రా...రా... షరపోవా!
►నేడే రష్యా టెన్నిస్ స్టార్ పునరాగమనం
►స్టట్‌గార్ట్ ఓపెన్‌లో వైల్డ్‌కార్డుతో బరిలోకి
నిషేధిత జాబితాలోని మెడిసిన్ తీసుకున్నావ్... సస్పెన్షన్ అన్నారు. తీరా అది ముగిసే దశలో వుంటే... అప్పుడే వైల్డ్‌కార్డా? నాన్సెన్స్ అన్నారు. ఏదేమైనా తనది కాన్ఫిడెన్స్ అంటోంది... షరపోవా వైఫల్యాలు వెంటాడినా... గాయాలు తిరగదోడినా... సవాళ్లతో సహవాసం... ఆటలో పునరాగమనం తనకు కొత్తకాదని... ఇక ఇప్పుడు డోపింగ్ ఉదంతాన్ని మరచి మళ్లీ రాకెట్ పవర్‌తో సత్తా చాటేందుకు ఆమె సిద్ధమైంది.
క్రీడావిభాగం : స్టట్‌గార్ట్ ఓపెన్‌లో మరియా షరపోవా కొత్త ఇన్నింగ్స్ షురూ. వనవాసం వీడినట్లు షరపోవా సస్పెన్షన్ కాలం ముగిసింది. దాంతో ఈ రష్యా రమణి మళ్లీ బరిలోకి దిగుతోంది. 30 ఏళ్ల రష్యా టెన్నిస్ స్టార్ 15 నెలల సస్పెన్షన్ తర్వాత జర్మనీ ఈవెంట్‌లో రాకెట్ పడుతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో స్టట్‌గార్ట్ ఓపెన్ తొలి రౌండ్లో రొబెర్టా విన్సీ (ఇటలీ)తో పోరుకు సిద్ధమైంది. నంబర్‌వన్ సెరెనా గైర్హాజరు అవుతున్న ఈ టోర్నమెంట్‌లో షరపోవాకు కాలం కలిసొస్తుందో లేదో తేలుతుంది. నిజానికి షరపోవాకు సవాళ్లు కొత్త కాదు! ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత అందలాలేవీ అంత తేలిగ్గా అందలేదు. ఒక్కో విజయం ఒక్కో మెట్టెక్కించింది. ఒక్కో వైఫల్యం ఒక్కో పాఠం నేర్పించింది. 17 ఏళ్లకే వింబుల్డన్ చాంపియన్ (2004)... 18 ఏళ్లకే నంబర్‌వన్ ర్యాంకు (2005)... ఇవన్నీ ఆటతోనే... ఈ క్రమంలోనే అనేక సవాళ్లను అధిగమించింది.
టెన్నిస్...ఫ్యాషన్
షరపోవా యూఎస్ ఓపెన్ (2006) గెలిచాక... తర్వాతి మూడేళ్లలోనే ఎక్కడలేని స్టార్‌డమ్! ఒక్కసారిగా వచ్చిన క్రేజ్! దీన్ని ఫ్యాషన్ ప్రపంచం బాగా క్యాష్ చేసుకుంది. ప్రపంచంలోని పేరున్న బ్రాండ్లు ఆమె తలుపు తట్టాయి. దీంతో ఆట కాస్త అటకెక్కినా... మోడలింగ్ తళుకులు కమ్మేసినా.... మళ్లీ పట్టుదలతో పైకొచ్చింది. రెండేళ్లు తిరిగేసరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ (2008) చేతికందింది. ఇక ‘కెరీర్ స్లామ్’ ఘనత ఒక్కటే మిగిలింది. ఫ్రెంచ్ ఓపెన్ రూపంలో లోటుగా ఉన్న ఈ గ్రాండ్‌స్లామ్ కూడా ఆమె రాకెట్ నుంచి తప్పించుకోలేకపోయింది. ఆలస్యంగానైనా సరే షరపోవా రెండుసార్లు (2012, 2014) రోలాండ్ గారోస్ టైటిళ్లు చేజిక్కించుకుంది.
గాయాలు...వైఫల్యాలు
కెరీర్ స్లామ్‌కు షరపోవా ఎనిమిదేళ్ల పోరాటం చేసింది. మధ్యలో భుజం గాయం పదేపదే రష్యన్ స్టార్‌ను నీడలా వెంటాడి వేధించింది. తొలిసారిగా 2007లో ఇదే కారణంగా ఆమె ర్యాంక్ దిగజారింది. అయినా అలుపెరగని పోరాటంతో మరుసటి ఏడాదే ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. తర్వాత 2009లో గాయం మళ్లీ తిరగబెట్టింది. ఈసారి సర్జరీ తప్పలేదు. చాన్నాళ్లు ఆటకు దూరం. తర్వాత వరుస వైఫల్యాలతో 2010 పేలవంగా గడిచింది. ఇక ఈ రష్యా భామ కథ ముగిసిందనే విమర్శలు... ఇవన్నీ భరించింది. రెండేళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌తో కెరీర్ స్లామ్‌తో తనలో ‘వాడి’ రాకెట్‌లో ‘వేడి’ తగ్గలేదని చేతలతో చెప్పింది. అనంతరం 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకోవడంతో మొదట రెండేళ్లు నిషేధం విధించినా... ఆ తర్వాత దానిని 15 నెలలకు కుదించారు. ఇప్పుడూ ఆమె కెరీర్‌కు ముగింపు తప్పదనే ఊహాగానాలు వచ్చినా... ఏడాది తిరిగే సరికి సమరానికి సై అంటూ దూసుకొస్తున్న షరపోవాకు ఆల్ ది బెస్ట్.