షరపోవా జోరు... | Sharapova dismisses Pliskova in quick time | Sakshi

షరపోవా జోరు...

Jun 3 2018 1:14 AM | Updated on Jun 3 2018 1:14 AM

 Sharapova dismisses Pliskova in quick time - Sakshi

కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతోన్న రష్యా టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మాత్రం అదరగొడుతోంది. రెండుసార్లు ఈ టోర్నమెంట్‌ టైటిల్‌ను సాధించిన ఆమె అలవోక విజయంతో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది. ఆరో సీడ్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌లో షరపోవా 6–2, 6–1తో ఘనవిజయం సాధించింది. తొలి గేమ్‌లోనే తన సర్వీస్‌ కోల్పోయిన షరపోవా వెంటనే తేరుకొని వరుస పాయింట్లతో కేవలం 59 నిమిషాల్లో ప్లిస్కోవా ఆట కట్టించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మాజీ చాంపియన్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా)తో షరపోవా ఆడనుంది. మూడో రౌండ్‌లో సెరెనా 6–3, 6–4తో జూలియా జార్జెస్‌ (జర్మనీ)పై గెలిచింది. మరోవైపు ఎనిమిదో సీడ్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) మూడో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది.

కొంటావీట్‌ (ఎస్తోనియా) 7–6 (8/6), 7–6 (7/4)తో క్విటోవాను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. హలెప్‌ ముందంజ టాప్‌ సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా), మూడో సీడ్‌ ముగురుజా (స్పెయిన్‌) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్‌లో హలెప్‌ 7–5, 6–0తో పెట్కోవిక్‌ (జర్మనీ)పై, ముగురుజా 6–0, 6–2తో సమంతా స్టోసుర్‌ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో పదో సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) 4–6, 6–1, 8–6తో గియోర్గి (ఇటలీ)పై, ఏడో సీడ్‌ కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌) 6–1, 6–3తో ఇరీనా బెగూ (రొమేనియా)పై గెలుపొందారు. నాదల్‌ దూకుడు... పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) 6–3, 6–2, 6–2తో రిచర్డ్‌ గాస్కే (ఫ్రాన్స్‌)ను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. రెండు గంటల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో నాదల్‌ నెట్‌ వద్ద 12 పాయింట్లు సాధించడంతోపాటు గాస్కే సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు.

ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ సిలిచ్‌ (క్రొయేషియా) 6–3, 6–2, 6–4తో జాన్సన్‌ (అమెరికా)పై, ఐదో సీడ్‌ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 7–5, 6–4, 6–1తో రామోస్‌ (స్పెయిన్‌)పై, ఆరో సీడ్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా) 6–1, 6–7 (3/7), 6–3, 7–6 (7/4)తో మిషా జ్వెరెవ్‌ (జర్మనీ)పై, ఎనిమిదో సీడ్‌ గాఫిన్‌ (బెల్జియం) 6–7 (6/8), 6–3, 4–6, 7–5, 6–3తో మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గారు. క్వార్టర్స్‌లో బోపన్న జంట పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రోహన్‌ బోపన్న (భారత్‌)–రోజర్‌ వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) ద్వయం సంచలనం సృష్టించింది. బోపన్న–వాసెలిన్‌ జంట 6–4, 7–6 (7/1)తో టాప్‌ సీడ్‌ మార్సెలో మెలో (బ్రెజిల్‌)–లుకాజ్‌ కుబోట్‌ (పోలాండ్‌) జోడీని బోల్తా కొట్టించి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement