నాదల్‌కు షాక్‌ | Frances Tiafoe knocks out Rafael Nadal in major US Open upset | Sakshi
Sakshi News home page

నాదల్‌కు షాక్‌

Published Wed, Sep 7 2022 5:55 AM | Last Updated on Wed, Sep 7 2022 5:55 AM

Frances Tiafoe knocks out Rafael Nadal in major US Open upset - Sakshi

న్యూయార్క్‌: ఈ ఏడాది మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌కు నిరాశ ఎదురైంది. సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌లో రాఫెల్‌ నాదల్‌ ప్రస్థానం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. అమెరికా ప్లేయర్‌ ఫ్రాన్సిస్కో టియాఫో తన కెరీర్‌లోనే గొప్ప ప్రదర్శనతో ప్రపంచ మూడో ర్యాంకర్‌ నాదల్‌ను ఓడించి యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.

మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 22వ సీడ్‌ టియాఫో 6–4, 4–6, 6–4, 6–3తో రెండో సీడ్‌ నాదల్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. క్వార్టర్‌ ఫైనల్లో ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా)తో టియాఫో ఆడతాడు. నాదల్‌తో 3 గంటల 34 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో టియాఫో 18 ఏస్‌లు సంధించి నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. నాదల్‌ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసిన టియాఫో 49 విన్నర్స్‌ కొట్టాడు. మరోవైపు నాదల్‌ తొమ్మిది డబుల్‌ ఫాల్ట్‌లు, 26 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.

ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో నాదల్‌ను ఓడించిన మూడో అమెరికా ప్లేయర్‌గా టియాఫో ఘనత వహించాడు. గతంలో అమెరికా ప్లేయర్లు ఆండీ రాడిక్‌ (2004లో), జేమ్స్‌ బ్లేక్‌ (2005లో) నాదల్‌ను ఓడించారు. ఈ ఏడాది నాదల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో టైటిల్స్‌ సాధించి, వింబుల్డన్‌ టోర్నీలో సెమీఫైనల్‌ చేరుకున్నాడు. గాయం కారణంగా అతను సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆడకుండా తన ప్రత్యర్థి కిరియోస్‌ (ఆస్ట్రేలియా)కు వాకోవర్‌ ఇచ్చాడు.

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో మూడో సీడ్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), 11వ సీడ్‌ జానిక్‌ సినెర్‌ (ఇటలీ) తమ ప్రత్యర్థులను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌ చేరారు. 2014 చాంపియన్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)తో 3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అల్‌కరాజ్‌ 6–4, 3–6, 6–4, 4–6, 6–3తో గెలుపొంది వరుసగా రెండో ఏడాది క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. సినెర్‌ 6–1, 5–7, 6–2, 4–6, 6–3తో ఇవాష్క (రష్యా)పై గెలిచాడు.

క్వార్టర్‌ ఫైనల్లో స్వియాటెక్‌
మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌ వన్, టాప్‌ సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌), ఆరో సీడ్‌ సబలెంకా (బెలారస్‌), ఎనిమిదో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా), కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో స్వియాటెక్‌ 2–6, 6–4, 6–0తో నీమియెర్‌ (జర్మనీ)పై, సబలెంకా 3–6, 6–3, 6–2తో డానియెలా కొలిన్స్‌ (అమెరికా)పై, పెగూలా 6–3, 6–2తో క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, ప్లిస్కోవా 7–5, 6–7 (5/7), 6–2తో మాజీ నంబర్‌వన్‌ అజరెంకా (బెలారస్‌)పై గెలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement