. ఆ ఏడాది ఫైనల్లో రోజర్ ఫెదరర్ నాదల్‌ను ఓడించి విజేతగా అవతరించాడు. అయితే ఈ భాద నాదల్‌ను ఎంతోకాలం ఆపలేకపోయింది. గోడకు కొట్టిన బంతిలా.. 2010లో మళ్లీ ఫుంజుకున్న నాదల్ ఏకంగా మూడు గ్రాండ్‌స్లామ్‌లను కొల్లగొట్టి పూర్వ వైభవం సాధించాడు. ఆటలో చాంపియన్‌గా నిలిచిన నాదల్కు అదే ఏడాది విడిపోయిన తల్లిదండ్రులు మళ్లీ కలుసుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. ఆ తర్వాత కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదురైనప్పటికి అంతా సాఫీగానే సాగింది. అయితే గత నాలుగేళ్లలో వయసు మీద పడడం.. ఆటలో ఏకాగ్రత తగ్గడం.. గాయాలు వేదించడంతో .. నాదల్ పని అయిపోయిందని అంతా భావించారు. దీనికి తోడూ రోజర్ ఫెదరర్, జొకోవిచ్‌లు ఆటలో దూసుకుపోతున్నారు. వీటన్నింటికి నాదల్ ఒకే ఒక్క గ్రాండ్‌స్లామ్‌తో సమాధానమిచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ డానిల్ మెద్వెదెవ్‌తో జరిగిన సుధీర్ఘ పోరులో నాదల్ ఓటమి అంచుల వరకు వెళ్లి విజేతగా నిలిచాడు. అలా కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ అందుకొని ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇక తనకు అచ్చొచ్చిన రోలాండ్ గారోస్(ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ) నాదల్ దూసుకెళుతున్నాడు. 36వ పుట్టిరోజు జరుపుకుంటున్న రోజునే అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో సెమీ ఫైనల్లో తలపడుతున్నాడు. 22వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నాదల్కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ముగిద్దాం. ముగించేముందు నాదల్కు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నాదల్ గురించి మనకు తెలియని కొన్ని ముఖ్య విషయాలు ►నాదల్ 2019, అక్టోబర్ 19న మారియా ఫ్రాన్సియా పెరెల్లోతో వివాహం జరిగింది. ►నాదల్ రెండు చేతులతో ఆడగలడు. అతను ఫోర్ హ్యాండ్ షాట్‌కు ఎడమ చేతిని వాడతాడు. రెండు చేతులతో టూహ్యాండెడ్ ఫోర్షాట్ కూడా ఆడగల సామర్థ్యం ఉంది. ►రాఫెల్ నాదల్కు చీకటంటే చచ్చేంత భయం. నిద్రపోతున్న సమయంలో ఒక లైటు లేదా టీవీ స్క్రీన్ వెలుగుతూనే ఉంటుంది. ►ఫ్రెంచ్ ఓపెన్ ఆడే సమయంలో నాదల్ లాకర్ నెంబర్ 159 మాత్రమే తీసుకుంటాడు. ►ప్రతీ మ్యాచ్‌కు ముందు చన్నీటితో స్నానం చేయడం నాదల్కు అలవాటు ►నాదల్ ఏ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్న నోటితో కొరకడం అలవాటుగా చేసుకున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నానో తనకు తెలియదని.. ఒకసారి కొరకడం అలవాటయ్యాకా దానికి మానలేకపోయానని ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. ►టెన్నిస్ కోర్టులో నాదల్ తాగే వాటర్ బాటిల్స్ వరుస క్రమంలో ఉంటేనే తాగుతాడు. అలా లేకుంటే వాటిని సరిచేసి గానీ నీళ్లు తాగడు. -
ఫ్రెంచ్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల కుర్రాడు..
స్పెయిన్ టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ 2022లో చరిత్ర సృష్టించాడు. సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ తర్వాత అత్యంత పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్.. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో సెబాస్టియర్ కోర్డాను 6-2, 6-4, 6-2తో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. కాగా మాంటే కార్లో ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సెబాస్టియన్ చేతిలో ఓటమికి కార్లోస్ బదులు తీర్చుకున్నాడు. సెబాస్టియన్ క్లే కోర్టులో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడగా.. అతనికి ఇదే తొలి ఓటమి కావడం విశేషం. ఇంతకముందు 2006లో నొవాక్ జొకోవిచ్ అత్యంత పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇక కార్లోస్ అల్కరాజ్.. ప్రిక్వార్టర్స్‌లో 21వ సీడ్ కరెన్ ఖచనోవ్‌తో తలపడనున్నాడు. చదవండి: French Open 2022: నాదల్, జొకోవిచ్ జోరు [6] @alcarazcarlos03 defeats [27] Korda 6-4 6-4 6-2 and is youngest man to reach 4R @RolandGarros since #Djokovic in 2006. #Alcaraz saved all 5 break pts faced (broke 4 times) en route to his 13th win in a row. Next: 1st meeting vs [21] @karenkhachanov (d [10] Norrie in 4 sets). — ATP Media Info (@ATPMediaInfo) May 27, 2022 -
దిగ్గజాలకు షాకిచ్చి చరిత్ర సృష్టించిన టెన్నిస్ యువ కెరటం
మాడ్రిడ్: స్పెయిన్ యువ టెన్నిస్ క్రీడాకారుడు కార్లోస్ అల్కరాజ్ (19) మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్1000 టైటిల్‌ను నెగ్గి చరిత్ర సృష్టించాడు. క్వార్టర్స్‌లో తన ఆరాధ్య ఆటగాడు రఫెల్ నదాల్‌ను, సెమీస్‌లో టాప్ ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్‌లను ఓడించిన ఈ యువ సంచలనం.. ఫైనల్లో 6-3, 6-1తో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ 3 ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను చిత్తు చేసి సీజన్లో నాలుగో టైటిల్‌ను ఎగురేసుకుపోయాడు. ఈ క్రమంలో అల్కరాజ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే సీజన్లో నదాల్ (2005) తర్వాత రెండు మాస్టర్స్ 1000 టైటిళ్లు నెగ్గిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. అల్కరాజ్ ఇప్పటికే టాప్ 10లోకి ప్రవేశించిన అతి పిన్న వయస్కుడిగా కూడా రికార్డుల్లో నిలిచాడు. మాడ్రిడ్ ఓపెన్‌లో విజయం సాధించిన అనంతరం జ్వెరెవ్.. అల్కరాజ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. అల్కరాజ్ను భవిష్యత్తు సూపర్ స్టార్‌గా అభివర్ణించాడు. చిన్న వయసులోనే దిగ్గజాలందరికీ ముచ్చెమటలు పట్టిస్తున్న అల్కరాజ్.. మున్ముందు అనేక గ్రాండ్ స్లామ్‌లు సాధించాలని ఆకాంక్షించాడు. చదవండి: గుకేశ్ ఖాతాలో ‘హ్యాట్రిక్’ టైటిల్ -
అమ్మాయికి ముద్దు పెట్టిన టెన్నిస్ సూపర్ స్టార్
కాన్బెర్రా: క్రీడాకారులు వేసిన గురి సరిగ్గా తగిలిందంటే అందరి ప్రశంసలు అందుకుంటారు. కానీ గురి తప్పిందంటే చాలు విమర్శలపాలవుతారు. కానీ ఇక్కడ గురి తప్పినందుకు ఓ స్టార్ క్రీడాకారుడు వార్తల్లో నిలిచాడు. స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ గురువారం ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ ఆడుతున్నాడు. ఈ సమయంలో బాల్‌ను తన ప్రత్యర్థి వైపు కొట్టగా అది గురి తప్పి నేరుగా వెళ్లి అంపైర్‌కు వెనకాల నిలబడ్డ ఓ అమ్మాయికి తగిలింది. వెంటనే ప్రేక్షకులు ఏమైందేమోనని భయంతో గట్టిగా అరిచారు. ఆ అమ్మాయికి దెబ్బ తగిలిందేమోనని రఫెల్ అటువైపు చూడగా ఆమె బాగానే ఉన్నానంటూ సైగ చేసింది. కానీ రఫెల్ ఆమె సమాధానం విని ఊరుకోలేదు. వెంటనే ఆమెను సమీపించి ఏమీ కాలేదు కదా అని ఆరా తీశాడు. అనంతరం ఆ బాలిక టోపీ పక్కకు జరిపి ఆమె