రోజర్ ఫెడరర్
టెన్నిస్‌లో ఎవరైనా ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిస్తేనే కల సాకారమైందంటారు. మరి ఒక్కడే 20 గెలిస్తే జీవితమే సాఫల్యమైందనాలేమో! ఎందుకంటే 200 గ్రాండ్‌స్లామ్‌లు జరిగిన టెన్నిస్ చరిత్రలో ఒక్కడే పది శాతం ట్రోఫీలు ఎగరేసుకుపోతే అది గ్రేట్ కాదు... ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ గ్రేట్ రికార్డు అవుతుంది. మెల్‌బోర్న్‌లో స్విట్జర్లాండ్ సూపర్‌స్టార్ రోజర్ ఫెడరర్ అదే చేశాడు. బరిలో మేటి... పోటీలో ఘనాపాఠి. పోరాడితే ఎవ్వరికీ మింగుడు పడని ప్రత్యర్థి. నిలిస్తే గెలుస్తాడు. గెలిస్తే చరిత్ర సృష్టిస్తాడు. ఔను... ఈ చరిత్ర పుటలకెక్కుతుంది. కాబట్టి మిన్నకుండిపోయింది... లేదంటే ఆ చరిత్రకే కళ్లుంటే మురిపెంగా ఈ విశ్వవిజేతను తన్మయత్వంతో చూసేది.
మెల్‌బోర్న్: చూస్తుంటే... గ్రాండ్‌స్లామ్ చరిత్రలో రోజర్ ఫెడరర్ తరతరాలకు చెరగని రికార్డును లిఖిస్తాడేమో! ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్ నిలబెట్టుకున్న ఈ డిఫెండింగ్ చాంపియన్ 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో టెన్నిస్ లోకాన్నే మురిపించాడు. వయసు మూడు పదులు దాటినా తనలో వాడి తగ్గలేదని తాజా విజయంతో మళ్లీ నిరూపించాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్విట్జర్లాండ్ లెజెండ్ ఫెడరర్ 6–2, 6–7 (5/7), 6–3, 3–6, 6–1తో ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై చెమటోడ్చి నెగ్గాడు.
36 ఏళ్ల రోజర్ తన కెరీర్‌లో 20వ టైటిల్ కోసం 3 గంటల 3 నిమిషాలు పోరాడాడు. పోరు ముగియగానే అదుపులేని ఆనందాన్ని, భావోద్వేగాన్ని దాచుకోలేకపోయిన ఫెడరర్ బిగ్గరగా ఏడ్చేశాడు. తనకు జేజేలు పలుకుతున్న స్టేడియంలోని ప్రేక్షకులకు ఆనంద బాష్పాలతో మాట కలిపాడు. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 40 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 20 కోట్ల 63 లక్షలు)... రన్నరప్ మారిన్ సిలిచ్‌కు 20 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 31 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
200వ గ్రాండ్‌స్లామ్... 30వ ఫైనల్...
టెన్నిస్ చరిత్రలో ఇది 200వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ. ఇందులో 30వ ఫైనల్ ఆడిన ఫెడరర్ 20వ టైటిల్ గెలవడం నిజంగా అద్భుతమే కదా! ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతనికిది ఆరో టైటిల్... దీంతో ఇది వరకే ఈ ఘనత సాధించిన జొకోవిచ్ (సెర్బియా), అలనాటి ఆసీస్ దిగ్గజం రాయ్ ఎమర్సన్‌ల సరసన నిలిచాడు. అలుపెరగని ఈ పోరాట యోధుడు ఫైనల్ పోరును దూకుడుగానే ఆరంభించాడు. తొలి సెట్‌ను తనదైన శైలిలో గెలుచుకున్న ఫెడరర్‌కు రెండో సెట్‌లో క్రొయేషియన్ ప్రత్యర్థి నుంచి అనూహ్య పోటీ ఎదురైంది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ సెట్ చివరకు టైబ్రేక్‌కు దారి తీసింది.
అక్కడా అదే తీరు కొనసాగడంతో స్టేడియంలోని ప్రేక్షకులు ఒళ్లంతా కళ్లు చేసుకున్నారు. చివరకు సెట్ కోల్పోయిన ఫెడరర్ మూడో సెట్‌లో పుంజుకొని ఆడాడు. పోటీ లేకుండానే 6–3తో ఈ సెట్‌ను ముగించాడు. నాలుగో సెట్ ఓడటంతో నిర్ణాయక ఐదో సెట్‌లో ఫెడరర్ తన అనుభవాన్నంతా రంగరించి తేలిగ్గా ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఆరోసారి ఆస్ట్రేలియన్ ట్రోఫీని ముద్దాడాడు. ఫైనల్లో ప్రత్యర్థి సిలిచ్ సర్వీస్‌ను ఆరు సార్లు బ్రేక్ చేసిన ఫెడరర్ 24 ఏస్‌లు సంధించాడు. సిలిచ్ 16 ఏస్‌లు సంధించాడు. ఎండవేడిమి... ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు పెరగడంతో టెన్నిస్ కోర్టు పైకప్పును మూసి ఆడించారు.
మీకు తెలుసా...
332-52 గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లో ఫెడరర్ జయాపజయాల రికార్డు ఇది. మెల్‌బోర్న్‌లోనూ అతనికి ఘనమైన రికార్డే (94–13) ఉంది.
10% చరిత్రలో పది శాతం గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు రోజర్ ఇంట్లోనే ఉన్నాయి.
91 సిలిచ్‌పై ఫెడరర్ పైచేయి ఇది. పదిసార్లు ముఖాముఖిగా తలపడితే ఒక్కసారి మాత్రమే (2014, యూఎస్ ఓపెన్ సెమీస్) ఓడాడు రోజర్.
ఇవీ ఫెడరర్ ‘గ్రాండ్’ టైటిల్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్ (6): 2004, 2006, 2007, 2010, 2017, 2018
ఫ్రెంచ్ ఓపెన్ (1): 2009
వింబుల్డన్ (8): 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017
యూఎస్ ఓపెన్ (5): 2004, 2005, 2006, 2007, 2008
94: ఫెడరర్ కెరీర్‌లో గెలిచిన టైటిల్స్. అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఇవాన్ లెండిల్ సరసన ఫెడరర్ చేరాడు. 109 టైటిల్స్‌తో జిమ్మీ కానర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు.
3: ఓపెన్ శకంలో (1968 తర్వాత) 30 ఏళ్లు దాటిన తర్వాత నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన మూడో ప్లేయర్ ఫెడరర్. గతంలో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా), కెన్ రోజ్‌వెల్ (అమెరికా) మాత్రమే ఇలాంటి ఘనత సాధించారు.
చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నాను. గతేడాది నాకు గొప్పగా గడిచింది. అది ఇచ్చిన ఉత్సాహమే ఈ టైటిల్ కూడా. ఎక్కడలేని ఆనందాన్ని, అనుభూతినిచ్చింది. ఈ ఫైనల్ నాకు 2006 తుది పోరును గుర్తుకు తెచ్చింది. బగ్ధాటిస్‌తో జరిగిన ఆ పోరును, విజయాన్ని మర్చిపోలేను. ఈ ఫైనల్లోనూ అదే విధంగా పోరాడాను. అనుకున్నది సాధించాను. ఫైనల్‌దాకా అద్భుతంగా సాగింది. నా టీమ్ (సహాయక సిబ్బంది)కు కృతజ్ఞతలు. నేను గెలిచేందుకు వాళ్లు కష్టపడ్డారు.
–ఫెడరర్
Comments
Please login to add a commentAdd a comment