షరపోవా శుభారంభం
♦ రెండో రౌండ్‌లోకి సెరెనా
♦ జొకోవిచ్, ఫెడరర్ కూడా
♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ
మెల్‌బోర్న్: అంచనాలకు అనుగుణంగా రాణించిన పలువురు అగ్రశ్రేణి క్రీడాకారిణులు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రౌండ్ అడ్డంకిని సాఫీగా అధిగమించారు. మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా (అమెరికా), నిరుటి రన్నరప్ షరపోవా (రష్యా) శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో ఐదో సీడ్ షరపోవా 6-1, 6-3తో హిబినో (జపాన్)ను ఓడించగా... టాప్ సీడ్ సెరెనా 6-4, 7-5తో కామిల్లా గియోర్గి (ఇటలీ)పై కష్టపడి గెలిచింది. హిబినోతో జరిగిన మ్యాచ్‌లో షరపోవా 11 ఏస్‌లను సంధించింది.
తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయినా, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-2, 6-3తో క్రిస్టినా మెక్‌హేల్ (అమెరికా)పై, ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 6-1తో కుమ్‌కుమ్ (థాయ్‌లాండ్)పై, పదో సీడ్ కార్లా నవారో (స్పెయిన్) 7-5, 6-4తో గొలుబిక్ (స్విట్జర్లాండ్)పై, 12వ సీడ్ బెలిండా (స్విట్జర్లాండ్) 6-4, 6-3తో అలీసన్ రిస్కీ (అమెరికా)పై, 13వ సీడ్ విన్సీ (ఇటలీ) 6-4, 6-2తో తమీరా పాశెక్ (ఆస్ట్రియా)పై, మాజీ ఐదో ర్యాంకర్ యుజిని బుచార్డ్ (కెనడా) 6-3, 6-4తో క్రునిక్ (సెర్బియా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.
ఏడుగురు సీడెడ్ క్రీడాకారిణులు ఓటమి: మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలోనే తొలి రోజు ఏడుగురు సీడెడ్ క్రీడాకారిణిలు ఇంటిదారి పట్టారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్, 16వ సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) 6-1, 6-7 (3/7), 4-6తో యూలియా పుతిన్‌సెవా (కజకిస్తాన్) చేతిలో; 17వ సీడ్ సారా ఎరాని (ఇటలీ) 6-1, 5-7, 1-6తో సు సెయి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. క్రిస్టినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6-4, 7-6 (8/6)తో 25వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై, కియాంగ్ వాంగ్ (చైనా) 6-3, 6-3తో 24వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై, ఎలిజవెటా కులిచ్‌కోవా (రష్యా) 7-5, 6-4తో 22వ సీడ్ ఆండ్రియా పెట్కోవిచ్ (జర్మనీ)పై, లారెన్ డేవిస్ (అమెరికా) 1-6, 6-3, 6-4తో పావ్లీచెంకోవా (రష్యా)పై, దరియా కసత్‌కినా (రష్యా) 6-3, 6-3తో 27వ సీడ్ కరోలినా షిమిద్‌లోవా (స్లొవేకియా)పై సంచలన విజయాలు సాధించారు.
వేట మొదలు: ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టాప్ సీడ్, నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ తొలి రౌండ్‌లో 6-3, 6-2, 6-4తో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా)పై గెలిచి శుభారంభం చేశాడు. మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-2, 6-1, 6-2తో బాసిలాష్‌విలి (జార్జియా)పై, ఏడో సీడ్ కీ నిషికోరి (జపాన్) 6-4, 6-3, 6-3తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై, తొమ్మిదో సీడ్ జో విల్‌ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్) 6-4, 4-6, 6-4, 6-2తో బగ్ధాటిస్ (సైప్రస్)పై నెగ్గి రెండో రౌండ్‌లోకి చేరుకున్నారు. 14వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్), 15వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) కూడా రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. గతేడాది మాదిరిగానే భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ ఈసారీ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)తో జరిగిన మ్యాచ్‌లో యూకీ 5-7, 1-6, 2-6తో ఓడిపోయాడు.