the Australian Open
-
నాదల్ కుదేల్
బెంబేలెత్తించిన బెర్డిచ్ ఆస్తి పోయినా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని అంటారు. నమ్మకానికి పట్టుదల, ఆత్మవిశ్వాసానికి సంకల్పం తోడైతే అద్భుతం జరుగుతుంది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మంగళవారం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకటా... రెండా... మూడా... నాలుగా... వరుసగా 17 మ్యాచ్‌ల్లో తనను ఓడించిన ప్రత్యర్థి మళ్లీ ఎదురైతే ఎవరైనా మ్యాచ్‌కు ముందే డీలా పడతారు. కానీ చెక్ రిపబ్లిక్కు చెందిన బెర్డిచ్ నేలకు కొట్టిన రబ్బరు బంతిలా ఎగిశాడు. ఊహించనిరీతిలో రాణించాడు. తనను వరుసగా 17 మ్యాచ్‌ల్లో ఓడించిన రాఫెల్ నాదల్‌ను బెంబేలెత్తించాడు. వరుస సెట్లలో చిత్తు చేశాడు. అన్ని పరాజయాలకు ఒకేసారి లెక్క సరిజేసి ఔరా అనిపించాడు. మెల్బోర్న్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ... టైటిల్ ఫేవరెట్‌కు షాక్ ఇస్తూ... ఏడో సీడ్ టామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మూడో సీడ్, మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో బెర్డిచ్ 6-2, 6-0, 7-6 (7/5)తో అద్భుత విజయం సాధించి సంచలనం సృష్టించాడు. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన బెర్డిచ్ అనుకున్న ఫలితం సాధించాడు. అదే క్రమంలో ఈ టోర్నీలో ఇప్పటివరకు ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని రికార్డును కొనసాగించాడు. పదునైన సర్వీస్‌లు, శక్తివంతమైన షాట్లు, క్లిష్టమైన కోణాల్లో రిటర్న్ షాట్లు, కోర్టుకిరువైపులా పాదరసంలాంటి కదలికలతో ఆరంభం నుంచే బెర్డిచ్ ఈ మ్యాచ్‌పై పట్టు బిగించాడు. తొందరగా ఓటమిని అంగీకరించే తత్వంలేని నాదల్లాంటి ప్లేయర్‌కు పుంజుకునే అవకాశం ఇస్తే ఏమి జరుగుతుందో బెర్డిచ్‌కు తెలుసు. అందుకే మ్యాచ్ పాయింట్ గెలిచే వరకు బెర్డిచ్ ఏదశలోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయలేదు. మరోవైపు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లేని నాదల్కు బెర్డిచ్ రూపంలో పటిష్టమైన ప్రత్యర్థి ఎదురుకావడం, ఆద్యంతం అతనూ కట్టుదిట్టంగా ఆడటంతో ఈ స్పెయిన్ స్టార్‌కు తేరుకునే అవకాశమే దక్కలేదు. తొలి రెండు సెట్లను అలవోకగా నెగ్గిన బెర్డిచ్‌కు మూడో సెట్లో ప్రతిఘటన ఎదురైనా... కీలకమైన టైబ్రేక్‌లో సంయమనంతో ఆడి నాదల్ కథను ముగించడంలో సఫలమయ్యాడు. 10 ఏస్‌లు సంధించిన బెర్డిచ్, ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం. అంతేకాకుండా నాదల్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన బెర్డిచ్ తన సర్వీస్‌లో ప్రత్యర్థి ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా ఇవ్వలేదు. 26 అనవసర తప్పిదాలు చేసిన నాదల్, అర డజను డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నాదల్‌పై తాజా గెలుపుతో ఈ స్పెయిన్ స్టార్ చేతిలో వరుసగా 17 మ్యాచ్‌ల్లో ఎదురైన పరాజయాల పరంపరకు తెరదించాడు. ఇప్పటివరకు బెర్డిచ్, నాదల్ 22 సార్లు తలపడ్డారు. ఇందులో బెర్డిచ్ 18 మ్యాచ్‌ల్లో ఓడిపోగా... ఈ మ్యాచ్‌కు ముందు వాటిలో 17 వరుస ఓటములున్నాయి. చివరిసారి నాదల్‌ను బెర్డిచ్ 2006లో మాడ్రిడ్ మాస్టర్స్ సిరీస్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడించాడు. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి నాదల్‌ను ఓడించడంలో బెర్డిచ్ సఫలమయ్యాడు. ఒకవేళ నాదల్ చేతిలో ఈసారీ ఓడిపోయుంటే మాత్రం బెర్డిచ్, ఓపెన్ శకంలో (1968 తర్వాత) ఒకే ఆటగాడి చేతిలో వరుసగా 18 మ్యాచ్‌ల్లో ఓడిన తొలి క్రీడాకారుడిగా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకునేవాడు. గతంలో జిమ్మీ కానర్స్ (అమెరికా), టిమ్ మయోటి (అమెరికా)లపై ఇవాన్ లెండిల్ (చెక్ రిపబ్లిక్/అమెరికా)... విటాస్ గెరులైటిస్ (అమెరికా)పై జాన్ బోర్గ్ (స్వీడన్) వరుసగా 17 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించారు. ఇప్పటివరకు ఆడిన 40 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నాదల్ తన ప్రత్యర్థి చేతిలో ఓ సెట్‌ను 0-6తో కోల్పోవడం ఇది మూడోసారి మాత్రమే. గతంలో రోజర్ ఫెడరర్ (2006-వింబుల్డన్‌లో), ఆండీ రాడిక్ (2004-యూఎస్ ఓపెన్) మాత్రమే ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నాదల్‌ను ఓ సెట్లో 0-6తో ఓడించారు. ఓవరాల్‌గా తన కెరీర్లో 711 మ్యాచ్‌లు ఆడిన నాదల్ 13 సార్లు తన ప్రత్యర్థి చేతిలో ఓ సెట్‌ను 0-6తో కోల్పోయాడు. ముర్రే జోరు మరో క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-3, 7-6 (7/5), 6-3తో ఆస్ట్రేలియా యువ ఆశాకిరణం నిక్ కిరియోస్‌ను ఓడించి సెమీఫైనల్లో బెర్డిచ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే 13 ఏస్‌లు సంధించడంతోపాటు కిరియోస్ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. సెమీస్ చేరే క్రమంలో ముర్రే తన ప్రత్యర్థులకు రెండు సెట్లు మాత్రమే కోల్పోయాడు. హలెప్‌కు మకరోవా షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), ఏడో సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా)ల పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ షరపోవా (రష్యా) 6-3, 6-2తో బౌచర్డ్ను చిత్తు చేయగా... పదో సీడ్ మకరోవా 6-4, 6-0తో హలెప్‌ను బోల్తా కొట్టించి సెమీస్‌లో షరపోవాతో సమరానికి సిద్ధమైంది. ‘‘ఈ విజయానికి సిద్ధమై వచ్చాను. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలనే నిర్ణయంతోనే వచ్చాను. అనుకున్న వ్యూహాన్ని అమలు చేశాను. నాదల్‌తో ఆడేటపుడు చివరి పాయింట్ సాధించేవరకు గెలిచినట్టు భావించకూడదు. గొప్ప ప్లేయర్‌ను ఓడించినందుకు గొప్పగా అనిపిస్తోంది.’’ -బెర్డిచ్ -
దూసుకుపోతున్న షరపోవా
మెల్ బోర్న్:ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్ షిప్ లో రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా దూసుకుపోతోంది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో షరపోవా 6-3,6-2 తేడాతో ఎగునీ బౌచర్డ్ పై విజయం సాధించి సెమీస్ లో అడుగుపెట్టింది. ప్రత్యర్థలను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా ఈ టోర్నీలో ఆకట్టుకుంటున్న షరపోవా వరుస రెండు సెట్లను కైవశం చేసుకుని తన తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఒకానొక దశలో షరపోవా సంధించిన ఏస్ లకు బౌచర్డ్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. -
ప్రాంజల పరాజయం
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో హైదరాబాద్ అమ్మాయి యెడ్లపల్లి ప్రాంజల పోరాటం ముగిసింది. సింగిల్స్ రెండో రౌండ్లో ప్రాంజల 3-6, 0-6తో టాప్‌సీడ్ జూ షిలిన్ (చైనా) చేతిలో ఓడింది. డబుల్స్ తొలిరౌండ్లో ప్రాంజల-మురామత్సు చిచిరో (జపాన్) జంట 6-7 (5/7), 0-6తో జూ షిలిన్ (చైనా)-టోమిక్ సారా (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో పేస్, సానియా జంటలు: మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సానియా మీర్జా (భారత్)-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జంట 7-5, 6-7 (3/7), 10-8తో అబిగెయిల్ (అమెరికా)-గొంజాలెజ్ (మెక్సికో) జోడీపై నెగ్గగా... లియాండర్ పేస్ (భారత్)-హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 6-3, 6-1తో మెదీనా-అందుజార్ (స్పెయిన్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. -
షరపోవా జోరు
అలవోక విజయంతో క్వార్టర్స్‌లోకి మెల్బోర్న్: ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా... స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తున్న ప్రపంచ రెండో ర్యాంకర్ మరియా షరపోవా (రష్యా) ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దూసుకుపోతోంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ షరపోవా 6-3, 6-0తో 21వ సీడ్ పెంగ్ షుయె (చైనా)పై అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. కేవలం 15 అనవసర తప్పిదాలు చేసిన ఈ రష్యా భామ నెట్ వద్దకు వచ్చిన ఐదుసార్లూ పాయింట్లు నెగ్గడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో ‘కెనడా బ్యూటీ’ యూజిన్ బౌచర్డ్తో షరపోవా తలపడుతుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ బౌచర్డ్ 6-1, 5-7, 6-2తో ఇరీనా కమెలియా బెగూ (రుమేనియా)పై చెమటోడ్చి నెగ్గగా... మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 6-4, 6-2తో యానినా విక్‌మాయెర్ (బెల్జియం)పై, పదో సీడ్ మకరోవా (రష్యా) 6-3, 6-2తో జూలియా (జర్మనీ)పై విజయం సాధించారు. శ్రమించిన ఆండీ ముర్రే: పురుషుల సింగిల్స్ విభాగంలో మూడుసార్లు రన్నరప్, ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)తోపాటు మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), ఆస్ట్రేలియా ఆశాకిరణం కియోరిస్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో నెగ్గడానికి ముర్రే తీవ్రంగానే శ్రమించాడు. 3 గంటల 32 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ముర్రే 6-4, 6-7 (5/7), 6-3, 7-5తో విజయం సాధించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ నాదల్ 7-5, 6-1, 6-4తో 14వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై, బెర్డిచ్ 6-2, 7-6 (7/3), 6-2తో బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా)పై, కియోరిస్ 5-7, 4-6, 6-3, 7-6 (7/5), 8-6తో సెప్పి (ఇటలీ)పై గెలిచారు. పేస్ జంట శుభారంభం: మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 6-2, 7-6 (7/2)తో థాంప్సన్-జొవనోవిచ్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్‌లో రోహన్ బోపన్న (భారత్)-స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట 2-6, 6-3, 4-10తో నెస్టర్ (కెనడా)-క్రిస్టినా మ్లడెనోవిచ్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల తొలి సారి ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బాలికల సింగిల్స్ విభాగంలో ఆమె బరిలోకి దిగుతోంది. ఈ విభాగం ‘డ్రా’ శుక్రవారం విడుదలైంది. శనివారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రాంజల... దక్షిణాఫ్రికాకు చెందిన కేటీ పొలూటాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆమె రెండో రౌండ్లో టాప్ సీడ్ షిలిన్ గ్జు (చైనా) లేదా కేలా మెక్ఫీ (ఆస్ట్రేలియా)లలో ఒకరిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
