Sharapova
-
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో షరపోవా, బ్రయాన్ బ్రదర్స్
న్యూపోర్ట్: అంతర్జాతీయ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో రష్యా స్టార్ మరియా షరపోవా... మేటి డబుల్స్ జోడీ బ్రయాన్ బ్రదర్స్ బాబ్, మైక్‌లకు చోటు లభించింది. బ్యాలెట్ సెలెక్షన్స్ ఓటింగ్ ద్వారా ఈ ముగ్గురిని ఎంపిక చేశారు. ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన షరపోవా 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. షరపోవా ఆ్రస్టేలియన్ ఓపెన్ (2008), వింబుల్డన్ (2004), యూఎస్ ఓపెన్ (2006) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను ఒక్కోసారి నెగ్గగా... ఫ్రెంచ్ ఓపెన్‌ను (2012, 2014) రెండుసార్లు సొంతం చేసుకొని ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించింది. కవల సోదరులైన బాబ్, మైక్ బ్రయాన్లు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 438 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. అంతేకాకుండా 16 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్‌ను దక్కించుకున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు 2007లో అమెరికా జట్టు డేవిస్ కప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. -
ఆడే సత్తా నాలో ఉంది: షరపోవా
బ్రిస్బేన్: మాజీ ప్రపంచ నంబర్‌వన్ మరియా షరపోవా తనలో ఇంకా టెన్నిస్ ఆడే సత్తా ఉందని చెప్పింది. ఈనెల 6 నుంచి బ్రిస్బేన్‌లో జరిగే ఈ టోర్నీలో మాజీ విజేత అయిన షరపోవాకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ రష్యా స్టార్ 2015లో ఇక్కడ టైటిల్ గెలిచింది. ఏటా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీకి ముందు సన్నాహక టోర్నీగా ఈ ఈవెంట్ జరుగుతుంది. ఇందులో పాల్గొంటానని చెప్పిన 32 ఏళ్ల షరపోవా కెరీర్ తొలినాళ్లలో 30 దాటాక కూడా ఆడతానని ఎప్పుడు అనుకోలేదని తెలిపింది. ‘కానీ నాలో ఆట మిగిలుంది. నా రాకెట్‌తో దూసుకెళ్లే సత్తా కూడా ఉంది. నేనిక్కడ ఎవరికైనా మేటి ప్రత్యర్థినే’ అని రష్యా స్టార్ వివరించింది. గత సీజన్ క్లిష్టంగా గడిచిన తనకు ఇది తాజా ఆరంభమని చెప్పుకొచ్చింది. ఆగస్టులో జరిగిన యూఎస్ ఓపెన్‌లో సెరెనాతో తొలి రౌండ్లో ఓడిపోయాక షరపోవా మళ్లీ బరిలోకి దిగలేదు. దీంతో డబ్ల్యూటీఏ ర్యాంకుల్లో ఆమె 133వ ర్యాంకుకు పడిపోయింది. బ్రిస్బేన్ ఈవెంట్లో ఆమెతో పాటు నయోమి ఒసాకా, యాష్లే బార్టీ, ప్లిస్కోవా, ఎలీనా స్వితొలినా, క్విటోవా, కికి బెర్టెన్స్ తదితర స్టార్ క్రీడాకారిణులు పాల్గొంటున్నారు. -
చాంపియన్‌కు షాక్
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆదివారం సంచలనాల మోత మోగింది. ఒకే రోజు టాప్–10లోని నలుగురు సీడెడ్ క్రీడాకారులు నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్... గతేడాది రన్నరప్, ఆరో సీడ్ మారిన్ సిలిచ్... 20వ సీడ్ దిమిత్రోవ్... మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఎంజెలిక్ కెర్బర్... మాజీ చాంపియన్ షరపోవా... ఐదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టారు. మెల్బోర్న్: అనుకున్నదొకటి... అయ్యిందొకటి. తొలి మూడు రౌండ్లలో అలవోకగా ప్రత్యర్థుల ఆట కట్టించిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం మట్టికరిచాడు. అంతర్జాతీయస్థాయిలో తన అనుభవమంత (21 ఏళ్లు) వయసు లేని 20 ఏళ్ల గ్రీస్ యువతార స్టెఫానోస్ సిట్సిపాస్ చేతిలో ఫెడరర్ కంగుతిన్నాడు. వరుసగా మూడోసారి... రికార్డు స్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ స్విస్ స్టార్‌కు... కెరీర్లో కేవలం ఆరో గ్రాండ్‌స్లామ్ ఆడుతోన్న సిట్సిపాస్ ఊహించని షాక్ ఇచ్చాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ సిట్సిపాస్ 6–7 (11/13), 7–6 (7/3), 7–5, 7–6 (7/5)తో మూడో సీడ్ ఫెడరర్‌పై గెలిచి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అంతేకాకుండా గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి గ్రీస్ ప్లేయర్‌గానూ గుర్తింపు పొందాడు. తన ప్రత్యర్థి 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత అని... 21 ఏళ్ల అనుభవమున్న దిగ్గజమని... కళాత్మక ఆటతీరుకు మరో రూపమని తెలిసినా... సిట్సిపాస్ అవేమీ పట్టించుకోలేదు. ఎలాంటి బెరుకు లేకుండా తొలి పాయింట్ నుంచి మ్యాచ్ పాయింట్ వరకు దూకుడుగానే ఆడాడు. ఫలితంగా తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ‘ప్రస్తుతం ఈ భూగోళం మీద అమితానందంగా ఉన్న వ్యక్తిని నేనే. నాకు ఆరేళ్లు ఉన్నప్పటి నుంచి ఫెడరర్‌ను ఆరాధిస్తున్నాను. మరో దిగ్గజం రాడ్ లేవర్ పేరిట ఉన్న సెంటర్ కోర్టులోనే ఫెడరర్‌తో ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైంది. ఈ ఫలితాన్ని ఎలా వర్ణించాలో కూడా మాటలు రావడంలేదు’ అని ఫెడరర్‌ను ఓడించిన అనంతరం సిట్సిపాస్ వ్యాఖ్యానించాడు.‘నేను మంచి ప్లేయర్ చేతిలోనే ఓడిపోయాను. ఇటీవల కాలంలో సిట్సిపాస్ చాలా బాగా ఆడుతున్నాడు. కీలక సమయాల్లో అతను ఎంతో ఓర్పుతో ఆడాడు’ అని ఫెడరర్ ప్రశంసించాడు. శక్తివంతమైన సర్వీస్‌లు... కచ్చితమైన రిటర్న్‌లు.. నెట్ వద్ద పైచేయి... ఏకంగా 12 బ్రేక్ పాయింట్లను కాపాడుకోవడం సిట్సిపాస్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. మ్యాచ్ మొత్తంలో 20 ఏస్‌లు సంధించిన ఈ గ్రీస్ యువతార కేవలం ఒక డబుల్ ఫాల్ట్ మాత్రమే చేశాడు. మరోవైపు ఫెడరర్ 12 ఏస్‌లు కొట్టినా... 12 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఒక్కటీ సద్వినియోగం చేసుకోకపోవడం గమనార్హం. 55 అనవసర తప్పిదాలు చేసిన ఈ స్విస్ స్టార్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. అగుట్ అద్భుతం... మరోవైపు 22వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్) మరో అద్భుత విజయం సాధించాడు. తన 25వ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. 3 గంటల 58 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అగుట్ 6–7 (6/8), 6–3, 6–2, 4–6, 6–4తో నిరుటి రన్నరప్, ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)ను ఓడించాడు. తొలి రౌండ్లో బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేపై, మూడో రౌండ్లో పదో సీడ్ ఖచనోవ్ (రష్యా)పై గెలిచిన అగుట్ క్వార్టర్ ఫైనల్లో సిట్సిపాస్‌తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో అమెరికా యువతార టియాఫో 7–5, 7–6 (8/6), 6–7 (1/7), 7–5తో 20వ సీడ్ దిమిత్రోవ్‌ను ఓడించి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6–0, 6–1, 7–6 (7/4)తో థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)పై గెలిచి టియాఫోతో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. కెర్బర్ కుదేలు... మహిళల సింగిల్స్ విభాగంలో 2016 చాంపియన్, మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)కు అనూహ్య ఓటమి ఎదురైంది. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతోన్న 25 ఏళ్ల అమెరికా అమ్మాయి డానియెలా కొలిన్స్ 6–0, 6–2తో కెర్బర్‌ను చిత్తు చేసింది. గతంలో ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో పాల్గొన్న కొలిన్స్ ఏనాడూ తొలి రౌండ్‌ను దాటకపోగా ఆరో ప్రయత్నంలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకోవడం విశేషం. మరో మ్యాచ్‌లో 15వ ర్యాంకర్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 4–6, 6–1, 6–4తో 30వ సీడ్, 2008 చాంపియన్, మాజీ నంబర్‌వన్ మరియా షరపోవా (రష్యా)ను బోల్తా కొట్టించి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) 6–7 (3/7), 6–3, 6–3తో ఐదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై సంచలన విజయం సాధించగా... ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–1తో అమండా అనిసిమోవా (అమెరికా)ను ఓడించింది. -
తగని ప్రశ్న తగిన జవాబు
ప్రశ్న : బిడ్డతల్లి అయ్యాక మీరు సరిగా ఆడడం లేదు. కాన్పుకోసం తీసుకున్న విరామం తర్వాత మీకన్నీ అపజయాలే. ఇటీవల మరియ షరపోవాతో ఆటను స్కిప్ చేశారు. అక్కడ తప్పించుకున్నా, వింబుల్డన్ ఫైనల్లో గెలవలేకపోయారు. ఇప్పుడు మళ్లీ డబ్లు్య.టి.ఎ. శాన్ జోస్ ఈవెంట్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. షాక్ తిన్నట్లనిపిస్తోందా? సెరెనా విలియమ్స్ : నాకు తెలీదు. నా మదిలో అనేక అలోచనలు ఉంటాయి. ఓడిపోయినందుకు షాక్ తినేంత సమయం నాకు ఉండదు. -
పులి.. చిరుత
బిడ్డకు పాలిచ్చి వచ్చిన పులి సెరెనా. బోనులోంచి బయటికి వచ్చిన చిరుత షరపోవా. ఇద్దరిలో ఆకలి ఉంది. బరిలో ఆహారం ఉంది. ఇదొక యుగాంతపు ఆట. ఉమెన్స్ టెన్నిస్‌లో ఈరోజు ధూమ్స్ డే. లైక్.. డూమ్స్ డే! సెరెనా, షరపోవాలు పరస్పర శత్రు ఘీంకార వందన సమర్పణతో బరిని బ్లాస్ట్ చేయబోతున్న మచ్ అవెయిటెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ (ఎదురుచూడబోతామని ఎవరూ ఎదురుచూడని) ఈవెంట్ ఇవాళ్టిది. ఇదింకా ఫోర్త్ రౌండే. ఫైనల్స్ కాదు. సెమీ ఫైనల్ కాదు. క్వార్టర్ ఫైనల్ కాదు. కేవలం ప్రీక్వార్టర్. అంతే. బట్, ఇదొక యుగాంతపు ఆట. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆరో సీడ్ ప్లిస్కోవాను కొట్టి, సెరెనా అనే కొరివితో పెట్టుకోబోతున్నారు షరపోవా. పదకండవ సీడ్ జూలియా జార్జెస్‌ను ఓడించి, షరపోవాను చిన్నపిల్లలా ఆటాడించేందుకు సిద్ధమై ఉన్నారు సెరెనా. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో ఇప్పటికి మూడుసార్లు షరపోవాపై గెలిచారు సెరెనా. ఇప్పటికి ఒకేసారి సెరెనాపై గెలిచారు షరపోవా. ఎవరు ఎవరిపై ఎన్నిసార్లు గెలిచారనేది.. ఈరోజు ఈ ఇద్దరి మధ్యా జరుగుతున్న ఆటలో ఓటమిని అంచనా వెయ్యడానికి పనికొచ్చే.. గెలుపు పాయింట్ ఏమీ కాబోదు. కానీ ప్రాణమున్న ఆట. సెరెనా ఒక బిడ్డకు జన్మనిచ్చాక, షరపోవా నిషేధం నుంచి పునర్జన్మించాక ఆడుతున్న ఆట. సెరెనా, షరపోవా చివరిసారిగా రెండున్నరేళ్ల క్రితం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఒకరితో ఒకరు తలపడ్డారు. తర్వాత ఇద్దరూ పరిస్థితులతో తలపడ్డారు. ఒక సంవత్సరం తేడాతో ఇద్దరి జీవితాల్లో మార్పులకు, మలుపులకు ఆస్ట్రేలియన్ ఓపెన్ కారణం అయింది. 2016 ఓపెన్‌లో వరల్డ్ యాంటీ డోపింక్ ఏజెన్సీ షరపోవాపై రెండేళ్ల నిషేధం విధించింది. ఆ రెండేళ్ల నిషేధాన్ని ఆ తర్వాత పదిహేను నెలలకు తగ్గించింది. లేకుంటే ఈ జూన్ 8 వరకు ఆ నిషేధం ఉండేది. ఈరోజు సెరెనా, షరపోవాల ఆట లేకపోయేది. షరపోవాలా సెరెనా కూడా తనకెంతో ప్రాణప్రదమైన టెన్నిస్‌కు కొన్ని నెలలు దూరంగా ఉండవలసి వచ్చింది. డోపింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయినందుకు షరపోవా ఆటకు దూరం అయితే, మాతృత్వపు టెస్ట్‌లో పాస్ అయినందుకు సెరెనా తన బిడ్డ కోసం ఆటలు కట్టిపెట్టవలసి వచ్చింది. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న సమయానికే ఆమె ఎనిమిది వారాల గర్భిణి. ఆ తర్వాత బిడ్డ పుట్టేవరకు, బిడ్డ పుట్టిన తర్వాత కూడా కొన్నాళ్లపాటు ఆటకు దూరంగా ఉన్నారు. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆటలోకి వచ్చారు. అక్కణ్ణుంచి ఇప్పుడు జరుగుతున్న ఫ్రెంచి ఓపెన్‌లోకి వచ్చారు. తొలి రౌండ్లో చెక్ అమ్మాయిని, రెండో రౌండ్లో ఆస్ట్రేలియా అమ్మాయినీ, మూడో రౌండ్లో జర్మన్ అమ్మాయినీ ఓడించి, నాలుగో రౌండ్లో రష్యా అమ్మాయి షరపోవా మీదకు రాకెట్ పట్టుకుని వచ్చేశారు. షరపోవా కూడా గ్యాప్ తర్వాత గత ఏడాది ఏప్రిల్‌లో ఆటలోకి వచ్చారు. అక్కణ్ణుంచి ఫ్రెంచ్ ఓపెన్‌కి వచ్చారు. తొలి రౌండ్లో నెదర్లాండ్స్ అమ్మాయిని, రెండో రౌండ్లో క్రొయేషియా అమ్మాయిని, మూడో రౌండ్లో చెక్ అమ్మాయిని ఓడించి నాలుగో రౌండ్లో అమెరికన్ యోధురాలు సెరెనా వైపు చిరుతలా చూస్తున్నారు. అయినా.. ఎన్ని చిరుతల్ని చూడలేదూ సెరెనా! షరపోవా కూడా! ఎదురుగా ఉన్నది యోధానుయోధులైతే మాత్రం ఎప్పుడైనా గాండ్రించకుండా ఉందా? గ్యాప్ వచ్చిన తర్వాత కూడా ఇంకా రిటైర్ కాకుండా ఉన్నారంటే.. వీళ్ల లోలోపలి ఫైరే.. వీళ్ల ఆటను వెలిగిస్తోంది. గత ఏడాది షరపోవా ఆత్మకథ ‘అన్‌స్టాపబుల్: మై లైఫ్ సో ఫార్’ విడుదలైంది. 2004 వింబుల్డన్ ఫైనల్లో తనపై ఓడిపోయినప్పుడు సెరెనా లాకర్ రూమ్‌లో కన్నీళ్లతో కూర్చొని ఉన్న దృశ్యాన్ని చూసినందుకు తనెప్పటికీ క్షమార్హురాలిని కాబోనని ఆ పుస్తకంలో రాసుకున్నారు షరపోవా. ‘ఒక బక్కపలుచని అమ్మాయి తనని ఓడించినందుకు సెరెనా నన్ను ద్వేషించి ఉండొచ్చు. తనది అనుకున్న దానిని నేను తీసేసుకున్నందుకు తను నన్ను ద్వేషించి ఉండొచ్చు. తన జీవితంలోని అతి దయనీయమైన క్షణాలు నా కంట్లో పడినందుకు తను నన్ను ద్వేషించి ఉండొచ్చు. అన్నిటికన్నా.. తను ఏడ్వటం నేను చూశాను. అందుకు మరీ ఎక్కువగా ద్వేషించి ఉండొచ్చు’ అని ఆ ప్యారాగ్రాఫ్‌ను కొనసాగించారు షరపోవా. ఈ విషయాన్ని శనివారం న్యూయార్స్ టైమ్స్ ప్రతినిధి సెరెనా ముందు ప్రస్తావించినప్పుడు.. ‘ఏడ్వకపోవడం విడ్డూరం గానీ, ఏడ్వటంలో ఆశ్చర్యం ఏముంది?’ అన్నారు సెరెనా. ‘ఆ సంగతిని లాకర్ రూమ్‌లోనే ఉంచేయవలసింది. పుస్తకం వరకూ తేకుండా. నాకూ ఎమోషన్స్ ఉంటాయి. నేనూ మనిషినే’ అని కూడా అన్నారు. అవును కదా! ఎంత ఫైర్ ఉన్న మనిషిలోనైనా ఏమూలో ‘ఐస్’ లేకుండా ఉంటుందా? ఎంత ‘అన్‌స్టాపబుల్’ అయినా చిన్న గులకరాయి తగలకుండా ఉంటుందా? బిడ్డకు పాలిచ్చి వచ్చిన పులి సెరెనా. బోనులోంచి బయటికొచ్చిన చిరుత షరపోవా. ఆకలి ఉంది. బరిలో ఆహారం ఉంది. - మాధవ్ శింగరాజు -
షరపోవా జోరు...
కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతోన్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం అదరగొడుతోంది. రెండుసార్లు ఈ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించిన ఆమె అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఆరో సీడ్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో షరపోవా 6–2, 6–1తో ఘనవిజయం సాధించింది. తొలి గేమ్‌లోనే తన సర్వీస్ కోల్పోయిన షరపోవా వెంటనే తేరుకొని వరుస పాయింట్లతో కేవలం 59 నిమిషాల్లో ప్లిస్కోవా ఆట కట్టించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)తో షరపోవా ఆడనుంది. మూడో రౌండ్లో సెరెనా 6–3, 6–4తో జూలియా జార్జెస్ (జర్మనీ)పై గెలిచింది. మరోవైపు ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. కొంటావీట్ (ఎస్తోనియా) 7–6 (8/6), 7–6 (7/4)తో క్విటోవాను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. హలెప్ ముందంజ టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో హలెప్ 7–5, 6–0తో పెట్కోవిక్ (జర్మనీ)పై, ముగురుజా 6–0, 6–2తో సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో పదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 4–6, 6–1, 8–6తో గియోర్గి (ఇటలీ)పై, ఏడో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–1, 6–3తో ఇరీనా బెగూ (రొమేనియా)పై గెలుపొందారు. నాదల్ దూకుడు... పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6–3, 6–2, 6–2తో రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. రెండు గంటల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో నాదల్ నెట్ వద్ద 12 పాయింట్లు సాధించడంతోపాటు గాస్కే సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6–3, 6–2, 6–4తో జాన్సన్ (అమెరికా)పై, ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 7–5, 6–4, 6–1తో రామోస్ (స్పెయిన్)పై, ఆరో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6–1, 6–7 (3/7), 6–3, 7–6 (7/4)తో మిషా జ్వెరెవ్ (జర్మనీ)పై, ఎనిమిదో సీడ్ గాఫిన్ (బెల్జియం) 6–7 (6/8), 6–3, 4–6, 7–5, 6–3తో మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. క్వార్టర్స్‌లో బోపన్న జంట పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం సంచలనం సృష్టించింది. బోపన్న–వాసెలిన్ జంట 6–4, 7–6 (7/1)తో టాప్ సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)–లుకాజ్ కుబోట్ (పోలాండ్) జోడీని బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. -
కోచ్‌కు కటీఫ్ చెప్పిన స్టార్ క్రీడాకారిణి
కాలిఫోర్నియా: మాజీ ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ మరియా షరపోవా తన కోచ్ స్వెన్ గ్రోనెవెల్డ్ తో తెగదెంపులు చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నీ మొదటి రౌండ్లోనే షరపోవా పరాజయం చెందడంతో కోచ్‌కు కటీఫ్ చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో వారిద్దరి నాలుగు సంవత్సరాల భాగస్వామ్యానికి తెర పడింది. పరస్పర అంగీకారం మేరకే విడిపోతున్నట్టు షరపోవా తెలిపారు. కోచ్ అందించిన సహకారం మర్చిపోలేనిదని, ఆట, కోచింగ్ కంటే తమ మధ్య స్నేహం చాలా విలువైందని అన్నారు. అతని పని తీరు, నాపై తనకున్న విశ్వాసం అద్భుతమైందని తెలిపారు. ఇలాంటి పర్యవేక్షకుడు తనకు కోచ్‌గా ఉండటం ఒక అదృష్టంగా షరపోవా అభివర్ణించారు. డచ్ దేశానికి చెందిన గ్రోనెవెల్డ్.. 2014లో షరపోవాకు కోచింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అదే ఏడాది షరపోవా ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది. మరొకవైపు గ్రోనెవెల్డ్ పర్యవేక్షణలో రెండు టైటిల్స్‌ను షరపోవా గెలిచారు. తామిద్దరం విడిపోతున్న విషయాన్ని కోచ్ స్వెన్ గ్రోనెవెల్డ్ ధ్రువీకరిస్తూ, ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. తాను ఇప్పటి వరకు కలిసి పనిచేసిన వారిలో అత్యంత కష్టపడే వ్యక్తి షరపోవా అని, ఆమె భవిష్యత్తులో మరింత పోరాట పటిమను కొనసాగించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఓ వ్యక్తిగా, క్రీడాకారిణిగా తన పట్ల నాకు అమితమైన గౌరవం ఉందని అన్నారు. ఈ వారం జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నీ మొదటి రౌండ్లోనే జపాన్ నంబర్ వన్ నయోమి ఒసాకాపై 6-4, 6-4 తేడాతో ఓడిపోయారు షరపోవా. అంతకుముందు నిషేధం తర్వాత ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పునరాగమనం చేసిన షరపోవా.. మూడో రౌండ్లో ఏంజెలిక్ కెర్బెర్ చేతిలో కూడా ఓటమిపాలైంది. -
షరపోవా మళ్లీ సాధించెన్...
రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా రెండున్నరేళ్ల తర్వాత తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనాలో ఆదివారం జరిగిన తియాన్జిన్ ఓపెన్‌లో షరపోవా విజేతగా నిలిచింది. ఫైనల్లో 7–5, 7–6 (8/6)తో అర్యానా సబలెంకా (బెలారస్)పై విజయం సాధించింది. గతేడాది డోపింగ్‌లో పట్టుబడి 15 నెలల నిషేధం ఎదుర్కొన్న షరపోవా ఈ ఏడాది ఏప్రిల్‌లో పునరాగమనం చేసింది. చివరిసారి షరపోవా 2015 మేలో రోమ్ ఓపెన్‌లో టైటిల్ గెలిచింది. -
రెండున్నరేళ్ల తర్వాత...
తియాన్జిన్ (చైనా): రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా రెండున్నరేళ్ల తర్వాత ఓ డబ్ల్యూటీఏ టోర్నమెంట్లో తొలిసారి ఫైనల్‌కు చేరింది. తియాన్జిన్ ఓపెన్ టోర్నీలో ఈ మాజీ నంబర్‌వన్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో షరపోవా 6–3, 6–1తో షుయె పెంగ్ (చైనా)పై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో అర్యానా సబలెంకా (బెలారస్)తో షరపోవా తలపడుతుంది. చివరిసారి షరపోవా 2015 మేలో రోమ్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. 2016 ఆరంభంలో డోపింగ్‌లో పట్టుబడిన ఈ రష్యా స్టార్‌పై 15 నెలల సస్పెన్షన్ విధించారు. నిషేధం గడువు పూర్తి కావడంతో ఆమె ఈ ఏడాది ఏప్రిల్‌లో స్టట్గార్ట్ ఓపెన్ ద్వారా పునరాగమనం చేసింది. -
షరపోవా, ముగురుజా అవుట్
►ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాజయం ►సెవస్తోవా, క్విటోవా సంచలనం ►యూఎస్ ఓపెన్ టోర్నీ న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల పరంపర కొనసాగుతోంది. డోపింగ్ నిషేధం గడువు పూర్తయ్యాక ఆడుతోన్న తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మరియా షరపోవా (రష్యా)... మరోవైపు మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్)ల పోరు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌ల్లో 16వ సీడ్ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) 5–7, 6–4, 6–2తో మాజీ నంబర్‌వన్, మాజీ విజేత షరపోవాను బోల్తా కొట్టించి... 13వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/3), 6–3తో ముగురుజాను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్, ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్స్ నెగ్గిన ముగురుజా తాజా ఓటమితో ఆమెకు నంబర్‌వన్ ర్యాంక్ అయ్యే అవకాశాలు నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), టాప్ సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) ఆటతీరుపై ఆధారపడ్డాయి. స్వితోలినా సెమీస్‌కు, ప్లిస్కోవా ఫైనల్‌కు చేరుకోకుంటేనే ముగురుజాకు నంబర్‌వన్ ర్యాంక్ లభిస్తుంది. సెవస్తోవాతో 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో షరపోవా ఏకంగా 51 అనవసర తప్పిదాలు చేయగా... లాత్వియా క్రీడాకారిణి కేవలం 14 మాత్రమే చేసింది. క్విటోవాతో గంటా 46 నిమిషాలపాటు జరిగిన పోరులో ముగురుజా 25 అనవసర తప్పిదాలు చేసి, కేవలం ఏడు విన్నర్స్ కొట్టింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో వీనస్ 6–3, 3–6, 6–1తో కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)పై, స్లోన్ స్టీఫెన్స్ 6–3, 3–6, 6–1తో జూలియా జార్జెస్ (జర్మనీ)పై, ప్లిస్కోవా 6–1, 6–0తో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)పై గెలిచారు. క్వార్టర్స్‌లో నాదల్ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ నాదల్ 6–2, 6–4, 6–1తో డల్గొపలోవ్ (ఉక్రెయిన్)పై గెలుపొందాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కెనడా రైజింగ్ స్టార్ షపోవలోవ్ 6–7 (2/7), 6–7 (4/7), 6–7 (3/7)తో పాబ్లో బుస్టా (స్పెయిన్) చేతిలో ఓడిపోగా... సామ్ క్వెరీ (అమెరికా) 6–2, 6–2, 6–1తో మిషా జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. అండర్సన్ (దక్షిణాఫ్రికా), ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) కూడా క్వార్టర్స్‌కు చేరారు. క్వార్టర్స్‌లో సానియా జంట మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా మీర్జా (భారత్)–షుయె పెంగ్ (చైనా) జంట 6–2, 3–6, 7–6 (7/2)తో సొరానా (రొమేనియా)–సొరిబెస్ (స్పెయిన్) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న (భారత్)–దబ్రౌస్కీ (కెనడా) ద్వయం 6–3, 6–4తో మార్టినెజ్ (స్పెయిన్)–మోన్రో (అమెరికా) జంటను ఓడించింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో పేస్–పురవ్ రాజా (భారత్) జోడీ 4–6, 6–7 (7/9)తో ఖచనోవ్–రుబ్లోవ్ (రష్యా) జంట చేతిలో ఓడింది. -
వింబుల్డన్ టోర్నీకి షరపోవా దూరం
లండన్: రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా వచ్చే నెలలో జరగనున్న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు దూరమైంది. తొడ గాయం కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. 2004లో వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన షరపోవా... సరైన ర్యాంక్ లేని కారణంగా ఈసారి వింబుల్డన్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో చోటు కోసం క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ఆడాల్సి ఉంది. ‘రోమ్ ఓపెన్ టోర్నీ సందర్భంగా తొడకు గాయమైంది. స్కాన్ చేస్తే ఆ గాయం ఇంకా తగ్గలేదని తేలింది. దాంతో ముందు జాగ్రత్తగా మొత్తం గ్రాస్‌కోర్టు సీజన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను’ అని 30 ఏళ్ల షరపోవా తెలిపింది. గతేడాది డోపింగ్‌లో పట్టుబడినందుకు షరపోవాపై 15 నెలల నిషేధం విధించారు. నిషేధం గడువు పూర్తయ్యాక ఏప్రిల్ చివరి వారంలో స్టట్గార్ట్ ఓపెన్‌తో ఆమె పునరాగమనం చేసింది. ప్రస్తుతం 178వ ర్యాంక్‌లో ఉన్న షరపోవాకు ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 10 వరకు జరిగే సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లోనూ మెయిన్ ‘డ్రా’లో నేరుగా చోటు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. -
‘వింబుల్డన్’ వైల్డ్ కార్డు అడగను...
తన తాజా ర్యాంక్ ప్రకారం వింబుల్డన్ టోర్నమెంట్లో క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించినందున.... ‘మెయిన్ ‘డ్రా’లో చోటు కోసం వైల్డ్ కార్డుకు దరఖాస్తు చేసుకోబోనని రష్యా టెన్నిస్ స్టార్ షరపోవా తెలిపింది. -
శిక్ష అనుభవించాక ఇదేం శిక్ష?
షరపోవాకు వైల్డ్‌కార్డ్ నిరాకరణపై డబ్ల్యూటీఏ చీఫ్ వ్యాఖ్య పారిస్: మాజీ నంబర్‌వన్ మరియా షరపోవాకు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో వైల్డ్‌కార్డ్‌ను నిరాకరించడంపై డబ్ల్యూటీఏ చీఫ్ స్టీవ్ సైమన్ మండిపడ్డారు. స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్డు (సీఏఎస్ ) షరపోవాకు విధించిన 15 నెలల శిక్ష అనుభవించాక కూడా మళ్లీ శిక్షించడమేంటని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకుల (ఎఫ్ఎఫ్టీ)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మాజీ చాంపియన్‌ను ఇలా అవమానించడం అనుచితమని ఆయన వ్యాఖ్యానించారు. టెన్నిస్ యాంటి డోపింగ్ ప్రోగ్రామ్ (టీఏడీపీ)లో బాధ్యత కలిగిన భాగస్వాములైన గ్రాండ్‌స్లామ్, డబ్ల్యూటీఏ, ఐటీఎఫ్, ఏటీపీ సంస్థలు శిక్షించిన క్రీడాకారిణిని మళ్లీ ఈ రకంగా శిక్షించడం సరైనది కాదని సైమన్ అభిప్రాయపడ్డారు. గత నెల 26తో 15 నెలల నిషేధం పూర్తయిన తర్వాత షరపోవా... స్టట్గార్ట్ ఓపెన్‌లో తొలిసారిగా బరిలోకి దిగింది. ఇందులో సెమీస్ చేరిన ఆమె తదనంతరం మాడ్రిడ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. అయితే గాయాలైన వారికే తప్ప డోపీలకు వైల్డ్ కార్డ్‌లు ఇవ్వమని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ప్రకటించారు. -
సెమీస్‌లో షరపోవా
రష్యా టెన్నిస్ స్టార్ షరపోవా పునరాగమనంలో అద్భుతంగా రాణిస్తోంది. స్టట్గార్ట్ ఓపెన్‌లో ఆమె సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో షరపోవా 6–3, 6–4తో అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా)పై విజయం సాధించింది. -
క్వార్టర్స్‌లో షరపోవా
స్టట్గార్ట్: స్టట్గార్ట్ ఓపెన్‌లో షరపోవా మరో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో ఆమె క్వార్టర్స్‌కు చేరుకుంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో షరపోవా 7–5, 6–1తో ఎకతెరినా మకరోవా (రష్యా)ను ఓడించింది. మరోవైపు తనపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ ‘నిర్వాహకులు నాకు ట్రోఫీలు, బంగారు పళ్లాలేమీ ఇవ్వట్లేదు. కేవలం టోర్నీల్లో ఆడేందుకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీలే ఇస్తున్నారు. వాటితోనే ట్రోఫీలు గెలిచేందుకు కష్టపడతాను’ అని చెప్పింది. -
రా...రా... షరపోవా!
►నేడే రష్యా టెన్నిస్ స్టార్ పునరాగమనం ►స్టట్గార్ట్ ఓపెన్‌లో వైల్డ్‌కార్డుతో బరిలోకి నిషేధిత జాబితాలోని మెడిసిన్ తీసుకున్నావ్... సస్పెన్షన్ అన్నారు. తీరా అది ముగిసే దశలో వుంటే... అప్పుడే వైల్డ్కార్డా? నాన్సెన్స్ అన్నారు. ఏదేమైనా తనది కాన్ఫిడెన్స్ అంటోంది... షరపోవా వైఫల్యాలు వెంటాడినా... గాయాలు తిరగదోడినా... సవాళ్లతో సహవాసం... ఆటలో పునరాగమనం తనకు కొత్తకాదని... ఇక ఇప్పుడు డోపింగ్ ఉదంతాన్ని మరచి మళ్లీ రాకెట్ పవర్‌తో సత్తా చాటేందుకు ఆమె సిద్ధమైంది. క్రీడావిభాగం : స్టట్గార్ట్ ఓపెన్‌లో మరియా షరపోవా కొత్త ఇన్నింగ్స్ షురూ. వనవాసం వీడినట్లు షరపోవా సస్పెన్షన్ కాలం ముగిసింది. దాంతో ఈ రష్యా రమణి మళ్లీ బరిలోకి దిగుతోంది. 30 ఏళ్ల రష్యా టెన్నిస్ స్టార్ 15 నెలల సస్పెన్షన్ తర్వాత జర్మనీ ఈవెంట్లో రాకెట్ పడుతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో స్టట్గార్ట్ ఓపెన్ తొలి రౌండ్లో రొబెర్టా విన్సీ (ఇటలీ)తో పోరుకు సిద్ధమైంది. నంబర్‌వన్ సెరెనా గైర్హాజరు అవుతున్న ఈ టోర్నమెంట్లో షరపోవాకు కాలం కలిసొస్తుందో లేదో తేలుతుంది. నిజానికి షరపోవాకు సవాళ్లు కొత్త కాదు! ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత అందలాలేవీ అంత తేలిగ్గా అందలేదు. ఒక్కో విజయం ఒక్కో మెట్టెక్కించింది. ఒక్కో వైఫల్యం ఒక్కో పాఠం నేర్పించింది. 17 ఏళ్లకే వింబుల్డన్ చాంపియన్ (2004)... 18 ఏళ్లకే నంబర్‌వన్ ర్యాంకు (2005)... ఇవన్నీ ఆటతోనే... ఈ క్రమంలోనే అనేక సవాళ్లను అధిగమించింది. టెన్నిస్...ఫ్యాషన్ షరపోవా యూఎస్ ఓపెన్ (2006) గెలిచాక... తర్వాతి మూడేళ్లలోనే ఎక్కడలేని స్టార్డమ్! ఒక్కసారిగా వచ్చిన క్రేజ్! దీన్ని ఫ్యాషన్ ప్రపంచం బాగా క్యాష్ చేసుకుంది. ప్రపంచంలోని పేరున్న బ్రాండ్లు ఆమె తలుపు తట్టాయి. దీంతో ఆట కాస్త అటకెక్కినా... మోడలింగ్ తళుకులు కమ్మేసినా.... మళ్లీ పట్టుదలతో పైకొచ్చింది. రెండేళ్లు తిరిగేసరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ (2008) చేతికందింది. ఇక ‘కెరీర్ స్లామ్’ ఘనత ఒక్కటే మిగిలింది. ఫ్రెంచ్ ఓపెన్ రూపంలో లోటుగా ఉన్న ఈ గ్రాండ్‌స్లామ్ కూడా ఆమె రాకెట్ నుంచి తప్పించుకోలేకపోయింది. ఆలస్యంగానైనా సరే షరపోవా రెండుసార్లు (2012, 2014) రోలాండ్ గారోస్ టైటిళ్లు చేజిక్కించుకుంది. గాయాలు...వైఫల్యాలు కెరీర్ స్లామ్‌కు షరపోవా ఎనిమిదేళ్ల పోరాటం చేసింది. మధ్యలో భుజం గాయం పదేపదే రష్యన్ స్టార్‌ను నీడలా వెంటాడి వేధించింది. తొలిసారిగా 2007లో ఇదే కారణంగా ఆమె ర్యాంక్ దిగజారింది. అయినా అలుపెరగని పోరాటంతో మరుసటి ఏడాదే ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. తర్వాత 2009లో గాయం మళ్లీ తిరగబెట్టింది. ఈసారి సర్జరీ తప్పలేదు. చాన్నాళ్లు ఆటకు దూరం. తర్వాత వరుస వైఫల్యాలతో 2010 పేలవంగా గడిచింది. ఇక ఈ రష్యా భామ కథ ముగిసిందనే విమర్శలు... ఇవన్నీ భరించింది. రెండేళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌తో కెరీర్ స్లామ్‌తో తనలో ‘వాడి’ రాకెట్లో ‘వేడి’ తగ్గలేదని చేతలతో చెప్పింది. అనంతరం 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకోవడంతో మొదట రెండేళ్లు నిషేధం విధించినా... ఆ తర్వాత దానిని 15 నెలలకు కుదించారు. ఇప్పుడూ ఆమె కెరీర్‌కు ముగింపు తప్పదనే ఊహాగానాలు వచ్చినా... ఏడాది తిరిగే సరికి సమరానికి సై అంటూ దూసుకొస్తున్న షరపోవాకు ఆల్ ది బెస్ట్. -
మే 15న షరపోవాపై నిర్ణయం
పారిస్: గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో రష్యా టెన్నిస్ తార మరియా షరపోవాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభిస్తుందా లేదా అనే అంశంపై మే 15న స్పష్టత రానుంది. ఈ విషయాన్ని ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య (ఎఫ్టీఎఫ్) గురువారం ప్రకటించింది. ‘రోలండ్ గారోస్ టోర్నీ క్వాలిఫయర్స్‌కు వారం రోజుల ముందు మే15న షరపోవా విషయంలో మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం. ఒకవేళ మేం వైల్డ్‌కార్డ్ అనుమతి ఇవ్వకపోయినా క్వాలిఫయర్స్ ఆడి ఆమె ఈ టోర్నీలో పాల్గొనవచ్చు’ అని ఎఫ్టీఎఫ్ అధ్యక్షుడు బెర్నార్డ్ గుడిసెలి అన్నారు. మే 28 నుంచి జూన్ 11 వరకు ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ జరగనుంది. మరోవైపు సెరెనా విలియమ్స్ కూడా ప్రెగ్నెన్సీ కారణంగా ఈ సీజన్ టోర్నీల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడంతో షరపోవాకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ దొరుకుతుందని అభిమానులు ఆశించారు. అయితే సెరెనా, షరపోవాలిద్దరివి విభిన్నమైన కేసులు. ఒకరి గైర్హాజరీతో మరొకరికి సంబంధం లేదని బెర్నార్డ్ స్పష్టం చేశారు. -
షరపోవా... నీకిది తగునా...
రష్యా స్టార్ పునరాగమనం తీరుపై వొజ్నియాకి అసంతృప్తి కాలిఫోర్నియా: నిషేధం ఎత్తేయగానే ముందుగా రష్యన్ స్టార్ మరియా షరపోవా కిందిస్థాయి టోర్నీలతో పునరాగమనం చేయాలని మాజీ ప్రపంచ నంబర్‌వన్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) సూచించింది. వచ్చిరాగానే ఓ మేటి డబ్ల్యూటీఏ టోర్నీలో బరిలోకి దిగడం తోటి క్రీడాకారిణిలను అగౌరవపరచడమేనని ఆమె చెప్పింది. నిషేధిత జాబితాలోని మెడిసిన్‌ను వాడటంతో షరపోవాపై 15 నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 26తో ఆమె నిషేధం తొలగిపోనుంది. అయితే అప్పటికే మొదలయ్యే స్టుట్గార్ట్ ఓపెన్‌లో షరపోవా బరిలోకి దిగనుండటంపై వొజ్నియాకి పెదవి విరిచింది. ఆమెతో తనకెలాంటి ఇబ్బందిలేదని అయితే కిందిస్థాయి టోర్నీలో పునరాగమనం చేస్తే బాగుంటుందని చెప్పింది. ‘మానవ మాత్రులందరూ తప్పు చేస్తారు. సరిదిద్దుకునేందుకు మరో అవకాశముంటుంది. ఇందులో నాకే ఇబ్బంది లేదు. కానీ నిషేధం గడువు పూర్తికాని సమయంలోనే మొదలయ్యే ఓ టోర్నీలో ఆడటమనేది సబబుగా లేదు’ అని వొజ్నియాకి తెలిపింది. ‘గాయంతో పునరాగమనం చేయడం వేరు... డోపింగ్ బ్యాన్‌తో పునరాగమనం చేయడం వేరు! ఈ రెండింటిని సమదృష్టితో చూడలేం’ అని వివరించింది. -
రోమ్ ఓపెన్‌లోనూ షరపోవాకు వైల్డ్ కార్డు...
రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు మరో టోర్నమెంట్లో వైల్డ్ కార్డు ఎంట్రీ లభించింది. ఇప్పటికే స్టుట్గార్ట్, మాడ్రిడ్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులు షరపోవాకు వైల్డ్ కార్డు కేటాయించగా... తాజాగా రోమ్ ఓపెన్‌లోనూ ఆమెకు ఈ అవకాశం దక్కింది. నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్లు తేలడంతో 2016 జనవరిలో షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) రెండేళ్లపాటు నిషేధం విధించింది. అయితే కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ జోక్యంతో ఈ రష్యా స్టార్ నిషేధాన్ని ఐటీఎఫ్ 15 నెలలకు కుదించింది. నిషేధం గడువు పూర్తయిన వెంటనే... ఏప్రిల్ 26న మొదలయ్యే స్టుట్గార్ట్ ఓపెన్‌లో షరపోవా పునరాగమనం చేయనుంది. ఆ తర్వాత మే 6 నుంచి 13 వరకు జరిగే మాడ్రిడ్ ఓపెన్‌లో, మే 15 నుంచి 21 వరకు జరిగే రోమ్ ఓపెన్‌లో ఆమె ఆడుతుంది. -
మళ్లీ లవ్ ఆల్
టెన్నిస్ క్రీడాకారిణి మారియా షరపోవా టెన్నిస్‌లో ‘లవ్’ అంటే జీరో. షరపోవా ఇప్పుడు ‘లవ్’లో ఉంది. ఆటను ఫ్రెష్‌గా... లవ్ నుంచి స్టార్ట్ చేయబోతోంది! అసలైతే... లవ్ అంటే ప్రేమ. షరపోవాను ఎంతోమంది లవ్ చేశారు. ఆమె మాత్రం ఆటనే లవ్ చేసింది. బ్యాన్ తర్వాత.. ఈ ఏడాది షరపోవా ఆడబోతున్న తొలి ఆట కోసం ప్రపంచమంతా కళ్లలో లవ్వొత్తులు వేసుకుని ఎదురు చూస్తోంది. షరపోవా కోపంగా ఉంది! కోపంగా ఉన్నప్పుడు రాకెట్‌తో లాగిపెట్టి బంతిని కొడుతుంది. ప్రాక్టీస్ వాల్‌ను పిడిగుద్దులు గుద్దినట్టుగా బంతిని వాల్ పైకి ఈడ్చి కొడుతూనే ఉంటుంది. షరపోవా మంచి అమ్మాయి. ఊరికినేతనకు కోపం రాదు. చేసిన తప్పు కాదు... చెప్పిన తప్పు! కొన్నాళ్లుగా షరపోవా కోపంగానే ఉంటోంది. ఏడాది క్రితం డోపింగ్ టెస్ట్‌లో ఆ అమ్మాయి దొరికిపోయింది. నిజానికి ‘దొరికిపోయేంత’ పెద్ద తప్పు తనేం చేయలేదు. ‘అరె! ఈ మందును నేను ఎప్పటి నుంచో వాడుతున్నా’ అని పబ్లిగ్గా చెప్పింది. అదే తప్పయింది! నిరుడు జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు డ్రగ్ టెస్ట్ చేసినప్పుడు ఆమె ఒంట్లో ‘మెల్డోనియం’ అనే మందు బయటపడింది. అదేమీ నిషేధించిన ఔషధం కాదు. అయితే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 2016 జనవరి 1 నుంచి నిషేధిత ఔషధాలలో దానిని కూడా చేర్చడంతో షరపోవా దోషి కావలసి వచ్చింది! అందుకు పడిన శిక్ష ఆట నుంచి రెండేళ్ల బ్యాన్! షరపోవా నివ్వెరపోయింది. తన వాదన వినిపించింది. శిక్షాకాలం రెండేళ్ల నుంచి పదిహేను నెలలకు తగ్గిపోయింది. కానీ షరపోవా కోపం తగ్గిపోలేదు. తలో రాయి విసిరినా.. నో సారీ కోపంగా ఉన్నప్పుడు షరపోవా గోడల్ని పగలగొట్టే మాట నిజమే కానీ, ఇప్పుడామె కొద్దిగా మారింది. కోపం నుంచి కొద్దికొద్దిగా పికప్ అవుతోంది. మెడిటేషన్ చేస్తోంది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చిన్నపాటి అధ్యయనం చేస్తోంది. మంచి మంచి బుక్స్ చదువుతోంది. బయోగ్రఫీ రాస్తోంది. ఇవి కాక.. బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోంది! బాక్సింగ్ మధ్యలో తనకు నచ్చని వ్యక్తులు గుర్తొస్తే, ఆ కోపాన్ని బాక్సింగ్ బ్యాగ్ మీద చూపిస్తోంది. బ్యాగ్‌కి ఏమీ కాదు. కానీ పంచ్ పడిన ప్రతిసారీ.. ఆమె లోపల కదలాడే మనుషుల దవడలు పగిలిపోతున్నాయి! నైస్. ఎవరివై ఉంటాయి షరపోవా ఊహాల్లోని ఆ శత్రుచిత్రాలు? ఎవరివైనా కావచ్చు. ఆమెను చాలామందే చికాకు పరిచారు. డేవిడ్ హెగర్టీ! ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్. ఆమె బ్యాన్ నిర్ణయం అతడిదే; ఇంకా.. సాటి ప్లేయర్లు జాన్ మెకన్రో, ప్యాట్ క్యాష్, జెన్నిఫర్ కాప్రియాటీ, సెరెనా విలియమ్స్, రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్, ఆండీ ముర్రే, నొవాక్ జొకోవిచ్.. వీళ్లలో ఎవరి దవడలైనా కావచ్చు. వీళ్లంతా తలో మాట వేశారు. ఇలా చేసిందంటే నమ్మలేక పోతున్నాం అని ఒకరు, తన 35 టైటిళ్లనీ వెనక్కు తీసేసుకోవాలి అని ఒకరు, సారీ చెప్పినా ఒప్పుకోవద్దని ఒకరు... ఇలా తలో రాయి విసిరారు. షరపోవా ఇప్పటికీ సారీ చెప్పలేదు. ఎప్పటికీ చెప్పేది లేదని కూడా అన్నారు. బ్యాన్ తీరిపోయాక జర్మనీలోని స్టట్గార్ట్ క్లే కోర్టులో ఏప్రిల్ 26న తొలి టోర్నమెంట్ ఆడబోతున్నారు. ఆట ఒక్కటే నిజమైన బాయ్‌ఫ్రెండ్ ఇష్టమైన వాళ్లకు దూరంగా ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా దూరంగా ఉండగలం. ఇష్టమైన ఆటకు ఒక రోజు కూడా ఉండలేం. షరపోవాకు టెన్నిస్ అంటే కేవలం ఇష్టం కాదు. ప్రాణం. పద్దెనిమిదవ యేటే టెన్నిస్‌లో ఆమె వరల్డ్ నం.1 ర్యాంకులోకి వచ్చేశారు. అదే ఏడాది 18వ బర్త్‌డే పార్టీలో అమెరికన్ పాప్ రాక్ బ్యాండ్ ‘మెరూన్ 5’ సింగర్ ఆడమ్ లెవీన్ ఆమెకు పరిచయం అయ్యాడు. డేటింగ్ అయ్యాక అతడు లేడు. ఆట మాత్రమే ఉంది. తర్వాత అమెరికన్ టెలివిజన్ ప్రొడ్యూజర్ చార్లీ ఎబర్సోల్ ఆమె జీవితంలోకి వచ్చాడు. కొన్నాళ్ల డేటింగ్ తర్వాత అతడూ లేడు. ఆట ఉంది. ఆ తర్వాత స్లొవేనియా బాస్కెట్‌బాల్ ప్లేయర్ సషా ఉజాసిక్, తర్వాత బల్గేరియన్ టెన్నిస్ ప్లేయర్ గ్రిగర్ డిమిట్రోవ్. వీళ్లూ మిగల్లేదు! ప్రతిసారీ ఆట ఒక్కటే షరపోవాతో ఉంటోంది. ఆట కోసం ప్రేమను వదులుకోవడం లేదు షరపోవా. ఆటను మాత్రమే ఆమె ప్రేమించింది. పన్నెండేళ్ల క్రితం వరల్డ్ నంబర్ 1 అయిన షరపోవాకు ఇప్పుడు ఏ ర్యాంకూ లేదు. మళ్లీ కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టాలి. ర్యాంకులే ఆమె జీవితం అని కాదు దీని అర్థం. అసలంటూ రాకెట్ పట్టడమే ఆమె లైఫ్. షరపోవా రష్యన్ ప్రొఫెషనల్ ప్లేయర్. ఇరవై రెండేళ్లుగా యు.ఎస్.లో ఉంటోంది. ఒలింపిక్ మెడలిస్ట్. గెలిస్తే ప్రాక్టీస్... ఓడితే షాపింగ్! మ్యాచ్ గెలిచినప్పుడు షరపోవా వెంటనే తర్వాతి మ్యాచ్‌కు ప్రాక్టీస్ మొదలు పెడతారు. మ్యాచ్‌లో ఓడిపోయినప్పుడు ఆ ప్రెజర్ నుంచి బయట పడడానికి షాపింగ్‌కి వెళతారు! ఇప్పుడంటే బ్యాన్ టైమ్‌లో సరదాగా బాక్సింగ్‌కి వెళుతున్నారు కానీ, షరపోవాకు టెన్నిస్ తప్ప మరే ఆటా ఇష్టం లేదు. పిప్పీ లాంగ్‌స్టాకింగ్ బుక్స్ చదివే అలవాటు ఆమెకు ఇంకా పోలేదు. ‘ఇంకా’ అంటే.. ఇంత పెద్దయినా! పిప్పీ లాంగ్‌స్టాకింగ్... స్వీడిష్ రచయిత్రి ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ నవలల్లోని ఒక అమ్మాయి క్యారెక్టర్. పిప్పీ జుట్టు ఎర్రగా ఉంటుంది. రెండు జడలు ఉంటాయి. సింగిల్ హ్యాండ్‌తో తన గుర్రాన్ని అదుపు చేస్తుంటుంది. చురుగ్గా ఉంటుంది. ఆ పాత్రలో తనను తాను ఊహించుకుంటుందట షరపోవా. అందుకే ఆమెకు పిప్పీ అంటే అంతిష్టం. బాల్యం నుంచి దూర దూరంగా వచ్చేస్తున్నకొద్దీ, బాల్యం ఆమెకు దగ్గర దగ్గరగా రావడం షరపోవా జీవితంలోని ఒక విశేషం. చిన్నపిల్ల నవ్వు, చిన్నపిల్ల చూపు, చిన్నపిల్ల వెక్కిరింపు ఇవెక్కడికీ పోలేదు. ఆమె దగ్గర చిన్నప్పటి స్టాంప్ కలెక్షన్ ఇంకా పోగవుతూనే ఉంది. చిన్నప్పటి ఆమె జ్ఞాపకాల సుగంధ పరిమళం స్టెల్లా మెకార్ట్నీ ఎప్పుడూ ఆమె ఒంటిని అంటుకునే ఉంటుంది! యాదృచ్ఛికంగా.. అదే రోజు! సోవియెట్ యూనియ¯Œ లో చెర్నోబిల్ అణు ప్రమాదం సంభవించిన తర్వాత ఏడాదికి న్యాగన్ పట్టణంలో షరపోవా పుట్టింది. ఆ పట్టణం చెర్నోబిల్ దుర్ఘటన జరిగిన ప్రిప్యత్ పట్టణానికి 3,500 కి.మీ. దూరంలో ఉంటుంది. ఉండడం కాదు, చెర్నోబిల్ ప్రమాద ప్రభావం పడకుండా ఉండేందుకు షరపోవా తల్లిదండ్రులే ముందు జాగ్రత్తగా ప్రిప్యత్ నుంచి ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా వెళ్లిన తర్వాతే బిడ్డను కనాలని నిర్ణయించుకుని న్యాగన్‌లో తలదాచుకున్నారు. చెర్నోబిల్ ప్రమాదం 1986 ఏప్రిల్ 26న జరిగింది. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే రోజున షరపోవా తన ‘రీబర్త్’ టెన్నిస్‌ను ఆడబోతున్నారు. తండ్రి స్నేహితుడు రాకెట్ ఇచ్చాడు షరపోవాకు రెండేళ్ల వయసులో ఆమె కుటుంబం సోచ్ సిటీకి మారింది. అక్కడ ఆమె తండ్రికి అలెగ్జాండర్ కఫెల్కి కోవ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అలెగ్జాండర్ తన పద్నాలుగేళ్ల కొడుకు ఎవ్‌జెనీకి టెన్నిస్‌లో శిక్షణ ఇప్పిస్తున్నప్పుడు ఈ ఇద్దరి పెద్దమనుషులు కలుసుకోవడం జరిగింది. తర్వాత రెండేళ్లకు తండ్రితో పాటు ఆట చూడడానికి వచ్చిన షరపోవాను చూసి ముచ్చట పడి ఆ చిన్నారికి కూడా ఓ టెన్నిస్ రాకెట్ కొనిచ్చాడు అలెగ్జాండర్. అదే తొలిసారి షరపోవా రాకెట్ పట్టుకోవడం. లోకల్ పార్క్‌లో చాలాకాలం పాటు ఆ రాకెట్‌తోనే ఆడింది షరపోవా. తర్వాత రష్యన్ కోచ్ యూరి యట్కిన్ దగ్గర టెన్నిస్ పాఠాలు నేర్చుకుంది. తొలి ఆటలోనే షరపోవాలోని అతి ప్రత్యేకమైన ‘హ్యాండ్–ఐ కోఆర్డినేషన్’ని గమనించాడు కోచ్. మార్టినా నవ్రతిలోవా ‘లిఫ్ట్’ ఇచ్చారు! ఆరవ యేట మాస్కోలో మార్టినా నవ్రతిలోవా నడుపుతున్న టెన్నిస్ క్లినిక్‌లో చేరడం షరపోవా కెరీర్‌ను మలుపుతిప్పింది. మార్టినా ఈ చిన్నారిని ఫ్లోరిడాలోని ఐ.ఎం.జి.అకాడమీకి రికమండ్ చేశారు! ఆండ్రీ అగస్సీ, మోనికా సెలెస్, అన్నా కోర్నికోవా లాంటి టెన్నిస్ దిగ్గజాలు ట్రైనింగ్ తీసుకున్న అకాడమీ అది. కానీ షరపోవా తండ్రి దగ్గర డబ్బుల్లేవు. అప్పు చేయాలి. డబ్బైతే అప్పు చేయగలడు కానీ, ఇంగ్లిషులో మాట్లాడలేడు కదా! ఇంట్లో ఎవ్వరికీ ఇంగ్లిష్ రాదు. ఆ భయంతో ఏడాది తాత్సారం చేసి, చివరికి ధైర్యం చేశాడు. అయితే వీసా నిబంధనలు తండ్రీ కూతుళ్లను మాత్రమే యు.ఎస్.లోకి రానిచ్చాయి. తల్లి ఎలీనా రెండేళ్ల పాటు భర్తకు, కూతురికి దూరంగా రష్యాలోనే ఉండిపోవలసి వచ్చింది. కూతురి కోసం ప్లేట్లు కడిగాడు 1994లో షరపోవా, ఆమె తండ్రి తొలిసారి అమెరికాలో అడుగుపెట్టేనాటికి వాళ్ల దగ్గరున్న డబ్బు 700 డాలర్లు. ఇప్పటి లెక్కల్లో కేవలం 47 వేల రూపాయలు. వాటిని జాగ్రత్తగా వాడుకుంటూనే ఫ్లోరిడాలోని చుట్టుపక్కల ఇళ్లల్లో ప్లేట్లు కడగడం వంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు యూరి. తర్వాతి ఏడాదికల్లా అకాడమీ ప్రవేశానికి అర్హమైన తొమ్మిదేళ్ల వయసు రాగానే కూతుర్ని ఐ.ఎం.జి.లో చేర్చారు. ఇక షరపోవాకి ట్యూషన్ ఫీజు, ఇతర సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ అకాడమీవే. అలా కెరీర్‌తో పాటు, షరపోవా జీవితం కూడా యు.ఎస్.తో ఫిక్స్ అయిపోయింది. ఆటల్లోనే కాదు, చారిటీల్లో కూడా ఇప్పుడామె పెద్ద సెలబ్రిటీ. సర్వీస్ ఓరియెంటెడ్ యువ క్రీడాకారిణి. స్వీట్ ఎట్ హార్ట్! సుగర్‌పోవా అనే క్యాండీ అమెరికాలో విరివిగా దొరుకుతుంది. ఫన్నీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే స్వీట్‌గా ఉంటుంది. క్యాండీల వ్యాపారి జెఫ్ రూబిన్.. షరపోవా పేరు మీదే, ఆమెతో కలసి ఈ సుగర్‌పోవా క్యాండీని సృష్టించాడు. దాని అమ్మకాలపై వచ్చే డబ్బు ‘షరపోవా చారిటీ’కి వెళుతుంది. ఒక సందర్భంలో షరపోవా తన పేరును సుగర్పోవాగా మార్చుకోవాలని కూడా అనుకున్నారు! అంతగా షరపోవా వల్ల ఆ ప్రోడక్ట్ ఇమేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో షరపోవా చదువుతున్న షార్ట్‌టర్మ్ కోర్సు కూడా తన క్యాండీ బిజినెస్‌ను విస్తృతం చెయ్యడానికి ఉపయోగపడేదే. ఇదీ షరపోవా బ్రీఫ్ బయోగ్రఫీ. అసలు ఆమె ఇంగ్లిష్ ఎలా నేర్చుకుందీ, కనీస విద్యార్హతలు లేకుండానే హార్వర్డ్‌లో ఇప్పుడు కోర్సు ఎలా చేస్తోందీ అనే డీటెయిల్స్ కావాలనుకునేవారు తను రాయబోతున్న పుస్తకం కోసం వచ్చే సెప్టెంబర్ వరకు ఆగాలి. మొదట ఇంగ్లిష్‌లో, తర్వాత రష్యన్ భాషలో పబ్లిష్ కాబోతున్న ఆ పుస్తకం.. నో డౌట్.. ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత మహిళల టెన్నిస్ చరిత్రలో ఇప్పటివరకు 10 మంది మాత్రమే ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ (నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడం) ఘనతను అందుకున్నారు. అప్పటికే మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన షరపోవా 2012లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ దక్కించుకోవడం ద్వారా ఈ ఘనత సాధించారు. పద్నాలుగేళ్లకే ప్రొఫెషనల్ తొమ్మిదేళ్ల వయసులోనే అండర్–16 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన షరపోవా ఒక్కో మెట్టు అధిగమిస్తూ కెరీర్లో ముందుకు సాగారు. 14 ఏళ్లకే ప్రొఫెషనల్‌గా మారారు. 2003లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌ల్లో ఆడారు. 2004లో షరపోవా కెరీర్ మలుపు తిరిగింది. ఆ ఏడాది వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)పై వరుస సెట్లలో షరపోవా గెలిచి 17 ఏళ్లకే వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించి పెను సంచలనం సృష్టించారు. అదే ఏడాది సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సెరెనాను మరోసారి ఓడించి షరపోవా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి ఎగబాకారు. 2005లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సంపాదించారు. షరపోవా ఆటతీరు దూకుడుగా ఉంటుంది.. రివర్స్ ఫోర్‌హ్యాండ్ షాట్లు ఎక్కువగా ఆడే షరపోవా సంప్రదాయ వాలీ, ఓవర్‌హెడ్ స్మాష్‌లు అంతగా ఆడరు. వీటికి బదులు నెట్ వద్దకు దూసుకొస్తూ బంతి గాల్లో ఉన్నపుడు వాలీ షాట్లు ఆడటాన్ని ఇష్టపడతారు. ఆటద్వారా షరపోవా సంపాదించిన ప్రైజ్‌మనీ 3 కోట్ల 64 లక్షల 84 వేల 486 డాలర్లు (రూ. 245 కోట్లు). -
షరపోవాపై నిషేధం తగ్గింది
లాసానే: డోపింగ్ ఆరోపణలతో నిషేధం ఎదుర్కొంటున్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు కాస్త ఊరట లభించింది. ప్రస్తుతం తనపై రెండేళ్ల నిషేధం ఉండగా క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) 15 నెలలకు తగ్గించింది. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 26న తిరిగి షరపోవా బరిలోకి దిగనుంది. సీఏఎస్ నిర్ణయంపై రష్యా టెన్నిస్ సమాఖ్య (ఆర్టీఎఫ్) హర్షం వ్యక్తం చేసింది. తనపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య విధించిన నిషేధంపై షరపోవా జూన్ 9న సీఏఎస్‌లో అప్పీల్ చేసుకుంది. శక్తి సామర్థ్యాలను పెంచే వాడా నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియమ్ ఆనవాళ్లు తన శాంపిల్‌లో ఉండడంతో ఈ రష్యా స్టార్‌పై వేటు పడింది. -
షరపోవా 18వ‘సారీ’...
అదే ప్రత్యర్థి. అదే ఫలితం. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... ఏకంగా 18వసారి రష్యా స్టార్ మరియా షరపోవాకు సెరెనా విలియమ్స్ చేతిలో ఓటమి ఎదురైంది. అప్పుడెప్పుడో 2004లో డబ్ల్యూటీఏ టూర్ చాంపియన్‌షిప్‌లో చివరిసారి సెరెనాను ఓడించిన షరపోవా మళ్లీ ఈ అమెరికా నల్లకలువపై విజయం రుచి చూడలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్లోనే సెరెనా చేతిలో షరపోవా ఓడిపోవడం ఇది నాలుగోసారి. గతంలో ఈ టోర్నీలో రెండుసార్లు ఫైనల్లో, ఒకసారి సెమీస్‌లో సెరెనా చేతిలో ఓడిన షరపోవా ఈసారి మాత్రం క్వార్టర్ ఫైనల్లోనే చేతులెత్తేసింది. సెరెనా చేతిలో మళ్లీ ఓడిన రష్యా స్టార్ * ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మెల్బోర్న్: కొత్త ఏడాదిలోనూ అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తన జోరు కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ డిఫెండింగ్ చాంపియన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సెరెనా 6-4, 6-1తో ఐదో సీడ్ మరియా షరపోవా (రష్యా)ను చిత్తుగా ఓడించింది. గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 13 ఏస్‌లతో అదరగొట్టింది. తొలి సెట్లో ఒకసారి సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన షరపోవా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. ఇక రెండో సెట్లో సెరెనా రెండుసార్లు షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా షరపోవాతో 21 సార్లు తలపడిన సెరెనా 19 సార్లు గెలుపొందగా, అందులో 18 వరుస విజయాలున్నాయి. షరపోవా 2004 వింబుల్డన్ ఫైనల్లో, 2005 డబ్ల్యూటీఏ టూర్ చాంషియన్షిప్ ఫైనల్లో మాత్రమే సెరెనాపై గెలవగలిగింది. సెమీఫైనల్లో నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)తో సెరెనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సెరెనా 8-0తో రద్వాన్స్కాపై ఆధిక్యంలో ఉండటం విశేషం. మరో క్వార్టర్ ఫైనల్లో రద్వాన్‌స్కా 6-1, 6-3తో పదో సీడ్ కార్లా నవారో (స్పెయిన్)పై అలవోకగా గెలిచింది. సెమీస్‌లో ఫెడరర్‌తో జొకోవిచ్ ‘ఢీ’ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) సెమీఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-3, 6-2, 6-4తో ఏడో సీడ్ కీ నిషికోరి (జపాన్)పై గెలుపొందగా... మూడో సీడ్ ఫెడరర్ 7-6 (7/4), 6-2, 6-4తో ఆరో సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్, జొకోవిచ్ 22-22తో సమఉజ్జీగా ఉన్నారు. సానియాతో పేస్ అమీతుమీ మిక్స్డ్ డబుల్స్‌లో ఇద్దరు భారత స్టార్స్ లియాండర్ పేస్, సానియా మీర్జాలు ప్రత్యర్థులుగా తలపడనున్నారు. ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)తో జతకట్టిన సానియా... మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ఆడుతున్న లియాండర్ పేస్ మిక్స్డ్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మంగళవారం జరిగిన మూడో రౌండ్లో పేస్-హింగిస్ ద్వయం 6-1, 6-2తో రోజర్ (నెదర్లాండ్స్)-స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) జంటపై గెలుపొందగా... టాప్ సీడ్ సానియా-డోడిగ్ జోడీ 7-5, 6-2తో ష్వెదోవా (కజకిస్తాన్)-ఐజామ్ ఉల్ ఖురేషీ (పాకిస్తాన్) జంటను ఓడించింది. మహిళల డబుల్స్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జంట సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ 6-2, 4-6, 6-1తో అనాలెనా గ్రోనెఫెల్డ్ (జర్మనీ)-కోకో వాండెవాగె (అమెరికా)లపై విజయం సాధించింది. డబుల్స్ క్వార్టర్స్‌లో ప్రాంజల జంట జూనియర్ బాలికల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల భారత్‌కే చెందిన కర్మాన్‌కౌర్ థండితో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో ఐదో సీడ్ ప్రాంజల-కర్మాన్ ద్వయం 6-4, 4-6, 10-2తో ‘సూపర్ టైబ్రేక్’లో సికి కావో-జియా రెన్ (చైనా) జంటపై గెలిచింది. -
షరపోవా శుభారంభం
♦ రెండో రౌండ్లోకి సెరెనా ♦ జొకోవిచ్, ఫెడరర్ కూడా ♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మెల్బోర్న్: అంచనాలకు అనుగుణంగా రాణించిన పలువురు అగ్రశ్రేణి క్రీడాకారిణులు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రౌండ్ అడ్డంకిని సాఫీగా అధిగమించారు. మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా (అమెరికా), నిరుటి రన్నరప్ షరపోవా (రష్యా) శుభారంభం చేశారు. తొలి రౌండ్లో ఐదో సీడ్ షరపోవా 6-1, 6-3తో హిబినో (జపాన్)ను ఓడించగా... టాప్ సీడ్ సెరెనా 6-4, 7-5తో కామిల్లా గియోర్గి (ఇటలీ)పై కష్టపడి గెలిచింది. హిబినోతో జరిగిన మ్యాచ్‌లో షరపోవా 11 ఏస్‌లను సంధించింది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయినా, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-2, 6-3తో క్రిస్టినా మెక్‌హేల్ (అమెరికా)పై, ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 6-1తో కుమ్కుమ్ (థాయ్‌లాండ్)పై, పదో సీడ్ కార్లా నవారో (స్పెయిన్) 7-5, 6-4తో గొలుబిక్ (స్విట్జర్లాండ్)పై, 12వ సీడ్ బెలిండా (స్విట్జర్లాండ్) 6-4, 6-3తో అలీసన్ రిస్కీ (అమెరికా)పై, 13వ సీడ్ విన్సీ (ఇటలీ) 6-4, 6-2తో తమీరా పాశెక్ (ఆస్ట్రియా)పై, మాజీ ఐదో ర్యాంకర్ యుజిని బుచార్డ్ (కెనడా) 6-3, 6-4తో క్రునిక్ (సెర్బియా)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. ఏడుగురు సీడెడ్ క్రీడాకారిణులు ఓటమి: మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలోనే తొలి రోజు ఏడుగురు సీడెడ్ క్రీడాకారిణిలు ఇంటిదారి పట్టారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్, 16వ సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) 6-1, 6-7 (3/7), 4-6తో యూలియా పుతిన్సెవా (కజకిస్తాన్) చేతిలో; 17వ సీడ్ సారా ఎరాని (ఇటలీ) 6-1, 5-7, 1-6తో సు సెయి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. క్రిస్టినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6-4, 7-6 (8/6)తో 25వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై, కియాంగ్ వాంగ్ (చైనా) 6-3, 6-3తో 24వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై, ఎలిజవెటా కులిచ్కోవా (రష్యా) 7-5, 6-4తో 22వ సీడ్ ఆండ్రియా పెట్కోవిచ్ (జర్మనీ)పై, లారెన్ డేవిస్ (అమెరికా) 1-6, 6-3, 6-4తో పావ్లీచెంకోవా (రష్యా)పై, దరియా కసత్కినా (రష్యా) 6-3, 6-3తో 27వ సీడ్ కరోలినా షిమిద్లోవా (స్లొవేకియా)పై సంచలన విజయాలు సాధించారు. వేట మొదలు: ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టాప్ సీడ్, నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ తొలి రౌండ్లో 6-3, 6-2, 6-4తో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా)పై గెలిచి శుభారంభం చేశాడు. మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-2, 6-1, 6-2తో బాసిలాష్విలి (జార్జియా)పై, ఏడో సీడ్ కీ నిషికోరి (జపాన్) 6-4, 6-3, 6-3తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై, తొమ్మిదో సీడ్ జో విల్ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్) 6-4, 4-6, 6-4, 6-2తో బగ్ధాటిస్ (సైప్రస్)పై నెగ్గి రెండో రౌండ్లోకి చేరుకున్నారు. 14వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్), 15వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) కూడా రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. గతేడాది మాదిరిగానే భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ ఈసారీ తొలి రౌండ్లోనే నిష్ర్కమించాడు. ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)తో జరిగిన మ్యాచ్‌లో యూకీ 5-7, 1-6, 2-6తో ఓడిపోయాడు. -
పవర్ ఆఫ్ సెరెనా
• సెరెనా విలియమ్స్ బయోగ్రఫీ ఎత్తు: 5 అడుగుల 9 అంగుళాలు (1.75 మీటర్లు) బరువు: 70.5 కిలోలు ఆమె షూ సైజ్ 10 సెరెనా గరిష్ట సర్వీస్ స్పీడ్ గంటకు 207 కిలోమీటర్లు. టెన్నిస్ చరిత్రలో మహిళల్లో అత్యధిక వేగంతో (210.8) సర్వీస్ చేసింది జర్మనీ క్రీడాకారిణి లిసికి. పదేళ్లు కూడా లేని పసితనంలోనే వర్ణవివక్ష సమస్యలు ఎదురైతే... అవి జీవితాంతం వెంటాడుతుంటే ఎవరికైనా కసి పెరుగుతుంది. ఆ కసిని పాజిటివ్ ఎనర్జీగా మలుచుకుంది సెరెనా విలియమ్స్. చరిత్రలోనే అతి గొప్ప టెన్నిస్ స్టార్‌గా ఎదిగింది. స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ మ్యాగజైన్ ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు గెలుచుకుంది. ఓటమితో ఎప్పుడూ కుంగిపోకూడదు. తిరిగి లేవాలి. మరింత కష్టపడాలి. మరింత సాధన చేయాలి. నేను జీవితంలో ప్రతిసారీ అదే చేశాను. ఎప్పుడూ వదలొద్దు అని చాలా మంది చెబుతుంటారు. కానీ ఆ విషయాన్ని మనసులోకి తీసుకుని పోరాడితేనే తిరిగి మళ్లీ పైకి లేవగలుగుతాం. అందుకే ఎప్పుడూ దేని గురించి నిరాశ చెందకూడదు. తిరిగి పోరాడాలి. మానసిక బలమే... సెరెనా టెన్నిస్ ఆడుతుంటే ప్రత్యక్షంగా చూడటం చాలా బాగుంటుంది. మ్యాచ్‌లో వెనకబడిన సమయంలో తనని తాను ప్రోత్సహించుకోవడానికి కేకలు పెడుతుంది. ఇక ఓ గొప్ప పాయింట్ సాధించినప్పుడు తన అరుపు ప్రత్యర్థికే కాదు... ప్రేక్షకుల్లోనూ భయం పెంచుతుంది. ఫిజికల్‌గా ఎంత ఫిట్‌గా ఉంటుందో... మెంటల్‌గా కూడా అంతే బలంగా ఉండటం సెరెనా విజయ రహస్యం. అయితే దీనిని తెచ్చింది మాత్రం ఆమె బాల్యమే. వామ్మో... సిస్టర్స్! 1999 నుంచి 2003 వరకు సెరెనా సిస్టర్స్‌ది స్వర్ణయుగం. ఏ టోర్నీ జరిగినా సింగిల్స్‌లో వాళ్లే. డబుల్స్‌లో వాళ్లే. తర్వాత గాయాలు, ఫామ్‌లేమి కారణాలతో కాస్త వెనకబడ్డా... తిరిగి 2009-10 సమయానికి తిరిగి మళ్లీ ప్రపంచాన్ని వణికించారు. కానీ క్రమంగా అక్క ఆట తేలిపోయింది. దీంతో సెరెనా సింగిల్స్‌కే పరిమితమైంది. ఆ ఫిట్‌నెస్‌కు సలామ్ ప్రస్తుతం సెరెనా వయసు 34 సంవత్సరాలు. ఫెడరర్ వయసు కూడా అంతే. అయితే ఫెడరర్ మీద వయసు ప్రభావం ఎంతో కొంత కనిపిస్తోంది. కానీ అదేంటో సెరెనా మాత్రం రోజు రోజుకూ మరింత ఫిట్‌గా తయారవుతోంది. ప్రొఫెషనల్ టెన్నిస్ సర్క్యూట్‌లోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయినా... మధ్యలో అనేక సార్లు గాయాల గండాలను అధిగమించినా... ఇంకా ఆ ఫిట్నెస్ అలాగే ఉంది. రికార్డులు ఇప్పటివరకు సెరెనా 21 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్, 13 డబుల్స్ టైటిల్స్, 2 మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ సాధించింది. అటు పురుషుల్లోగానీ, ఇటు మహిళల్లోగానీ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ‘కెరీర్ గోల్డెన్‌స్లామ్’ (నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తోపాటు ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గడం) సాధించిన ఏకైక ప్లేయర్ సెరెనాయే. మహిళల క్రీడా ప్రపంచంలో ఇప్పటివరకు టోర్నమెంట్ల ద్వారా అత్యధిక ప్రైజ్‌మనీ (7 కోట్ల 40 లక్షల 83 వేల 421 డాలర్లు-రూ. 489 కోట్లు) సంపాదించిన క్రీడాకారిణిగా గుర్తింపు. 30 ఏళ్ల వయసు దాటాక ఎనిమిది గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ఏకైక క్రీడాకారిణిగా గుర్తింపు. నిజమైన చాంపియన్ సెరెనాతో ఆడటం ఎవరికీ సులభం కాదు. ఎందుకంటే తను ఏ పాయింట్ కూడా సులభంగా ఇవ్వదు. బ్రేక్ పాయింట్ దగ్గర అయినా, మ్యాచ్ పాయింట్ దగ్గర అయినా ఏ దశలో అయినా ప్రత్యర్థి తన శక్తినంతా ఉపయోగించి పోరాడితేనే పాయింట్ దక్కుతుంది. అందుకే సెరెనా నిజమైన చాంపియన్ - షరపోవా మోడల్‌గా ఉన్నారా? ఫ్యాషన్ డిజైనర్. సొంతంగా స్విమ్ సూట్స్, ఇన్నర్‌వేర్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. న్యూయార్క్ ఫ్యాషన్ షోలో కనిపిస్తుంది. తన ఉత్పత్తులకు తనే మోడల్. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంత సంపాదించారు? స్పాన్సర్స్ ద్వారా ఏడాదికి 85 మిలియన్ డాలర్లు (రూ.561 కోట్లు) సంపాదిస్తుంది. తనకంటే షరపోవా 90 మిలియన్ డాలర్లు (రూ.594 కోట్లు) ఎక్కువ సంపాదిస్తుంది. ఓవరాల్‌గా ఫెడరర్, షరపోవా తర్వాత స్థానం సెరెనాది. షూ సైజ్? 10. నటన? పలు టీవీ సిరీస్‌లలో నటించింది. ఒకట్రెండు సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ వేసింది. ఇండియా వచ్చిందా? సెరెనా తొలిసారి 2008లో బెంగళూరు వచ్చింది. ఆ సమయంలో ఆమె, అక్క వీనస్ కలిసి చీర కట్టి ఓ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. టెన్సిస్ కోర్టులో కన్నీళ్లు పెట్టిన సందర్భం? 2012 ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్ మ్యాచ్‌లో రెండో సెట్ టై బ్రేకర్‌లో 5-1 ఆధిక్యంలో ఉంది. ఇక ఒక్క పాయింట్ వస్తే టైటిల్ గెలిచేది. ఈ దశ నుంచి మ్యాచ్ పోగొట్టుకుంది. ఈ ఓటమి తర్వాత దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. గాయాల కారణంగా ఏడ్చిన సందర్భాలు ఉన్నా... మ్యాచ్ ఓడిపోయాక బాగా ఎమోషన్ కావడం 2012లోనే. ప్రేమాయణం 2002లో కేస్వాన్ జాన్సన్ అనే పుట్‌బాల్ ఆటగాడితో ప్రేమ 2004 నుంచి 2006 వరకు డెరైక్టర్ బ్రెట్ రాట్నర్తో ప్రేమ 2007 నుంచి ఏడాది పాటు నటుడు జాకీలాంగ్తో ప్రేమాయణం 2008 నుంచి రెండు సంవత్సరాల పాటు కామన్ అనే పేరున్న సింగర్‌తో ప్రేమలో గడిపింది అమెరికా బాస్కెట్‌బాల్ లీగ్ ఎన్బీఏలో ప్లేబోయ్‌గా పేరున్న స్టోడిమేర్తో 2010లో కొంతకాలం ప్రేమాయణం 2011లో కెనడా సింగర్ డ్రేక్‌తో కొంతకాలం డేటింగ్ చేసింది 2012లో టెన్నిస్ క్రీడాకారుడు దిమిత్రోవ్‌తో కలిసి ఉన్నట్లు వార్తలు వచ్చాయి 2013 నుంచి ప్రస్తుతం వరకు టెన్నిస్ కోచ్ ప్యాట్రిక్‌తో ప్రేమలో ఉంది. ఓటమిని ఎలా స్వీకరిస్తుంది? ఓటమిని అంగీకరించదు. మ్యాచ్ ముగిశాక ఒక రోజు పాటు కోపంతోనే ఉంటుంది. పలుసార్లు మ్యాచ్ ఓడిపోయాక మీడియా ప్రశ్నలకు విసుగ్గా సమాధానం చెప్పింది. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ! అమెరికాలో వైద్య విద్యకు ముందు విద్యార్థులు చదివే పుస్తకం. ముఖచిత్రం సెరెనా విలియమ్స్‌ది. మనిషి శరీరం బాగా క్లిష్టమైన స్థాయిలో ఎలా పని చేస్తుందో ఈ పుస్తకంలో వివరిస్తారు. దిగ్గజాలుగా ఎదిగిన క్రీడాకారుల మెంటాలిటీ ఒకటే. పోరాడు... చివరి క్షణం దాకా పోరాడు. సెరెనా కూడా అటు కోర్టులో ప్రత్యర్థులతో, ఇటు కోర్టు బయట జాత్యహంకారులతో పోరాడుతూనే ఉంది. ఎవరైనా కోర్టులోకి వస్తున్నప్పుడు ఎంతో కొంత ఒత్తిడితో ఉంటారు. కానీ సెరెనా మాత్రం మ్యాచ్ గెలవబోతున్నాననే ధీమాతో వస్తుంది. నిజానికి తనను చూస్తే ప్రత్యర్థి సగం మ్యాచ్‌కు ముందే ఓడిపోతుంది. ఇలాంటి లక్షణం గతంలో మైక్ టైనస్లో కనిపించేది. ప్రత్యర్థులెవరూ అతని కళ్లలోకి చూసేవారు కాదు. చూస్తే భయంతో ఓడిపోతారని. ప్రస్తుతం సెరెనా కూడా టైసన్ లాగే ప్రత్యర్థులను వణికిస్తోంది. మూడేళ్ల వయసులోనే సెరెనా విలియమ్స్ అమెరికాలోని చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. ఐదుగురు అక్కచెల్లెళ్లలో ఆమె చిన్నది. వాళ్ల అమ్మ ఆరెసెన్ ప్రిన్స్‌కు ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత రిచర్డ్ విలియమ్స్‌ను రెండో వివాహం చేసుకుంది. రిచర్డ్ విలియమ్స్ దంపతులకు తొలి సంతానం వీనస్. రెండో అమ్మాయి సెరెనా. రిచర్డ్‌కు టెన్నిస్ అంటే ఆసక్తి ఎక్కువ. ఈ ఆటలో మాత్రమే డబ్బులు బాగా వస్తాయని, ఒక్క గ్రాండ్‌స్లామ్ గెలిస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని చిన్న వయసులోనే రాకెట్స్ కొని కూతుళ్లు ఇద్దరికీ ఇచ్చేశాడు. 1984లో మూడేళ్ల వయసులో సెరెనా తొలిసారి టెన్నిస్ రాకెట్ చేతబట్టింది. అయితే నల్ల జాతీయులను అమెరికాలో స్వేచ్ఛగా ఆడుకోనివ్వరని రిచర్డ్స్కు భయం. చాలాకాలం పాటు ఇంట్లోనే కూతుళ్లకు టెన్నిస్ నేర్పించాడు. చిన్నగా టోర్నీలకు పంపడం ప్రారంభించాడు. తన జాతకాన్ని మార్చేది వీనస్ అని రిచర్డ్స్ నమ్మకం. పదేపదే అదే మాట అనేవాడు. దీనివల్ల తెలియకుండానే ఓ వివక్ష చూపించాడు. అలా ఆరేళ్ల వయసులోనే సెరెనాకు అర్థమైపోయింది... గెలవాలంటే పోరాడాలని. ప్రత్యర్థి ప్రపంచమే! క్రమంగా అక్కాచెల్లెళ్లు బయటకు వెళ్లి టోర్నమెంట్స్ ఆడటం మొదలుపెట్టారు. వీనస్ కంటే సెరెనా బాగా ఆడేది. పదేళ్ల వయసు వచ్చేసరికి సెరెనా ఆ ఏజ్ గ్రూప్‌లో అమెరికాలో నంబర్‌వన్‌గా ఎదిగింది. అయితే సెరెనా విజయాలను శ్వేత జాతీయుల తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. జాతి వివక్ష వ్యాఖ్యలు మొదలయ్యాయి. అప్పుడు సెరెనాకు బాగా తెలిసిపోయింది... తాను పోరాడాల్సింది ప్రపంచంతో అని. పాఠశాలలో హేళన... వెక్కిరించే అబ్బాయిలు... అడుగడుగునా కనిపించే ‘వివక్ష’. 1995లో తొలిసారి ప్రొఫెషనల్ సర్క్యూట్‌లోకి 14 ఏళ్ల వయసులో అడుగుపెట్టింది. ఆ తర్వాత రెండేళ్లకే మగవాళ్లకు సవాళ్లు విసురుతూ.. తనపై గెలిచి చూపించమనేది. అటు వీనస్ కూడా అంతే. సెరెనాకు ఏమాత్రం తగ్గేది కాదు. అక్కాచెళ్లెల్లు ఎప్పుడూ ఒకే మాట మీద ఉండేవారు. ఎవరినైనా సవాల్ చేసేవారు. ‘ఓపెన్’ గెలిచినా వెక్కిరింతలే 1999లో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది. దీనికి కొద్దిగా ముందే ఫ్రెంచ్ ఓపెన్‌లో అక్కతో కలిసి డబుల్స్ టైటిల్ సాధించినా, సింగిల్స్ టైటిల్ నెగ్గడంలో ఉన్న మజా ఏంటో సెరెనాకు తెలిసింది. అంతేకాదు చిన్నప్పుడు తనని అవమానించిన వ్యక్తులు చూస్తుండగా... తన దేశంలోనే తొలిసారి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. అంతే... అప్పుడు ప్రారంభమైన ప్రస్థానం 2015 వరకూ కొనసాగుతూనే ఉంది. 2000వ సంవత్సరం నాటికి అక్కాచెళ్లెల్లు ఇద్దరు పీక్స్‌లోకి వచ్చేశారు. ఎవరు గెలుస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఆ ఇద్దరి మధ్య పోరాటం చూడటానికి టెన్నిస్ అభిమానులకు రెండు కళ్లు సరిపోయేవి కావు. టెన్నిస్ ప్రపంచం మీద విలియమ్స్ సిస్టర్స్ ముద్ర పడిపోతూ ఉన్న సమయంలో... ఓ ఆందోళన. అక్కాచెళ్లల్ల మధ్య మ్యాచ్‌లలో ఎవరు గెలవాలో తండ్రి రిచర్డ్స్ ముందే నిర్ణయిస్తున్నాడంటూ విమర్శలు వచ్చాయి. ఇది ఆ కుటుంబానికి షాక్. తామేంటో, తమ సత్తా ఏంటో చూపించినా... ఇంకా తేలికగా చూస్తున్నారు.... సెరెనా కోపం నషాళానికి అంటింది. అప్పుడు నిర్ణయించుకుంది... ఇక ఎవరినీ ఉపేక్షించకూడదని. చీదరించుకున్నా... చారిటీ కోసం... 2001లో ఇండియన్ వెల్స్ ఓపెన్. సెరెనా, వీనస్‌ల మధ్య మ్యాచ్. తనకు గాయం ఉందని ఆడలేనని వీనస్ ముందే చెప్పేసింది. కానీ నిర్వాహకులు మాత్రం ఆడుతుందనే ఆశతో చివరిక్షణం వరకు చూశారు. కానీ రాలేదు. దీంతో అభిమానులు అక్కాచెళ్లెల్లు కలిసి మోసం చేస్తున్నారని భావించారు. సెరెనా ఫైనల్ ఆడుతున్నప్పుడు అడుగడుగునా హేళన చేశారు. దీంతో సెరెనా 14 ఏళ్ల పాటు ఆ టోర్నమెంట్‌ను బహిష్కరించింది. ఎవరు ఎంత బతిమాలినా ఒప్పుకోలేదు. తాజాగా ఈ ఏడాది 2015లో మళ్లీ ఆ టోర్నమెంట్ ఆడింది. అది కూడా ఓ చారిటీ సంస్థ కోరిక మేరకు ఆడింది. అంపైర్లు కూడా ప్రత్యర్థులే ఇక 2004 యూఎస్ ఓపెన్‌లో అయితే ఏకంగా అంపైర్ సెరెనా పట్ల వివక్ష చూపించారు. పదే పదే కావాలని సెరెనాకు వ్యతిరేకంగా నిర్ణయాలు ఇచ్చారు. దీనిపై తను గొంతు విప్పింది. ఎందుకిలా? అంటూ ప్రశ్నించింది. ఫలితమే... హాక్ఐ (ఏ్చఠీజు ఉడ్ఛ) టెక్నాలజీ. అప్పుడు సెరెనా చేసిన పోరాటం వల్ల ఇప్పుడు మిగిలిన క్రీడాకారులంతా టెక్నాలజీ సహాయంతో న్యాయమైన నిర్ణయాలను చూస్తున్నారు. సెరెనా కోపాన్ని ఎప్పుడూ దాచుకోదు. 2009 యూఎస్ ఓపెన్‌లో తనకు వ్యతిరేకంగా నిర్ణయాలు వస్తున్నాయనే కోపంతో లైన్ అంపైర్‌ను చంపేస్తానని బెదిరించింది. అంతే... అవకాశం కాచుకుని కూర్చున్నవాళ్లంతా జూలు విదిల్చారు. మామూలుగా జరిమానాతో సరిపెట్టొచ్చు. కానీ నిషేధం విధిస్తామన్నారు. క్షమించమని బహిరంగంగా కోరితే నిర్ణయాన్ని సమీక్షిస్తామన్నారు. తనకు ఇష్టం లేకపోయినా శ్రేయోభిలాషుల సలహా మేరకు క్షమించమని కోరింది. నిషేధాన్ని తప్పించుకుంది, కానీ లక్షా 75 వేల డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. అయితే ఈ రెండు దశాబ్దాలలో సెరెనా శాంతించింది. వయసుతో పాటు తనలో పరిణితి కూడా వచ్చింది. అయినా కోర్టులో అడుగుపెట్టగానే వచ్చే కసి మాత్రం తగ్గలేదు. తగ్గదు కూడా. తనలో ఆ తపన, పట్టుదల తగ్గిన రోజు సెరెనా కోర్టులో కనిపించదు. - బత్తినేని జయప్రకాష్ -
క్రీడల్లో కుబేరులు వీరే
-
షరపోవా..సెరెనా.. ఓ బాయ్ ఫ్రెండ్!
ఒకరు అగ్నిగోళం. ఒకరు మంచు కొండ. ఒకరంటే ఒకరికి పడదు. మైదానంలోకి దిగితే ఒకరిపై ఒకరు నిప్పులు కురిపిస్తారు. మరొకరు మంచు తుపాను రేపుతారు. అయినా ఆటలో ఎప్పుడూ అగ్ని గోళానిదే పైచేయి. వారే ప్రస్తుతం వింబుల్డన్ ఛాంపియన్షిప్ పోటీల్లో పరస్పరం తలపడుతున్న సెరెనా విలియమ్స్, మరియా షరపోవా.... షరపోవా నుంచి సెరెనా విలియమ్స్ ఆటను గెల్చుకోగా, ఆమె బాయ్ ఫ్రెండ్‌ను షరపోవా గెలుచుకుంది. వీరు ఒక దశలో ఆటలో పోట్లాడుకున్నట్టే బహిరంగంగా బాయ్ ఫ్రెండ్ గురించి పోట్లాడుకున్నారు. ఆ బాయ్ ఫ్రెండే బల్గేరియా టెన్నిస్ యువ కిశోరం గ్రిగర్ దిమిత్రోవ్...ఆయన టెన్నిస్ ఆట ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెడరర్‌ను తలపింపచేస్తోంది. కనుక ఆయన అభిమానులు ఆయన్ని బేబీ ఫెడ్ అని కూడా పిలుస్తారు. దిమిత్రోవ్ తనను విడిచి వెళ్లిన కొన్ని వారాలకు 2012, జూలైలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విలియమ్స్ ఆ బాయ్ ఫ్రెండ్ గురించి ఇలా వ్యాఖ్యానించారు ‘నేను ఆయనతో డేటింగ్ వదిలేశాను. ఎందుకో అది నాకు అచ్చిరాలేదు. నాలో ఉద్వేగం పాలెక్కువ. నా గుండె తరుక్కుపోయింది. అందరు తప్పు చేసినట్టుగానే నేనూ తప్పుచేశాను. ఆ విషయాన్ని తలుచుకుంటే భరించలేను’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై షరపోవా స్పందిస్తూ ‘ఆమె... ఆమెకు సంబంధించిన వ్యక్తిగత అంశాలు మాట్లాడదల్చుకుంటే, ఆమె ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ గురించి మాత్రమే మాట్లాడాలి. ఎవరైతే ఇద్దరు పిల్లలు కలిగి ఉండి భార్య నుంచి డైవోర్స్ తీసుకోబోతున్నారో ఆ బాయ్ ఫ్రెండ్ గురించి మాత్రమే మాట్లాడాలి’ అని ఫెంచ్ టెన్నిస్ కోచ్ పాట్రిక్ మౌరతొగ్లౌను దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించారు. దిమిత్రోవ్ కూడా తొలుత పాట్రిక్ దగ్గరే శిక్షణ పొందాడు. అప్పటికే ఆయన వద్ద శిక్షణ పొందుతున్న విలియమ్స్‌తో అక్కడే ఆయనకు పరిచయమైంది. కొంతకాలం వారిద్దరి మధ్య ప్రేమాయణం సాగింది. అనంతరం దిమిత్రోవ్ మరో కోచ్వద్దకు మారిపోయాక షరపోవాతో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం దిమిత్రోవ్‌తో షరపోవా ప్రేమాయణం సాగిస్తుంటే పాట్రిక్‌ను విలియమ్స్ పెళ్లి చేసుకోబుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు 33 ఏళ్ల విలియమ్స్ ఇద్దరు ర్యాప్ సింగర్లతో ప్రేమాయణం సాగించగా, షరపోవా ఓ టెన్నిస్ ప్లేయర్, ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్, ఓ సినిమా నిర్మాతతో ప్రేమాయణం సాగించారు. వీరి ఇద్దరి ప్రేమాయణం ఈసారైనా పెళ్లిదాకా వెళుతుందా లేదా ? అన్నది వేచి చూడాలి. -
షరపోవా సెరెనా షో
-
షరపోవా సెరెనా షో
ఇక సెమీస్‌లో అమీతుమీ - ముగురుజా సంచలనం - వింబుల్డన్ టోర్నమెంట్ లండన్: తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడిన మరియా షరపోవా (రష్యా), సెరెనా విలియమ్స్ (అమెరికా) వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ షరపోవా 6-3, 6-7 (3/7), 6-2తో అన్‌సీడెడ్ కోకో వాండెవెగె (అమెరికా)పై... టాప్ సీడ్ సెరెనా 3-6, 6-2, 6-3తో 23వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై కష్టపడి గెలిచి సెమీస్‌లో అమీతుమీకి సిద్ధమయ్యారు. రెండు క్వార్టర్స్‌లోనూ షరపోవా, సెరెనా నిర్ణాయక మూడో సెట్లో తమ అసలు సిసలు ఆటతీరును కనబరిచారు. వాండెవెగెతో 2 గంటల 45 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌ను షరపోవా రెండో సెట్లోనే ముగించాల్సింది. అయితే క్వార్టర్స్ చేరే క్రమంలో ముగ్గురు సీడెడ్ క్రీడాకారిణులను (6వ సీడ్ సఫరోవా, 22వ సీడ్ సమంతా స్టోసుర్, 11వ సీడ్ ప్లిస్కోవా) ఓడించిన వాండెవెగె అద్భుత పోరాటంతో పుంజుకుంది. రెండో సెట్లో 5-4తో ఆధిక్యంలో ఉన్న షరపోవా పదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెటుకోవాల్సిన పరిస్థితిలో కోల్పోయింది. దాంతో స్కోరు 5-5తో సమమైంది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకున్నారు. టైబ్రేక్‌లో షరపోవా 3-0తో ముందంజ వేసినా... ఆ తర్వాత వాండెవెగె చెలరేగి వరుసగా ఏడు పాయింట్లను సాధించి రెండో సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో ఈ అమెరికా యువతార ప్రదర్శన చూశాక మరో సంచలనం నమోదవుతుందా అనే అనుమానం కలిగింది. అయితే కెరీర్లో 48వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న షరపోవా తన అనుభవాన్నంతా ఉపయోగించి నిర్ణాయక మూడో సెట్లో కోలుకుంది. ఆరంభంలోనే వాండెవెగె సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ మాజీ చాంపియన్ ఆ తర్వాత అదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. నాలుగు ఏస్‌లు సంధించిన ఈ రష్యా భామ 10 డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం. 2011 తర్వాత షరపోవా ఈ టోర్నీలో సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. అజరెంకాతో జరిగిన మ్యాచ్‌లో సెరెనా తొలి సెట్‌ను కోల్పోయినా... నిరుత్సాహ పడకుండా తర్వాతి రెండు సెట్లను నెగ్గి 2012 తర్వాత ఈ టోర్నీలో సెమీస్‌కు చేరింది. మరోవైపు 20వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) 7-5, 6-3తో టిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై నెగ్గి కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. అంతేకాకుండా 1997లో అరంటా శాంచెజ్ తర్వాత వింబుల్డన్ టోర్నీలో సెమీస్‌కు చేరిన తొలి స్పెయిన్ క్రీడాకారిణిగా ముగురుజా గుర్తింపు పొందింది. సెమీస్‌లో 13వ సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)తో ముగురుజా ఆడుతుంది. క్వార్టర్స్‌లో రద్వాన్‌స్కా 7-6 (7/3), 3-6, 6-3తో మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలిచింది. -
వింబుల్డన్ సెమీస్ లో షరపోవా
లండన్:వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో నాలుగో సీడ్ క్రీడాకారిణి మారియా షరపోవా సెమీ ఫైనల్ కు చేరింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో షరపోవా 6-3, 6-7, 6-2 తేడాతో వాందివెగీపై విజయం సాధించి సెమీస్ లో కి ప్రవేశించింది. తొలి సెట్ ను అవలీలగా గెలిచిన షరపోవా.. రెండో గేమ్ ను కోల్పోయింది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్ లో షరపోవా దూకుడుగా ఆడింది. ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఆ సెట్ ను కైవశం చేసుకుని టోర్నీలో మరో ముందడుగు వేసింది. -
ఒకే పార్శ్వంలో ఆ ముగ్గురు
లండన్ : ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఈసారి ముగ్గురు మాజీ చాంపియన్స్ రోజర్ ఫెడరర్, ఆండీ ముర్రే, రాఫెల్ నాదల్ ఒకే పార్శ్వంలో ఉన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే క్వార్టర్ ఫైనల్లో ముర్రే (బ్రిటన్)తో నాదల్ (స్పెయిన్) తలపడవచ్చు. ఈ మ్యాచ్‌లో నెగ్గినవారు సెమీఫైనల్లో ఫెడరర్ (స్విట్జర్లాండ్)తో ఆడే అవకాశముంది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు సెమీఫైనల్ వరకు సులువైన ‘డ్రా’ పడింది. జొకోవిచ్‌కు సెమీస్‌లో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ప్రత్యర్థిగా ఉండే అవకాశముంది. సోమవారం మొదలయ్యే వింబుల్డన్ టోర్నమెంట్‌కు సంబంధించి ‘డ్రా’ను శుక్రవారం విడుదల చేశారు. సెరెనా దారిలో షరపోవా మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), షరపోవా (రష్యా) ఒకే పార్శ్వంలో ఉన్నారు. వీరిద్దరూ సెమీఫైనల్లో తలపడే అవకాశముంది. అంతకుముందే నాలుగో రౌండ్లో తన సోదరి వీనస్‌తో సెరెనా ఢీకొనే చాన్స్ ఉంది. మరో పార్శ్వం నుంచి డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) సెమీఫైనల్ చేరే అవకాశముంది.‘డ్రా’ విడుదలకు ముందు గురువారం రాత్రి జరిగిన క్రీడాకారిణుల పార్టీలో షరపోవా, సెరెనా, ఇవనోవిచ్లతోపాటు క్విటోవా, అజరెంకా, లిసికి, యూజిన్ బౌచర్డ్ తదితర స్టార్ ప్లేయర్లు ఫ్యాషన్ దుస్తులతో సందడి చేశారు. -
ఇవనోవిచ్ జోరు
♦ ప్రిక్వార్టర్స్‌లో సెర్బియా స్టార్ ♦ షరపోవా, మకరోవా కూడా ♦ 11వ సీడ్ కెర్బర్‌కు షాక్ ♦ ఫ్రెంచ్ ఓపెన్ పారిస్ : తొలి రెండు రౌండ్లలో చెమటోడ్చిన మాజీ చాంపియన్ అనా ఇవనోవిచ్ మూడో రౌండ్లో మాత్రం చెలరేగింది. కేవలం 52 నిమిషాల్లో తన ప్రత్యర్థి ఆట కట్టించింది. సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో ఏడో సీడ్ ఇవనోవిచ్ 6-0, 6-3తో డోనా వెకిక్ (క్రొయేషియా)పై అలవోకగా గెలిచింది. 19 విన్నర్స్ కొట్టిన ఇవనోవిచ్ 11 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ షరపోవా (రష్యా), తొమ్మిదో సీడ్ మకరోవా (రష్యా), 13వ సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్) కూడా ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో షరపోవా 6-3, 6-4తో 26వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై, మకరోవా 6-2, 6-4తో వెస్నినా (రష్యా)పై, సఫరోవా 6-3, 7-6 (7/2)తో 20వ సీడ్ సబీనా లిసికి (జర్మనీ)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో ముగురుజా (స్పెయిన్) 4-6, 6-2, 6-2తో 11వ సీడ్ కెర్బర్ (జర్మనీ)పై, ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) 6-3, 6-4తో ఎనిమిదో సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) పై సంచలన విజయం సాధించారు. రెండో రౌండ్లో మూడో సీడ్, నిరుటి రన్నరప్ సిమోనా హలెప్‌ను బోల్తా కొట్టించిన మిర్యానా లూసిచ్ బరోనీ (క్రొయేషియా) మూడో రౌండ్లో 6-4, 3-6, 5-7తో అలీజా కార్నె (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. ఎదురులేని ఫెడరర్ పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) తన జోరును కొనసాగిస్తున్నాడు. మూడో రౌండ్లో ఫెడరర్ 6-4, 6-3, 6-2తో దామిర్ జుముర్ (బోస్నియా అండ్ హెర్జెగోవినా)పై గెలిచాడు. 20వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మూడో రౌండ్లో నాలుగో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-1, 6-7 (5/7), 6-3, 6-4తో పెయిర్ (ఫ్రాన్స్)పై, ఎనిమిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-4, 6-3, 6-2తో జాన్సన్ (అమెరికా)పై, 12వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్) 6-2, 6-7 (6/8), 6-7 (6/8), 6-3, 6-1తో నికొలస్ మహుట్ (ఫ్రాన్స్)పై, 20వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 3-6, 6-3, 6-1, 4-6, 6-1తో బెర్లోక్ (అర్జెంటీనా)పై నెగ్గారు. సానియా జంట ముందంజ మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా మీర్జా (భారత్) -మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 6-3, 6-4తో ఫోరెట్జ్-హెసి (ఫ్రాన్స్)లపై నెగ్గింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో పేస్ (భారత్)-నెస్టర్ (కెనడా) 7-6 (7/3), 6-2తో బెగెమన్ (జర్మనీ)-నోల్ (ఆస్ట్రియా)లపై, రోహన్ బోపన్న (భారత్)-మెర్జియా (రుమేనియా) 3-6, 6-3, 7-5తో ఆస్టిన్ క్రాయిసెక్-డొనాల్డ్ యంగ్ (అమెరికా)లపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. -
షరపోవా సులభంగా..
మూడో రౌండ్లోకి రష్యా స్టార్ ♦ మూడో సీడ్ హలెప్‌కు మిర్యానా షాక్ ♦ ఫెడరర్, నిషికోరి ముందంజ ♦ ఫ్రెంచ్ ఓపెన్ పారిస్ : గతేడాది విజేత షరపోవా మరో అలవోక విజయంతో ముందుకు దూసుకెళ్లగా... నిరుటి రన్నరప్ సిమోనా హలెప్ మాత్రం అనూహ్య ఓటమితో ఇంటిముఖం పట్టింది. ఫలితంగా సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో రోజు మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా భావించిన సిమోనా హలెప్‌కు వెటరన్ క్రీడాకారిణి మిర్యానా లూసిచ్ బరోని (క్రొయేషియా) షాక్ ఇచ్చింది. వరుస సెట్లలో 7-5, 6-1తో ఓడించి మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. గతేడాది యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ హలెప్‌ను బోల్తా కొట్టించిన 33 ఏళ్ల మిర్యానా అదే ఫలితాన్ని ఫ్రెంచ్ ఓపెన్‌లో పునరావృతం చేసింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్లో కీలకదశలో మిర్యానా భారీ సర్వీస్‌లు, శక్తివంతమైన గ్రౌండ్‌స్ట్రోక్స్‌తో విజృంభించింది. ఏకపక్షంగా జరిగిన రెండో సెట్లో మిర్యానా 5-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అతికష్టమ్మీద ఒక గేమ్ నెగ్గిన హలెప్ ఆ తర్వాత ఓటమిని తప్పించుకోలేకపోయింది. మ్యాచ్ మొత్తంలో మిర్యానా 29 విన్నర్స్ కొట్టగా, హలెప్ కేవలం ఐదింటితో సరిపెట్టుకుంది. తన దేశానికే చెందిన వితాలియా దియత్చెంకోతో జరిగిన రెండో రౌండ్లో షరపోవా ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు వితాలియా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఈ డిఫెండింగ్ చాంపియన్ 24 విన్నర్స్ కొట్టి, కేవలం ఎనిమిది అనవసర తప్పిదాలు చేసింది. తదుపరి రౌండ్లో సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)తో షరపోవా ఆడుతుంది. గతేడాది వీరిద్దరూ ప్రిక్వార్టర్ ఫైనల్లో తలపడగా, మూడు సెట్లలో షరపోవాను విజయం వరించింది. రెండో రౌండ్లో సమంతా స్టోసుర్ 6-0, 6-1తో అమందైన్ హెసి (ఫ్రాన్స్)పై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో 29వ సీడ్ అలీజా కార్నె (ఫ్రాన్స్) 6-2, 7-5తో డల్గెరు (రుమేనియా)పై, 13వ సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-2, 6-0తో కురుమి నారా (జపాన్)పై నెగ్గారు. పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-2, 7-6 (7/1), 6-3తో గ్రానోలెర్స్ (స్పెయిన్)పై, నాలుగో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-3, 6-7 (7/9), 6-3, 6-3తో స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)పై, ఐదో సీడ్ నిషికోరి (జపాన్) 7-5, 6-4, 6-4తో బెలూచి (బ్రెజిల్)పై నెగ్గి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. ఎనిమిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-3, 6-4, 5-7, 6-3తో లాజోవిచ్ (సెర్బియా)పై, 12వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్) 7-5, 6-2, 6-3తో క్లిజాన్ (స్లొవేకియా)పై, 14వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-4, 6-1, 6-1తో డూడీ సెలా (ఇజ్రాయెల్)పై గెలిచారు. 24వ సీడ్ గుల్బిస్ (లాత్వియా) 3-6, 6-3, 5-7, 3-6తో మహుట్ (ఫ్రాన్స్) చేతిలో, 28వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ) 1-6, 3-6, 5-7తో పెయిర్ (ఫ్రాన్స్) చేతిలో, 19వ సీడ్ అగుట్ (స్పెయిన్) 4-6, 2-6, 2-6తో లూకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయారు. -
షరపోవా శుభారంభం
రద్వాన్‌స్కాకు షాక్ ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: డిఫెండింగ్ చాంపియన్ మరియా షరపోవా ఫ్రెంచ్ ఓపెన్‌లో అలవోక విజయంతో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ రష్యా స్టార్ 6-2, 6-4తో కయీ కనెపి (ఎస్తోనియా)పై గెలిచింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన ఈ రెండో సీడ్ క్రీడాకారిణి ప్రత్యర్థి సర్వీస్‌ను మాత్రం ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ప్రపంచ మాజీ రెండో ర్యాంకర్, 14వ సీడ్ రద్వాన్‌స్కా (పోలండ్) మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. అనీకా బెక్ (జర్మనీ) 6-2, 3-6, 6-1తో రద్వాన్స్కాపై సంచలన విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ కార్లా నవారో (స్పెయిన్) 6-2, 6-2తో నికెలెస్కూ (రుమేనియా)పై, 11వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-0, 6-1తో బాబోస్ (హంగేరి)పై, అజరెంకా (బెలారస్) 6-2, 6-1తో టోరో ఫ్లోర్ (స్పెయిన్)పై నెగ్గారు. పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), నాలుగో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), 12వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్), 13వ సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) రెండో రౌండ్‌కు చేరుకోగా... 11వ సీడ్ ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్) తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ముర్రే 6-3, 6-3, 6-1తో అర్గుయెలో (అర్జెంటీనా)పై, బెర్డిచ్ 6-0, 7-5, 6-3తో నిషియోకా (జపాన్)పై, సిమోన్ 3-6, 6-1, 6-2, 6-4తో పౌలీ (ఫ్రాన్స్)పై, మోన్ఫిల్స్ 6-2, 6-7 (5/7), 6-1, 7-5తో వాసెలిన్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. గబాష్విలి (రష్యా) 6-3, 7-6 (11/9), 6-3తో లోపెజ్‌ను ఓడించాడు. మరోవైపు 36 ఏళ్ల స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) 5-7, 6-3, 6-4, 6-1తో డోడిగ్ (క్రొయేషియా)ను ఓడించాడు. ఈ క్రమంలో 1991 (జిమ్మీ కానర్స్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో విజయం సాధించిన పెద్ద వయస్కుడిగా స్టెపానెక్ గుర్తింపు పొందాడు. -
సెరెనా ' సిక్సర్ '
ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ హస్తగతం కెరీర్లో 19వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ వశం ఫైనల్లో షరపోవాపై విజయం రూ. 14 కోట్ల 96 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ఆనవాయితీ కొనసాగిస్తూ... ఆధిపత్యం చలాయిస్తూ... విజయకాంక్షకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తూ... అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ మరో అద్భుతం చేసింది. గతంలో ఫైనల్‌కు చేరిన ఐదుసార్లూ టైటిల్ నెగ్గిన ఈ ప్రపంచ నంబర్‌వన్ ఆరోసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తన చిరకాల ప్రత్యర్థి షరపోవాపై వరుసగా 16వ విజయాన్ని సాధించడంతోపాటు ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కెరీర్లో 19వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన 33 ఏళ్ల సెరెనా ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు సాధించిన వారి జాబితాలో ఉమ్మడిగా మూడో స్థానానికి చేరుకుంది. మెల్బోర్న్: టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ... నంబర్‌వన్ ర్యాంక్‌కు గౌరవం నిలబెడుతూ... అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. రాడ్‌లేవర్ ఎరీనాలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా 6-3, 7-6 (7/5)తో రెండో సీడ్ మరియా షరపోవా (రష్యా)పై విజయం సాధించింది. గంటా 50 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సెరెనా 18 ఏస్‌లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన సెరెనా తన సర్వీస్‌ను ఒకసారి మాత్రమే కోల్పోయింది. 33 ఏళ్ల సెరెనాకిది ఆరో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. మ్యాచ్ తొలి గేమ్‌లోనే షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. పదునైన సర్వీస్‌లు, శక్తివంతమైన షాట్లు, కోర్టులో చురుకైన కదలికలతో ఈ అమెరికా స్టార్ దూసుకుపోయింది. స్కోరు 3-2 వద్ద ఉన్నప్పుడు వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. పైకప్పు మూశాక మ్యాచ్‌ను కొనసాగించినప్పటికీ సెరెనా దూకుడు ఏమాత్రం తగ్గలేదు. 5-2తో ముందంజ వేసినా ఆమె అదే జోరులో తొలి సెట్‌ను 47 నిమిషాల్లో 6-3తో దక్కించుకుంది. రెండో సెట్లో ఇద్దరూ పాయింట్ పాయింట్‌కూ పోరాడారు. ఇద్దరూ తమ సర్వీస్లనునిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. కీలకమైన టైబ్రేక్‌లో సెరెనా 4-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. షరపోవా తేరుకునే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. తన సర్వీస్‌లో ఏస్‌తో మ్యాచ్‌ను ముగించి సెరెనా విజేతగా అవతరించింది. దీంతో 2004 నుంచి షరపోవా చేతిలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోని రికార్డును కొనసాగించింది. విజేతగా నిలిచిన సెరెనాకు 31 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 14 కోట్ల 96 లక్షలు); రన్నరప్ షరపోవాకు 15 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 7 కోట్ల 48 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గతంలో ఫైనల్‌కు చేరిన ఐదు సార్లూ సెరెనా (2003, 2005, 2007, 2009, 2010) టైటిల్ నెగ్గింది. ఓపెన్ శకంలో (1968 తర్వాత) పెద్ద వయస్సులో (33 ఏళ్లు) టైటిల్ సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. మహిళల విభాగంలో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన వారి జాబితాలో హెలెన్ విల్స్ మూడీ (అమెరికా)తో కలిసి సెరెనా ఉమ్మడిగా మూడో స్థానంలో ఉంది. మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా-24 టైటిల్స్), స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ-22 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఓపెన్ శకంలో స్టెఫీ గ్రాఫ్ తర్వాత జాబితాలో సెరెనా రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు సెరెనా ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్; రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ (2002, 2013లలో); ఐదుసార్లు వింబుల్డన్ (2002, 2003, 2009, 2010, 2012లలో); ఆరుసార్లు యూఎస్ ఓపెన్ (1999, 2002, 2008, 2012, 2013, 2014లలో) టైటిల్స్‌ను సాధించింది. తన కెరీర్లో షరపోవా బేసి సంఖ్య ఏడాదిలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గలేదు. గతంలో ఆమె నెగ్గిన ఐదు టైటిల్స్ (2008-ఆస్ట్రేలియన్ ఓపెన్, 2004-వింబుల్డన్, 2012, 2014-ఫ్రెంచ్ ఓపెన్, 2006-యూఎస్ ఓపెన్) సరి సంఖ్య ఏడాదిలోనే వచ్చాయి. 2007, 2012, 2015 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో; 2011 వింబుల్డన్‌లో, 2013 ఫ్రెంచ్ ఓపెన్‌లో షరపోవా ఫైనల్‌కు చేరినా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. బొలెలీ-ఫాగ్నిని జంటకు డబుల్స్ టైటిల్ పురుషుల డబుల్స్‌లో సిమోన్ బొలెలీ-ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో ఈ ద్వయం 6-4, 6-4తో హెర్బర్ట్-నికొలస్ మహుట్ (ఫ్రాన్స్) జోడీని ఓడించి తమ కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌ను నెగ్గింది. పుట్టుకతోనే నేను ధనవంతురాలిని కాదు. కానీ స్ఫూర్తి, మద్దతు ఇచ్చే అంశాల్లో నా కుటుంబ సభ్యులు ఉన్నతంగా నిలిచారు. కెరీర్లో 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తానని ఏనాడూ ఊహించలేదు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారు, ఏదైనా కావాలనుకున్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులెత్తేయకూడదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎవరికి మీరు స్ఫూర్తిగా నిలుస్తారో చెప్పలేం. -సెరెనా -
సెరెనా vs షరపోవా
నేడు మహిళల ఫైనల్ మ. గం. 2.00 నుంచి సోనీ సిక్స్‌లో లైవ్ కెరీర్లో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కొరకు సెరెనా... సెరెనా చేతిలో వరుసగా ఎదురైన 16 పరాజయాల పరంపరకు తెరదించాలనే లక్ష్యంతో షరపోవా... శనివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో బరిలోకి దిగనున్నారు. గతంలో సెరెనా ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన ఐదుసార్లూ విజేతగా నిలిచింది. మరోవైపు 2004 నుంచి సెరెనాపై ఏ టోర్నీలోనూ షరపోవా నెగ్గలేకపోయింది. -
సెరెనా X షరపోవా
ఆరంభ దశలో ఎలాంటి సంచలనాలు నమోదైనా... ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విభాగంలో చివరి దశకు వచ్చేసరికి టాప్ సీడ్స్ ఇద్దరే మిగిలారు. అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్, రష్యా అందాలతార షరపోవా ఫైనల్‌కు చేరారు. అటు పురుషుల విభాగంలో క్వార్టర్స్‌లో నాదల్‌ను ఇంటికి పంపిన బెర్డిచ్ జోరుకు ఆండీ ముర్రే బ్రేక్ వేశాడు. * మహిళల టైటిల్ పోరుకు టాప్ సీడ్స్ * పురుషుల ఫైనల్లో ముర్రే * ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మెల్బోర్న్: ఇప్పటికే 18 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను సాధించిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్... ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ సెరెనా 7-6 (7/5), 6-2తో అన్‌సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గంటా 24 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరువురు క్రీడాకారిణిలు 25 ఏస్‌లతో అలరించారు. అయితే అనుభవలేమితో ఇబ్బంది పడ్డ కీస్ 39 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. కీలక సమయంలో డబుల్ ఫాల్ట్‌లు చేయడం కూడా సెరెనాకు కలిసొచ్చింది. తొలిసెట్ ఆరో గేమ్ వరకు మంచి నియంత్రణతో ఆడిన కీస్ ఆ తర్వాత కాస్త నిరాశపర్చింది. ఈ దశలో భారీ సర్వీస్‌లతో చెలరేగిన సెరెనా తన అనుభవంతో వరుసగా పాయింట్లు నెగ్గింది. అయితే 12వ గేమ్‌లో కీస్ అద్భుతమైన ఏస్‌ను సంధించడంతో గేమ్ టైబ్రేక్‌కు దారితీసింది. కానీ టైబ్రేక్‌లో కీస్ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయింది. ఊహించని రీతిలో రెండు ఏస్‌లను సంధించిన సెరెనా 4-1 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత రెండు సెట్ పాయింట్లను కాచుకోవడంతో పాటు తిరుగులేని సర్వీస్‌ను సంధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సెరెనా మరింత దూకుడుగా ఆడింది. కీస్ చేసిన డబుల్ ఫాల్ట్‌ను ఆసరాగా చేసుకుని 5-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో కీస్ ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుంది. కానీ చివర్లో సెరెనా కొట్టిన ఏస్‌కు సమాధానం చెప్పలేక సెట్‌తో పాటు మ్యాచ్‌నూ అప్పగించేసింది. షరపోవా అలవోకగా... మరో సెమీస్‌లో రెండోసీడ్ షరపోవా (రష్యా) 6-3, 6-2తో అలవోకగా 10వ సీడ్ ఎకతెరినా మకరోవా (రష్యా)పై నెగ్గింది. గంటా 27 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా మూడు ఏస్‌లు సంధించగా, మకరోవా ఒక్కటి కూడా కొట్టలేకపోయింది. అయితే 29సార్లు అనవసర తప్పిదాలు చేయడంతో పాటు ఆరు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఒక్కదాన్ని మాత్రమే కాపాడుకుంది. నెట్ వద్ద సూపర్‌గా ఆడిన షరపోవా తొమ్మిది బ్రేక్ పాయింట్లతో నాలుగింటిని కాచుకుంది. కీలక సమయంలో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు తన సర్వీస్‌ను నిలబెట్టుకుంది. శనివారం జరిగే ఫైనల్లో షరపోవా... సెరెనాతో తలపడుతుంది. బెర్డిచ్‌కు ముర్రే చెక్ పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఆరోసీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-7 (6/8), 6-0, 6-3, 7-5తో ఏడోసీడ్ థామస్ బెర్డిచ్ (చెక్)పై నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే 15 ఏస్‌లు కొట్టగా, బెర్డిచ్ ఐదింటితో సరిపెట్టుకున్నాడు. అయితే బ్రేక్ పాయింట్లను కాచుకోవడంలో బ్రిటన్ ఆటగాడు పైచేయి సాధించగా, చెక్ ప్లేయర్ వెనుకబడిపోయాడు. 56 అనవసర తప్పిదాలు, ఆరుసార్లు డబుల్ ఫాల్ట్‌లు చేసి మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. పురుషుల విభాగంలో రెండో సెమీఫైనల్ నేడు వావ్రింకా, జొకోవిచ్‌ల మధ్య జరుగుతుంది. -
తుదిపోరుకు షరపోవా-సెరెనా సిద్ధం
-
ఎనిమిదేళ్ల తరువాత వారిద్దరు 'ఢీ'
మెల్ బోర్న్: ఆస్ట్రేలియ ఓపెన్ మహిళల ఫైనల్స్ రసవత్తరంగా మారింది. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ రష్యన్ భామ మరియా షరపోవా, అమెరికా నల్లకలువ సెరీనా విలియమ్స్ పోటీ పడనున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కోసం వీరిద్దరు ఫైనల్స్‌లో తలపడనున్నారు. కాగా షరపోవా సెమీ ఫైనల్లో మకరోవాపై 6-3, 6-2 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు సెరీనా విలియమ్స్ కూడా మ్యాడిసన్ కీస్పై గెలుపొంది ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. 7-6, 6-2 తేడాతో విజయం సాధించింది. దాంతో చాలా ఏళ్లకు షరపోవా, సెరీనాలు టైటిల్ కోసం పోరాడనున్నారు. -
క్వార్టర్స్‌లో షరపోవా, నదాల్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో రష్యా అందం మరియా షరపోవా, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ క్వార్టర్స్‌లో ప్రవేశించారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో వరల్డ్ నెంబర్ టూ షరపోవా 6-3, 6-0తో పెంగ్ ష్వాయ్ (చైనా)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో నదాల్ 7-5, 6-1, 6-4తో కెవిన్ ఆండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించి క్వార్టర్స్ బెర్తు సొంతం చేసుకున్నాడు. -
హమ్మయ్య...! నాదల్
మెల్బోర్న్: పూర్తి ఫిట్నెస్తో లేకపోతే అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సి వస్తుందని స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్కు మరోసారి తెలిసొచ్చింది. గాయం కారణంగా గత ఆరు నెలల కాలంలో కేవలం తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఈ మాజీ నంబర్‌వన్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో ఊహించని ప్రతిఘటన ఎదురైంది. క్వాలిఫయర్, ప్రపంచ 112వ ర్యాంకర్ టిమ్ స్మిజెక్ (అమెరికా)తో జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో విజయం దక్కించుకునేందుకు ఈ మాజీ చాంపియన్ ఏకంగా 4 గంటల 12 నిమిషాలు తీసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో తుదకు మూడో సీడ్ నాదల్ 6-2, 3-6, 6-7 (2/7), 6-3, 7-5తో టిమ్ స్మిజెక్ను ఓడించి ఊపిరి పీల్చుకున్నాడు. నిర్ణాయక ఐదో సెట్లోని 11వ గేమ్‌లో స్మిజెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ తన సర్వీస్‌లోని 12వ గేమ్‌ను కష్టపడి నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. దాంతోపాటు తన గ్రాండ్‌స్లామ్ కెరీర్లో ఏనాడూ ఓ క్వాలిఫయర్ చేతిలో ఓడిపోని రికార్డును కొనసాగించాడు. విజయం సాధించిన వెంటనే నాదల్ కోర్టులో మోకాళ్లపై కూర్చోని టైటిల్ గెలిచినంత సంబరపడటం గమనార్హం. మరోవైపు రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), పదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా రెండో రౌండ్లో నెగ్గి మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. ఫెడరర్ 3-6, 6-3, 6-2, 6-2తో సిమోన్ బొలెలీ (ఇటలీ)పై, ముర్రే 6-1, 6-3, 6-2తో మటోసెవిచ్ (ఆస్ట్రేలియా)పై, బెర్డిచ్ 7-6 (7/0), 6-2, 6-2తో జర్గెన్ మెల్జర్ (ఆస్ట్రియా)పై, దిమిత్రోవ్ 6-3, 6-7 (10/12), 6-3, 6-3తో లుకాస్ లాకో (స్లొవేకియా)పై గెలిచారు. ఆస్ట్రేలియా ఆశాకిరణాల్లో బెర్నాడ్ టామిక్, నిక్ కిరియోస్ మూడో రౌండ్‌కు చేరుకోగా... థనాసి కొకినాకిస్ రెండో రౌండ్లో ఓడిపోయాడు. 29వ సీడ్ జెరెమి చార్డీ (ఫ్రాన్స్), 23వ సీడ్ కార్లోవిచ్ (క్రొయేషియా), 20వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం), 28వ సీడ్ రొసోల్ (చెక్ రిపబ్లిక్), 26వ సీడ్ ఫ్లోరియన్ మాయెర్ (అర్జెంటీనా), 32వ సీడ్ క్లిజాన్ (స్లొవేకియా) రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. శ్రమించిన షరపోవా మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ షరపోవా మూడు సెట్ల పోరాటంలో నెగ్గగా... మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), ఏడో సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా), పదో సీడ్ మకరోవా (రష్యా) మాత్రం అలవోక విజయాలతో మూడో రౌండ్లోకి చేరుకున్నారు. రెండో రౌండ్లో షరపోవా 6-1, 4-6, 7-5తో అలెగ్జాండ్రా పనోవా (రష్యా)ను ఓడించేందుకు 2 గంటల 32 నిమిషాలు తీసుకుంది. ఎనిమిది ఏస్‌లు సంధించిన ఈ రష్యా స్టార్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు దూసుకొచ్చిన ఎనిమిది సార్లూ ఆమె పాయింట్లు గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో హలెప్ 6-2, 6-2తో గజ్దోసోవా (ఆస్ట్రేలియా)పై, బౌచర్డ్ 6-0, 6-3తో బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై, మకరోవా 6-2, 6-4తో రొబెర్టా విన్సీ (ఇటలీ)పై నెగ్గారు. సానియా జంట శుభారంభం మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)-సు వి సెయి (చైనీస్ తైపీ) జంట... పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)-రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) ద్వయం శుభారంభం చేశాయి. తొలి రౌండ్లో రెండో సీడ్ సానియా-సు వి సెయి జంట 6-2, 6-0తో మరియా ఇరిగోయెన్ (అర్జెంటీనా)-రొమినా ఒప్రాండి (రుమేనియా) జోడీని ఓడించింది. తదుపరి రౌండ్లో గాబ్రియెలా దబ్రోవ్‌స్కీ (కెనడా)-అలిసా రొసోల్‌స్కా (పోలండ్)లతో సానియా జంట తలపడుతుంది. మరోవైపు పేస్-క్లాసెన్ జోడీ 6-4, 7-6 (8/6)తో స్కాట్ లిప్స్కీ -రాజీవ్ రామ్ (అమెరికా) జంటపై గెలిచింది. -
మూడోరౌండ్లో షరపోవా
- వీనస్, హలెప్ కూడా... - బెర్డిచ్, వావ్రింకా ముందంజ - యూఎస్ ఓపెన్ న్యూయార్క్: తొలి సెట్ కోల్పోయినా పట్టు వదలకుండా పోరాడిన రష్యా అందాల తార మరియా షరపోవా... యూఎస్ ఓపెన్‌లో మూడోరౌండ్లోకి ప్రవేశించింది. బుధవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం) జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఐదోసీడ్ షరపోవా 46, 63, 62తో ప్రపంచ 95వ ర్యాంకర్ డుల్గెర్ (రొమేనియా)పై గెలిచింది. రెండు గంటలా 26 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్యా ప్లేయర్ 26 అనవసర తప్పిదాలు చేసింది. అయితే ప్రత్యర్థి (14) కంటే ఎక్కువ విన్నర్లు (34) సాధించి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో 2వ సీడ్ హలెప్ (రొమేనియా) 62, 61తో సెపలోవా (స్లొవేకియా)పై; 6వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 62, 64తో కుద్రయెత్సోవా (రష్యా)పై; 9వ సీడ్ జంకోవిచ్ (సెర్బియా) 75, 64తో పెరైంకోవా (బల్గేరియా)పై; 10వ సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) 63, 64తో సస్నోవిచ్ (బెలారస్)పై గెలిచారు. ఎనిమిదో సీడ్ ఇవనోవిచ్ (సెర్బియా) 57, 46తో ప్లిస్కోవా (చెక్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. శ్రమించిన వావ్రింకా పురుషుల సింగిల్స్‌లో మూడోసీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) చెమటోడ్చి విజయం సాధించాడు. రెండోరౌండ్లో అతను 63, 64, 36, 76 (1)తో బెలుచి (బ్రెజిల్)పై నెగ్గాడు. అయితే మ్యాచ్ మధ్యలో ఓ ప్రేక్షకుడు పదేపదే అంతరాయం కలిగించడంతో షటప్ అంటూ వావ్రింకా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో 6వ సీడ్ బెర్డిచ్ (చెక్) 63, 64, 63తో హెవిట్ (ఆస్ట్రేలియా)పై; 7వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 62, 76 (4), 62తో హారిసన్ (అమెరికా)పై; 11వ సీడ్ గుల్బిస్ (లాత్వినియా) 61, 64, 6-2తో షెప్పర్ (ఫ్రాన్స్)పై; 14వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 63, 61 (రిటైర్డ్‌హర్ట్)తో బగ్దాటిస్ (సైప్రస్)పై; 18వ సీడ్ అండర్సన్ (రష్యా) 63, 67 (3), 46, 62, 76 (1)తో కువాస్ (ఉరుగ్వే)పై; 19వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) 16, 75, 2-6, 64, 11 (రిటైర్డ్‌హర్ట్)తో డుడిగ్ (క్రొయేషియా)పై గెలిచాడు. 10వ సీడ్ నిషికోరి (జపాన్) 64, 61 (రిటైర్డ్‌హర్ట్)తో అండూజర్ (స్పెయిన్)పై నెగ్గాడు. మిక్స్‌డ్‌లో సానియా జోడి గెలుపు మహిళల డబుల్స్‌లో అలవోకగా నెగ్గిన భారత స్టార్ సానియా మీర్జా... మిక్స్డ్ డబుల్స్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. బ్రూనో సోరెస్ (బ్రెజిల్) సానియా జోడి 62, 36, 105తో అమెరికా జోడి అలికా బ్లాక్ ఎస్కోబ్డోలపై నెగ్గింది. -
అసలు నువ్వెవరు?
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ ఎవరో తనకు తెలియదంటూ రష్యన్ టెన్నిస్ స్టార్ షరపోవా వ్యాఖ్యానించడంపై మాస్టర్ అభిమానులు విరుచుకుపడ్డారు. అసలు షరపోవా ఎవరంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో దుమ్మెత్తి పోశారు. షరపోవా ట్విట్టర్ అకౌంట్లో ఏనాడూ లేని స్థాయిలో ట్వీట్స్ వెల్లువెత్తాయి. ‘దేవుడినే గుర్తు పట్టదా? ఆమెకు బుద్ది చెప్పాల్సిందే’ అని ఓ ఫ్యాన్ ఆవేశం ప్రదర్శిస్తే... ‘స్విట్జర్లాండ్‌లో క్రికెట్ ఆడకపోయినా ఫెడరర్ ఎంతో వినయంతో సచిన్‌తో మాట్లాడతాడు. రష్యాలో క్రికెట్ ఆడరనే సాకుతో సచిన్ తెలియదని వ్యాఖ్యానించడం మూర్ఖత్వం’ అంటూ మరో అభిమాని విరుచుకుపడ్డాడు. దీనికి ప్రతిగా ‘పుతిన్ ఎవరో నాకు తెలియదని మోడి చెప్పాలి’ అని ఓ అభిమాని రాశాడు. -
ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ షరపొవాదే!
-
సెమీస్‌లో షరపోవా
బౌచర్డ్ కూడా... ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల్లో జొకోవిచ్, గుల్బిస్ ముందంజ పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో రష్యా అందాల తార మరియా షరపోవా జోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్, ఏడోసీడ్ షరపోవా 1-6, 7-5, 6-1తో ప్రపంచ 35వ ర్యాంకర్, అన్‌సీడ్ గార్బిని ముగురుజా (స్పెయిన్)పై విజయం సాధించింది. తద్వారా సెమీస్‌లోకి ప్రవేశించింది. రెండు గంటలా ఆరు నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్యా ప్లేయర్ నిలకడను ప్రదర్శించింది. ఆరంభంలో నెమ్మదిగా ఆడుతూ 0-4తో వెనుకబడి తొలిసెట్‌ను చేజార్చుకున్నా... చివరి రెండు సెట్లలో కచ్చితమైన సర్వీస్‌లు, పదునైన షాట్లతో చెలరేగింది. చివరి 10 గేమ్‌ల్లో 9 గెలుచుకుంది. మరోవైపు తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్ మ్యాచ్ ఆడుతున్న ముగురుజా ప్రారంభంలో మెరుగైన షాట్లతో అలరించింది. మరో క్వార్టర్స్‌లో 18వ సీడ్ ఎగుని బౌచర్డ్ (కెనడా) 7-6 (4), 2-6, 7-5తో 14వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)పై నెగ్గింది. బెర్డిచ్‌కు షాక్: పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో ఆరోసీడ్ థామస్ బెర్డిచ్ (చెక్)కు నిరాశ ఎదురైంది. 18వ సీడ్ ఎర్నెస్ట్ గుల్బిస్ (లాత్వియా) 6-3, 6-2, 6-4తో బెర్డిచ్‌పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో రెండోసీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 7-5, 7-6 (7/5), 6-4తో ఎనిమిదో సీడ్ మిలోస్ రావోనిక్ (కెనడా)పై నెగ్గాడు. సానియా జోడి పరాజయం: మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడికి చుక్కెదురైంది. క్వార్టర్ఫైనల్లో ఐదోసీడ్ సానియా ద్వయం 2-6, 6-3, 3-6తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌సీడ్ సూ వీ సెయి (చైనీస్‌తైపీ)-షుయె పెంగ్ (చైనా)ల చేతిలో ఓడింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా-బ్లాక్ ఎనిమిది బ్రేక్ పాయింట్ అవకాశాల్లో మూడింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. ఐదుసార్లు సర్వీస్‌ను కోల్పోయింది. సానియా జోడి ఓటమితో రోలాండ్ గారోస్‌లో భారత పోరు ముగిసింది. -
క్రీడలు: షరపోవాకు పోర్షే గ్రాండ్ ప్రి టైటిల్
చిత్ర మగిమైరాజ్‌కు ప్రపంచ మహిళల స్నూకర్ టైటిల్ బెంగళూరుకు చెందిన చిత్రమగిమైరాజ్ ప్రపంచ మహిళల స్నూకర్ చాంపియన్ టైటిల్ గెలుచుకుంది. లీడ్స్ (ఇంగ్లండ్)లో ఏప్రిల్ 22న జరిగిన ఫైనల్లో బెలారస్‌కు చెందిన అలెనా అస్మోలోవను చిత్ర ఓడించి విజేతగా నిలిచింది. లిన్ డాన్, సుంగ్ జీలకు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్స్ దక్షిణ కొరియాలో ఏప్రిల్ 27న ముగిసిన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను లిన్‌డాన్, మహిళల సింగిల్స్ టైటిల్‌ను సుంగ్ జీ యున్ గెలుచుకున్నారు. విజేతలు పురుషుల సింగిల్స్: లిన్ డాన్ (చైనా) ఫైనల్స్‌లో ససాకి షో (జపాన్)ను ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు. మహిళల సింగిల్స్: సుంగ్ జీ యున్ (కొరియా) గెలుచుకుంది. ఈమె ఫైనల్స్‌లో షిజియాన్ వాంగ్ (చైనా)ను ఓడించింది. పురుషుల డబుల్స్: షిన్ బీక్ చోయెల్ - యు యోన్ సియోంగ్ (కొరియా) గెలుచుకున్నారు. వీరు లియు, యుచెన్ (చైనా)లను ఓడించారు. మహిళల డబుల్స్: లూ యింగ్ - లు యు (చైనా) గెలుచుకున్నారు. వీరు కిమ్ హ నా-జుంగ్ యుంగ్ యున్ (కొరియా)లను ఓడించారు. మిక్స్డ్ డబుల్స్: లీ చున్ హె - చావు హో వా (హాంకాంగ్) గెలుచుకున్నారు. వీరు ఫైనల్స్‌లో షిన్ బీక్ చోయెల్ - జాంగ్ యె నా (కొరియా)లను ఓడించారు. ఈ చాంపియన్‌షిప్ లో భారత్‌కు చెందిన సింధు, జ్వాల-అశ్విని జోడికి కాంస్య పతకాలు లభించాయి. లాహిరికి గోల్ఫ్ ఆసియన్ టూర్ టైటిల్ భారత్‌కు చెందిన అనిర్బన్ లాహిరి గోల్ఫ్ ఆసియన్ టూర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. జకర్తాలో ఏప్రిల్ 27న ముగిసిన పోటీలో లాహిరి టైటిల్ సాధించగా కొరియాకు చెందిన బేక్ సెయుహైన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ టైటిల్ లాహిరి గెలుచుకోవడం ఇది నాలుగోసారి. ఎమ్మా బొన్నీకి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్స్ టైటిల్ ఎమ్మాబొన్నీ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. లీడ్స్‌లో ఏప్రిల్ 24న జరిగిన ఫైనల్లో భారత్‌కు చెందిన ఉమాదేవి నాగరాజ్‌ను బోన్నీ ఓడించింది. ఈ టైటిల్‌ను భారత్ నుంచి తొలిసారి 2005లో అనూజ ఠాకూర్ గెలుచుకుంది. తర్వాత 2006, 2007లో చిత్ర గెలుచుకుంది. షరపోవాకు పోర్షే గ్రాండ్ ప్రి టైటిల్ పోర్షే గ్రాండ్ ప్రి టెన్నిస్ టైటిల్‌ను మరియా షరపోవా గెలుచుకుంది. స్టుట్‌గార్‌టలో ఏప్రిల్ 27న జరిగిన ఫైనల్స్‌లో అనా ఇవనోవిక్‌ను షరపోవా ఓడించింది.