హమ్మయ్య...! నాదల్ | Rafael Nadal battles through to Australian Open third round | Sakshi
Sakshi News home page

హమ్మయ్య...! నాదల్

Published Thu, Jan 22 2015 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

హమ్మయ్య...! నాదల్

హమ్మయ్య...! నాదల్

మెల్‌బోర్న్: పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోతే అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సి వస్తుందని స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్‌కు మరోసారి తెలిసొచ్చింది. గాయం కారణంగా గత ఆరు నెలల కాలంలో కేవలం తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఈ మాజీ నంబర్‌వన్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్‌లో ఊహించని ప్రతిఘటన ఎదురైంది. క్వాలిఫయర్, ప్రపంచ 112వ ర్యాంకర్ టిమ్ స్మిజెక్ (అమెరికా)తో జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో విజయం దక్కించుకునేందుకు ఈ మాజీ చాంపియన్ ఏకంగా 4 గంటల 12 నిమిషాలు తీసుకున్నాడు.

హోరాహోరీగా సాగిన ఈ పోరులో తుదకు మూడో సీడ్ నాదల్ 6-2, 3-6, 6-7 (2/7), 6-3, 7-5తో టిమ్ స్మిజెక్‌ను ఓడించి ఊపిరి పీల్చుకున్నాడు. నిర్ణాయక ఐదో సెట్‌లోని 11వ గేమ్‌లో స్మిజెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ తన సర్వీస్‌లోని 12వ గేమ్‌ను కష్టపడి నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. దాంతోపాటు తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లో ఏనాడూ ఓ క్వాలిఫయర్ చేతిలో ఓడిపోని రికార్డును కొనసాగించాడు. విజయం సాధించిన వెంటనే నాదల్ కోర్టులో మోకాళ్లపై కూర్చోని టైటిల్ గెలిచినంత సంబరపడటం గమనార్హం.  
 
మరోవైపు రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), పదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా రెండో రౌండ్‌లో నెగ్గి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. ఫెడరర్ 3-6, 6-3, 6-2, 6-2తో సిమోన్ బొలెలీ (ఇటలీ)పై, ముర్రే 6-1, 6-3, 6-2తో మటోసెవిచ్ (ఆస్ట్రేలియా)పై, బెర్డిచ్ 7-6 (7/0), 6-2, 6-2తో జర్గెన్ మెల్జర్ (ఆస్ట్రియా)పై, దిమిత్రోవ్ 6-3, 6-7 (10/12), 6-3, 6-3తో లుకాస్ లాకో (స్లొవేకియా)పై గెలిచారు.

ఆస్ట్రేలియా ఆశాకిరణాల్లో బెర్నాడ్ టామిక్, నిక్ కిరియోస్ మూడో రౌండ్‌కు చేరుకోగా... థనాసి కొకినాకిస్ రెండో రౌండ్‌లో ఓడిపోయాడు. 29వ సీడ్ జెరెమి చార్డీ (ఫ్రాన్స్), 23వ సీడ్ కార్లోవిచ్ (క్రొయేషియా), 20వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం), 28వ సీడ్ రొసోల్ (చెక్ రిపబ్లిక్), 26వ సీడ్ ఫ్లోరియన్ మాయెర్ (అర్జెంటీనా), 32వ సీడ్ క్లిజాన్ (స్లొవేకియా) రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు.
 
శ్రమించిన షరపోవా
మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ షరపోవా మూడు సెట్‌ల పోరాటంలో నెగ్గగా... మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), ఏడో సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా), పదో సీడ్ మకరోవా (రష్యా) మాత్రం అలవోక విజయాలతో మూడో రౌండ్‌లోకి చేరుకున్నారు. రెండో రౌండ్‌లో షరపోవా 6-1, 4-6, 7-5తో అలెగ్జాండ్రా పనోవా (రష్యా)ను ఓడించేందుకు 2 గంటల 32 నిమిషాలు తీసుకుంది.

ఎనిమిది ఏస్‌లు సంధించిన ఈ రష్యా స్టార్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు దూసుకొచ్చిన ఎనిమిది సార్లూ ఆమె పాయింట్లు గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో హలెప్ 6-2, 6-2తో గజ్దోసోవా (ఆస్ట్రేలియా)పై, బౌచర్డ్ 6-0, 6-3తో బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై, మకరోవా 6-2, 6-4తో రొబెర్టా విన్సీ (ఇటలీ)పై నెగ్గారు.
 
సానియా జంట శుభారంభం
మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)-సు వి సెయి (చైనీస్ తైపీ) జంట... పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)-రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) ద్వయం శుభారంభం చేశాయి. తొలి రౌండ్‌లో రెండో సీడ్ సానియా-సు వి సెయి జంట 6-2, 6-0తో మరియా ఇరిగోయెన్ (అర్జెంటీనా)-రొమినా ఒప్రాండి (రుమేనియా) జోడీని ఓడించింది. తదుపరి రౌండ్‌లో గాబ్రియెలా దబ్రోవ్‌స్కీ (కెనడా)-అలిసా రొసోల్‌స్కా (పోలండ్)లతో సానియా జంట తలపడుతుంది. మరోవైపు పేస్-క్లాసెన్ జోడీ 6-4, 7-6 (8/6)తో స్కాట్ లిప్‌స్కీ -రాజీవ్ రామ్ (అమెరికా) జంటపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement