ఒక్కడే ‘ఐదు’ | Novak Djokovic Beats Andy Murray for Australian Open Title | Sakshi
Sakshi News home page

ఒక్కడే ‘ఐదు’

Published Mon, Feb 2 2015 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

ఒక్కడే ‘ఐదు’

ఒక్కడే ‘ఐదు’

అంచనాలను నిజం చేస్తూ... పురుషుల టెన్నిస్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ... సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అదుర్స్ అనిపించాడు. టెన్నిస్‌లో ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఐదోసారి నెగ్గిన తొలి క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. మెల్‌బోర్న్ పార్క్‌లో తన విజయపరంపరను కొనసాగిస్తూ ఫైనల్‌కు చేరిన ఐదోసారీ విజేతగా నిలిచి ఔరా అనిపించాడు.
 
జొకోవిచ్ కొత్త చరిత్ర

ఐదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ వశం
ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు
రూ. 14 కోట్ల 96 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
ముర్రేకు నాలుగోసారీ నిరాశే

మెల్‌బోర్న్: ఫెడరర్, రాఫెల్ నాదల్ లాంటి మాజీ చాంపియన్స్ క్వార్టర్ ఫైనల్లోపే నిష్ర్కమించిన చోట... ఆద్యంతం నిలకడగా ఆడిన ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) తన హోదాకు, ర్యాంక్‌కు న్యాయం చేస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం 3 గంటల 39 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 7-6 (7/5), 6-7 (4/7), 6-3, 6-0తో ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై విజయం సాధించాడు. తద్వారా ఓపెన్ శకంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన తొలి క్రీడాకారుడిగా జొకోవిచ్ కొత్త చరిత్రను లిఖించాడు.

గతంలో అతను 2008, 2011, 2012, 2013లో కూడా విజేతగా నిలిచాడు. మరోసారి నెగ్గితే... ఈ టోర్నీని అత్యధికంగా ఆరుసార్లు సాధించిన ఆస్ట్రేలియా దిగ్గజం రాయ్ ఎమర్సన్ సరసన జొకోవిచ్ నిలుస్తాడు. ఓపెన్ శకం ప్రారంభం కాకముందు రాయ్ ఎమర్సన్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా జొకోవిచ్ కెరీర్‌లో ఇది ఎనిమిదో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. అతను రెండుసార్లు వింబుల్డన్, ఒకసారి యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌నూ నెగ్గితే జొకోవిచ్ ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేసుకుంటాడు. చాంపియన్ జొకోవిచ్‌కు 31 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 14 కోట్ల 96 లక్షలు); రన్నరప్ ఆండీ ముర్రేకు 15 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 7 కోట్ల 48 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
 
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మూడోసారి తలపడిన జొకోవిచ్, ముర్రే ప్రతి పాయింట్‌కూ పోరాడారు. పలుమార్లు సుదీర్ఘ ర్యాలీలతో ఈ ఇద్దరూ అలరించారు. తొలి రెండు సెట్‌లలో ఇద్దరూ తమ సర్వీస్‌లను రెండేసిసార్లు కోల్పోయారు. 72 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్‌ను టైబ్రేక్‌లో జొకోవిచ్ దక్కించుకోగా... 80 నిమిషాలపాటు జరిగిన రెండో సెట్‌ను టైబ్రేక్‌లో ముర్రే గెల్చుకున్నాడు. మూడో సెట్‌లోనూ తొలి ఆరు గేమ్‌ల వరకు ఇద్దరూ సమంగా నిలిచారు. అయితే ఏడో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్న ముర్రే ఊహించని విధంగా ఎనిమిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కోల్పోయాడు.

తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 39 నిమిషాల్లో మూడో సెట్‌ను నెగ్గాడు. నాలుగో సెట్‌లో జొకోవిచ్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. ముర్రే సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ 28 నిమిషాల్లోనే ఈ సెట్‌ను దక్కించుకొని విజేతగా నిలిచాడు. జొకోవిచ్ 8 ఏస్‌లు సంధించడంతోపాటు ముర్రే సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేశాడు. 40 అనవసర తప్పిదాలు చేసిన అతను నెట్‌వద్దకు 37 సార్లు వచ్చి 26 సార్లు పాయింట్లు సాధించాడు. ఈ ఓటమితో ఆండీ ముర్రేకు నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. ఓపెన్ శకంలో ఈ టోర్నీలో నాలుగుసార్లు ఫైనల్ చేరుకున్నప్పటికీ ఒక్కసారీ టైటిల్ సాధించలేకపోయిన తొలి ప్లేయర్‌గా ముర్రే గుర్తింపు పొందాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement