ముర్రే మెరిసె... | Johanna Konta & Andy Murray reach Australian Open semi-finals | Sakshi
Sakshi News home page

ముర్రే మెరిసె...

Published Thu, Jan 28 2016 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

ముర్రే  మెరిసె...

ముర్రే మెరిసె...

ఏడేళ్లలో ఆరోసారి సెమీస్‌కు
తొలిసారి సెమీస్‌లోకి రావ్‌నిచ్

మెల్‌బోర్న్: అందని ద్రాక్షగా ఊరిస్తోన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే... తన విజయపరంపరను కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.

బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ముర్రే 6-3, 6-7 (5/7), 6-2, 6-3తో ఎనిమిదో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)పై గెలుపొందాడు. ఈ విజయంతో ముర్రే గత ఏడేళ్లలో ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. 2010, 2011, 2013, 2015లలో ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచిన ముర్రే ఇదే జోరును కొనసాగిస్తే ఐదోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఫైనల్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో 13వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో ముర్రే తలపడతాడు.

మరో క్వార్టర్ ఫైనల్లో రావ్‌నిచ్ 6-3, 3-6, 6-3, 6-4తో 23వ సీడ్ గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. తద్వారా కెనడా తరఫున ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ముర్రే, రావ్‌నిచ్ ముఖాముఖి రికార్డులో 3-3తో సమఉజ్జీగా ఉండటంతో ఈసారి సెమీఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగే అవకాశముంది.

 ఫెరర్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముర్రేకు రెండో సెట్‌లో మినహా అంతగా పోటీ ఎదురుకాలేదు. మూడో సెట్‌లో స్కోరు 3-1 వద్ద ఉన్నపుడు భారీ వర్ష సూచనతో ముందు జాగ్రత్తగా నిర్వాహకులు ఈ మ్యాచ్ వేదికైన రాడ్‌లేవర్ ఎరీనా పైకప్పును మూసేయాలని నిర్ణయించారు. దాంతో మ్యాచ్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. పైకప్పు మూసిన తర్వాత ముర్రే తన దూకుడును కొనసాగించి 4-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. నాలుగో సెట్‌లో ఫెరర్ సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసిన ముర్రే తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.

 39 ఏళ్ల తర్వాత...: మహిళల సింగిల్స్ విభాగంలో బ్రిటన్ యువతార జొహానా కొంటా సంచలన జైత్రయాత్ర కొనసాగుతోంది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన కొంటా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. తద్వారా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 39 ఏళ్ల తర్వాత సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి బ్రిటన్ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. చివరిసారి బ్రిటన్ తరఫున 1977లో స్యు బార్కర్ ఈ టోర్నీలో సెమీస్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో జొహానా కొంటా 6-4, 6-1తో క్వాలిఫయర్ జాంగ్ షుయె (చైనా)పై గెలిచింది. హంగేరి జాతీయత ఉన్న తల్లిదండ్రులకు 1991లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించిన కొంటా 2005లో బ్రిటన్‌కు వలస వెళ్లింది. 2012లో బ్రిటన్ పౌరసత్వం వచ్చేవరకు కొంటా ఆస్ట్రేలియాకి ప్రాతినిధ్యం వహించింది.

  ప్రస్తుతం కొంటా వద్ద మూడు దేశాల (హంగేరి, ఆస్ట్రేలియా, బ్రిటన్) పాస్‌పోర్టులు ఉండటం విశేషం. మరో క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ కెర్బర్ 6-3, 7-5తో 14వ సీడ్, మాజీ నంబర్‌వన్, మాజీ చాంపియన్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై సంచలన విజయం సాధించి సెమీస్‌లో జొహానా కొంటాతో పోరుకు సిద్ధమైంది. కొంటా, కెర్బర్‌లలో ఎవరు గెలిచినా తమ కెరీర్‌లో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంటారు. గతంలో కెర్బర్ 2011లో యూ ఎస్ ఓపెన్‌లో, 2012లో వింబుల్డన్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని నిష్ర్కమించింది. మరోవైపు కొంటా గతంలో ఒక్కసారి కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది.

నేడు జొకోవిచ్ ఁ ఫెడరర్: పురుషుల సింగిల్స్ విభాగంలో గురువారం తొలి సెమీఫైనల్ జరగనుంది. టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), మాజీ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. ముఖాముఖి రికార్డులో వీరిద్దరూ 22-22తో సమఉజ్జీగా ఉన్నారు. గురువారమే జరిగే మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)తో సెరెనా విలియమ్స్ (అమెరికా); జొహానా కొంటాతో ఎంజెలిక్ కెర్బర్ తలపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement