సెరెనా ' సిక్సర్ ' | Serena Williams beats Maria Sharapova to win Australian Open | Sakshi
Sakshi News home page

సెరెనా ' సిక్సర్ '

Published Sun, Feb 1 2015 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

సెరెనా ' సిక్సర్ '

సెరెనా ' సిక్సర్ '

ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ హస్తగతం
కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ వశం
ఫైనల్లో షరపోవాపై విజయం
రూ. 14 కోట్ల 96 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
 

 ఆనవాయితీ కొనసాగిస్తూ... ఆధిపత్యం చలాయిస్తూ... విజయకాంక్షకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తూ... అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ మరో అద్భుతం చేసింది. గతంలో ఫైనల్‌కు చేరిన ఐదుసార్లూ టైటిల్ నెగ్గిన ఈ ప్రపంచ నంబర్‌వన్ ఆరోసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తన చిరకాల ప్రత్యర్థి షరపోవాపై వరుసగా 16వ విజయాన్ని సాధించడంతోపాటు ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన 33 ఏళ్ల సెరెనా ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు సాధించిన వారి జాబితాలో ఉమ్మడిగా మూడో స్థానానికి చేరుకుంది.
 
 మెల్‌బోర్న్: టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ... నంబర్‌వన్ ర్యాంక్‌కు గౌరవం నిలబెడుతూ... అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. రాడ్‌లేవర్ ఎరీనాలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా 6-3, 7-6 (7/5)తో రెండో సీడ్ మరియా షరపోవా (రష్యా)పై విజయం సాధించింది. గంటా 50 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సెరెనా 18 ఏస్‌లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన సెరెనా తన సర్వీస్‌ను ఒకసారి మాత్రమే కోల్పోయింది. 33 ఏళ్ల సెరెనాకిది ఆరో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్.
  మ్యాచ్ తొలి గేమ్‌లోనే షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. పదునైన సర్వీస్‌లు, శక్తివంతమైన షాట్‌లు, కోర్టులో చురుకైన కదలికలతో ఈ అమెరికా స్టార్ దూసుకుపోయింది. స్కోరు 3-2 వద్ద ఉన్నప్పుడు వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. పైకప్పు మూశాక మ్యాచ్‌ను కొనసాగించినప్పటికీ సెరెనా దూకుడు ఏమాత్రం తగ్గలేదు. 5-2తో ముందంజ వేసినా ఆమె అదే జోరులో తొలి సెట్‌ను 47 నిమిషాల్లో 6-3తో దక్కించుకుంది.

రెండో సెట్‌లో ఇద్దరూ పాయింట్ పాయింట్‌కూ పోరాడారు. ఇద్దరూ తమ సర్వీస్‌లనునిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. కీలకమైన టైబ్రేక్‌లో సెరెనా 4-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. షరపోవా తేరుకునే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. తన సర్వీస్‌లో ఏస్‌తో మ్యాచ్‌ను ముగించి సెరెనా విజేతగా అవతరించింది. దీంతో 2004 నుంచి షరపోవా చేతిలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోని రికార్డును కొనసాగించింది.

విజేతగా నిలిచిన సెరెనాకు 31 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 14 కోట్ల 96 లక్షలు); రన్నరప్ షరపోవాకు 15 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 7 కోట్ల 48 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

గతంలో ఫైనల్‌కు చేరిన ఐదు సార్లూ సెరెనా (2003, 2005, 2007, 2009, 2010) టైటిల్ నెగ్గింది. ఓపెన్ శకంలో (1968 తర్వాత) పెద్ద వయస్సులో (33 ఏళ్లు) టైటిల్ సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.
 
మహిళల విభాగంలో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన వారి జాబితాలో హెలెన్ విల్స్ మూడీ (అమెరికా)తో కలిసి సెరెనా ఉమ్మడిగా మూడో స్థానంలో ఉంది. మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా-24 టైటిల్స్), స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ-22 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఓపెన్ శకంలో స్టెఫీ గ్రాఫ్ తర్వాత జాబితాలో సెరెనా రెండో స్థానంలో ఉంది.
 
ఇప్పటివరకు సెరెనా ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్; రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ (2002, 2013లలో); ఐదుసార్లు వింబుల్డన్ (2002, 2003, 2009, 2010, 2012లలో); ఆరుసార్లు యూఎస్ ఓపెన్ (1999, 2002, 2008, 2012, 2013, 2014లలో) టైటిల్స్‌ను సాధించింది.
 
తన కెరీర్‌లో షరపోవా బేసి సంఖ్య ఏడాదిలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గలేదు. గతంలో ఆమె నెగ్గిన ఐదు టైటిల్స్ (2008-ఆస్ట్రేలియన్ ఓపెన్, 2004-వింబుల్డన్, 2012, 2014-ఫ్రెంచ్ ఓపెన్, 2006-యూఎస్ ఓపెన్) సరి సంఖ్య ఏడాదిలోనే వచ్చాయి. 2007, 2012, 2015 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో; 2011 వింబుల్డన్‌లో, 2013 ఫ్రెంచ్ ఓపెన్‌లో షరపోవా ఫైనల్‌కు చేరినా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.
 
బొలెలీ-ఫాగ్‌నిని జంటకు డబుల్స్ టైటిల్
 
పురుషుల డబుల్స్‌లో సిమోన్ బొలెలీ-ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ) జంట  విజేతగా నిలిచింది. ఫైనల్లో ఈ ద్వయం 6-4, 6-4తో హెర్బర్ట్-నికొలస్ మహుట్ (ఫ్రాన్స్) జోడీని ఓడించి తమ కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌ను నెగ్గింది.
 
 పుట్టుకతోనే నేను  ధనవంతురాలిని కాదు.

 కానీ స్ఫూర్తి, మద్దతు ఇచ్చే అంశాల్లో  నా కుటుంబ సభ్యులు ఉన్నతంగా నిలిచారు. కెరీర్‌లో 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తానని ఏనాడూ ఊహించలేదు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారు, ఏదైనా కావాలనుకున్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులెత్తేయకూడదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో,  ఎవరికి మీరు స్ఫూర్తిగా  నిలుస్తారో చెప్పలేం.
 -సెరెనా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement