ఏడాది క్రితం.. స్పెయిన్‌లో మాడ్రిడ్ ఓపెన్.. కార్లోస్ అల్‌కరాజ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్లే కోర్టుపై అప్పటికే అతను చెప్పుకోదగ్గ విజయాలు సాధించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. క్వార్టర్స్ సమరంలో ప్రత్యర్థి ఎవరో తెలియగానే అతను భావోద్వేగానికి గురయ్యాడు. దిగ్గజ ఆటగాడు, తాను ఆరాధించే, అభిమానించే రాఫెల్ నాదల్ ఎదురుగా ఉన్నాడు.
ఇద్దరు స్పెయిన్ స్టార్ల మధ్య వారి సొంతగడ్డపై పోరు అనగానే ఆ మ్యాచ్‌కు ఎక్కడ లేని ఆకర్షణ వచ్చింది. చివరకు నాదల్‌పై సంచలన విజయంతో తన 19వ పుట్టిన రోజున అల్‌కరాజ్ తనకు తానే కానుక ఇచ్చుకున్నాడు. అతను అంతటితో ఆగలేదు. సెమీస్‌లో జొకోవిచ్‌నూ మట్టికరిపించి ఒకే క్లే కోర్టు టోర్నీలో ఆ ఇద్దరినీ ఓడించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అక్కడే అతను ఏమిటో ప్రపంచానికి తెలిసింది. భవిష్యత్తులో సాధించబోయే ఘనతలకు అది సూచిక అయింది.
- మొహమ్మద్ అబ్దుల్ హాది
మూడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో వింబుల్డన్ గెలవడం, వరల్డ్ నంబర్ వన్ కావడం తన కల అని చెప్పుకున్నాడు. క్లే కోర్టు వేదిక ఫ్రెంచ్ ఓపెన్ చాలా ఇష్టమైనా, వింబుల్డన్‌కు ఉండే ప్రత్యేకత వేరని అన్నాడు. 17 ఏళ్ల వయసులో అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. కానీ కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఈ ఘనతలన్నీ సాధిస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు.
నాదల్ దేశం నుంచి వచ్చి.. నాదల్ తరహాలోనే బలమైన షాట్లు ఆడుతూ, అతనిలాగే క్లే కోర్టును ఇష్టపడే అల్‌కరాజ్‌ను అందరూ నాదల్‌కు సరైన వారసుడిగా గుర్తించారు. బేబీ నాదల్ అంటూ పేరు పెట్టారు. నాలుగేళ్ల క్రితం వింబుల్డన్ గ్రాస్ కోర్టుల్లో ఫెడరర్‌తో కలసి ప్రాక్టీస్ చేసిన అతను ఇప్పుడు అదే వింబుల్డన్‌ను ముద్దాడి కొత్త చరిత్ర సృష్టించాడు.
అసాధారణంగా..
సమకాలీన టెన్నిస్‌లో అల్‌కరాజ్ ప్రస్థానం చాలా వేగంగా సాగింది. తండ్రి గొన్‌జాలెజ్ అల్‌కరాజ్ మాజీ టెన్నిస్ ఆటగాడు. ఒకప్పుడు స్పెయిన్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. సహజంగానే తండ్రి వల్లే అతనికి ఆటపై ఆసక్తి పెరిగింది. ముర్షియా పట్టణంలో గొన్‌జాలెజ్ ఒక టెన్నిస్ అకాడమీకి డైరెక్టర్‌గా ఉండటంతో అక్కడే ఆటలో ఓనమాలు నేర్చుకున్నాడు అల్‌కరాజ్. సహజ ప్రతిభ ఉన్న అతను ఆటలో వేగంగా దూసుకుపోయాడు.