చెంపకు ఆప్యాయంగా ముద్దు పెట్టి తలనిమిరి వెళ్లిపోయాడు. ఈ అనూహ్య పరిణామానికి ఆమె బుగ్గలు ఎరుపెక్కగా, ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. ఇక మ్యాచ్ అనంతరం రఫెల్ నాదల్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘ఆమె గురించి నాకు చాలా భయమేసింది. ఎందుకంటే ఆ బంతి నేరుగా ఆమె తలకు తగిలింది కానీ గాయం అవలేదు. అందుకు సంతోషంగా ఉంది. కానీ ఆమె చాలా తెలివైన అమ్మాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు వారి కళ్లను నమ్మలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘టెన్నిస్ సూపర్ స్టార్ తనంతట తానుగా వెళ్లి ఓ అమ్మాయికి ముద్దు పెట్టడమా..’ అంటూ నోరెళ్లబెడుతున్నారు. మరికొంతమందేమో రఫెల్ ఆమెపై కురిపించిన ప్రేమను చూసి మెచ్చుకుంటున్నారు. 😱(🎥@Eurosport_RU ) pic.twitter.com/IR5B2Z42fu — doublefault28 (@doublefault28) January 23, 2020 చదవండి: అయ్యో షరపోవా! -
ఇండియన్ వెల్స్, మయామి టోర్నీలకు నాదల్ దూరం
ఫ్లోరిడా: తుంటి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఇండియన్ వెల్స్, మయామి మాస్టర్స్ సిరీస్ టోర్నీలకు దూరమయ్యాడు. ‘గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అందుకే ఇండియన్ వెల్స్, మయామి టోర్నమెంట్లకు దూరమవుతున్నాను. క్లే కోర్టు సీజన్ వరకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తా’ అని పేర్కొన్నాడు. 31 ఏళ్ల నాదల్ గతంలో మూడు సార్లు (2007, 2009, 2013) ఇండియన్ వెల్స్ టైటిల్స్ గెలుచుకున్నాడు. ఐదు సార్లు (2005, 2008, 2011, 2014, 2017) మయామి ఫైనల్‌కు చేరాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్‌లో ఓడిన అనంతరం నాదల్ కోర్టులో అడుగు పెట్టలేదు. మరోవైపు ప్రస్తుతం వరల్డ్ నంబర్‌వన్‌గా ఉన్న రోజర్ ఫెడరర్ తన ర్యాంక్‌ను కాపాడుకోవాలంటే ఇండియన్ వెల్స్ టోర్నీలో కనీసం సెమీస్‌కు చేరాల్సి ఉంటుంది. లేదంటే నాదల్ మళ్లీ నంబర్‌వన్ అవుతాడు. -
ఐదేళ్ల తర్వాత ‘గ్రాస్’ టైటిల్...
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తన కెరీర్లో 66వ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జర్మనీలోని స్టుట్‌గార్ట్‌లో జరిగిన మెర్సిడెస్ కప్‌లో అతను విజేతగా నిలిచాడు. ఫైనల్లో నాదల్ 7-6 (7/3), 6-3తో విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా)పై గెలిచాడు. తద్వారా ఐదేళ్ల విరామం తర్వాత గ్రాస్‌కోర్టులపై మరో ట్రోఫీని అందుకున్నాడు. 2010లో వింబుల్డన్ టైటిల్ నెగ్గిన తర్వాత నాదల్ ఖాతాలో మరో గ్రాస్‌కోర్టు టైటిల్ చేరడం ఇదే ప్రథమం. -
నమ్మకం... అలా తినిపించింది
న్యూయార్క్: స్పెయిన్ టెన్నిస్ స్టార్, యూఎస్ ఓపెన్ చాంపియన్ రాఫెల్ నాదల్‌లో పవర్ షాట్లే కాదు... పవర్ఫుల్ మూఢనమ్మకాలు ఉన్నాయండోయ్! ఆ నమ్మకాలెంత పవర్ఫుల్ అంటే... ఒకే రెస్టారెంట్లో, ఒకే టేబుల్‌పై, ఒకే విధమైన భోజనాన్ని టోర్నీ అసాంతం తినిపించేంత..! యూఎస్ చాంపియన్‌షిప్‌ను సాధించేందుకు వచ్చిన ఈ ప్రపంచ రెండో ర్యాంకర్ ఇక్కడి మన్హటన్ చైనీస్ రెస్టారెంట్లోనే ప్రతి రాత్రి భోజనం చేసేవాడు. రోజూ ఒకే డైనింగ్ టేబుల్‌పై ఫ్రైడ్ రైస్, నూడుల్స్ భుజించేవాడని ‘న్యూయార్క్ పోస్ట్’ పత్రిక వెల్లడించింది. రాత్రి మ్యాచ్ లేని రోజు ఇలా చేసేవాడని, ఫైనల్‌కు ముందు ఆదివారం రాత్రి కూడా అక్కడే అదే విధమైన ఆహారం రుచి చూశాడని ఆ పత్రిక పేర్కొంది. టైటిల్ విజయానంతరం వేడుకలు కూడా ఆ రెస్టారెంట్ టేబుల్‌పైనే జరిగాయంటే... అతని మూఢనమ్మకమెంత పవర్ఫులో అర్థం చేసుకోవచ్చు మరి! ఈ వేడుకల్లో అతని ప్రియసఖి జిస్కా పెరెల్లో, కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు పాల్గొన్నారు. ఈ చాంపియన్ కోసం ఆ రోజు (టైటిల్ గెలిచిన రోజు) రెస్టారెంట్‌ను అర్ధరాత్రి 12.30 గంటల వరకు తెరిచేవుంచారట నిర్వాహకులు.