జెమీమా రోడ్రిగ్స్ వ్యాఖ్య
ముంబై: ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని చూసి తాము ఏ దశలోనూ భయపడలేదని, సాధించగలమనే నమ్మకంతోనే బరిలోకి దిగామని భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ వెల్లడించింది. ఈ పోరులో 134 బంతుల్లో 127 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్‌తో జెమీమా మన జట్టును గెలిపించింది. ‘ఆ్రస్టేలియా జట్టు ఇన్నింగ్స్ ప్రారంభమైన తీరు, చివరకు వారు సాధించిన స్కోరును చూస్తే కనీసం 30 పరుగులు తక్కువగా చేశారని చెప్పగలను.
డీవై పాటిల్ స్టేడియం పిచ్‌పై ఎలాంటి లక్ష్యమైనా ఛేదించవచ్చని మాకు బాగా తెలుసు. కొద్ది సేపు క్రీజ్‌లో ఉండి నిలదొక్కుకుంటే పరుగులు వాటంతట అవే వస్తాయని కూడా మాకు ఇక్కడ ఉన్న అనుభవం చెబుతుంది. అందుకే ముందు పట్టుదలగా నిలబడటంపైనే దృష్టి పెట్టాను’ అని జెమీమా వ్యాఖ్యానించింది. తాను, హర్మన్ కలిసి మ్యాచ్‌ను ముగించాలని గట్టిగా అనుకున్నామని...అయితే హర్మన్ అవుట్‌తో తన బాధ్యత మరింత పెరిగిందని ఆమె పేర్కొంది.
‘ఒక దశలో నేను బాగా అలసిపోయి ఏకాగ్రత కోల్పోతూ వచ్చాను. అయితే హర్మన్ అవుట్ కావడంతో మళ్లీ పరిస్థితి మారిపోయింది. ఇది ఒక రకంగా నాకు మేలు చేసింది. ఆమె పరుగులు కూడా నేను చేయాల్సి ఉందని అనిపించింది. దాంతో మళ్లీ సరైన స్థితికి వచ్చి జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాను’ అని జెమీమా చెప్పింది.


