
షరపోవా శుభారంభం
రద్వాన్‌స్కాకు షాక్
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: డిఫెండింగ్ చాంపియన్ మరియా షరపోవా ఫ్రెంచ్ ఓపెన్‌లో అలవోక విజయంతో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఈ రష్యా స్టార్ 6-2, 6-4తో కయీ కనెపి (ఎస్తోనియా)పై గెలిచింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన ఈ రెండో సీడ్ క్రీడాకారిణి ప్రత్యర్థి సర్వీస్‌ను మాత్రం ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ప్రపంచ మాజీ రెండో ర్యాంకర్, 14వ సీడ్ రద్వాన్‌స్కా (పోలండ్) మాత్రం తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. అనీకా బెక్ (జర్మనీ) 6-2, 3-6, 6-1తో రద్వాన్‌స్కాపై సంచలన విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ కార్లా నవారో (స్పెయిన్) 6-2, 6-2తో నికెలెస్కూ (రుమేనియా)పై, 11వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-0, 6-1తో బాబోస్ (హంగేరి)పై, అజరెంకా (బెలారస్) 6-2, 6-1తో టోరో ఫ్లోర్ (స్పెయిన్)పై నెగ్గారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), నాలుగో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), 12వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్), 13వ సీడ్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) రెండో రౌండ్‌కు చేరుకోగా... 11వ సీడ్ ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్) తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. ముర్రే 6-3, 6-3, 6-1తో అర్గుయెలో (అర్జెంటీనా)పై, బెర్డిచ్ 6-0, 7-5, 6-3తో నిషియోకా (జపాన్)పై, సిమోన్ 3-6, 6-1, 6-2, 6-4తో పౌలీ (ఫ్రాన్స్)పై, మోన్‌ఫిల్స్ 6-2, 6-7 (5/7), 6-1, 7-5తో వాసెలిన్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. గబాష్‌విలి (రష్యా) 6-3, 7-6 (11/9), 6-3తో లోపెజ్‌ను ఓడించాడు. మరోవైపు 36 ఏళ్ల స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) 5-7, 6-3, 6-4, 6-1తో డోడిగ్ (క్రొయేషియా)ను ఓడించాడు. ఈ క్రమంలో 1991 (జిమ్మీ కానర్స్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో విజయం సాధించిన పెద్ద వయస్కుడిగా స్టెపానెక్ గుర్తింపు పొందాడు.