హమ్మయ్య...! నాదల్
మెల్బోర్న్: పూర్తి ఫిట్నెస్తో లేకపోతే అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సి వస్తుందని స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్కు మరోసారి తెలిసొచ్చింది. గాయం కారణంగా గత ఆరు నెలల కాలంలో కేవలం తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఈ మాజీ నంబర్‌వన్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో ఊహించని ప్రతిఘటన ఎదురైంది. క్వాలిఫయర్, ప్రపంచ 112వ ర్యాంకర్ టిమ్ స్మిజెక్ (అమెరికా)తో జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో విజయం దక్కించుకునేందుకు ఈ మాజీ చాంపియన్ ఏకంగా 4 గంటల 12 నిమిషాలు తీసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో తుదకు మూడో సీడ్ నాదల్ 6-2, 3-6, 6-7 (2/7), 6-3, 7-5తో టిమ్ స్మిజెక్ను ఓడించి ఊపిరి పీల్చుకున్నాడు. నిర్ణాయక ఐదో సెట్లోని 11వ గేమ్‌లో స్మిజెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ తన సర్వీస్‌లోని 12వ గేమ్‌ను కష్టపడి నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. దాంతోపాటు తన గ్రాండ్‌స్లామ్ కెరీర్లో ఏనాడూ ఓ క్వాలిఫయర్ చేతిలో ఓడిపోని రికార్డును కొనసాగించాడు. విజయం సాధించిన వెంటనే నాదల్ కోర్టులో మోకాళ్లపై కూర్చోని టైటిల్ గెలిచినంత సంబరపడటం గమనార్హం. మరోవైపు రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), పదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా రెండో రౌండ్లో నెగ్గి మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. ఫెడరర్ 3-6, 6-3, 6-2, 6-2తో సిమోన్ బొలెలీ (ఇటలీ)పై, ముర్రే 6-1, 6-3, 6-2తో మటోసెవిచ్ (ఆస్ట్రేలియా)పై, బెర్డిచ్ 7-6 (7/0), 6-2, 6-2తో జర్గెన్ మెల్జర్ (ఆస్ట్రియా)పై, దిమిత్రోవ్ 6-3, 6-7 (10/12), 6-3, 6-3తో లుకాస్ లాకో (స్లొవేకియా)పై గెలిచారు. ఆస్ట్రేలియా ఆశాకిరణాల్లో బెర్నాడ్ టామిక్, నిక్ కిరియోస్ మూడో రౌండ్‌కు చేరుకోగా... థనాసి కొకినాకిస్ రెండో రౌండ్లో ఓడిపోయాడు. 29వ సీడ్ జెరెమి చార్డీ (ఫ్రాన్స్), 23వ సీడ్ కార్లోవిచ్ (క్రొయేషియా), 20వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం), 28వ సీడ్ రొసోల్ (చెక్ రిపబ్లిక్), 26వ సీడ్ ఫ్లోరియన్ మాయెర్ (అర్జెంటీనా), 32వ సీడ్ క్లిజాన్ (స్లొవేకియా) రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. శ్రమించిన షరపోవా మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ షరపోవా మూడు సెట్ల పోరాటంలో నెగ్గగా... మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), ఏడో సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా), పదో సీడ్ మకరోవా (రష్యా) మాత్రం అలవోక విజయాలతో మూడో రౌండ్లోకి చేరుకున్నారు. రెండో రౌండ్లో షరపోవా 6-1, 4-6, 7-5తో అలెగ్జాండ్రా పనోవా (రష్యా)ను ఓడించేందుకు 2 గంటల 32 నిమిషాలు తీసుకుంది. ఎనిమిది ఏస్‌లు సంధించిన ఈ రష్యా స్టార్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు దూసుకొచ్చిన ఎనిమిది సార్లూ ఆమె పాయింట్లు గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో హలెప్ 6-2, 6-2తో గజ్దోసోవా (ఆస్ట్రేలియా)పై, బౌచర్డ్ 6-0, 6-3తో బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై, మకరోవా 6-2, 6-4తో రొబెర్టా విన్సీ (ఇటలీ)పై నెగ్గారు. సానియా జంట శుభారంభం మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)-సు వి సెయి (చైనీస్ తైపీ) జంట... పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)-రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) ద్వయం శుభారంభం చేశాయి. తొలి రౌండ్లో రెండో సీడ్ సానియా-సు వి సెయి జంట 6-2, 6-0తో మరియా ఇరిగోయెన్ (అర్జెంటీనా)-రొమినా ఒప్రాండి (రుమేనియా) జోడీని ఓడించింది. తదుపరి రౌండ్లో గాబ్రియెలా దబ్రోవ్‌స్కీ (కెనడా)-అలిసా రొసోల్‌స్కా (పోలండ్)లతో సానియా జంట తలపడుతుంది. మరోవైపు పేస్-క్లాసెన్ జోడీ 6-4, 7-6 (8/6)తో స్కాట్ లిప్స్కీ -రాజీవ్ రామ్ (అమెరికా) జంటపై గెలిచింది. -
పోరాడి ఓడిన యూకీ
మెల్బోర్న్: సింగిల్స్ విభాగంలో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ బరిలోకి దిగిన భారత యువతార యూకీ బాంబ్రీ ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాడు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ ఢిల్లీ ఆటగాడు మొదటి రౌండ్లోనే ఓడిపోయాడు. అయితే తనకంటే ఎన్నో రెట్లు మెరుగైన ప్రత్యర్థి, ఆరో సీడ్ ఆండీ ముర్రేకు విజయం దక్కడానికి కష్టపడేలా చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 317వ ర్యాంకర్ యూకీ 3-6, 4-6, 6-7 (3/7)తో ప్రపంచ 6వ ర్యాంకర్ ఆండీ ముర్రే (బ్రిటన్) చేతిలో ఓటమి చవిచూశాడు. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ రెండుసార్లు ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేయడం విశేషం. ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసిన యూకీ నెట్‌వద్దకు 33 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు సాధించాడు. మూడో సెట్లో ఒకదశలో యూకీ 4-1తో ఆధిక్యంలోకి కూడా వెళ్లాడు. అయితే ఇప్పటికే 35 సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన అనుభవమున్న ముర్రే వెంటనే తేరుకున్నాడు. వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి స్కోరును 4-4 వద్ద సమం చేశాడు. ఆఖరికి టైబ్రేక్‌లో సెట్‌ను నెగ్గి విజయాన్ని దక్కించుకున్నాడు. అనంతరం యూకీ ఆటతీరును ఈ బ్రిటన్ ప్లేయర్ మెచ్చుకున్నాడు. ‘యూకీ చాలా దూకుడుగా ఆడాడు. అతనిలో ఎంతో ప్రతిభ దాగి ఉంది. అతని ఆటతీరును చూస్తే ర్యాంకింగ్స్‌లో 300కు సమీపంలో ఉండకూడదు. ఈ ఏడాది ముగిసేలోపు అతని ర్యాంక్‌లో చాలా పురోగతి కనిపిస్తుంది’ అని ముర్రే వ్యాఖ్యానించాడు. మరోవైపు రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మూడో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), పదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా శుభారంభం చేయగా... 