Australian open title
-
సెరెనా మరో అడుగు
మెల్బోర్న్: రెండేళ్ల క్రితం రెండు నెలల గర్భంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ మళ్లీ టైటిలే లక్ష్యంగా వేగం పెంచింది. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ రికార్డును సమం చేసేందుకు సిద్ధమైన ఆమె సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. టాప్‌సీడ్ హలెప్‌కు రెండో రౌండ్లోనే చావుతప్పి కన్నులొట్టపోయినంత పనైంది. ఆమె అతికష్టమ్మీద గట్టెక్కింది. వీనస్ విలియమ్స్, సీడెడ్ క్రీడాకారిణిలు ఒసాకా, స్వితోలినా, ప్లిస్కోవా మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ సీడ్ జొకోవిచ్ సునాయాస విజయంతో ముందంజ వేయగా... రావ్‌నిక్, నిషికొరి, జ్వెరెవ్ మూడో రౌండ్‌కు చేరారు. ‘అమ్మ’ అలవోకగా... మహిళల సింగిల్స్‌లో 16వ సీడ్‌గా బరిలోకి దిగిన అమెరికన్ దిగ్గజం సెరెనా రెండో రౌండ్లో దూకుడుగా ఆడింది. కోర్ట్ అంతా పాదరసంలా కదిలిన ఈ ‘అమ్మ’ 6–2, 6–2తో ఎజెని బౌచర్డ్ (కెనడా)పై విజయం సాధించింది. కేవలం గంటా 10 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. టాప్ సీడ్ హలెప్ (రుమేనియా)కు అన్‌సీడెడ్ సోఫియా కెనిన్ (అమెరికా) ముచ్చెమటలు పట్టించింది. చివరకు హలెప్ 6–3, 6–7 (5/7), 6–4తో కెనిన్‌పై గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది. మిగతా మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ నవొమి ఒసాకా (జపాన్) 6–2, 6–4తో తమర జిదన్సెక్ (స్లోవేనియా)పై, ఆరో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–1తో కుజ్మోవ (స్లోవేకియా)పై గెలుపొందారు. ఏడో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 6–1, 6–0తో బ్రింగిల్ (అమెరికా)ను ఓడించగా, వీనస్ విలియమ్స్ (అమెరికా) 6–3, 4–6, 6–0తో కార్నెట్ (ఫ్రాన్స్)పై, ముగురుజా (స్పెయిన్) 6–4, 6–7 (3/7), 7–5తో జొహానా కొంటా (ఇంగ్లండ్)పై నెగ్గింది. మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–4తో అనస్తాసియా పొటపొవా (రష్యా)పై విజయం సాధించింది. జోరుమీదున్న జొకో పురుషుల సింగిల్స్‌లో సెర్బియన్ స్టార్, టాప్ సీడ్ జొకోవిచ్ జోరు పెంచాడు. రెండో రౌండ్లో అతను 6–3, 7–5, 6–4తో జో విల్ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్)ను ఇంటిదారి పట్టించాడు. నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–6 (7/5), 6–4, 5–7, 6–7 (6/8), 6–1తో జెరిమి చార్డి (ఫ్రాన్స్)పై, ఎనిమిదో సీడ్ నిషికొరి (జపాన్) 6–3, 7–6 (8/6), 5–7, 5–7, 7–6 (10/7)తో కార్లోవిక్ (క్రొయేషియా)పై చెమటోడ్చి నెగ్గారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఆటగాడు అలెక్సి పొపిరిన్ (ఆస్ట్రేలియా) ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)కు షాకిచ్చాడు. 5–7, 4–6, 0–2తో వెనుకబడిన దశలో థీమ్ రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. 11వ సీడ్ బొర్నా కొరిచ్ (క్రొయేషియా) 6–4, 6–3, 6–4తో ఫుక్సోవిక్స్ (హంగేరి)పై, 12వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ) 7–6 (7/3), 6–3, 7–6 (7/5)తో మేయర్ (అర్జెంటీనా)పై గెలిచారు. -
అది గ్రేట్ కాదు.. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ గ్రేట్ రికార్డు..!
టెన్నిస్‌లో ఎవరైనా ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిస్తేనే కల సాకారమైందంటారు. మరి ఒక్కడే 20 గెలిస్తే జీవితమే సాఫల్యమైందనాలేమో! ఎందుకంటే 200 గ్రాండ్‌స్లామ్‌లు జరిగిన టెన్నిస్ చరిత్రలో ఒక్కడే పది శాతం ట్రోఫీలు ఎగరేసుకుపోతే అది గ్రేట్ కాదు... ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ గ్రేట్ రికార్డు అవుతుంది. మెల్బోర్న్లో స్విట్జర్లాండ్ సూపర్‌స్టార్ రోజర్ ఫెడరర్ అదే చేశాడు. బరిలో మేటి... పోటీలో ఘనాపాఠి. పోరాడితే ఎవ్వరికీ మింగుడు పడని ప్రత్యర్థి. నిలిస్తే గెలుస్తాడు. గెలిస్తే చరిత్ర సృష్టిస్తాడు. ఔను... ఈ చరిత్ర పుటలకెక్కుతుంది. కాబట్టి మిన్నకుండిపోయింది... లేదంటే ఆ చరిత్రకే కళ్లుంటే మురిపెంగా ఈ విశ్వవిజేతను తన్మయత్వంతో చూసేది. మెల్బోర్న్: చూస్తుంటే... గ్రాండ్‌స్లామ్ చరిత్రలో రోజర్ ఫెడరర్ తరతరాలకు చెరగని రికార్డును లిఖిస్తాడేమో! ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్ నిలబెట్టుకున్న ఈ డిఫెండింగ్ చాంపియన్ 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో టెన్నిస్ లోకాన్నే మురిపించాడు. వయసు మూడు పదులు దాటినా తనలో వాడి తగ్గలేదని తాజా విజయంతో మళ్లీ నిరూపించాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్విట్జర్లాండ్ లెజెండ్ ఫెడరర్ 6–2, 6–7 (5/7), 6–3, 3–6, 6–1తో ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై చెమటోడ్చి నెగ్గాడు. 36 ఏళ్ల రోజర్ తన కెరీర్లో 20వ టైటిల్ కోసం 3 గంటల 3 నిమిషాలు పోరాడాడు. పోరు ముగియగానే అదుపులేని ఆనందాన్ని, భావోద్వేగాన్ని దాచుకోలేకపోయిన ఫెడరర్ బిగ్గరగా ఏడ్చేశాడు. తనకు జేజేలు పలుకుతున్న స్టేడియంలోని ప్రేక్షకులకు ఆనంద బాష్పాలతో మాట కలిపాడు. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 40 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 20 కోట్ల 63 లక్షలు)... రన్నరప్ మారిన్ సిలిచ్‌కు 20 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 31 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 200వ గ్రాండ్‌స్లామ్... 30వ ఫైనల్... టెన్నిస్ చరిత్రలో ఇది 200వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ. ఇందులో 30వ ఫైనల్ ఆడిన ఫెడరర్ 20వ టైటిల్ గెలవడం నిజంగా అద్భుతమే కదా! ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతనికిది ఆరో టైటిల్... దీంతో ఇది వరకే ఈ ఘనత సాధించిన జొకోవిచ్ (సెర్బియా), అలనాటి ఆసీస్ దిగ్గజం రాయ్ ఎమర్సన్‌ల సరసన నిలిచాడు. అలుపెరగని ఈ పోరాట యోధుడు ఫైనల్ పోరును దూకుడుగానే ఆరంభించాడు. తొలి సెట్‌ను తనదైన శైలిలో గెలుచుకున్న ఫెడరర్‌కు రెండో సెట్లో క్రొయేషియన్ ప్రత్యర్థి నుంచి అనూహ్య పోటీ ఎదురైంది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ సెట్ చివరకు టైబ్రేక్‌కు దారి తీసింది. అక్కడా అదే తీరు కొనసాగడంతో స్టేడియంలోని ప్రేక్షకులు ఒళ్లంతా కళ్లు చేసుకున్నారు. చివరకు సెట్ కోల్పోయిన ఫెడరర్ మూడో సెట్లో పుంజుకొని ఆడాడు. పోటీ లేకుండానే 6–3తో ఈ సెట్‌ను ముగించాడు. నాలుగో సెట్ ఓడటంతో నిర్ణాయక ఐదో సెట్లో ఫెడరర్ తన అనుభవాన్నంతా రంగరించి తేలిగ్గా ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఆరోసారి ఆస్ట్రేలియన్ ట్రోఫీని ముద్దాడాడు. ఫైనల్లో ప్రత్యర్థి సిలిచ్ సర్వీస్‌ను ఆరు సార్లు బ్రేక్ చేసిన ఫెడరర్ 24 ఏస్‌లు సంధించాడు. సిలిచ్ 16 ఏస్‌లు సంధించాడు. ఎండవేడిమి... ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు పెరగడంతో టెన్నిస్ కోర్టు పైకప్పును మూసి ఆడించారు. మీకు తెలుసా... 332-52 గ్రాండ్‌స్లామ్ కెరీర్లో ఫెడరర్ జయాపజయాల రికార్డు ఇది. మెల్‌బోర్న్‌లోనూ అతనికి ఘనమైన రికార్డే (94–13) ఉంది. 10% చరిత్రలో పది శాతం గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు రోజర్ ఇంట్లోనే ఉన్నాయి. 91 సిలిచ్‌పై ఫెడరర్ పైచేయి ఇది. పదిసార్లు ముఖాముఖిగా తలపడితే ఒక్కసారి మాత్రమే (2014, యూఎస్ ఓపెన్ సెమీస్) ఓడాడు రోజర్. ఇవీ ఫెడరర్ ‘గ్రాండ్’ టైటిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ (6): 2004, 2006, 2007, 2010, 2017, 2018 ఫ్రెంచ్ ఓపెన్ (1): 2009 వింబుల్డన్ (8): 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017 యూఎస్ ఓపెన్ (5): 2004, 2005, 2006, 2007, 2008 94: ఫెడరర్ కెరీర్లో గెలిచిన టైటిల్స్. అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఇవాన్ లెండిల్ సరసన ఫెడరర్ చేరాడు. 109 టైటిల్స్‌తో జిమ్మీ కానర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. 3: ఓపెన్ శకంలో (1968 తర్వాత) 30 ఏళ్లు దాటిన తర్వాత నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన మూడో ప్లేయర్ ఫెడరర్. గతంలో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా), కెన్ రోజ్‌వెల్ (అమెరికా) మాత్రమే ఇలాంటి ఘనత సాధించారు. చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నాను. గతేడాది నాకు గొప్పగా గడిచింది. అది ఇచ్చిన ఉత్సాహమే ఈ టైటిల్ కూడా. ఎక్కడలేని ఆనందాన్ని, అనుభూతినిచ్చింది. ఈ ఫైనల్ నాకు 2006 తుది పోరును గుర్తుకు తెచ్చింది. బగ్ధాటిస్తో జరిగిన ఆ పోరును, విజయాన్ని మర్చిపోలేను. ఈ ఫైనల్లోనూ అదే విధంగా పోరాడాను. అనుకున్నది సాధించాను. ఫైనల్‌దాకా అద్భుతంగా సాగింది. నా టీమ్ (సహాయక సిబ్బంది)కు కృతజ్ఞతలు. నేను గెలిచేందుకు వాళ్లు కష్టపడ్డారు. –ఫెడరర్ -
హరీందర్‌కు మరో టైటిల్
చెన్నై: భారత అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారుడు హరీందర్ పాల్ సంధూ తన జోరును కొనసాగిస్తున్నాడు. గత వారమే ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన హరీందర్ తాజాగా విక్టోరియన్ ఓపెన్ టైటిల్‌నూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ హరీందర్ 12–14, 11–3, 11–4, 11–7తో టాప్ సీడ్ రెక్స్ హెడ్రిక్ (ఆస్ట్రేలియా)పై సంచలన విజయాన్ని సాధించాడు. 28 ఏళ్ల హరీందర్‌కు ఈ ఏడాదిలో ఇది నాలుగో టైటిల్ కావడం విశేషం. ఫైనల్‌కు చేరే క్రమంలో ఒక్క గేమ్నూ కూడా కోల్పోని భారత స్టార్ తుది పోరును 77 నిమిషాల్లో ముగించాడు. -
ముర్రే మెరిసె...
♦ ఏడేళ్లలో ఆరోసారి సెమీస్‌కు ♦ తొలిసారి సెమీస్‌లోకి రావ్‌నిచ్ మెల్బోర్న్: అందని ద్రాక్షగా ఊరిస్తోన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే... తన విజయపరంపరను కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ముర్రే 6-3, 6-7 (5/7), 6-2, 6-3తో ఎనిమిదో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)పై గెలుపొందాడు. ఈ విజయంతో ముర్రే గత ఏడేళ్లలో ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. 2010, 2011, 2013, 2015లలో ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచిన ముర్రే ఇదే జోరును కొనసాగిస్తే ఐదోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఫైనల్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో 13వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో ముర్రే తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో రావ్‌నిచ్ 6-3, 3-6, 6-3, 6-4తో 23వ సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. తద్వారా కెనడా తరఫున ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ముర్రే, రావ్‌నిచ్ ముఖాముఖి రికార్డులో 3-3తో సమఉజ్జీగా ఉండటంతో ఈసారి సెమీఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగే అవకాశముంది. ఫెరర్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముర్రేకు రెండో సెట్లో మినహా అంతగా పోటీ ఎదురుకాలేదు. మూడో సెట్లో స్కోరు 3-1 వద్ద ఉన్నపుడు భారీ వర్ష సూచనతో ముందు జాగ్రత్తగా నిర్వాహకులు ఈ మ్యాచ్ వేదికైన రాడ్‌లేవర్ ఎరీనా పైకప్పును మూసేయాలని నిర్ణయించారు. దాంతో మ్యాచ్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. పైకప్పు మూసిన తర్వాత ముర్రే తన దూకుడును కొనసాగించి 4-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. నాలుగో సెట్లో ఫెరర్ సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసిన ముర్రే తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. 39 ఏళ్ల తర్వాత...: మహిళల సింగిల్స్ విభాగంలో బ్రిటన్ యువతార జొహానా కొంటా సంచలన జైత్రయాత్ర కొనసాగుతోంది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన కొంటా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. తద్వారా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 39 ఏళ్ల తర్వాత సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి బ్రిటన్ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. చివరిసారి బ్రిటన్ తరఫున 1977లో స్యు బార్కర్ ఈ టోర్నీలో సెమీస్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో జొహానా కొంటా 6-4, 6-1తో క్వాలిఫయర్ జాంగ్ షుయె (చైనా)పై గెలిచింది. హంగేరి జాతీయత ఉన్న తల్లిదండ్రులకు 1991లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించిన కొంటా 2005లో బ్రిటన్‌కు వలస వెళ్లింది. 2012లో బ్రిటన్ పౌరసత్వం వచ్చేవరకు కొంటా ఆస్ట్రేలియాకి ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం కొంటా వద్ద మూడు దేశాల (హంగేరి, ఆస్ట్రేలియా, బ్రిటన్) పాస్‌పోర్టులు ఉండటం విశేషం. మరో క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ కెర్బర్ 6-3, 7-5తో 14వ సీడ్, మాజీ నంబర్‌వన్, మాజీ చాంపియన్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై సంచలన విజయం సాధించి సెమీస్‌లో జొహానా కొంటాతో పోరుకు సిద్ధమైంది. కొంటా, కెర్బర్లలో ఎవరు గెలిచినా తమ కెరీర్లో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంటారు. గతంలో కెర్బర్ 2011లో యూ ఎస్ ఓపెన్‌లో, 2012లో వింబుల్డన్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని నిష్ర్కమించింది. మరోవైపు కొంటా గతంలో ఒక్కసారి కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది. నేడు జొకోవిచ్ ఁ ఫెడరర్: పురుషుల సింగిల్స్ విభాగంలో గురువారం తొలి సెమీఫైనల్ జరగనుంది. టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), మాజీ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. ముఖాముఖి రికార్డులో వీరిద్దరూ 22-22తో సమఉజ్జీగా ఉన్నారు. గురువారమే జరిగే మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)తో సెరెనా విలియమ్స్ (అమెరికా); జొహానా కొంటాతో ఎంజెలిక్ కెర్బర్ తలపడతారు. -
ఒక్కడే ‘ఐదు’
అంచనాలను నిజం చేస్తూ... పురుషుల టెన్నిస్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ... సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అదుర్స్ అనిపించాడు. టెన్నిస్‌లో ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఐదోసారి నెగ్గిన తొలి క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. మెల్బోర్న్ పార్క్‌లో తన విజయపరంపరను కొనసాగిస్తూ ఫైనల్‌కు చేరిన ఐదోసారీ విజేతగా నిలిచి ఔరా అనిపించాడు. జొకోవిచ్ కొత్త చరిత్ర ⇒ ఐదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ వశం ⇒ ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు ⇒ రూ. 14 కోట్ల 96 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ⇒ ముర్రేకు నాలుగోసారీ నిరాశే మెల్బోర్న్: ఫెడరర్, రాఫెల్ నాదల్ లాంటి మాజీ చాంపియన్స్ క్వార్టర్ ఫైనల్లోపే నిష్ర్కమించిన చోట... ఆద్యంతం నిలకడగా ఆడిన ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) తన హోదాకు, ర్యాంక్‌కు న్యాయం చేస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం 3 గంటల 39 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 7-6 (7/5), 6-7 (4/7), 6-3, 6-0తో ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై విజయం సాధించాడు. తద్వారా ఓపెన్ శకంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన తొలి క్రీడాకారుడిగా జొకోవిచ్ కొత్త చరిత్రను లిఖించాడు. గతంలో అతను 2008, 2011, 2012, 2013లో కూడా విజేతగా నిలిచాడు. మరోసారి నెగ్గితే... ఈ టోర్నీని అత్యధికంగా ఆరుసార్లు సాధించిన ఆస్ట్రేలియా దిగ్గజం రాయ్ ఎమర్సన్ సరసన జొకోవిచ్ నిలుస్తాడు. ఓపెన్ శకం ప్రారంభం కాకముందు రాయ్ ఎమర్సన్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా జొకోవిచ్ కెరీర్లో ఇది ఎనిమిదో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. అతను రెండుసార్లు వింబుల్డన్, ఒకసారి యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌నూ నెగ్గితే జొకోవిచ్ ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేసుకుంటాడు. చాంపియన్ జొకోవిచ్‌కు 31 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 14 కోట్ల 96 లక్షలు); రన్నరప్ ఆండీ ముర్రేకు 15 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 7 కోట్ల 48 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మూడోసారి తలపడిన జొకోవిచ్, ముర్రే ప్రతి పాయింట్‌కూ పోరాడారు. పలుమార్లు సుదీర్ఘ ర్యాలీలతో ఈ ఇద్దరూ అలరించారు. తొలి రెండు సెట్లలో ఇద్దరూ తమ సర్వీస్‌లను రెండేసిసార్లు కోల్పోయారు. 72 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్‌ను టైబ్రేక్‌లో జొకోవిచ్ దక్కించుకోగా... 80 నిమిషాలపాటు జరిగిన రెండో సెట్‌ను టైబ్రేక్‌లో ముర్రే గెల్చుకున్నాడు. మూడో సెట్లోనూ తొలి ఆరు గేమ్‌ల వరకు ఇద్దరూ సమంగా నిలిచారు. అయితే ఏడో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్న ముర్రే ఊహించని విధంగా ఎనిమిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కోల్పోయాడు. తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 39 నిమిషాల్లో మూడో సెట్‌ను నెగ్గాడు. నాలుగో సెట్లో జొకోవిచ్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. ముర్రే సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ 28 నిమిషాల్లోనే ఈ సెట్‌ను దక్కించుకొని విజేతగా నిలిచాడు. జొకోవిచ్ 8 ఏస్‌లు సంధించడంతోపాటు ముర్రే సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేశాడు. 40 అనవసర తప్పిదాలు చేసిన అతను నెట్‌వద్దకు 37 సార్లు వచ్చి 26 సార్లు పాయింట్లు సాధించాడు. ఈ ఓటమితో ఆండీ ముర్రేకు నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. ఓపెన్ శకంలో ఈ టోర్నీలో నాలుగుసార్లు ఫైనల్ చేరుకున్నప్పటికీ ఒక్కసారీ టైటిల్ సాధించలేకపోయిన తొలి ప్లేయర్‌గా ముర్రే గుర్తింపు పొందాడు. -
సెరెనా ' సిక్సర్ '
ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ హస్తగతం కెరీర్లో 19వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ వశం ఫైనల్లో షరపోవాపై విజయం రూ. 14 కోట్ల 96 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ఆనవాయితీ కొనసాగిస్తూ... ఆధిపత్యం చలాయిస్తూ... విజయకాంక్షకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తూ... అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ మరో అద్భుతం చేసింది. గతంలో ఫైనల్‌కు చేరిన ఐదుసార్లూ టైటిల్ నెగ్గిన ఈ ప్రపంచ నంబర్‌వన్ ఆరోసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తన చిరకాల ప్రత్యర్థి షరపోవాపై వరుసగా 16వ విజయాన్ని సాధించడంతోపాటు ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కెరీర్లో 19వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన 33 ఏళ్ల సెరెనా ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు సాధించిన వారి జాబితాలో ఉమ్మడిగా మూడో స్థానానికి చేరుకుంది. మెల్బోర్న్: టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ... నంబర్‌వన్ ర్యాంక్‌కు గౌరవం నిలబెడుతూ... అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. రాడ్‌లేవర్ ఎరీనాలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా 6-3, 7-6 (7/5)తో రెండో సీడ్ మరియా షరపోవా (రష్యా)పై విజయం సాధించింది. గంటా 50 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సెరెనా 18 ఏస్‌లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన సెరెనా తన సర్వీస్‌ను ఒకసారి మాత్రమే కోల్పోయింది. 33 ఏళ్ల సెరెనాకిది ఆరో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. మ్యాచ్ తొలి గేమ్‌లోనే షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. పదునైన సర్వీస్‌లు, శక్తివంతమైన షాట్లు, కోర్టులో చురుకైన కదలికలతో ఈ అమెరికా స్టార్ దూసుకుపోయింది. స్కోరు 3-2 వద్ద ఉన్నప్పుడు వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. పైకప్పు మూశాక మ్యాచ్‌ను కొనసాగించినప్పటికీ సెరెనా దూకుడు ఏమాత్రం తగ్గలేదు. 5-2తో ముందంజ వేసినా ఆమె అదే జోరులో తొలి సెట్‌ను 47 నిమిషాల్లో 6-3తో దక్కించుకుంది. రెండో సెట్లో ఇద్దరూ పాయింట్ పాయింట్‌కూ పోరాడారు. ఇద్దరూ తమ సర్వీస్లనునిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. కీలకమైన టైబ్రేక్‌లో సెరెనా 4-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. షరపోవా తేరుకునే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. తన సర్వీస్‌లో ఏస్‌తో మ్యాచ్‌ను ముగించి సెరెనా విజేతగా అవతరించింది. దీంతో 2004 నుంచి షరపోవా చేతిలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోని రికార్డును కొనసాగించింది. విజేతగా నిలిచిన సెరెనాకు 31 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 14 కోట్ల 96 లక్షలు); రన్నరప్ షరపోవాకు 15 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 7 కోట్ల 48 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గతంలో ఫైనల్‌కు చేరిన ఐదు సార్లూ సెరెనా (2003, 2005, 2007, 2009, 2010) టైటిల్ నెగ్గింది. ఓపెన్ శకంలో (1968 తర్వాత) పెద్ద వయస్సులో (33 ఏళ్లు) టైటిల్ సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. మహిళల విభాగంలో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన వారి జాబితాలో హెలెన్ విల్స్ మూడీ (అమెరికా)తో కలిసి సెరెనా ఉమ్మడిగా మూడో స్థానంలో ఉంది. మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా-24 టైటిల్స్), స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ-22 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఓపెన్ శకంలో స్టెఫీ గ్రాఫ్ తర్వాత జాబితాలో సెరెనా రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు సెరెనా ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్; రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ (2002, 2013లలో); ఐదుసార్లు వింబుల్డన్ (2002, 2003, 2009, 2010, 2012లలో); ఆరుసార్లు యూఎస్ ఓపెన్ (1999, 2002, 2008, 2012, 2013, 2014లలో) టైటిల్స్‌ను సాధించింది. తన కెరీర్లో షరపోవా బేసి సంఖ్య ఏడాదిలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గలేదు. గతంలో ఆమె నెగ్గిన ఐదు టైటిల్స్ (2008-ఆస్ట్రేలియన్ ఓపెన్, 2004-వింబుల్డన్, 2012, 2014-ఫ్రెంచ్ ఓపెన్, 2006-యూఎస్ ఓపెన్) సరి సంఖ్య ఏడాదిలోనే వచ్చాయి. 2007, 2012, 2015 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో; 2011 వింబుల్డన్‌లో, 2013 ఫ్రెంచ్ ఓపెన్‌లో షరపోవా ఫైనల్‌కు చేరినా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. బొలెలీ-ఫాగ్నిని జంటకు డబుల్స్ టైటిల్ పురుషుల డబుల్స్‌లో సిమోన్ బొలెలీ-ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో ఈ ద్వయం 6-4, 6-4తో హెర్బర్ట్-నికొలస్ మహుట్ (ఫ్రాన్స్) జోడీని ఓడించి తమ కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌ను నెగ్గింది. పుట్టుకతోనే నేను ధనవంతురాలిని కాదు. కానీ స్ఫూర్తి, మద్దతు ఇచ్చే అంశాల్లో నా కుటుంబ సభ్యులు ఉన్నతంగా నిలిచారు. కెరీర్లో 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తానని ఏనాడూ ఊహించలేదు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారు, ఏదైనా కావాలనుకున్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులెత్తేయకూడదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎవరికి మీరు స్ఫూర్తిగా నిలుస్తారో చెప్పలేం. -సెరెనా -
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సైనా సంచలనం!
-
సైనా... ‘సూపర్ 7’
ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సొంతం ఫైనల్లో కరోలినాపై గెలుపు ఖాతాలో రూ. 34 లక్షల ప్రైజ్‌మనీ కెరీర్లో ఏడో సూపర్ సిరీస్ టైటిల్ ఈ ఏడాది రెండో విజయం సిడ్నీ: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చాన్నాళ్ల తర్వాత తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్, ఆరో సీడ్ సైనా 21-18, 21-11 తేడాతో కరోలినా మారిన్ (స్పెయిన్)పై ఘన విజయం సాధించింది. ఆద్యంతం ఆధిక్యం కనబర్చిన సైనా 43 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసింది. కెరీర్లో తొలి సూపర్ సిరీస్ ఫైనల్ ఆడుతున్న 21 ఏళ్ల మారిన్... ప్రత్యర్థి వేగం, దూకుడు ముందు నిలువలేకపోయింది. తొలి గేమ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్, ప్రస్తుత యూరోపియన్ చాంపియన్ అయిన మారిన్ నుంచి కొంత ప్రతిఘటన ఎదుర్కొన్న సైనా, రెండో గేమ్‌లో ఎలాంటి అవకాశం కూడా ఇవ్వలేదు. విజేతగా నిలిచిన సైనాకు 56,250 డాలర్లు (దాదాపు రూ. 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆది నుంచే జోరు... గతంలో కరోలినాతో తలపడిన ఏకైక మ్యాచ్‌లో గెలిచిన సైనా, ఈసారి కూడా తన జోరు కొనసాగించింది. తొలి గేమ్‌లో చక్కటి వాలీలతో 5-2తో ముందంజ వేసింది. ఆ తర్వాత నెట్ వద్ద సైనా చక్కటి ఆటతీరు కనబర్చగా, మారిన్ చేసిన పొరపాట్లతో స్కోరు 11-7కు చేరింది. విరామం తర్వాత కరోలినా మెరుగైన ఆటతీరు కనబర్చి స్కోరు సమం చేసినా... ఆ తర్వాత నిలకడ ప్రదర్శించలేకపోయింది. ఫలితంగా సైనా వరుస పాయింట్లుతో దూసుకెళ్లి 23 నిమిషాల్లో గేమ్‌ను ముగించింది. ఏకపక్షం... ఆరంభంలో ఉత్సాహంగా ఆడిన మారిన్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ దశలో తిరుగులేని స్మాష్‌లతో చెలరేగిన సైనా, వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి విరామ సమయానికి స్కోరును 11-4 వరకు తీసుకెళ్లింది. ఆ తర్వాత కూడా భారత షట్లర్ తగ్గలేదు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి 19-9 వరకు దూసుకుపోయింది. ఈ దశలో సైనా తప్పిదాలతో స్పెయిన్ ప్లేయర్‌కు రెండు పాయింట్లు లభించాయి. చివరకు మారిన్ కొట్టిన స్మాష్.. కోర్టు బయట పడటంతో టైటిల్ సైనా నెహ్వాల్ సొంతమైంది. కమాన్... రెండో గేమ్‌లో ఒక దశలో తనను తాను ఉత్సాహపరచుకునే ప్రయత్నంలో సైనా పదే పదే ‘కమాన్ సైనా’ అంటూ అరుస్తూ వచ్చింది. అయితే ర్యాలీల సమయంలో అది ఇబ్బందికరంగా మారడంతో చైర్ అంపైర్‌కు ప్రత్యర్థి ఫిర్యాదు చేసింది. ఈ దశలో వీరిద్దరి మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగింది. అయితే అంపైర్ దానిని పెద్దగా పట్టించుకోకుండా ఆట కొనసాగించమని కరోలినాకు సూచించారు. విశేషాలు... ఈ ఏడాది ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ (లక్నోలో) టోర్నీ సాధించిన సైనాకు ఇది రెండో విజయం. సైనా కెరీర్లో ఇది ఏడో సూపర్ సిరీస్ టైటిల్. ఇండోనేసియా సూపర్ సిరీస్‌ను 3 సార్లు (2009, 2010, 2012) గెలిచిన సైనా... సింగపూర్ (2010), డెన్మార్క్ (2012), హాంకాంగ్ (2010), ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్‌లలో ఒక్కోసారి విజేతగా నిలిచింది. 2012 అక్టోబరులో డెన్మార్క్ ఓపెన్ నెగ్గాక దాదాపు 20 నెలల తర్వాత ఇప్పుడు మరో సూపర్ సిరీస్‌ను సైనా గెలుచుకుంది. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో కలిపి మొత్తం ఎనిమిది సూపర్ సిరీస్ టోర్నీలు జరిగాయి. ఇందులో ఏడు టైటిల్స్ చైనా క్రీడాకారిణులే నెగ్గగా... ఈ సారి సైనా గెలవడం విశేషం. సరైన సమయంలో... సూపర్ సిరీస్ విజయంతో చాలా సంతోషంగా ఉన్నాను. నా కఠిన శ్రమకు తగిన ఫలితం లభించింది. నేను గాయం బారిన పడకుండా నా కోచ్‌లు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. కీలకమైన సమయంలో ఈ విజయం నాకు దక్కింది. కెరీర్లో ఇది మరో కీలక సంవత్సరం కానుంది. కామన్వెల్త్ క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా నేను బరిలోకి దిగుతున్నాను. ఆసియా క్రీడల్లో కూడా రాణించాల్సి ఉంది. కాబట్టి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. - సైనా నెహ్వాల్