All time great
-
ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ అథ్లెట్ల జాబితాలో విరాట్
టీమిండియా స్టార్ క్రికెటర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి అత్యంత అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అలిమో ఫిలిప్ ఎంపిక చేసిన ఆల్‌టైమ్ గ్రేట్ అథ్లెట్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో విరాట్ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితా టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ మాత్రమే. అలిమో ఫిలిప్ విరాట్‌ను ఫేస్ ఆఫ్ ద క్రికెట్‌గా అభివర్ణించాడు. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ అథ్లెట్ల జాబితాలో ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా ప్లేయర్ లియోనల్ మెస్సీ అగ్రస్థానంలో నిలిచాడు. మెస్సీ తర్వాతి స్థానంలో మరో ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు. 𝐆𝐑𝐄𝐀𝐓𝐄𝐒𝐓 𝐀𝐓𝐇𝐋𝐄𝐓𝐄𝐒 𝐎𝐅 𝐀𝐋𝐋 𝐓𝐈𝐌𝐄 🥇 Lionel Messi 🥈 Cristiano Ronaldo 🥉 Muhammad Ali 4️⃣ Michael Jordan 5️⃣ Virat Kohli 6️⃣ Usain Bolt 7️⃣ Mike Tyson 8️⃣ Lebron James 9️⃣ Serena Williams 🔟 Michael Phelps 🐐 𝐓𝐡𝐞 𝐆𝐎𝐀𝐓𝐒#Messi𓃵|#GOAT𓃵|#NBA pic.twitter.com/Sxv0dBksKW — FIFA World Cup Stats (@alimo_philip) February 3, 2024 బాక్సింగ్ లెజెండ్ మొహమ్మద్ ఆలీ మూడో స్థానంలో, బాస్కెట్‌బాల్ కింగ్ మైఖేల్ జోర్డన్ నాలుగో ప్లేస్‌లో, ట్రాక్ చీతా ఉసేన్ బోల్ట్ ఆరులో, మరో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఏడో స్థానంలో, బాస్కెట్‌బాల్ లెజెండ్ లెబ్రాన్ జేమ్స్ ఎనిమిదిలో, టెన్నిస్ క్వీన్ సెరెనా విలియమ్స్ తొమ్మిదిలో, బంగారు చేప, స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ పదో స్థానంలో నిలిచారు. ఆల్‌టైమ్ గ్రేట్ టాప్ 10 అథ్లెట్ల జాబితాలో సెరెనా విలియమ్స్ ఒక్కరే మహిళ కావడం విశేషం. ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ గర్భంతో ఉన్న కారణంగా విరాట్ జట్టుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో విరాట్ తొలి రెండు టెస్ట్‌లకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుతం వైజాగ్‌లో రెండో టెస్ట్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్‌కు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. -
ఆల్‌టైమ్ బెస్ట్ టీ20 జట్టు ఇదే.. !
టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ తెచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి అందరికీ తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పని చేసే ఈ అధునాతన చాట్‌బోట్.. మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో పని చేస్తూ, టెక్స్ట్ రూపంలో యూజర్లు అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా సెకెన్ల వ్యవధిలో వివరమైన సమాధానం ఇస్తుంది. ఈ టూల్ తన బ్యాక్ ఎండ్‌లో ఉన్న అపారమైన డేటా బేస్ సాయంతో యూజర్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, కోడింగ్, ఆరోగ్యం, క్రీడలు, రాజకీయాలు, వంటకాలు, లైఫ్‌స్టైల్.. ఇలా ఏ విషయానికి సంబంధించి ప్రశ్నలు అడిగినా చాట్ జీపీటీ ఇట్టే సమాధానం చెబుతుంది. ఈ ఏఐ టూల్ క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలకు కూడా ఠక్కున సమాధానం చెబుతుంది. టీ20 క్రికెట్లో ఆల్‌టైమ్ బెస్ట్ జట్టు ఏది అని చాట్ జీపీటీని అడిగితే.. క్రిస్ గేల్, రోహిత్, కోహ్లి, ధోనిలతో కూడిన 11 మంది సభ్యుల పేర్లను చెప్పింది. జట్టు కూర్పు విషయంలో ఈ టూల్ అచ్చం మనిషిలా ఆలోచించి సమతూకమైన జట్టును ప్రకటించింది. బ్యాటింగ్ ఆర్డర్ నుంచి స్పిన్నర్లు, పేసర్లు, వికెట్‌కీపర్.. ఇలా ఓ పర్ఫెక్ట్ జట్టుకు ఉండాల్సిన వనరులన్నిటినీ చాట్ జీపీటీ అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో సమకూర్చింది. ఈ జట్టుకు చాట్ జీపీటీ ధోనిని కెప్టెన్ కమ్ వికెట్‌కీపర్‌గా ఎన్నుకుంది. ఓపెనర్లుగా క్రిస్ గేల్, రోహిత్ శర్మలను ఎంపిక చేసిన చాట్ జీపీటీ.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్, ఐదో ప్లేస్‌లో మ్యాక్స్‌వెల్, ఆతర్వాత ధోని, ఆల్‌రౌండర్ కోటాలో షాహిద్ అఫ్రిది, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రషీద్ ఖాన్, పేసర్లుగా లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, డేల్ స్టెయిన్‌లను ఎంచుకుంది. క్రికెట్ విశ్లేషకులు సైతం ఎంచుకోలేని పర్ఫెక్ట్ టీ20 జట్టును చాట్ జీపీటీ ఎంపిక చేయడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేయడం మనిషి వల్ల కాదని కామెంట్లు చేస్తున్నారు. -
సంచలనాల 'అల్కరాజ్'.. 'ఆల్‌టైమ్ గ్రేట్' లక్షణాలు పుష్కలంగా
ఏడాది క్రితం.. స్పెయిన్‌లో మాడ్రిడ్ ఓపెన్.. కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్లే కోర్టుపై అప్పటికే అతను చెప్పుకోదగ్గ విజయాలు సాధించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. క్వార్టర్స్ సమరంలో ప్రత్యర్థి ఎవరో తెలియగానే అతను భావోద్వేగానికి గురయ్యాడు. దిగ్గజ ఆటగాడు, తాను ఆరాధించే, అభిమానించే రాఫెల్ నాదల్ ఎదురుగా ఉన్నాడు. ఇద్దరు స్పెయిన్ స్టార్ల మధ్య వారి సొంతగడ్డపై పోరు అనగానే ఆ మ్యాచ్‌కు ఎక్కడ లేని ఆకర్షణ వచ్చింది. చివరకు నాదల్‌పై సంచలన విజయంతో తన 19వ పుట్టిన రోజున అల్కరాజ్ తనకు తానే కానుక ఇచ్చుకున్నాడు. అతను అంతటితో ఆగలేదు. సెమీస్‌లో జొకోవిచ్‌నూ మట్టికరిపించి ఒకే క్లే కోర్టు టోర్నీలో ఆ ఇద్దరినీ ఓడించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అక్కడే అతను ఏమిటో ప్రపంచానికి తెలిసింది. భవిష్యత్తులో సాధించబోయే ఘనతలకు అది సూచిక అయింది. - మొహమ్మద్ అబ్దుల్ హాది మూడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో వింబుల్డన్ గెలవడం, వరల్డ్ నంబర్ వన్ కావడం తన కల అని చెప్పుకున్నాడు. క్లే కోర్టు వేదిక ఫ్రెంచ్ ఓపెన్ చాలా ఇష్టమైనా, వింబుల్డన్‌కు ఉండే ప్రత్యేకత వేరని అన్నాడు. 17 ఏళ్ల వయసులో అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. కానీ కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఈ ఘనతలన్నీ సాధిస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. నాదల్ దేశం నుంచి వచ్చి.. నాదల్ తరహాలోనే బలమైన షాట్లు ఆడుతూ, అతనిలాగే క్లే కోర్టును ఇష్టపడే అల్కరాజ్ను అందరూ నాదల్కు సరైన వారసుడిగా గుర్తించారు. బేబీ నాదల్ అంటూ పేరు పెట్టారు. నాలుగేళ్ల క్రితం వింబుల్డన్ గ్రాస్ కోర్టుల్లో ఫెడరర్‌తో కలసి ప్రాక్టీస్ చేసిన అతను ఇప్పుడు అదే వింబుల్డన్‌ను ముద్దాడి కొత్త చరిత్ర సృష్టించాడు. అసాధారణంగా.. సమకాలీన టెన్నిస్‌లో అల్కరాజ్ ప్రస్థానం చాలా వేగంగా సాగింది. తండ్రి గొన్జాలెజ్ అల్కరాజ్ మాజీ టెన్నిస్ ఆటగాడు. ఒకప్పుడు స్పెయిన్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. సహజంగానే తండ్రి వల్లే అతనికి ఆటపై ఆసక్తి పెరిగింది. ముర్షియా పట్టణంలో గొన్జాలెజ్ ఒక టెన్నిస్ అకాడమీకి డైరెక్టర్‌గా ఉండటంతో అక్కడే ఆటలో ఓనమాలు నేర్చుకున్నాడు అల్కరాజ్. సహజ ప్రతిభ ఉన్న అతను ఆటలో వేగంగా దూసుకుపోయాడు. దిగువ స్థాయి జూనియర్ టోర్నీలలో అతను రెగ్యులర్‌గా ఆడాల్సిన అవసరమే లేకపోయింది. 15 ఏళ్ల వయసుకే ప్రొఫెషనల్‌గా మారి వరుస విజయాలు సాధించడంతో సర్క్యూట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాజీ వరల్డ్ నంబర్ వన్, ఫ్రెంచ్ ఓపెన్ విజేత యువాన్ కార్లోస్ ఫెరీరోను కోచ్‌గా పెట్టుకోవడం అతని కెరీర్లో కీలక మలుపు. ముడి పదార్థంలా ఉన్న అల్కరాజ్ను ఫెరీరో మెరిసే బంగారంగా తీర్చిదిద్ది.. అద్భుతమైన అతని ఆటలో తన వంతు పాత్ర పోషించాడు. అన్నీ సంచలనాలే.. ఏటీపీ టూర్లో అల్కరాజ్ ఎన్నో అరుదైన విజయాలు అందుకున్నాడు. వీటిలో ఎక్కువ భాగం పిన్న వయస్సులోనే సాధించిన ఘనతలుగా గుర్తింపు పొందాయి. టీనేజర్‌గా ఉండగానే 9 టైటిల్స్ నెగ్గి సంచలనం సృష్టించాడు. ఏటీపీ 500 స్థాయి టోర్నీ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా, ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్‌ను సాధించిన మూడో పిన్న వయస్కుడిగా అల్కరాజ్ నిలిచాడు. తనపై ఉన్న అంచనాలను అతను ఎప్పుడూ వమ్ము చేయలేదు. వాటికి అనుగుణంగా తన ఆటను మెరుగుపరచుకుంటూ, తన స్థాయిని పెంచుకుంటూ పోయాడు. అతని కెరీర్లో అన్నింటికంటే అత్యుత్తమ క్షణం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఉన్నత స్థానాన్ని పొందడం! వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచిన చిన్న వయస్కుడిగా, మొదటి టీనేజర్‌గా అల్కరాజ్ ఘనత వహించాడు. ఈ మైలురాయిని దాటాక అతని గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. కేవలం అతని ఆట, అతను సాధించబోయే టైటిల్స్‌పైనే అందరి చూపులు నిలిచాయి. గ్రాండ్‌గా విజయాలు.. 17 ఏళ్ల వయసులో తొలిసారి అల్కరాజ్ వింబుల్డన్ బరిలోకి దిగాడు. ఇదే అతనికి మొదటి గ్రాండ్‌స్లామ్ టోర్నీ. అయితే క్వాలిఫయింగ్ దశను అధిగమించలేకపోయాడు. తర్వాత ఏడాదికే యూఎస్ ఓపెన్‌లో ఏకంగా క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాడు. 1963 తర్వాత ఎవరూ 18 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించలేకపోవడం అతని విజయం విలువను చూపించింది. 2022లో తనకిష్టమైన ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్ వరకు చేరిన అల్కరాజ్ ఏడాది చివరికల్లా గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించడం విశేషం. యూఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకొని మొదటిసారి అతను మేజర్ విజయాన్ని చవి చూశాడు. అప్పటికే వరల్డ్ నంబర్ వన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్కరాజ్ అదే స్థానంతో ఏడాదిని ముగించాడు. అనూహ్య గాయాలు ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరం చేయగా.. గాయం కారణంగానే ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోనూ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత అతను మళ్లీ రివ్వున పైకి ఎగిశాడు. పూర్తి ఫిట్నెస్ను సాధించిన తర్వాత గ్రాస్ కోర్టు టోర్నీ క్వీన్స్ క్లబ్ విజేతగా.. వింబుల్డన్‌పై గురి పెట్టాడు. గ్రాస్ కోర్టుపై తన ఆట కాస్త బలహీనం అని తాను స్వయంగా చెప్పుకున్నా.. పట్టుదల ఉంటే ఎక్కడైనా గెలవొచ్చని ఈ స్పెయిన్ కుర్రాడు నిరూపించాడు. ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తూ వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన తీరు కొత్త శకానికి నాంది పలికింది. గత రెండు దశాబ్దాల్లో ముగ్గురు దిగ్గజాలు మాత్రమే శాసించిన వింబుల్డన్‌ను గెలుచుకొని తాను టెన్నిస్‌ను ఏలడానికి వచ్చానని సూత్రప్రాయంగా చెప్పాడు. పదునైన ఆటతో.. అల్కరాజ్ ఆటలోకి వచ్చినప్పుడు అతను క్లే కోర్టు స్పెషలిస్ట్ మాత్రమే అన్నారు. అతను ఆరంభంలో అతను సాధించిన టైటిల్స్, నాదల్ వారసుడిగా వచ్చిన గుర్తింపు ఒక్క సర్ఫేస్కే పరిమితం చేసేలా కనిపించింది. కానీ ఏడాది తిరిగే లోపే అది తప్పని నిరూపించాడు. తొలి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ హార్డ్ కోర్టు కాగా, ఇప్పుడు సాధించిన వింబుల్డన్ గ్రాస్ కోర్టు. ఇక క్లే కోర్టులో ఫ్రెంచ్ ఓపెన్ బాకీ ఉంది. దాన్ని సాధించేందుకూ ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఇప్పుడతను ఆల్‌రౌండ్ ప్లేయర్. పదునైన ఫోర్హ్యండ్ అతని ప్రధాన బలం. అతని డ్రాప్ షాట్లు నిజంగా సూపర్. ఆ షాట్ బలమేమిటో తాజాగా వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్ రుచి చూశాడు. ఫిట్నెస్, ఫుట్ స్పీడ్, దృఢమైన శరీరంతో అతను యువ నాదల్‌ను గుర్తుకు తెస్తున్నాడు. అల్కరాజ్ ఇప్పటికే తన ఆటతో ప్రపంచ టెన్నిస్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నాడు. కెరీర్లో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోనే జీవితకాలం సంతృప్తి పొందే ఆటగాళ్లతో పోలిస్తే రెండు పదుల వయసులోనే అతను రెండు గ్రాండ్‌స్లామ్‌లు సాధించాడు. మున్ముందు గాయాల బారిన పడకపోతే పెద్ద సంఖ్యలో టైటిల్స్ అతని ఖాతాలో చేరడం ఖాయం. 2021లో క్రొయేషియా ఓపెన్ గెలిచి తన తొలి ట్రోఫీని అందుకున్న అల్కరాజ్ తర్వాతి ఏడాది వచ్చేసరికి 5 టైటిల్స్ గెలిచాడు. 2023లో ఇప్పటికే 6 టైటిల్స్ అతని ఖాతాలో చేరాయంటే అతను ఎంతగా ప్రభావం చూపిస్తున్నాడో అర్థమవుతోంది. ముగ్గురు దిగ్గజాలు ఫెడరర్, నాదల్, జొకోవిచ్ తర్వాత టెన్నిస్‌ను శాసించగల ఆటగాడిగా అతని పేరు ముందుకొచ్చేసింది. దాంతో సహజంగానే ఎండార్స్మెంట్లు, బ్రాండ్లు అతని వెంట పడ్తున్నాయి. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక కంపెనీలు నైకీ, బబోలట్, రోలెక్స్, ఎల్పోజో, బీఎండబ్ల్యూ, కెల్విన్ క్లీన్, లూయీ విటాన్ అతనితో జత కట్టాయి. ఆటలో ఇదే జోరు కొనసాగిస్తే అల్కరాజ్ ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలవడం ఖాయం. చదవండి: #StuartBroad: రిటైర్మెంట్తో షాకిచ్చిన స్టువర్ట్ బ్రాడ్ క్రికెట్లో సంచలనం.. ఒకే ఓవర్లో 7 సిక్స్‌లు, 48 పరుగులు! వీడియో వైరల్ -
సినిమాల్లో 'డాన్'లు చాలా మందే.. బ్యాడ్మింటన్‌లో మాత్రం ఒక్కడే 'డాన్'
డాన్... ఆ పేరులోనే ప్రపంచాన్ని శాసిస్తున్న భావన వినిపిస్తుంది! ఈ డాన్ కూడా అలాగే చేశాడు. సుదీర్ఘకాలం పాటు బ్యాడ్మింటన్ ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఎందరు పోటీకొచ్చినా.. ఎందరు ప్రయత్నించినా అతడిని పడగొట్టలేకపోయారు. సాధించిన ఘనతలు, రికార్డులు చూస్తే అతని తిరుగులేని ఆట కళ్ల ముందు కనిపిస్తుంది. టీనేజర్‌గా దూసుకొచ్చి దాదాపు రెండు దశాబ్దాల పాటు విజయాలకు చిరునామాగా మారిన ఆల్‌టైమ్ బ్యాడ్మింటన్ గ్రేట్ లిన్ డాన్. షటిల్‌ను చైనా నడిపించిన కాలం నుంచి ఇతర దేశాల షట్లర్ల జోరు పెరిగే దాకా.. ఎక్కడా ఆటలో వన్నె తగ్గని వీరుడతను. బ్యాడ్మింటన్ ప్రపంచంలో 9 టోర్నమెంట్లను అత్యుత్తమమైనవిగా భావిస్తారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచ కప్, థామస్ కప్, సుదిర్మన్ కప్, సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్... సూపర్ గ్రాండ్స్లామ్గా వ్యవహరించే వీటన్నింటిని గెలుచుకున్న తొలి, ఏకైక ఆటగాడు లిన్ డాన్ మాత్రమే. 28 ఏళ్ల వయసు వచ్చే సరికే అతను సాధించిన ఈ ఘనత.. డాన్ స్థాయి ఏమిటో చూపిస్తుంది. ఇన్నేళ్లలో మరే ఆటగాడికి సాధ్యం కాని రీతిలో అతను ప్రదర్శించిన ఆట డాన్‌ను బాడ్మింటన్ దిగ్గజంగా మార్చింది. ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని నిలబెట్టుకున్న ఏకైక షట్లర్ డాన్ మాత్రమే. 2008లో బీజింగ్‌లో సొంత అభిమానుల సమక్షంలో పసిడి సాధించిన అతను 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ కనకాన్ని సొంతం చేసుకున్నాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడం కూడా అసాధారణ రికార్డే! మొత్తంగా అంతర్జాతీయ పోటీల్లో 666 విజయాలు, 66 టైటిల్స్ లిన్ డాన్ దిగ్గజ హోదాకు చిరునామాగా నిలిచాయి. సుదీర్ఘకాలం సత్తా చాటుతూ.. అద్భుతమైన ఫిట్నెస్, పదునైన ఆటతో సుదీర్ఘ కాలం పాటు డాన్ బ్యాడ్మింటన్‌ను శాసించగలిగాడు. సరిగ్గా చెప్పాలంటే వేర్వేరు దశకాల్లో అతను భిన్నమైన ప్రత్యర్థులతో తలపడుతూ అన్ని సమయాల్లోనూ తనదైన ముద్ర చూపించాడు. ఉదాహరణకు డాన్‌ను ఎదుర్కొన్న భారత షట్లర్లను చూస్తే అతని ఆట ఏమిటో అర్థమవుతుంది. తన 17 ఏళ్ల వయసులో 2001లో అతను పుల్లెల గోపీచంద్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దిగాడు. తన కెరీర్ అత్యుత్తమంగా సాగుతున్న 2000 మధ్యకాలంలో అనూప్ శ్రీధర్, అరవింద్ భట్‌లాంటి వారితో తలపడ్డాడు. ఆ దశాబ్దం చివర్లో పారుపల్లి కశ్యప్నూ ఓడించాడు. 2010 దాటాక భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సాయిప్రణీత్లను డాన్ ఎదుర్కొన్నాడు. ఇక 2018కి వచ్చేసరికి భారత యువ ఆటగాడు లక్ష్య సేన్తోనూ కోర్టులో పోటీ పడ్డాడు. అటాకింగ్‌కి మారు పేరుగా డాన్ తన ప్రత్యర్థులపై చెలరేగాడు. పదిసార్లు షటిల్ గాల్లోకి లేస్తే తొమ్మిదిసార్లు డాన్ జంప్ చేసి స్మాష్ కొట్టడం సహజం. అదే అతని శైలి అంటూ మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్ కితాబు ఇచ్చాడు. బాడ్మింటన్‌లో లిన్ డాన్ అత్యుత్తమ ఆటగాడు అన్నది మరో మాటకు తావులేని స్టేట్మెంట్! టెన్నిస్లోనైనా కొన్నిసార్లు కొందరు ఆటగాళ్ల గురించి చర్చ సాగుతుంది. కానీ ఇక్కడ అలాంటి అవకాశమే లేదు అని అరవింద్ భట్ చెప్పాడు. సంగీతం నుంచి షటిల్ వరకు.. చిన్నతనంలో పియానో బాగా వాయించడం చూసి తల్లిదండ్రులు డాన్‌ను సంగీతంలోనే కొనసాగమని ప్రోత్సహించారు. అయితే అతను మాత్రం దానిని సరదాకే పరిమితం చేసి బ్యాడ్మింటన్ రాకెట్ పట్టాడు. అతనిలోని సహజ ప్రతిభ ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే దూసుకుపోయేలా చేసింది. చైనా ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఆర్మీ స్పోర్ట్స్ టీమ్ దృష్టి డాన్‌పై పడిన తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తన రాకను ఘనంగా చాటిన డాన్ ఆ తర్వాత అదే జోరుతో అద్భుతాలు చేశాడు. వరుస విజయాలతో 21 ఏళ్లకే తొలిసారి ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. చిరకాల ప్రత్యర్థితో.. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత ఆసక్తికరమైన, సమ ఉజ్జీల సమరాలు అంటే.. లిన్ డాన్ – లీ చోంగ్ వీ (మలేసియా) మధ్య జరిగిన మ్యాచ్‌ల గురించే చెప్పాలి. ఒక తరం పాటు వీరిద్దరి మధ్య సాగిన పోటీ షటిల్ అభిమానులకు ఆనందాన్ని పంచింది. ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఈ ఇద్దరి మధ్య సాగిన హోరాహోరీ మ్యాచ్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే. పోలిస్తే లీ చోంగ్ వీ అత్యధిక అంతర్జాతీయ విజయాలు (732), అత్యధిక వారాలు వరల్డ్ నంబర్‌వన్ (348) ఘనత సాధించాడు. ప్రతిభ, సాంకేతికపరంగా చూస్తే డాన్ కంటే చోంగ్ వీ ఎంతో ముందుంటాడు. కానీ కోర్టులోకి దిగేసరికి మాత్రం డాన్ ఒక్కసారిగా పూనకం వచ్చినవాడిలా మారిపోతాడు అనేది పుల్లెల గోపీచంద్ అభిప్రాయం. నిజంగానే ఓవరాల్ రికార్డు అలాగే ఉంది. వీరిద్దరూ 40 సార్లు తలపడగా లిన్ డాన్ 28–12తో ఆధిక్యం ప్రదర్శించాడు. అయితే ఈ అంకెలు చూస్తే అంతా ఏకపక్షంగా కనిపించినా.. వాస్తవం అది కాదు. ఒక్కో పాయింట్ కోసం, సుదీర్ఘ ర్యాలీలతో వీరిద్దరూ పోరాడిన తీరు ఆయా మ్యాచ్‌లను అద్భుతాలుగా నిలిపాయి. వీరిద్దరి మధ్య జరిగిన 2012 ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ బ్యాడ్మింటన్ చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. మరో చర్చ లేకుండా లిన్ డాన్ మాత్రమే బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు అంటూ లీ చోంగ్ వీ చేసిన ప్రశంస డాన్ ప్రతిభకు అందిన సర్టిఫికెట్‌గా చెప్పొచ్చు. ఈ ఏడాది మే నెలలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తమ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఒకేసారి ఈ ఇద్దరు స్టార్లను చేర్చడం విశేషం. కోర్టులోనే ప్రేమ.. బ్యాడ్మింటన్‌లో సహచర క్రీడాకారిణి గ్జి గ్జింగ్ఫాంగ్తో ఏడేళ్ల పాటు డేటింగ్ చేసిన అనంతరం డాన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. గ్జింగ్ఫాంగ్ కూడా రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో పాటు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించింది. మాడ్రిడ్‌లో జరిగిన 2006 వరల్డ్ చాంపియన్‌షిప్ సింగిల్స్ పురుషుల, మహిళల విభాగాల్లో వీరిద్దరూ విజేతలుగా నిలిచాక ప్రేమబంధం మరింత బలపడింది. ఆటలో ఏ స్థాయికి ఎదిగినా చదువులో కూడా డాన్ చురుగ్గా ఉండేవాడు. కెరీర్లో ఉచ్ఛ దశలో ఉన్న సమయంలోనే అతను హువాఖియో యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. తద్వారా ఆటగాడిగా ఉంటూనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి చైనా ప్లేయర్‌గా నిలిచాడు. 2012లో రెండోసారి ఒలింపిక్స్ పతకం గెలిచాక లిన్ డాన్ బయోగ్రఫీ వచ్చింది. ‘అన్టిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్’ పేరుతో వచ్చిన ఈ పుస్తకం ఎంతో మంది యువకులకు స్ఫూర్తిగా నిలిచి అత్యంత ఆదరణ పొందింది. - మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: భారత మహిళలకు చేజారిన విజయం టైటిల్‌కు అడుగు దూరంలో... -
పాక్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గవాస్కర్.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన
Sunil Gavaskar Hails Babar Azam: గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న పాకిస్థాన్ సారధి బాబర్ ఆజమ్‌పై దిగ్గజ బ్యాటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఈ దశాబ్దపు అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడని కొనియాడాడు. మూడు ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో పరుగులు చేస్తూ.. సమకాలీకులైన విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లతో పోటీపడుతున్నాడని అన్నాడు. బాబర్ ఇదే ఫామ్‌ను కెరీర్ ముగిసే వరకు కొనసాగించగలిగితే.. ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడిగా నిలిచిపోతాడని జోస్యం చెప్పాడు. అయితే, ఫిట్నెస్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరించాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్-2021లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పాక్ జట్టును బాబర్ అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడని ప్రశంసించాడు. అతని స్ఫూర్తిదాయకమైన, ప్రశాంతమైన నాయకత్వ శైలి అమోఘమని ఆకాశానికెత్తాడు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021 సూపర్-12లో అజేయ జట్టుగా నిలిచి సెమీస్‌కు చేరుకున్న పాక్.. ఇవాళ(నవంబర్ 11) రెండో సెమీ ఫైనల్స్‌లో బలమైన ఆసీస్ జట్టుతో తలపడనుంది. చదవండి: Siraj: అబ్బాయిలు ఏడ్వకూడదని నాన్న చెప్పేవాడు.. కానీ ఆపుకోలేక..! -
అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ అంటే ఒప్పుకోను..
ముంబై: భారత అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా పరిగణించబడే స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజాపై కూడా ఇలాంటి వాఖ్యలే చేసిన ఆయన.. తాజాగా అశ్విన్‌ను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారంది. కుంబ్లే, హర్భజన్ తర్వాత భారత క్రికెట్‌పై ఆ స్థాయి ముద్ర వేసిన స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న అశ్విన్‌ను ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ అంటే ఒప్పుకోనని, ఎవరైనా అతన్ని అలా పరిగణిస్తే తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే, తాను చేసిన ఈ వ్యాఖ్యల వెనుక బలమైన కారణం ఉందంటున్నాడు మంజ్రేకర్. SENA దేశాలైన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పిచ్‌లపై అశ్విన్ పెద్దగా ప్రభావం చూపలేదని, ఆ దేశాల్లో అశ్విన్ ఒక్కసారి కూడా ఐదు వికెట్ల ప్రదర్శన చేయలేదని, అలాంటప్పుడు అతన్ని ఆల్‌టైమ్ గ్రేట్‌గా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించాడు. అశ్విన్ మంచి ప్లేయరే అయ్యుండొచ్చు కానీ, ఆల్‌టైమ్ గ్రేట్స్ మాత్రం కాదని, అతన్ని దిగ్గజాల జాబితాలో కలపడం తనకు ఎంత మాత్రం నచ్చదని వ్యాఖ్యానించాడు. భారత్‌లో అశ్విన్‌కు తిరుగులేదని అంటారు. కానీ, గడిచిన కొన్నేళ్లేగా జడేజా కూడా అశ్విన్‌తో పోటీ పడి మరీ వికెట్లు తీశాడు, ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అయితే అశ్విన్ కంటే అక్షర్ పటేల్ ఎక్కువ వికెట్లు సాధించాడని గుర్తు చేశాడు. అలాంటప్పుడు అశ్విన్‌ను దిగ్గజ స్పిన్నర్‌గా పరిగణించడం ఏమాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఓ యూట్యూబ్ ఛానెల్లో ఇంటర్వ్యూ సందర్భంగా మంజ్రేకర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, 34 ఏళ్ల అశ్విన్.. ప్రస్తుతం 78 టెస్ట్‌ల్లో 409 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న నాలుగో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో 30 ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉండగా, కపిల్, హర్భజన్లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అశ్విన్ బౌలర్ల విభాగంలో ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో, ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: క్వారంటైన్ కంప్లీట్.. ప్రాక్టీస్ షురూ -
అది గ్రేట్ కాదు.. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ గ్రేట్ రికార్డు..!
టెన్నిస్‌లో ఎవరైనా ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిస్తేనే కల సాకారమైందంటారు. మరి ఒక్కడే 20 గెలిస్తే జీవితమే సాఫల్యమైందనాలేమో! ఎందుకంటే 200 గ్రాండ్‌స్లామ్‌లు జరిగిన టెన్నిస్ చరిత్రలో ఒక్కడే పది శాతం ట్రోఫీలు ఎగరేసుకుపోతే అది గ్రేట్ కాదు... ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ గ్రేట్ రికార్డు అవుతుంది. మెల్బోర్న్లో స్విట్జర్లాండ్ సూపర్‌స్టార్ రోజర్ ఫెడరర్ అదే చేశాడు. బరిలో మేటి... పోటీలో ఘనాపాఠి. పోరాడితే ఎవ్వరికీ మింగుడు పడని ప్రత్యర్థి. నిలిస్తే గెలుస్తాడు. గెలిస్తే చరిత్ర సృష్టిస్తాడు. ఔను... ఈ చరిత్ర పుటలకెక్కుతుంది. కాబట్టి మిన్నకుండిపోయింది... లేదంటే ఆ చరిత్రకే కళ్లుంటే మురిపెంగా ఈ విశ్వవిజేతను తన్మయత్వంతో చూసేది. మెల్బోర్న్: చూస్తుంటే... గ్రాండ్‌స్లామ్ చరిత్రలో రోజర్ ఫెడరర్ తరతరాలకు చెరగని రికార్డును లిఖిస్తాడేమో! ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్ నిలబెట్టుకున్న ఈ డిఫెండింగ్ చాంపియన్ 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో టెన్నిస్ లోకాన్నే మురిపించాడు. వయసు మూడు పదులు దాటినా తనలో వాడి తగ్గలేదని తాజా విజయంతో మళ్లీ నిరూపించాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్విట్జర్లాండ్ లెజెండ్ ఫెడరర్ 6–2, 6–7 (5/7), 6–3, 3–6, 6–1తో ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై చెమటోడ్చి నెగ్గాడు. 36 ఏళ్ల రోజర్ తన కెరీర్లో 20వ టైటిల్ కోసం 3 గంటల 3 నిమిషాలు పోరాడాడు. పోరు ముగియగానే అదుపులేని ఆనందాన్ని, భావోద్వేగాన్ని దాచుకోలేకపోయిన ఫెడరర్ బిగ్గరగా ఏడ్చేశాడు. తనకు జేజేలు పలుకుతున్న స్టేడియంలోని ప్రేక్షకులకు ఆనంద బాష్పాలతో మాట కలిపాడు. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 40 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 20 కోట్ల 63 లక్షలు)... రన్నరప్ మారిన్ సిలిచ్‌కు 20 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 31 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 200వ గ్రాండ్‌స్లామ్... 30వ ఫైనల్... టెన్నిస్ చరిత్రలో ఇది 200వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ. ఇందులో 30వ ఫైనల్ ఆడిన ఫెడరర్ 20వ టైటిల్ గెలవడం నిజంగా అద్భుతమే కదా! ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతనికిది ఆరో టైటిల్... దీంతో ఇది వరకే ఈ ఘనత సాధించిన జొకోవిచ్ (సెర్బియా), అలనాటి ఆసీస్ దిగ్గజం రాయ్ ఎమర్సన్‌ల సరసన నిలిచాడు. అలుపెరగని ఈ పోరాట యోధుడు ఫైనల్ పోరును దూకుడుగానే ఆరంభించాడు. తొలి సెట్‌ను తనదైన శైలిలో గెలుచుకున్న ఫెడరర్‌కు రెండో సెట్లో క్రొయేషియన్ ప్రత్యర్థి నుంచి అనూహ్య పోటీ ఎదురైంది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ సెట్ చివరకు టైబ్రేక్‌కు దారి తీసింది. అక్కడా అదే తీరు కొనసాగడంతో స్టేడియంలోని ప్రేక్షకులు ఒళ్లంతా కళ్లు చేసుకున్నారు. చివరకు సెట్ కోల్పోయిన ఫెడరర్ మూడో సెట్లో పుంజుకొని ఆడాడు. పోటీ లేకుండానే 6–3తో ఈ సెట్‌ను ముగించాడు. నాలుగో సెట్ ఓడటంతో నిర్ణాయక ఐదో సెట్లో ఫెడరర్ తన అనుభవాన్నంతా రంగరించి తేలిగ్గా ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఆరోసారి ఆస్ట్రేలియన్ ట్రోఫీని ముద్దాడాడు. ఫైనల్లో ప్రత్యర్థి సిలిచ్ సర్వీస్‌ను ఆరు సార్లు బ్రేక్ చేసిన ఫెడరర్ 24 ఏస్‌లు సంధించాడు. సిలిచ్ 16 ఏస్‌లు సంధించాడు. ఎండవేడిమి... ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు పెరగడంతో టెన్నిస్ కోర్టు పైకప్పును మూసి ఆడించారు. మీకు తెలుసా... 332-52 గ్రాండ్‌స్లామ్ కెరీర్లో ఫెడరర్ జయాపజయాల రికార్డు ఇది. మెల్‌బోర్న్‌లోనూ అతనికి ఘనమైన రికార్డే (94–13) ఉంది. 10% చరిత్రలో పది శాతం గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు రోజర్ ఇంట్లోనే ఉన్నాయి. 91 సిలిచ్‌పై ఫెడరర్ పైచేయి ఇది. పదిసార్లు ముఖాముఖిగా తలపడితే ఒక్కసారి మాత్రమే (2014, యూఎస్ ఓపెన్ సెమీస్) ఓడాడు రోజర్. ఇవీ ఫెడరర్ ‘గ్రాండ్’ టైటిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ (6): 2004, 2006, 2007, 2010, 2017, 2018 ఫ్రెంచ్ ఓపెన్ (1): 2009 వింబుల్డన్ (8): 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017 యూఎస్ ఓపెన్ (5): 2004, 2005, 2006, 2007, 2008 94: ఫెడరర్ కెరీర్లో గెలిచిన టైటిల్స్. అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఇవాన్ లెండిల్ సరసన ఫెడరర్ చేరాడు. 109 టైటిల్స్‌తో జిమ్మీ కానర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. 3: ఓపెన్ శకంలో (1968 తర్వాత) 30 ఏళ్లు దాటిన తర్వాత నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన మూడో ప్లేయర్ ఫెడరర్. గతంలో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా), కెన్ రోజ్‌వెల్ (అమెరికా) మాత్రమే ఇలాంటి ఘనత సాధించారు. చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నాను. గతేడాది నాకు గొప్పగా గడిచింది. అది ఇచ్చిన ఉత్సాహమే ఈ టైటిల్ కూడా. ఎక్కడలేని ఆనందాన్ని, అనుభూతినిచ్చింది. ఈ ఫైనల్ నాకు 2006 తుది పోరును గుర్తుకు తెచ్చింది. బగ్ధాటిస్తో జరిగిన ఆ పోరును, విజయాన్ని మర్చిపోలేను. ఈ ఫైనల్లోనూ అదే విధంగా పోరాడాను. అనుకున్నది సాధించాను. ఫైనల్‌దాకా అద్భుతంగా సాగింది. నా టీమ్ (సహాయక సిబ్బంది)కు కృతజ్ఞతలు. నేను గెలిచేందుకు వాళ్లు కష్టపడ్డారు. –ఫెడరర్ -
రాష్ట్రపతి అభినందన
న్యూఢిల్లీ: కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న సచిన్‌ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. ‘ సచిన్ ఎంతో మంది యువకులకు స్ఫూర్తినిచ్చిన అసలైన దిగ్గజం. భవిష్యత్తులోనూ క్రీడలకు సేవ చేస్తాడని నా నమ్మకం’ అని ప్రణబ్ అన్నారు. సచిన్‌ను ఆల్‌టైమ్ గ్రేట్‌గా బ్రిటన్ ప్రధాని కామెరాన్ కొనియాడారు. ఇంగ్లండ్‌లో సచిన్ తొలి టెస్టు సెంచరీ చేసిన ఫొటోను ప్రత్యేకంగా ఫ్రేమ్ చేయించి మాస్టర్‌కు కామెరాన్ బహుమతిగా పంపారు.