11వ సీడ్ ఎర్నెస్ట్ గుల్బిస్ (లాత్వియా) మాత్రం తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ఫెడరర్ 6-4, 6-2, 7-5తో యెన్ సున్ లూ (చైనీస్ తైపీ)పై, నాదల్ 6-3, 6-2, 6-2తో మిఖాయిల్ యూజ్నీ (రష్యా)పై, బెర్డిచ్ 6-3, 7-6 (7/1), 6-3తో అలెజాంద్రో ఫలా (కొలంబియా)పై, దిమిత్రోవ్ 6-2, 6-3, 6-2తో డస్టిన్ బ్రౌన్ (జర్మనీ)పై గెలిచారు. ఐదు సెట్ల హోరాహోరీ పోరులో ఆస్ట్రేలియా యువ ఆశాకిరణం థనాసి కొకినాకిస్ 5-7, 6-0, 1-6, 7-6 (7/2), 8-6తో గుల్బిస్ను బోల్తా కొట్టించాడు. షరపోవా, హలెప్ ముందంజ మహిళల సింగిల్స్ విభాగంలో తొలి రోజే రెండు సంచలనాలు నమోదయ్యాయి. టాప్-10 లో ఉన్న ఐదో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), తొమ్మిదో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ఈ ఇద్దరితోపాటు 16వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్), 17వ సీడ్ కార్లా నవారో (స్పెయిన్), 23వ సీడ్ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా), 27వ సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా), 28వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ), 32వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) కూడా తొలి రౌండ్లోనే నిష్ర్కమించారు. మరోవైపు రెండో సీడ్ షరపోవా (రష్యా), మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), ఏడో సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా), పదో సీడ్ మకరోవా (రష్యా) శుభారంభం చేశారు. లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) 1-6, 6-3, 6-2తో ఇవనోవిచ్‌పై, ఇరీనా బెగూ (రుమేనియా) 6-4, 0-6, 6-1తో కెర్బర్‌పై సంచలన విజయాలు సాధించారు. షరపోవా 6-4, 6-1తో పెట్రా మార్టిక్ (చెక్ రిపబ్లిక్)పై, హలెప్ 6-3, 6-2తో కరీన్ నాప్ (ఇటలీ)పై, బౌచర్డ్ 6-2, 6-4తో ఫ్రయిడ్సామ్ (జర్మనీ)పై, మకరోవా 6-2, 6-2తో మెస్టాచ్ (బెల్జియం)పై నెగ్గారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉదయం గం. 5.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
వరుసగా 13వ ఏడాది...
బ్రిస్బేన్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సన్నాహకంగా జరిగిన బ్రిస్బేన్ ఓపెన్‌లో రష్యా స్టార్ మరియా షరపోవా విజేతగా నిలిచింది. ఈ ఫలితంతో షరపోవా వరుసగా 13వ ఏడాది కూడా తన ఖాతాలో కనీసం ఒక్క డబ్ల్యూటీఏ టైటిల్ జమచేసుకున్నట్టయ్యింది. శనివారం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో షరపోవా 6-7 (4/7), 6-3, 6-3తో అనా ఇవనోవిచ్ (సెర్బియా)పై గెలిచింది. ఓవరాల్‌గా షరపోవా కెరీర్లో ఇది 34వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. విజేతగా నిలిచిన షరపోవాకు 1,95,026 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటి 21 లక్షలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభిం చాయి. ప్రస్తుతం నంబర్‌వన్‌గా ఉన్న సెరెనాకు, షరపోవాకు మధ్య తేడా కేవలం 681 పాయింట్లు ఉన్నాయి. ఫెడరర్ @ 999 బ్రిస్బేన్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరో మైలురాయికి చేరువయ్యాడు. తన కెరీర్లో 999వ విజయాన్ని నమోదు చేసుకోవడంతోపాటు బ్రిస్బేన్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఫెడరర్ 6-2, 6-2తో దిమిత్రోవ్ (బల్గేరియా)ను ఓడించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో మిలోస్ రావ్‌నిక్ (కెనడా)తో ఫెడరర్ తలపడతాడు.