దిగువ స్థాయి జూనియర్ టోర్నీలలో అతను రెగ్యులర్‌గా ఆడాల్సిన అవసరమే లేకపోయింది. 15 ఏళ్ల వయసుకే ప్రొఫెషనల్‌గా మారి వరుస విజయాలు సాధించడంతో సర్క్యూట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాజీ వరల్డ్ నంబర్ వన్, ఫ్రెంచ్ ఓపెన్ విజేత యువాన్ కార్లోస్ ఫెరీరోను కోచ్‌గా పెట్టుకోవడం అతని కెరీర్‌లో కీలక మలుపు. ముడి పదార్థంలా ఉన్న అల్‌కరాజ్‌ను ఫెరీరో మెరిసే బంగారంగా తీర్చిదిద్ది.. అద్భుతమైన అతని ఆటలో తన వంతు పాత్ర పోషించాడు.
అన్నీ సంచలనాలే..
ఏటీపీ టూర్‌లో అల్‌కరాజ్ ఎన్నో అరుదైన విజయాలు అందుకున్నాడు. వీటిలో ఎక్కువ భాగం పిన్న వయస్సులోనే సాధించిన ఘనతలుగా గుర్తింపు పొందాయి. టీనేజర్‌గా ఉండగానే 9 టైటిల్స్ నెగ్గి సంచలనం సృష్టించాడు. ఏటీపీ 500 స్థాయి టోర్నీ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా, ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్‌ను సాధించిన మూడో పిన్న వయస్కుడిగా అల్‌కరాజ్ నిలిచాడు.
తనపై ఉన్న అంచనాలను అతను ఎప్పుడూ వమ్ము చేయలేదు. వాటికి అనుగుణంగా తన ఆటను మెరుగుపరచుకుంటూ, తన స్థాయిని పెంచుకుంటూ పోయాడు. అతని కెరీర్‌లో అన్నింటికంటే అత్యుత్తమ క్షణం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఉన్నత స్థానాన్ని పొందడం! వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచిన చిన్న వయస్కుడిగా, మొదటి టీనేజర్‌గా అల్‌కరాజ్ ఘనత వహించాడు. ఈ మైలురాయిని దాటాక అతని గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. కేవలం అతని ఆట, అతను సాధించబోయే టైటిల్స్‌పైనే అందరి చూపులు నిలిచాయి.
గ్రాండ్‌గా విజయాలు..
17 ఏళ్ల వయసులో తొలిసారి అల్‌కరాజ్ వింబుల్డన్ బరిలోకి దిగాడు. ఇదే అతనికి మొదటి గ్రాండ్‌స్లామ్ టోర్నీ. అయితే క్వాలిఫయింగ్ దశను అధిగమించలేకపోయాడు. తర్వాత ఏడాదికే యూఎస్ ఓపెన్‌లో ఏకంగా క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాడు. 1963 తర్వాత ఎవరూ 18 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించలేకపోవడం అతని విజయం విలువను చూపించింది. 2022లో తనకిష్టమైన ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్ వరకు చేరిన అల్‌కరాజ్ ఏడాది చివరికల్లా గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించడం విశేషం.
యూఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకొని మొదటిసారి అతను మేజర్ విజయాన్ని చవి చూశాడు. అప్పటికే వరల్డ్ నంబర్ వన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్‌కరాజ్ అదే స్థానంతో ఏడాదిని ముగించాడు. అనూహ్య గాయాలు ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరం చేయగా.. గాయం కారణంగానే ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోనూ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత అతను మళ్లీ రివ్వున పైకి ఎగిశాడు. పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించిన తర్వాత గ్రాస్ కోర్టు టోర్నీ క్వీన్స్ క్లబ్ విజేతగా.. వింబుల్డన్‌పై గురి పెట్టాడు.
గ్రాస్ కోర్టుపై తన ఆట కాస్త బలహీనం అని తాను స్వయంగా చెప్పుకున్నా.. పట్టుదల ఉంటే ఎక్కడైనా గెలవొచ్చని ఈ స్పెయిన్ కుర్రాడు నిరూపించాడు. ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తూ వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన తీరు కొత్త శకానికి నాంది పలికింది. గత రెండు దశాబ్దాల్లో ముగ్గురు దిగ్గజాలు మాత్రమే శాసించిన వింబుల్డన్‌ను గెలుచుకొని తాను టెన్నిస్‌ను ఏలడానికి వచ్చానని సూత్రప్రాయంగా చెప్పాడు.
పదునైన ఆటతో..
అల్‌కరాజ్ ఆటలోకి వచ్చినప్పుడు అతను క్లే కోర్టు స్పెషలిస్ట్ మాత్రమే అన్నారు. అతను ఆరంభంలో అతను సాధించిన టైటిల్స్, నాదల్ వారసుడిగా వచ్చిన గుర్తింపు ఒక్క సర్ఫేస్‌కే పరిమితం చేసేలా కనిపించింది. కానీ ఏడాది తిరిగే లోపే అది తప్పని నిరూపించాడు. తొలి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ హార్డ్ కోర్టు కాగా, ఇప్పుడు సాధించిన వింబుల్డన్ గ్రాస్ కోర్టు.
ఇక క్లే కోర్టులో ఫ్రెంచ్ ఓపెన్ బాకీ ఉంది. దాన్ని సాధించేందుకూ ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఇప్పుడతను ఆల్‌రౌండ్ ప్లేయర్. పదునైన ఫోర్‌హ్యండ్ అతని ప్రధాన బలం. అతని డ్రాప్ షాట్‌లు నిజంగా సూపర్. ఆ షాట్ బలమేమిటో తాజాగా వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్ రుచి చూశాడు. ఫిట్‌నెస్, ఫుట్ స్పీడ్, దృఢమైన శరీరంతో అతను యువ నాదల్‌ను గుర్తుకు తెస్తున్నాడు.
అల్‌కరాజ్ ఇప్పటికే తన ఆటతో ప్రపంచ టెన్నిస్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నాడు. కెరీర్‌లో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోనే జీవితకాలం సంతృప్తి పొందే ఆటగాళ్లతో పోలిస్తే రెండు పదుల వయసులోనే అతను రెండు గ్రాండ్‌స్లామ్‌లు సాధించాడు. మున్ముందు గాయాల బారిన పడకపోతే పెద్ద సంఖ్యలో టైటిల్స్ అతని ఖాతాలో చేరడం ఖాయం. 2021లో క్రొయేషియా ఓపెన్ గెలిచి తన తొలి ట్రోఫీని అందుకున్న అల్‌కరాజ్ తర్వాతి ఏడాది వచ్చేసరికి 5 టైటిల్స్ గెలిచాడు.
2023లో ఇప్పటికే 6 టైటిల్స్ అతని ఖాతాలో చేరాయంటే అతను ఎంతగా ప్రభావం చూపిస్తున్నాడో అర్థమవుతోంది. ముగ్గురు దిగ్గజాలు ఫెడరర్, నాదల్, జొకోవిచ్ తర్వాత టెన్నిస్‌ను శాసించగల ఆటగాడిగా అతని పేరు ముందుకొచ్చేసింది. దాంతో సహజంగానే ఎండార్స్‌మెంట్‌లు, బ్రాండ్‌లు అతని వెంట పడ్తున్నాయి. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక కంపెనీలు నైకీ, బబోలట్, రోలెక్స్, ఎల్‌పోజో, బీఎండబ్ల్యూ, కెల్విన్ క్లీన్, లూయీ విటాన్ అతనితో జత కట్టాయి. ఆటలో ఇదే జోరు కొనసాగిస్తే అల్‌కరాజ్ ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలవడం ఖాయం.
చదవండి: #StuartBroad: రిటైర్మెంట్‌తో షాకిచ్చిన స్టువర్ట్ బ్రాడ్
క్రికెట్‌లో సంచలనం.. ఒకే ఓవర్‌లో 7 సిక్స్‌లు, 48 పరుగులు! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment